RELATED NEWS
NEWS
విడుదలకు సిద్దంగా ఉన్న నాట్స్ స్రవంతి

విడుదలకు సిద్దంగా ఉన్న నాట్స్ స్రవంతి. తెలుగు సంబరాల సంచికలో ఎన్నో విశేషాలు

 

జూలై నెల 4-6 తేదీలలో ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ కన్నుల పండువగా జరుగనున్న "ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ వారి "మూడవ అమెరికా తెలుగు సంబరాల" జ్ఞాపక సంచిక (souvenir)"స్రవంతి" విడుదలకి సిద్ధంగాఉంది.


“భాషే రమ్యం – సేవే గమ్యం” అన్న ధ్యేయంతో పని చేసే సంస్థ నాట్స్. అత్యంత వైభవోపేతమైన  “అమెరికా తెలుగు సంబరాలు”  మిగిల్చే మధుర స్మృతులకి, జ్ఞాపకాలకీ ప్రతీకగా నిలిచిపోయే ఒక మంచి గ్రంథం – ఈ నాట్స్ సంబరాల జ్ఞాపక  సంచిక.


ఎన్ని కాలాలు మారినా, తరాలు మారినా , మన భాష , సాహిత్యం, సంస్కృతీ, సంప్రదాయాలు,  సతతం కొత్త పుంతలు తొక్కుతూ, నిరంతర జీవనదిలా, సాగిపోతూ ఉంటాయి. మన "చరిత"లోని చైతన్యాన్ని తీసుకొని, "నవత"రంగాల ఊపుతో ఎప్పుడూ "భవిత" వైపు సాగే తెలుగు భాషా సాహిత్య సంస్కృతీ స్రవంతి.


మన “చరిత”,  “నవత” మరియు “భవిత” అని మూడు తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని , సాహిత్య ధోరణుల వైవిధ్యమైన వర్ణాలకి అద్దం పడుతూ, వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగువైభవపు త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే ప్రయత్నమే ఈ “నాట్స్ సంబరాల స్రవంతి”. తొలిసారిగా మొత్తం విశ్వరూప ఖతులతో (యూనికోడ్ ఫాంట్లు) సొగసుగా రూపొంది, కాగితం నుంచి సాంకేతిక మాధ్యమాల వైపు దూసుకెళ్తున్న “భవిత”కి  సరితూగే మెట్టు ఎక్కి తొలిసారిగా ఐప్యాడ్ మరియు కిన్డిల్ పరికరాలలో ఆవిష్కరింప బడుతోంది.


స్రవంతి మూల సూత్రాన్ని, భావనల్ని, ప్రధానమైన ఆలోచనకి అద్దం పట్టే ఒక అందమైన ముఖచిత్రంతోనే మీ మనసుల్ని కట్టిపడవేస్తుంది ఈ మూడువందల ఎనభై పేజీల స్రవంతి. ఇంకా లోపలి పేజీల్లో, ఈ సంబరాల ఏర్పాట్లలో అహర్నిశలూ కష్టపడి పనిచేసిన అద్భుతమైన జట్లు, వారందరి రంగు రంగుల ముఖచిత్రాలు, ప్రముఖుల సందేశాలు, భూరివిరాళాలను ఇచ్చిన దాతల చిత్రాలు, వారి శుభాకాంక్షల ప్రకటనలు. ఎన్నో వ్యాపారాలలో రాణిస్తూ, వెలుగుతూ నాట్స్ యొక్క ఆశయాలకు ఊత నిస్తున్నఎన్నో వ్యాపార సంస్థల ప్రకటనలు. ఇంకా దాదాపు 220పుటలలో సాహిత్య సౌరభాలని గుబాళింపజేసి మనసుకి హత్తుకునే, ఆలోచనలు రేకెత్తించే కథలు, కథానికలు, వ్యాసాలు, పద్యాలు, కవితలు, నాటికలు, బుర్రకథలు, కుంచెకారుల కళలు మరియు కార్టూన్లు. వీటిలో తలమానికంగా నిలిచేవి, మన తర్వాతి తరంవారి సాహిత్య ప్రక్రియలు. "భవిత"లో, ముప్ఫై మంది పైగా ప్రస్తుత యువ రచయితలూ, భావి గొప్ప కవుల సరళి, మన తెలుగు సాహిత్య పయనించబోయే ఒక దిశా చూస్తారు. గతమెంతో ఘన కీర్తి కలిగిన మన సాహిత్య "చరిత", ఈ రెండు తరాల మంధ్య వంతెనలా నిల్చిన "నవత", వీటిలో దాదాపు తొంభైమంది సాహిత్యరంగ ప్రముఖులు, ప్రతిభాపాటవం ఉన్న రచయితల సాహిత్యవిన్యాసాలు మీ మనసుల్ని చూరగొంటాయి. ఇందులో ప్రచురించిన రచనలలో మొదటి బహుమతి పొందిన వారు - చరిత విభాగంలో నౌడూరి మూర్తి , నవితలో దమ్మన్న గీత,  ప్రత్యేక సంపాదక గుర్తింపు బహుమతి పాలూరి సుజన.  ప్రత్యేక వ్యాస రచయితలు  అక్కిరాజు రమాపతిరావు గారు, బెడదకోట సుజాత. భవిత (18 ఏళ్ళలోపు) విభాగంలో చిన్నారులు కర్రి శ్రీవైష్ణవి, అనుదీప్, పల్లవి కృష్ణారావు, శ్రీరామదాసు వైదేహి, మ్యాదరి స్వప్న, విజేతలుగా ప్రకటిస్తున్నాము.


వీటన్నితో ముస్తాబయిన మా, మన "నాట్స్ సంబరాల జ్ఞాపక సంచిక" "స్రవంతి", గిడుగు వారి 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని,  గిడుగువారి స్మారక సంచికగా మీకోసం, ఈ “స్రవంతి”. తప్పక ఆద్యంతమూ చదివి ఆనందించమని స్రవంతి సంపాదక వర్గం మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటోంది.

TeluguOne For Your Business
About TeluguOne
;