- టాంటెక్స్ వారి పునస్సమాగమ వేడుక – పెల్లుబికిన గతస్మృతులు
- 83వ సదస్సులో "మనుచరిత్ర" కు పెద్దపీట
- డల్లాస్ లో టాంటెక్స్ & తానా ఆధ్వర్యంలో ఘనంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలు
- టాంటెక్స్, టిప్స్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక ఉచిత వైద్య శిబిరం
- టాంటెక్స్ కార్య వర్గంలో నూతనోత్సాహం-2014 అధ్యక్షులుగా విజయ్ మోహన్ కాకర్ల ప్రమాణ స్వీకారం
- Tantex Deepaavali Vedukalu-2013: Unprecedented Show Awaits In Dallas
- టాంటెక్స్ దీపావళి వేడుకలకు భారీగా ఏర్పాట్లు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 73వ నెలనెలా తెలుగువెన్నెల
- Tantex 59th Nela Nela Telugu Vennela Music-literary Fest
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల
- టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 79వ “నెలనెలా తెలుగువెన్నెల”
- వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
- ఘనంగా టాంటెక్స్ రియూనియన్ బాంక్వెట్ - అలరించిన సునీత సంగీత విభావరి
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 76 వ సదస్సు శనివారం, నవంబరు 23 వ తేది, ఉత్తర అమెరికా భారతీయ సంఘం (ఐ.ఏ.ఎన్.టి) కార్యాలయములో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 76 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.
సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో “నెల నెలా తెలుగువెన్నెల” కార్యక్రమానికి స్థానిక సాహితీ ప్రియులు అందిస్తున్న చేయూత, విశేష ఆదరణను గుర్తిస్తూ అందరికీ స్వాగతం తెలిపారు. శ్రీమతి మరిన్గంటి సంగీత తెలుగు భాష గొప్పదనం గురించి తెలియజేస్తూ శ్రీ చంద్రబోస్ రాసిన పాటను పాడి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. శ్రీమతి బాలత్రిపుర సుందరి గణపతి వందనం ప్రార్ధనా గీతాన్ని ఆలాపించారు. శ్రీమతి డి.యన్.శోభారాణి అన్నమాచార్య కీర్తనతో అలరించారు. అన్నమాచార్యుల కవితా సాహిత్యం లోని అంతర్యామి తత్వాన్ని అనుక్షణం ఎలా ఆస్వాదించాలో శ్రీమరిన్గంటి యుగంధర్ పాడుతూ దాన్ని వివరించారు.
శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు ప్రముఖ రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు రచించిన “పట్నవాసం” కథాసంపుటిని సభకు పరిచయం చేశారు. చాలా సంవత్సరాల క్రితం పల్లె నుండి పట్టణానికి వెళ్ళిపోయిన చెల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన అన్న ఎలుక కథను అందరికీ పరిచయం చేసారు. పల్లెకూ, పట్టణానికి ఉన్న తేడాలను ఎలుక ద్వారా రచయిత సరదాగ చెప్పించారని వివరించారు. తెలుగు మరియు అంగ్లంలో విభిన్న రచనల ద్వారా పాఠకులకు పరిచయమైన ప్రముఖ సాహితీ ప్రియుడు, రచయిత, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి డా. జె. బాపు రెడ్డి లలిత గీతాల ‘ప్రగతి పాటల తోట’ పుస్తక పరిచయం శ్రీ పున్నం సతీష్ చేసి ఆ గీతాల లాలిత్యాన్ని వినిపించి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు.
టాంటెక్స్ ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి “మాసానికో మహనీయుడు” శీర్షికలో భాగంగా నవంబరు నెలలో కీర్తిశేషులయిన త్రిపురనేని గోపీచంద్, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, గురజాడ అప్పారావు, ప్రముఖ నవలా రచయిత్రి మాలతీ చందూర్, మరియు ఇదే మాసంలో జన్మించిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, శిష్ట్లా ఉమామహేశ్వర రావు, పురిపండా అప్పలస్వామిలను గుర్తు చేసారు. దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి సాహితీ ప్రస్తానంలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ “భావ కవితా పదరావాలను గగన తలము మార్మోగగ కంఠమెత్తి వినిపించావు. స్వేచ్చాకుమారుడవు నీవు. గగనపథ విహార విహంగ పతివి నీవు. మోహన వినీల నిర్మలప్రళయ జంఝూ ప్రభంజన కవిస్వాములకే గురుస్వామి నీవు. కృష్ణ పక్షం క్రీనీడల్లో వేణుగానం విన్నావు. నిశాంత నీపసాఖికల చెంత కృసాంగినీ గోపికలను కనుగోన్నావు. యామినీ చంద్రికల గోలే చకోరమే నీవు చిగురు మామిడి కొమ్మ కోయిలవు నీవే” అని శాస్త్రి గారి సాహితీ ప్రతిభను కొనియాడారు.
