RELATED NEWS
NEWS
దక్షిణాఫ్రికాలో భారత రాయబారి చేతుల మీదుగా సిలికానాంధ్ర మనబడి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం


దక్షిణాఫ్రికా లో  భారత రాయబారి చేతుల మీదుగా సిలికానాంధ్ర మనబడి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం!

 

దక్షిణాఫ్రికా లోని జొహాన్నెస్ బర్గ్ లో గత రెండు సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం  వారి సహకారంతో సిలికానాంధ్ర మనబడి, తెలుగు బోధనా తరగతులను  విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ వారాంతంలో ప్రారంభమయ్యే మూడవ సంవత్సరానికి నాందిగా  ఫిబ్రవరి 5వ తేదీన జొహాన్నెస్ బర్గ్ లోని ఇండియన్ కాన్సులేట్ వారి కార్యాలయంలో ఒక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత రాయబారి శ్రీ నరేష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యి, మనబడి నూతన విద్యాసంవత్సరాన్ని లాంచనంగా ప్రారంభించారు. భారత దేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్నా, మాతృభాషని మరువకుండా నేర్పిస్తున్న తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు   శ్రీ నరేష్ కుమార్ అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా న్యూ జెర్సీ (అమెరికా) నుంచి విచ్చేసిన సిలికానాంధ్ర మనబడి అభివృద్ధి శాఖ  ఉపాధ్యక్షులు శ్రీ శరత్ వేట మనబడి పాఠ్య ప్రణాళిక,  విధి విధానాలు విపులంగా వివరించడమే కాకుండా, తలిదండ్రులతో' ముచ్చటించి వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా, మనబడిలో చదువుతున్న విద్యార్థులు వారు నేర్చుకున్న పద్యాలను వినిపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. జొహాన్నెస్ బర్గ్ లోని తెలుగు వారందరూ తమ పిల్లలతో సహా ఎంతో ఉత్సాహంగా ఈ అవగాహనా సదస్సులో పాల్గొన్నారు.

నూతన విద్యాసంవత్సరానికి విద్యార్ధులు మనబడిలో నమోదు చేసుకున్నారు.  సీతారామరాజు రాపోలు, ఇందిరా లింగం,  పవన్  అట్లూరి, శ్వేత బొల్లోజు ఉపాధ్యాయులుగా తమ బాధ్యతలు స్వీకరించారు. దక్షిణాఫ్రికా మనబడి సమన్వయకర్త సతీష్ పొణుగుపాటి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కీర్తిక పొణుగుపాటి గారి కృతజ్ఞతాభివందనాలతో సభ ముగిసింది. మనబడి గురించిన మరిన్ని వివరాలకు, నమోదు కోసం manabadi.siliconandhra.org చూడవచ్చు. 

TeluguOne For Your Business
About TeluguOne
;