RELATED NEWS
NEWS
బే ఏరియాలో సిలికానాంధ్ర మనబడి

 

అమెరికాలోని బే ఏరియాలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మనబడి 9వ సాంస్కృతికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సన్నీవేల్ హిందూ దేవాలయం, లివర్ మోర్ శివవిష్ణు దేవాలయాల సమావేశ మందిరాల్లో నిర్వహించిన ఈ వేడుకలలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు ఏడు వందల మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వేదవచనాలతో కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు శోభాయాత్ర నిర్వహించారు. పెద్దల నుంచి మనబడి విద్యార్థులు ‘తెలుగు భాషా జ్యోతి’ని అందుకున్నారు. బాలబడి, ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం తరగతులు చదువుతున్న విద్యార్థులు తెలుగు భాషపై వున్న ఆసక్తిని, తెలుగు సంస్కృతిపై అవగాహనను ప్రదర్శించారు. తెలుగు సంప్రదాయ గాన, నృత్య, వాచకంలో వున్న మక్కువను చాటారు. చిట్టిపొట్టి పాటలు, దేశభక్తి గీతాలు చక్కగా పాడారు. శాస్త్రీయ సంగీత రీతుల్లో త్యాగయ్య, పురందరదాసు, అన్నమయ్య, భక్త కబీరు కీర్తనలను ఆలపించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో చిన్నారులు ఒక్క ఆంగ్లపదం కూడా ఉపయోగించకపోవడం విశేషం. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు పిల్లలందరికీ మాతృభాషను బోధించడానికి అవకాశం ఇస్తున్న తల్లిదండ్రులకు మనబడి కులపతి చమర్తి రాజు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మనబడి ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి దీనబాబు మాట్లాడుతూ, మనబడిలో చేరిన పిల్లలు తెలుగుతోపాటు నాయకత్వ పటిమ, ఇతరులతో కలసి పనిచేసే మెళకువలను నేర్చుకుంటారని అన్నారు. అమెరికాలోని 16 రాష్ట్రాలలో మనబడి సాంస్కృతికోత్సవాలు నిర్వహించనున్నట్టు మనబడి సాంస్కృతికోత్సవాల పర్యవేక్షణాధికారి వేదుల స్నేహ తెలిపారు. మాతృభాష వెలకట్టలేని సంనద అని, దానిని ఒక తరం నుంచి మరో తరానికి అందించడం మన బాధ్యత అని, ఈ అంశంలో మనబడి పోషిస్తున్న పాత్ర అమూల్యమైనదని సిలికానాంధ్ర ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ అన్నారు. మనబడి ఉత్సవాలు విజయవంతంగా జరగడానికి సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు సంజీవ్ తనుగుంట్ల, ప్రభ మాలెంపాటి, కిషోర్ బొడ్డు, మృత్యుంజయుడు తాటిపాముల, రవీంద్ర కూచిభొట్ల, శాంతి కూచిభొట్ల, స్నేహ వేదుల, జయంతి కొట్ని, మాధవి కడియాల, శ్రీరాం కొట్ని, శ్రీనివాస్ హరిదాస, అరుణ్, బైట్ గ్రాఫ్ ప్రశాంత్, సిలికానాంధ్ర సైనికులు, ఉపాధ్యాలయులు సహకరించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;