MEMORIES
స్వీట్ మెమోరీస్

కనుమరుగైన మధురస్మృతులు గురించి రాయాలంటే ఎన్నైనా రాయవచ్చు. ప్రతి మనిషి జీవితంలో చిన్ననాటి చిలిపి చేష్టలు, అల్లరిపనులు, ఆకతాయి చేష్టలు తలచుకుంటూ ఉంటే మనస్సు పులకరిస్తుంది. ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అదొక స్వర్ణయుగం. మళ్ళీ తిరిగిరాని మరిచిపోలేని మంచి రోజులవి.

 

మాది ప్రకృతి అందాలతో, పాడిపంటలతో పచ్చని పొలాలతో, గోదావరి గలగలతో, పూల సోయగాలతో ప్రేమానురాగాలతో పలకరించే పల్లెజనులు నివశించే పల్లెటూరు. మా దోసకాయలపల్లి. గోదావరి జిల్లాలో ఉంది.



ఇంక మా కుటుంబం గురించి ... మా ఇంటిపేరు శ్రీనిలయం. మాది ఉమ్మడి కుటుంబం. ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాల నిలయం మా శ్రీనిలయం. అందరం కలిసిమెలిసి అనురాగాలతో, ఆనందంతో ఉండేవారు. మా అమ్మ, నాన్న, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, బాబాయ్, పిల్లలతో ప్రతిరోజూ ఒక పండగలాగానే ఉండేది.



తెల్లవారుతుంది లేవండహో అంటూ కోడికూతులతో మేల్కొలిపే కోడిపుంజులు, కిటికీలోంచి వచ్చి వెచ్చగా తాకే భానుడి ఉదయ అరుణోదయ లేతకిరణాలు, తెల్లవారింది లేవండర్రా అని పలకరించే బామ్మా, వాకిలి ఊడ్చి, కల్లాపుజల్లి, ఇంటిముందు వాకిలిని రంగవల్లులతో తీర్చిదిద్ది, స్నానంచేసి తులసికోటకు పూజచేసి పలహారం చేసే అమ్మ కాలకృత్యాలు తీర్చుకోగానే పలహారం, పాలగ్లాసుతో వచ్చి కొసరి కొసరితినిపించే బామ్మా, తొందరగా తినండే మీ స్నేహితులు వచ్చారు. ముచ్చట్లకి, ఆటలకి అంటూ చెప్పే బాబాయ్ ఆ మధుర స్మృతులు తలుచుకుంటేనే మనస్సు ఆనందంతో పొంగిపోతుంది.



ఇంక బాల్యస్నేహితుల గురించి : పాఠశాలలో చదువుకునే రోజుల్లో నా స్నేహితులు - దేవి, బాల, లక్ష్మి, దీపిక, సరోజ. అందరం కలిసే క్లాసులో బాగా అల్లరి చేసేవాళ్ళం. పిలకపంతుల్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో తికమక చేసేవాళ్ళం. మా స్నేహితులందరిలో దేవి బాగా అల్లరి చేసేది. ఒకసారి ఏమయిందంటే ...



మా తెలుగుమాస్టారు ఒక పద్యం చెప్పి దాన్ని బట్టీపట్టి పదిసార్లు చూసి రాసి తీసుకురమ్మన్నారు. ఎవ్వరము బట్టి పట్టలేదు. చూచి రాత రాయలేదు. కారణం రాములవారి గుడిముందు శ్రీరామనవమి తాలూకు ఉత్సవాలు జరుగుతున్నాయి. రోజూ హరికథలు, తోలుబొమ్మలాటలు, కోలాటాలు, పెద్ద తిరునాళ్ళు దేవుడిని బండిమీద ఊరేగిస్తూ ఉంటే పూజారినడిగి కొబ్బరిచిప్ప తెచ్చాను. నేను, మా స్నేహితురాలు దేవి కిరాణాకొట్లో బెల్లం దొంగలించుకుని వచ్చింది. కొబ్బరిముక్కలతో బెల్లం నంచుకుని తింటూ ఉంటే భలే మజాగా ఉండేది. ఇంక మరుసటిరోజు హోమ్ వరకు చెయ్యలేదని పిలకపంతులు బెత్తంతో కొట్టి, గుంజీళ్ళు తీయించి, గోడకుర్చీ వేయించాడు. అందరి ముందూ కొట్టావు కదా ఉండు నీ పనిచేప్తాను అని మనస్సులో అనుకొని మా బాబాయి నేను ఆడుకోవడానికి తెచ్చిన రబ్బరు పాముని పిలకపంతులు కుర్చీక్రింద పెట్టాను.పిలకపంతులు కుర్చీలో కూర్చుని పాముని చూచి నిజం పాము అనుకుని ఎగిరిపడ్డాడు. దీన్ని ఇక్కడ పెట్టింది ఎవరు అని అడిగితే ఎవరూ సమాధానము చెప్పలేదు. అందర్నీ బెత్తంతో పిచ్చకొట్టుడు కొట్టాడు. ఇది తల్చకున్నప్పుడల్లా పిచ్చ నవ్వొస్తుంది. బాల్యంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో. అవన్నీ మరపురాని మధురానుభూతులు.



