RELATED NEWS
NEWS
విజయవంతంగా మొదలైన మనబడి విద్యా సంవత్సరం !

 

విజయవంతంగా మొదలైన మనబడి విద్యా సంవత్సరం !


భాషా సేవయే భావి తరాల సేవ ! అనే స్ఫూర్తితో ప్రవాస బాలలకు తెలుగు భాష నేర్పించే సిలికానాంధ్ర మనబడి, 2016-17 విద్యా సంవత్సరం తరగతులు సెప్టెంబర్ 10న అమెరికా వ్యాప్తంగా 35 రాష్ట్రాలలో, 12 దేశాలలో 275 కి పైగా ప్రాంతాలలో ప్రారంభమయినాయి. దాదాపు 6500 మంది విద్యార్ధులు ఈ తరగతులకు నమోదు చేసుకున్నారు..

సిలికాన్ వ్యాలీలోని Fremont హై స్కూల్ లో మనబడి తెలుగు తరగతులను ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి    శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ లాంచనంగా ప్రారంబించిన సందర్భంగా  విద్యార్ధుల తల్లితండ్రులతో  మాట్లాడుతూ, సిలికానాంధ్ర మనబడి ని చూసాక తెలుగు భాష భవిష్యత్తు మీద భరోసా మరింత పెరిగిందన్నారు. మాతృదేశానికి దూరంగా ఉన్నా మాతృభాష నేర్చుకోవాలన్న తపన ఉన్న తల్లితండ్రులకు, వారికి తెలుగు నేర్పుతున్న మనబడి బృందానికి అభినందనలు తెలిపారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని చాటాలన్న ఏకైక లక్ష్యంతో సిలికానాంధ్ర పని చేస్తోన్దని, ఆ కార్యాచరణలో భాగంగానే 10 సంవత్సారల క్రితం మనబడి ప్రారంభించామని , రాజు చమర్తి నేతృత్వం లో ఆ దిశగా ఎన్నో విజయాలు సాధిస్తున్నామని అన్నారు.


మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, వాస్క్ ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్ లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లాంటి అనేక విజయాలు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు విద్యావిధానం సిలికానాంధ్ర మనబడి అని, ఇక్కడ తెలుగు నేర్చుకున్న పిల్లలు వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, గత 10 సంవత్సరాలలో మనబడి ద్వారా 25000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని, తెలుగు భాషను ప్రాచీన భాష నుండి ప్రపంచ భాషగా అందించే భాషా సారధులు మనబడి విద్యార్ధులే ముందుంటారని  అన్నారు.


అమెరికా వ్యాప్తంగా 275 కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి లో ప్రవేశం కావాలనుకున్న వారు వెంటనే manabadi.siliconandhra.org ద్వారా  ఈ నెల 23 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని  లేదా   1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షులు  దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


లాస్ ఏంజిలస్ లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీ లో శరత్ వేట, డాలస్ లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, సంజీవ్ తనుగుల శాంతి కూచిభొట్ల, అనిల్ అన్నం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని,  శ్రీరాం కోట్ని , ఫణి మాధవ్ కస్తూరి తదితరుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో మనబడి నూతన విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయినాయి.  

TeluguOne For Your Business
About TeluguOne
;