RELATED NEWS
NEWS
తెలుగు విద్యార్థులకు తానా అండ

 

అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎల్లవేళలా అందుబాటులో వుంటుందని తానా కార్యనిర్వాహక అధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీల్లో వీసా సమస్యలతో బాధపడుతున్న తెలుగు విద్యార్థులకు తానా అండగా వుంటుందని తెలిపారు. తెలుగు విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గమనిస్తున్నామని, ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇమ్మిగ్రేషన్ అటార్నీ షీలా మూర్తి దృష్టికి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్ళామని చెప్పారు. అమెరికాలో భారత రాయబారి అరుణ్ సింగ్‌ని, అమెరికా చట్టసభల్లో సభ్యులను కలసి ఈ సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. తానా సంయుక్త కార్యదర్శి రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ రీజనల్ కో-ఆర్డినేటర్ ప్రకాష్ బత్తినేని, ఫిలడెల్ఫియా తానాబృందం ఆధ్వర్యంలో నిర్వహఇంచిన ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సులో దాదాపు రెండు వందల మంది తెలుగువారు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;