RELATED NEWS
NEWS
అట్లాంటాలో ముగిసిన సిలికానాంధ్ర ‘మనబడి’



అట్లాంటాలో దిగ్విజయంగా జరిగిన సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవ కార్యక్రమం ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో విజయవంతంగా మొదలైన మనబడి సాంస్కృతికోత్సవాల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం అట్లాంటా నగరసీమలోని బెర్క్మర్ హైస్కూలు వేదికగా దాదాపు ఐదువందల మందికి పైగా తెలుగు భాషాభిమానుల సమక్షంలో కన్నుల పండువగా, వీనుల విందుగా ఈ కార్యక్రమం ముగిసింది. ముందుగా గణపతి, సరస్వతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత వేద పండితులు  పిల్లలకు ఆశీర్వచనాలు అందించారు. తరువాత వివిధ తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులు జట్లుగా నడుస్తూ శోభాయాత్ర నిర్వహించారు. పిల్లల సంప్రదాయ మిలమిలల మధ్య తెలుగు భాషాజ్యోతి మూడు తరాల చేతుల మీదుగా ప్రజల స్ఫూర్తికై ప్రేక్షకులందరి చేతులు మారింది.


దాదాపు 105 మంది బాలబడి, ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం తరగతులు చదువుతున్న విద్యార్థులు మనబడి తరగతులలో నేర్చుకునే పాఠ్యాంశాల ఆధారంగా తమ ప్రతిభని చక్కని సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో అందించి అందరి అభిమానం పొందారు. తెలుగు భాషపై ఉన్న అవగాహనను చక్కగా ప్రదర్శించి, తెలుగు సంప్రదాయంపై ఉన్న మక్కువను చాటారు. చిట్టిపొట్టి పాటలు, దేశభక్తి గేయాలు అవలీలగా పాడుతూ శాస్త్రీయ సంగీత రీతులలో అన్నమయ్య కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. అవే కాక పొడుపు కథలు, మనబడిలో మా చదువు, సుమతి శతకం, వేమన పద్యాల అర్థాలతోపాటు పరమానందయ్య శిష్యుల కథల్లోని గుమ్మడికాయల దొంగ, మనబడి పిల్లలబడి సరదాల బడి వంటి నాటికలే కాక, వక్రతుండం, సరసి శబ్దం, పంచభూతాలు, ముద్దుగారే యశోద, బ్రహ్మమొక్కటే, షిర్డీ యాత్ర, ఏ దేశమేగినా వంటి ఎన్నో అలరించే, మురిపించే నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆహ్లాదపరిచారు.


ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిలికానాంధ్ర పూర్వ అధ్యక్షుడు, మనబడి ముఖ్య ఆర్థిక వనరుల నిర్వహణాధికారి కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ, ‘‘ఎందరో గురువులు, సమన్వయకర్తలు, భాషా సైనికులు తమ విలువైన సమయాన్ని, అమూల్యమైన మేధస్సుని ఇచ్చి మనబడిలో తెలుగు నేర్చుకునే పిల్లలని భావి తెలుగు నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ పిల్లల ప్రతిభకి మనబడి సాంస్కృతికోత్సవం అద్దం పడుతుంది’’ అన్నారు. అనంతరం మనబడి ప్రాచుర్యమం అధినేత, అట్లాంటా సమన్వయకర్త విజయ్ రావిళ్ళ అట్లాంటా మనబడి ప్రస్థానం గురించి, రాబోయే రోజులలో అట్లాంటాలో మనబడి విస్తరణకు సంబంధించి ప్రణాళికలను గురించి వివరించారు. మనబడి భాషా సైనికుల జట్టులో ఉపాధ్యాయులైన సుచేత కాంచనపల్లి, విశ్వభారతి అన్నే, కిషోర్ దేవరపల్లి, సురేష్ ధూళిపూడి, హేమ అక్కినేని, నీలిమ బుడిం, కార్యక్రమాలను పర్యవేక్షించిన నాగిని మాగంటి, సుష్మకిరణ్ కొసరాజు, నగేస్ దొడ్డాకలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అట్లాంటా తెలుగు సంఘం అయిన తామా వారి సహాయ సహకారాలను కొనియాడుతూ తామా కార్యవర్గ సభ్యులను ప్రేక్షకులకు పరిచయం చేశారు.


తామా నాయకత్వ సభ్యులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా తమ సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తామని, తెలుగు భాషాభివృద్ధికి మరింత తోడ్పాటును అందిస్తామని తెలిపారు. తామా విద్యా కోశాధికారి వెంకి గద్దె తామా తరఫున మనబడికి సహకారాన్ని అందిస్తామని చెప్పారు. తామా సహకారాన్ని గుర్తించిన సిలికానాంధ్ర మనబడి నిర్వాహకులు తామా నాయకులను సత్కరించారు. టైట్ గ్రాఫ్ ప్రశాంత్ తన చక్కని ఆడియో, వీడియో, ఫొటో, లైటింగ్‌తో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడ్డారు. మనబడి నిర్వాహకులు ఏర్పాటు చేసిన తెలుగు విందు భోజనం అందరికీ సంతృప్తిని ఇవ్వడంతో అట్లాంటా మనబడి సాంస్కృతికోత్సవం విజయవంతంగా ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;