RELATED NEWS
NEWS
అమెరికా లో భారతీయలు ఎవరైనా చనిపోతే ... చేయవలసిన ఏర్పాట్లు

 

అమెరికా లో భారతీయలు ఎవరైనా చనిపోతే ... 

చేయవలసిన ఏర్పాట్లు

 స్వదేశంలో ఎవరైనా చనిపోయినప్పుడు మనకున్న సాంఘిక పరిస్థితుల వల్ల చనిపోయిన వ్యక్తి  యొక్క కుటుంబ సభ్యులకు ఎటువంటి భారం లేకుండానే బంధు మిత్రుల సహకారం తో అన్ని పనులు చకచకా

జరిగిపోతాయి.  కాని విదేశాల్లో భారతీయులు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ దహనసంస్కారాలు చేయడానికి ఎన్నో నియమ నిభందనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే పార్ధివ దేహాన్ని భారతదేశం

తరలించాలన్నా అనేక శవ పరీక్షలు మరెన్నో ప్రభుత్వ అనుమతులు అవసరమౌతాయి. చనిపోయినవారు సామాన్యులా, ప్రముఖ వ్యక్తులా అనే విషయాన్ని పక్కనపెట్టి, విదేశాల్లోని ప్రభుత్వ అధికారులు అన్ని

నియమ నిభందనలను తు.చ తప్పకుండా పాటిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో వారి కుటుంబం

ఉండడం సహజం. ఈ విషాద పరిస్థితుల నుండి తేరుకొని చనిపోయిన వ్యక్తి  యొక్క అంతిమసంస్కారాలు అక్కడే జరిపించాలంటే ఈ క్రింది పద్ధతులు పాటించవలసిన అవసరం ఉంది.
ఒక వ్యక్తి అనారోగ్య కారణంగా ఇంటి వద్ద చనిపోయినా, లేదా ఏదైనా ప్రమాదంలో మరణించినా, హత్య లేదా ఆత్మహత్య లాంటి సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసు శాఖకు తెలియజేయడం

తప్పనిసరి. ఆ తరువాత పోలీసు వారి అనుమతితో ఆ పార్ధివ దేహాన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపవలసి ఉంటుంది.  అప్పుడు వైద్యులు అవసరమైతే శవ పంచనామా చేసి మరణానికి గల కారణాలను

ధృవీకరిస్తూ ఒక శవ ‘పంచనామా నివేదిక’ (ఆటాప్సి రిపోర్ట్), సుమారుగా పలనా తేదిన, పలనా సమయానికి చనిపోయినట్లు గా నిర్ధారిస్తూ ‘మరణ ధృవీకరణ పత్రం’ (డెత్ సర్టిఫికేట్) లను జారీ చేస్తారు.
ఒకవేళ వైద్య చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపోతే, పై విధానాన్నే పాటిస్తూ ఏ అనారోగ్య కారణాలతో చనిపోయారో విశదీకరిస్తూ సంబంధిత వైద్య అధికారులు‘మరణ ధృవీకరణ పత్రం’ (డెత్ సర్టిఫికేట్) ను

జారీ చేస్తారు. 
తరువాత ఆ పార్ధివ దేహాన్ని కుటుంబ సభ్యులు సూచించిన విధంగా స్థానికంగా ఉన్న ఒక ‘ఫ్యునరల్ హోం’ (అంతిమ సంస్కారాలు జరిపే ప్రదేశం) కు తరలిస్తారు. అప్పుడు ఆ ఫ్యునరల్ హోం అధికారులు ( ఆ

పార్ధివ దేహానికి అక్కడే అంతిమ సంస్కారాలు జరపాలన్నా లేదా విదేశాలకు పంపాలన్నా) కుటుంబసభ్యుల నుండి కావలసిన సమాచారాన్ని రాతపూర్వకం గా తీసుకొని తదుపరి చర్యలను చేపడతారు. ఈ

క్రింది వివరాలను కుటుంబసభ్యులు ఫ్యునరల్ హోం అధికారులకు వెంటనే అందజేయాల్సి ఉంటుంది.
చనిపోయిన వ్యక్తి పేరు
స్త్రీ లేదా పురుషుడు   
పుట్టిన తేది
వయస్సు
జన్మస్థలం
సోషల్ సెక్యూరిటీ నెంబర్ (ఒకవేళ ఉంటే)
జాతి
వివాహితులా? లేదా?
భర్త లేదా భార్య వివరాలు
విద్యార్హతలు
వృత్తి
పనిచేస్తున్న రంగం
చిరునామ
తండ్రి పేరు
తల్లి ఇంటి పేరు (పెళ్లి కాక ముందు) 
చనిపోయిన స్థలం,  ప్రాంతం
ఆసుపత్రి  పేరు
చనిపోయినట్లుగా తెలిపిన వ్యక్తి పేరు, వివరాలు
అంతిమ సంస్కారాల ప్రాధాన్యత? – దహన సంస్కారమా /  ఖననమా /  ఏదైనా ఆసుపత్రికి విరాళమా?
ఈ పై వివరాలను కుటుంబసభ్యుల నుండి సేకరించిన తరువాత ఫ్యునరల్ హోం అధికారులు ఆసుపత్రి నుండి శవ పంచనామా నివేదిక (ఉంటే), ‘మరణ ధృవీకరణ పత్రం’ (డెత్ సర్టిఫికేట్),  చనిపోయిన వ్యక్తి 