ఇంక పండగల విషయానికొస్తే సంక్రాంతి పల్లెప్రజలకు పెద్దపండుగ. నెలరోజుల ముందునుంచే ఇంటికి సున్నాలు వేయించడం, అటకమీద ఇత్తడి వస్తువులన్నీ తళతళా మెరుస్తూ ఉండేలా తోమడం. నవారు పట్టీలు ఉతకడం, సైకిల్ మీద బట్టలు అమ్మే ప్రసాదు కోసం ఎదురుచూడటం కొత్త రకాలు ఏమి తెస్తాడా అని, అవి కొనుక్కుని టైలర్ కిచ్చి అవి కుట్టి ఇచ్చేదాకా పదిసార్లు దర్జీ అంగడి చుట్టూ తిరగడం ప్రతిరోజూ పోటీలుపడి రంగవల్లులు తీర్చిదిద్దడం, గొబ్బమ్మలు పెట్టి ప్రతిరోజూ స్నేహితురాళ్ళని పేరంటానికి పిల్చి గొబ్బిపాటలు పాడటం, బొమ్మల కొలువులు పెట్టడం, రోజూ వచ్చే హరిదాసు కోసం బియ్యం, డబ్బులు పట్టుకుని ఎదురుచూడటం, ఇంక పండగ శెలవులు ఇవ్వగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళటం. ఇంక అమ్మమ్మ చేసి పెట్టిన పిండివంటలు, ముఖ్యంగా అమ్మమ్మ చేసే అరిశెలు, పాకుండలు, బూరెలు, బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంక పండగ మూడురోజులు భోగి రోజున ఆవుపేడతో చేసిన పిడకలతో భోగిమంటలు వెయ్యడం, నలుగుపెట్టి అమ్మ చేయించే తలంటి స్నానం, సాయంత్రం భోగిపళ్ళ పేరంటం ఆ పేరంటంలో పోటీలుపడి డబ్బులు ఏరుకోవడం అంతా భలే మజాగా ఉండేది. ఇంక సంక్రాంతి రోజుల పోటీలు పడి గాలిపటాలు ఎగరవేయడం, కనుమ రోజున పక్క ఊళ్ళలో జరిగే తీర్థాలకి, కోడిపందాలకి వెళ్ళటం అలా చాలా సరదాగా గడిచిపోయేవి.



ఇంకో ముఖ్యమైన ఇష్టమయిన పండగలలో అట్లతద్ది. అట్లతద్ది అంటే ఆడపిల్లలకు యమా సరదా! ముందురోజే గోరింటాకు పెట్టుకుని, అట్లతద్ది రోజు ఉదయం 4 గంటలకే లేచి చద్దన్నం తిని ఉయ్యాల ఊగుతూ, తొక్కుడుబిళ్ళాటలు, ఉప్పులగుప్పలు అన్ని ఆడేవాళ్ళము. అన్నింటిలోను నేను బాగా ఆడుతున్నానని మా చుప్పనాతి సరోజ ఉయ్యాల వంకరగా ఊపి ఉయ్యాల మీదనుండి నేను కింద పడేటట్టుగా చేసింది. పైగా తను కంచి పట్టుపరికిణి కట్టుకొచ్చి గొప్పలు చెప్పేది. సరోజకి గుణపాఠం చెప్పాలని మ్యూజికల్ చేయిర్స్ ఆటలో అది కూర్చోబోయే కుర్చీలో రేకు పైకీ వచ్చేలా చేశాను. సరోజ పట్టులంగా పర్రున చిరిగింది. అర్థం చేసుకుని చిర్రుబుర్రు లాడుతూ వెళ్ళిపోయింది. మేమందరం తెగ నవ్వుకున్నాము. ఇలా చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ పొతే బోలెడు.



