RELATED NEWS
NEWS
డాలస్ నరంలో మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించిన రేవంత్ రెడ్డి

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి, ఐ.టి శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు, రహదారులు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా దేశంలోనే అతి పెద్దదైన డాలస్ నరంలో నెలకొనిఉన్న మహాత్మాగాంధీ స్మారకస్థలిని బుధవారం సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఈ నాయకులతో పాటు ఇండియన్ కాన్సల్ జనరల్ డి.సి మంజునాథ్ కూడా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి బృందానికి గాంధీ స్మారకస్థలి నిర్మాణ వివరాలాను తెలియజేస్తూ - 2014 అక్టోబర్ 2 న ఈ స్మారకాన్ని నిర్మించామని, విజయవాడకు చెందిన శిల్పి బుర్రా వరప్రసాద్ జీవం ఉట్టిపడేటట్లుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని, 18 ఎకరాల సువిశాలమైన ఉద్యానవనంలో ఈ గాంధీ స్మారకస్థలిని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చిన ఇర్వింగ్ నగర అధికారులకు, సహకరించిన వేలాదిమంది ప్రవాస భారతీయులకు, కార్యవర్గ సభ్యులకు, ఎన్నో తీరికలేని పనులతో సతమతమవుతూ కూడా వీలుచూసుకుని ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించడానికి ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత రెడ్డి, మంత్రివర్యులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి 10 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో హార్దికకృతజ్ఞతలు అన్నారు.

ప్రవాస తెలుగువారి తరపున డా. ప్రసాద్ తోటకూర ముఖ్యమంత్రి రేవంత రెడ్డికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అందులో ఈ క్రింది విషయాలను పొందుపరచారు.

ప్రపంచంఅంతటా యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న ఈ సమయంలో మహాత్మాగాంధీ సిద్ధాంతాలైన శాంతి, సహనం, పరస్పర అవగాహన, గౌరవం లాంటి అంశాలను విద్యార్దులకు పాట్యప్రణాళికలో చేర్చి చిన్నపటినుండే నేర్పాలి.

ప్రజలభాషే పాలకులభాష కావాలి. మాతృభాష పరిరక్షణ, పరివ్యాప్తికై ప్రభుత్వ కార్యాలయాలమీద పేర్లు, కార్యాలయాలలో ఉండే నామఫలకాలు, ప్రజా ప్రతినిధుల పేర్లు, హోదా, తిరిగే ప్రభుత్వ వాహనాలమీద, శంకుస్థాపన ఫలకాలు అన్నీ తెలుగులోనే ఉండాలని, ఆంగ్లంలో ఉండవలసిన అవసరంఉంటే విధిగా మొదట తెలుగులో వ్రాసి, దాని క్రిందివరుసలో ఆంగ్లంలోను, ఇతర భాషలలోను వ్రాయాలి. ప్రభుత్వఉత్తర్వులన్నీ ఆంగ్లంతో పాటు, తెలుగులో తర్జుమాచేసిన ప్రతులను కూడా కార్యాలయాలలో, వెబ్ సైట్లలోను, ప్రజలకు అందుబాటులో ఉంచాలి

కనీసం ప్రాధమికస్థాయి వరకైనా మాతృభాషలో విద్యాభోదన జరగాలి, మాతృభాషలో విద్యాబోధన మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే సందర్భంలో ఆంగ్ల భాషకున్న ప్రాధాన్యతను విస్మరించలేమని, ఆంగ్లం బాగా నేర్పగల్గిన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులను ఆంగ్లభాషలో నిష్ణాతులుగా తయారుచెయ్యాలి.

తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత శాతం మేరకు వెసులుబాటు కల్పించి ప్రోత్సహించాలి.

వివిధ రంగాలలో సుదీర్ఘకాలం పనిచేసి, విశేషానుభవం గడించి, విశ్రాంతజీవితం గడుపుతున్న వారి మేధోసంపత్తిని ప్రభుత్వం ఎంతగానైనా ఉపయోగించుకోవచ్చును.

తెలుగుభాష, సాహిత్య వికాసాల కోసం, సంగీత, నాటక, నాట్య, కళల ప్రోత్సాహం కోసం వేర్వేరుగా కేబినెట్ స్థాయితో సమానమైన స్వయం ప్రతిపత్తి కల్గిన అకాడమీలను నెలకొల్పి, అవసరమైన నిధులను సమకూర్చి, సమర్ధులైనవారికి ఆ బాధ్యతలను అప్పగిస్తే సత్ఫలితాలు కలుగుతాయి.

విదేశాలలో స్థిరపడిన విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో విశేష ప్రగతి సాధించిన అనేకమంది మేధావులు అనునిత్యం మాతృదేశం సందర్శిస్తూనే ఉంటారు. వారిలో అనేకమంది వారి పర్యటనలలో భాగంగా వారి విజ్ఞాన్ని మాతృదేశంలో ఆయా రంగాల ప్రముఖులతో ముఖ్యంగా యువతతో పంచుకోవదానికి సిద్దంగానే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినందల్లా వారి పర్యటన తేదీలను తెలుసుకుని, కాలానుగుణమైన ప్రణాళికతో వారి ఉపన్యాసాలకు అనువైన వాతావరణం కల్పించదమే.

తెలంగాణ రాష్ట్రంలోని సంగీత, సాహిత్య, నాట్య, కళారంగాలలోని ప్రముఖులను కొంతమందిని రాష్ట్రప్రభుత్వం ఎంపికచేసి ప్రభుత్వం తరపున అమెరికాలాంటి విదేశాలకు తరచూ పంపడంవల్ల, ఆయా కళాకారుల ప్రదర్శనలవల్ల విదేశాలలోని భావితరాలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయ, వారసత్వ వైభవాన్ని తెలియచెప్పినట్లవుతుంది. రాష్ట్రప్రభుత్వం ఎంపికచేసి పంపిన కళాకారులకు తగిన వసతిసౌకర్యాలు కల్పించి, వారితో కళాప్రదర్శనలు ఏర్పాటుచేయడానికి అనేక స్థానిక, జాతీయ తెలుగు సంస్థలు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటాయన్నారు. మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలకడానికి మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు రావు కల్వల, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, మురళీ వెన్నం, రాజీవ్ కామత్, బి.ఎన్ రావు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, వందలాది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;