ప్రాంతపు జనన మరణ నమోదు కార్యాలయపు అధికరులనుండి చనిపోయినట్లుగా  నమోదు చేసిన (కౌంటీ డెత్ సర్టిఫికేట్) పత్రాలను సేకరిస్తారు.
పార్ధివ దేహం చెడిపోకుండా సమశీతల ఉష్ణోగ్రత పరిస్థితులల్లో భద్రపరచిన తరువాత కుటుంబసభ్యుల వీలుననుసరించి అంతిమ సంస్కార ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఇతర కుటుంబ సభ్యులు,

బంధు మిత్రులు ఆ పార్ధివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేందుకు వీలుగా తగు ఏర్పాట్లను ఆ ఫ్యునరల్ హోం అధికారులే చేస్తారు. అంతేగాక, చనిపోయిన వ్యక్తి మతాచారాలకు అనుగుణంగా శాస్త్రోక్తంగా

పూజా కార్యక్రమాలు జరిపే వీలును కూడా ఫ్యునరల్ హోం అధికారులు కల్పిస్తారు. సాధారణంగా ప్రతి ఫ్యునరల్ హోం ఆవరణలోను పార్ధివ దేహాన్ని ఖననం చేసే ఏర్పాటు ఉంటుంది కాని చాలా కొన్ని ఫ్యునరల్

హోమ్స్ లో మాత్రమె దహన సంస్కారాలు జరిపే వీలుంటుంది. ఒకవేళ ఆ సదరు ఫ్యునరల్ హోం లో దహన సంస్కారాలు జరిపే వీలులేకుంటే, వారే దగ్గరలో ఆ వీలున్న ఫ్యునరల్ హోం లో తగు ఏర్పాట్లు చేసి ఆ

పార్ధివ దేహాన్ని  అక్కడకి తరలిస్తారు. పార్ధివ దేహం చెడిపోకుండా కొన్ని రోజుల పాటు యథా స్థితిలో ఉండేట్టుగా కొన్ని రసాయనాలను నింపి భద్ర పరచే ప్రక్రియను ‘ఎంబామింగ్’ అంటారు. పార్ధివ దేహానికి

ఇరవై నాలుగు గంటల్లోపు అంతిమ సంస్కారాలు జరిపినా లేదా శీతలీకరణ చేసినా ఎంబామింగ్ అవసరం ఉండదు. మిగతా అన్ని సందర్భాల్లోనూ ఈ ఎంబామింగ్  ప్రక్రియ తప్పనిసరి. ఫ్యునరల్ హోం వారు

కల్పించే ఈ ఏర్పాట్లన్నటికీ కలిపి సుమారుగా మూడు లేదా నాలుగు వేల డాలర్లు ఖర్చవుతుంది.
ఒకవేళ పార్ధివ దేహాన్ని భారత దేశం తరలించాల్సి వస్తే ఫ్యునరల్ హోం అధికారులే ఈ క్రింది వివరాలు సేకరించి,  అవసరమైన అనుమతి పత్రాలు సంపాదించి కావాల్సిన ఏర్పాట్లను చేయవల్సిఉంటుంది.

సేకరించవలసిన వివరాలు –
* చనిపోయిన వ్యక్తి పాస్ పోర్టు 
* పార్ధివ దేహం నుండి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రతలు తీసుకున్నట్టు ధృవీకరిస్తూ స్థానిక ఆరోగ్య అధికారుల నుండి అనుమతి పత్రం
* పార్ధివ దేహాన్ని సీల్డ్ కంటైనర్ లో భద్రపరచినట్లు ధృవీకరణ పత్రం
* కొన్ని సందర్భాల్లో అవసరమైతే పోలీసు అధికారులనుండి కావాల్సిన అనుమతి పత్రాలు
* కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులనుండి పార్ధివ దేహాన్ని భారతదేశం పంపడానికి అనుమతి పత్రం
* పార్ధివ దేహాన్ని ఎవరైతే ఇండియాలో స్వీకరిస్తున్నారో వారి వివరాలు
* పార్ధివ దేహాన్ని భారతదేశంలో ఏ స్మశాన వాటికలో దహనం లేదా ఖననం చేస్తున్నారో దాని చిరునామ
 మొదలైనవి అన్నిటిని సేకరించి ఎయిర్ లైన్ అధికారులతో ఫ్యునరల్ హోం అధికారులు సంప్రదింపులు జరపి పార్ధివ దేహాన్ని భారతదేశం తరలిస్తారు. సాధారణ పరిస్థితుల్లో  ఈ ఏర్పాట్లన్ని పూర్తి అయ్యి,

పార్ధివ దేహం భారతదేశం చేరడానికి సుమారుగా 3 నుండి 5 రోజులు పడుతుంది. దాదాపు గా 5 వేల నుండి 8 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది.
పూర్తి వివరాలకు www.prasadthotakura.com  వెబ్ సైట్ ను చూడవచ్చు
(ఈ వ్యాస రచయిత డాక్టర్. ప్రసాద్ తోటకూర గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు. అనేక విషాద

సంఘటనల్లో ఎన్నో కుటుంబాలకు అండగా నిల్చి అనేక పర్యాయాలు ఇలాంటి కావల్సిన ఏర్పాట్లు చేసిన అనుభవజ్ఞుడు)

TeluguOne For Your Business
About TeluguOne
;