తరువాత నేను డిగ్రీ పూర్తి చేశాను. వెంటనే గవర్నమెంటు ఉద్యోగికిచ్చి పెళ్ళి చేశారు. వెంటనే ప్రెగ్నెసి వచ్చింది. చిన్న వయసులో గర్భవతిని అయిన నాకు అన్ని అనుమానాలే. ఎన్నో భయాలు, సందేహాలతో ఉండేదాన్ని. పురిటికోసం పుట్టింటికి వచ్చాను. ఎంతో ఉత్సాహంగా ఉండే నాలో ఫిజికల్ గానే కాక మెంటల్ గా కూడా చాలా మార్పు వచ్చింది. అప్పుడప్పుడు బియ్యం తినడం, ఆకలి మందగించడం, కాళ్ళకి నీరు రావడం, వాంతులు ఏమితిన్నా కూడా నీరసంగా ఉండటం, అప్పుడప్పుడు లైట్ గా బ్లీడింగ్ కన్పించడం, ఎబార్షన్ అవుతుందేమో అని భయపడేదాన్ని అన్నింటికీ బామ్మ తన అనుభవాలు రంగరించి ధైర్యం చెప్పేది. రెమిడీలు చెప్పేది. బామ్మ మాటలు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి. ఇదిగో పిల్లా గర్భం వచ్చినప్పుడు కాల్షియం ఎక్కువ కావాలి. ఇప్పుడు నువ్వు ఇద్దరికి సరిపడా తినాలి అంటూ పాలు, పళ్ళు, బలమైన ఆహారం బలవంతంగా తినిపించేది. తిననని మారం చేస్తే నువ్వు తినకపోతే వెయిట్ తక్కువగా పిల్లలు పుడతారు తరువాత నువ్వే ఏడుస్తావు అని చెప్పగానే గబగబా తినేసేదాన్ని. బి.పి. పెరగడం, కాళ్ళకి నీరు పట్టడం అన్నీ డెలివరీ కాగానే తగ్గిపోతాయి. తోలికాన్పు ఆడదానికి మరోజన్మ లాంటిది. టైంకి తిని మందులు డాక్టర్ల సలహా ప్రకారం వాడుతూ చిన్నపాటి వ్యాయామాలు చెయ్యి పండంటి బిడ్డకు జన్మనిస్తావు అని బామ్మ, నానమ్మ, ఆమ్మమ్మలు ఒకరి తరువాత ఒకరు వాళ్ళ సలహాలు, అనుభవాలు చెప్తూ ఉంటే నాకు ఎంతో ధైర్యాన్నిచ్చేవి. మాత్రుత్వంలోనే ఉంది ఆడజన్మకి సార్థకం. అమ్మా అని పిలిపించుకోవడంలోని ఆనందం నాకు పిల్లలు పుట్టాక తెలిసింది. అందుకే అన్నారు పెద్దలమాట చద్దన్నం మూట అని. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాను.


ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ లో ఉంటున్నాము. చిన్ననాటి సంఘటనలు, స్నేహాలు, ఉన్న ఊరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒక్కసారి వెళ్లాలనిపిస్తుంది.



అందుకే అన్నారు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని. భుక్తికోసం, బ్రతుకుతెరువు కోసం ఏదేశమేగినా కన్నవారిని, ఉన్న ఊరిని, బాల్య స్నేహితులను మరవలేము. మాతృభూమి, పుణ్యభూమి కన్న భూమి మనది. కన్నరుణం, ఉన్నరుణం తీర్చుకోలేనిది. మళ్ళా ఎప్పుడు సమయం దొరుకుతుందా పల్లె అందాలను, బాల్యస్నేహితులను, కన్నవారిని, ఉన్న ఊరిని చూడాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది.


 

TeluguOne For Your Business
About TeluguOne