డా.జువ్వాడి రమణ ఆపద్భాందవుడు చిత్రములో శ్రీ ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన పద్యం చక్కగా పాడి వినిపించారు. శ్రీ కాజ సురేష్ క్రికెట్ “అపర పరబ్రహ్మ” సచ్చిన్ టెండూల్కర్ క్రీడ నుండి విరమించిన సందర్భంగా ఛందోబద్ధంగా పద్యం అల్లారు. శ్రీ మద్దుకూరి చంద్రహాస్ పదం, పాటల ప్రాముఖ్యత గురించి నాలుగు మాటలు సభతో పంచుకున్నారు.
శ్రీమతి సింగిరెడ్డి శారద సాహిత్యం నుండి కాల క్రమేణా సంగీత ప్రక్రియ, దానినుండి క్రమేపి వాగ్గేయ కారుల పదసంపద సామాన్య ప్రజలను సైతం సాహిత్యం వైపు నడిపించడానికి దోహదం చేసింది అంటూ, అంత్యాక్షరి మాతృకగా అందులోంచి ఉద్భవించిన “ఆద్యక్షరి” అనే ప్రక్రియకు వాగ్గేయకారుల కీర్తనలతో శ్రీ కారం చుట్టిన ముఖ్యఅతిథి శ్రీ పిస్క సత్యనారాయణ గారిని సభకు పరిచయం చేసారు. డా. మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛము తో వేదిక పైన ముఖ్య అతిథిని అభినందించారు. డా. ఇవటూరి భానుమతి పుష్పగుచ్ఛముతో వేదిక పైన ప్రముఖ స్థానిక శాస్త్రీయ, లలిత సంగీత గాయనీమణి శ్రీమతి కడ్మిశెట్టి పూజిత ను అభినందించారు. ఆహూతులు అడిగిన అక్షరంతో అన్నమయ్య,త్యాగరాజు,భద్రాచల రామదాసు కీర్తనలు తెలుపగా వాటిని శ్రీమతి కడ్మిశెట్టి పూజిత ఆ కీర్తనలను చక్కగా పాడి వినిపించారు.
టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు శ్రీ కాకర్ల విజయమోహన్, ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి దుశ్శాలువతో ముఖ్య అతిథి శ్రీ పిస్క సత్యనారాయణ గారిని సన్మానించారు. టాంటెక్స్ కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు శ్రీమతి సింగిరెడ్డి శారద, శ్రీ పున్నం సతీష్, శ్రీబసాబత్తిన శ్రీనివాసులు సంయుక్తంగా ముఖ్య అతిధిని ఙ్ఞాపికతో సత్కరించారు, కార్యవర్గ సభ్యులు శ్రీ వీర్ణపు చినసత్యం, శ్రీ చామకూర బాల్కి, శ్రీ ఉప్పలపాటి క్రిష్ణా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ"నెల నెలా తెలుగు వెన్నెల" 76 వ సదస్సులో ముఖ్య ప్రసంగం చేసిన శ్రీ పిస్క సత్యనారాయణ గారికి, వాగ్గేయకారుల సాహిత్యపు సొగసులకు, తన మధురమైన గాత్రంతో అమృతాన్ని పంచిన శ్రీమతి కడ్మిశెట్టి పూజిత గారికి కృతఙ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన ఐ.ఎ.ఎన్.టి. సంస్థకు, విందు రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన రేడియో ఖుషి, తెలుగు వన్ “టోరి” రేడియో, సతీష్ పున్నం, దేసి ప్లాజా, టివి-5, టివి-9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.