RELATED NEWS
NEWS
డాలస్ నగరంలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము




డాలస్ నగరంలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తెలుగు దేశంపార్టీనుండి అత్యధిక మెజారీటితో గుడివాడ నియోజకవర్గంనుండి శాసనసభసభ్యునిగా ఎన్నికైన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము తన గెలుపుకి సహకరించిన ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదములు తెల్పేందుకు డాలస్ నగరంలో ఆదివారం పర్యటించారు.


ఆ పర్యటనలో భాగంగా ముందుగా ఇర్వింగ్ పట్టణంలో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించడానికి విచ్చేసిన శాసనసభసభ్యులు వెనిగండ్ల రాముకు మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల ఘనస్వాగతం పలికారు. శాసనసభ్యుడు రాము బాపూజీకి పుష్పాంజలి ఘటించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ - ‘‘ఎంతోకాలంగా ఈ మహత్మాగాంధీ మెమోరియల్ గురించి వింటున్నాను, కానీ ఇప్పటివరకు ఇక్కడికి రావడానికి వీలుపడలేదు. 2014లో స్థాపించబడ్డ ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ అమెరికా దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందదం, ఇప్పుడు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషం. ప్రాంతాలకు, పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా ప్రవాసభారతీయులందరూ ఐకమత్యంతో కలసి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు అనేదానికి ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఒకరోజులో నిర్మాణం కాలేదు, ప్రముఖ ప్రవాసభారతీయ నాయకులు, ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన డా. ప్రసాద్ తోటకూర దూరదృష్టి, అధికారులను ఒప్పించేందుకు జరిపిన దాదాపు 5 సంవత్సరాల అవిరళ కృషితో ఇది సాధ్యం అయింది. ఈ నిర్మాణంలో సహకరించిన బోర్డ్ సభ్యులు – రావు కల్వాల, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, ఎంవిఎల్ ప్రసాద్, బి.ఎన్ రావు మొదలైన కార్యవర్గ సభ్యులందరికీ నా అభినందనలు‘‘ అన్నారు.


మన భారతదేశంనుండి వివిధ పార్టీలకు చెందిన ఎందరో రాజకీయనాయకులు, ప్రముఖులు ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించడం సంతోషించదగ్గ విషయం. ప్రవాస భారతీయులందరికి ఇదొక ప్రధాన వేదిక కావడం ముదావహం అన్నారు. ప్రపంచమంతా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత వాతావరణంలో మహాత్మాగాంధీ సిద్దాంతాలు, ఆశయాల గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనాఉంది. పరస్పర అవగాహన, గౌరవం, చర్చల ద్వారా ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న శాంతి కాముకుడు గాంధీజీ ప్రపంచ మానవాళికి ఆదర్శం అన్నారు. ప్రవాసభారతీయులగా స్థిరపడ్డ మీరందరూ మన మాతృదేశ అభివృద్ధికి మీకు వీలైంతవరకు తోడ్పడమని కోరుతున్నాను అన్నారు శాసనసభసభ్యుడు వెనిగండ్ల రాము. ఈ పర్యటనలో శానసభసభ్యుడు వెనిగండ్ల రాము గెలుపుకు కృషిచేసిన వారు మిత్రులు అయిన తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ఎంతోమంది రాము అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne