RELATED NEWS
NEWS
న్యూజెర్సీ మనబడి సాంస్కృతికోత్సవం



అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో మనబడి సాంస్కృతికోత్సవం April 18 2015 నాడు ఎడిసన్ లోని JPStevens High School లో దిగ్విజయంగా జరిగింది.  ఇందులో 250 మంది విద్యార్థులు 50 మంది పైగా గురువులు, సమన్వయక కర్తలు, 100 మంది స్వచ్చంద కార్యకర్తలు, 1000 మందికి పైగా  సభికులు  పాల్గొని, విజయవంతంగా జరుపుకున్నారు.  కిరణ్ దుద్దాగి  నాయకత్వంలో కార్యవర్గం  సభ్యులు రాంగోపాల్ కర్రి, మహేష్ నాగెళ్ళ, సోమసుందర్ చీడెల్ల మరియు  ఓరుగంటి వేణుగోపాల కృష్ణ గార్లు జరిపిన ఈ కార్యక్రమంలో బాలబడి నుంచి ప్రమోదం వరకు  చదువుతున్న విద్యార్థులు ఎన్నో సాంస్కృతిక అంశాలు ప్రదర్శించి వారి తెలుగు ప్రజ్ఞాపాటవాలని చూపించి ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నారు.

 



ఈ కార్యక్రమంలో భాగంగా స్నాతకోత్సవం (Graduation Ceremony) కన్నులపండుగగా జరిగింది. క్రితం సంవత్సరం ప్రకాశం మరియు ప్రభాసం చదివి, పొట్టి  శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులై, పట్టభద్రులైన విద్యార్థులకి యోగ్యతాపత్రాలు ఇచ్చారు.

ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించిన పౌరాణిక, చారిత్రాత్మక, నీతికథల నాటికలు, చిన్నారులు పాడిన పద్యాలు, పాటలు చాలా ఆసక్తిదాయకంగా  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  రామాయణం, వేదభూమి, పంచతంత్రం కథలు, మనభాష-మనసంస్కృతి-మనబడి, తెలుగు అమెరికా, చెట్టుమీద పిట్ట అనే వైవిధ్యమున్న ఇతివృత్తాల మీద నాటికలు, కథలు, పద్యాలు, పాటలు, ఉచ్చారణలో స్వచ్చత, ఆహార్యంలో ప్రామాణికతతో సాంస్కృతిక కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 

 



అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్న ఈ చిన్నారులను చూస్తుంటే అసలు వీళ్ళు అమెరికాలో పుట్టిన పిల్లలేనా అనిపించింది. అంతమంది విద్యార్థులతో రిహార్సల్స్ జరిపించడమూ, వారికి దుస్తులూ, ఆభరణాలు లాంటి ఆహార్యం సమకూర్చడము, పిల్లల చేత క్లిష్టమైన మాటలు పలికించడమూ సామాన్య విషయం కాదు.  వీటన్నింటి వెనుక ఎంత శ్రమ పడ్డారో కానీ ఆ తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ ధన్యులు. వాళ్ళందరికీ అభివందనాలు, శుభాభినందనలు.

 



సభకి వచ్చిన ముఖ్య అతిథులు మన తెలుగు వారికి చిరపరిచితులు ఉపేంద్ర చివుకుల (Commissioner, NJ Board of Public Utilities)  తెలుగు భాషకీ సంస్కృతికీ మనబడి చేస్తున్న కృషిని పలు విధాలుగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి డాలస్ నగరం నుంది మనబడి ప్రణాళిక బృంద సభ్యులు, ప్రాచుర్య విభాగానికి నాయకులు అయిన శ్రీ రాయవరం విజయభాస్కర్ గారు వచ్చి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు.

TeluguOne For Your Business
About TeluguOne
;