జగన్ బ్యాండేజీ తీసేశారు.. సెప్టిక్ భయమే కారణమా?!

జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ ఆయన చేపట్టిన బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన కంటి పైభాగాన గాయమైంది.   ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజలలో సానుభూతి పొంగి పొర్లిపోయి ఓట్లు రాలుస్తుందని భావించింది. అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల పాలైందది. జగన్ ప్రతిష్ఠ దిగజారింది. ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాటిని వేటినీ పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేననీ, దీని వెనుక ఉన్నది చంద్రబాబు, తెలుగుదేశమేననీ వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదనీ, పోలీసుల వైఫల్యం అస్సలు లేదనీ ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. అయినా  ఎన్నికల సంఘం నమ్మలేదు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పొలీస్ పై బదలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది.  దీంతో జగన్ పరిస్థితి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదన్నట్లు తయారైంది. దానికి తోడు కుట్లు పడేలా అయిన గాయానికి బ్యాండ్ ఎయిడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తయినా సెంటిమెంటును పిండుకుందామనుకున్నారు. అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండ్ ఎయిడ్ కూ డాక్టర్ల బృందం చికిత్స తరువాత వేసిన బ్యాండ్ ఎయిడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.   ఆ ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతుండటం కారణమో, వైద్యులు సరైన సలహా ఇవ్వలేదా? బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు, సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరికతో భయపడో తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండ్ ఎయిడ్ లేకుండా దర్శనమిచ్చారు. సరే ఇక్కడ విశేషం ఏమిటంటే రాయిదాడిలో తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ తీసేసిన తరువాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం విశేషం. ఈ జగన్మాయ ఏమిటి ముఖ్యమంత్రిగారూ అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  
Publish Date: Apr 27, 2024 1:50PM

పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం? మెగా హీరోలందరూ కూడా!

రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే గతంలోలా కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తాను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్ షోలతో జనాలకు దగ్గరౌతున్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోని బహిరంగ సభలలో పాల్గొనేందుకు మాత్రమే జనసేనాని నియోజకవర్గం వదిలి వెడుతున్నారు. అలా నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి విజయమే లక్ష్యంగా అగుడులు వేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా జనసేనాని గెలుపు లక్ష్యంగా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. జబర్దన్ కమేడియన్లు ఆది, గెటప్ శ్రీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా శనివారం నియోజకవర్గంలో తన చిన్నాన్న తరఫున ప్రచారం చేశారు.  ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ చిరంజీవి త్వరలో పిఠాపురంలో  పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనుండటం కూటమికి గట్టి బలం కానుంది. అయితే చిరంజీవి ప్రచారానికి వస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. ఏవో సినిమాలలో రాజకీయాలను నేను వదిలినా అవి తనను వదలడం లేదన్న డైలాగులు వినా చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయ ప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. అయితే ఇటీవల మాత్రం చిరంజీవి బహిరంగంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరు ప్రచారం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా చెబుతున్నారు. చిరు ప్రచారంతో పిఠాపురంలో జనసేనానికి ఇక తిరుగే ఉండదని అంటున్నారు. చిరు ప్రచారం ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూటమికి పెద్ద బూస్ట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు, ముఖ్యంగా మెగా హీరోలు జనసేనానికి మద్దతుగా ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.   
Publish Date: Apr 27, 2024 12:50PM

కేటీఆర్ విశ్వాసం లేని డాష్.. డాష్..!

శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలావరకు ఖాళీ అయిపోగా, అక్కడక్కడ మిగిలి వున్న పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్లర్లో కొన్ని లైన్లు పోస్టు చేశారు. తమ పార్టీ పుట్టుక సంచలనం అని, దారిపొడవునా రాజీలేని రణం.. అని ఏవేవో సోత్కర్ష లాంటి పదాలు పోస్టు చేశారు. ఇండియాలో ఎవరూ ఇంకొకరి డబ్బా కొట్టరు.. ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి కాబట్టి కేటీఆర్ ట్విట్టర్లో సొంతడబ్బా కొట్టుకున్నారని అనుకోవచ్చు. కానీ ఆయన అందులో వాడిన ఒక వాక్యం చూస్తుంటే, కేటీఆర్ని విశ్వాసం లేని డాష్.. డాష్ అన్నా తప్పులేదని అనిపిస్తోంది. ఇంతకీ ఆ పదం ఏమిటంటే, ‘పరపీడన చెర విడిపించిన ఉద్యమ జెండా’.. ఈ పదం రాయడానికి సిగ్గు లేకుండా అయినా వుండాలి.. లేదా బుద్ధి అయినా లేకుండా వుండాలి. కేటీఆర్ తండ్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు తెలుగువాళ్ళందరి మీద అధికారం చెలాయించాడా లేక తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించాడా? తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగతా మంత్రులుగానీ, ముఖ్యమంత్రులుగానీ తెలంగాణ ప్రాంతం మీదే అధికారం చెలాయించారా? బ్రిటీష్ వాళ్ళ మీద ఉపయోగించిన ‘పరాయి పాలన’ అనే పదాన్ని తోటి భారతీయుల మీద ఉపయోగించడమంత దుర్మార్గం మరొకటి వుండదు. అలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసిన పాపం మూటగట్టుకుంది కేసీఆర్ ఫ్యామిలీ.  మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకునిపోయింది. ఆ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం తప్ప అన్ని స్థానాలు దక్కాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళు ఓట్లు వేయబట్టే బీఆర్ఎస్ పరువు హైదరాబాద్‌లో అయినా మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వున్న తెలంగాణ స్థానికులు అందరూ బీఆర్ఎస్‌ని బొందపెడితే, హైదరాబాద్‌లో తమ పార్టీ పరువు నిలిపింది ఆంధ్రావాళ్ళేననే విశ్వాసం కూడా లేని డాష్ డాష్ కేటీఆర్‌కి పార్లమెంట్ ఎన్నికలలో ‘పరాయి’ వాళ్ళు బుద్ధి చెబుతారు.
Publish Date: Apr 27, 2024 12:49PM

నిప్పుల కుంపటి తెలంగాణ!

వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర  ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.  మొత్తంమీద ఈ నాలుగు రోజులూ రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. మండే ఎండలకు తోడు వేడి గాలులు కూడా వీస్తాయనీ, వడదెబ్బ ప్రమాదం హెచ్చుగా ఉంటుందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయనీ, ఉక్కపోత తీవ్రత ఎక్కువ అవుతుందని తెలిపింది.   ఇక వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకూ నమోదౌతున్నాయనీ, రానున్న రోజులలో ఇవి 50 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనీ పేర్కొంది.   
Publish Date: Apr 27, 2024 12:26PM

వైసీపీ నేతల నుంచే లక్ష్మీనారాయణకు ముప్పు!

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని వుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విశాఖ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ని కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. తన ప్రాణాలకు వైసీపీ నాయకుల నుంచి ముప్పు వుందని, తనకు ఎలాంటి హాని జరిగినా నంబాల రాజేష్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు బాధ్యులని లక్ష్మీనారాయణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. నంబాల రాజేష్ కుమార్, వీవీ రాజు, గాలి జనార్దనరెడ్డి కలసి వున్న ఫొటోను కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులకు అందించారు. ‘‘నేను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా వున్న సమయంలో అనధికార మైనింగ్ విషయంలో గాలి జనార్దనరెడ్డిని విచారించాను. ఆ సమయంలో గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడిగా ప్రచారంలో వున్న నంబాల రాజేష్‌కుమార్ కూడా విచారణను ఎదుర్కొన్నారు. ‘నా బాస్ గాలి జనార్డనరెడ్డిని లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతీకారం తీర్చుకుని మా బాస్‌కి బహుమతి ఇస్తాను. నాకు కేకే రాజు అండగా వుంటారు’ అంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నంబాల రాజేష్ అందరి ముందూ బాహాటంగానే మాట్లాడారు’’ అంటూ లక్ష్మీనారాయణ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణకు ఏదైనా ముప్పు ఏర్పడకముందే పోలీసులు స్పందించాల్సిన అవసరం వుంది.
Publish Date: Apr 27, 2024 12:21PM

ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు 

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.   బేగంపేటలోని ప్రముఖ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్ లో నిబంధనలకు విరుద్ధంగా యువతుల చేత ఆశ్లీల నృత్యాలు చేయించడం, యువకులను రెచ్చగొట్టడం, చెవులు చిల్లులు పడే డీజే శబ్దాల హోరులో మద్యం తాగుతూ చిందులు వేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఆ సందర్భంగా బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది యువతులు, 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.
Publish Date: Apr 27, 2024 12:21PM