RELATED NEWS
NEWS
అమెరికాలో సేవా కిరణం మన శైలజా అడ్లూరు

ఇప్పుడు అమెరికాలో ప్రసిద్ధులైన తెలుగుతేజాల్లో శైలజా అడ్లూరు కూడా ఒకరు. ఆధ్యాత్మిక శిఖరం తిరుమలలో జన్మించిన ఆమె ఎన్నెన్నో విద్యాశిఖరాలు అధిరోహించారు. 1991 సంవత్సరంలో డాక్టర్ రమేష్ జీవితంలో వెలుగుగా మారిన ఆమె భర్త చెయ్యి పట్టుకుని అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియాకి వెళ్ళారు. బాల్యం నుంచే సేవాభావ పరిమళం వెదజల్లిన శైలజ ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా అన్నట్టుగా అమెరికాలో కూడా తన సమాజ సేవను భర్త సహకారంతో కొనసాగిస్తున్నారు. శైలజ భర్త డాక్టర్ రమేష్ అమెరికాలోని ప్రముఖ సైకియాట్రిస్టుగా వైద్యసేవలు అందిస్తుంటే, ఆయన సహధర్మచారిణిగా శైలజ సేవా కార్యక్రమాలలో నిమగ్నమై వున్నారు. గ్రేటర్ ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీలో మాత్రమే కాకుండా ఇతర కమ్యూనిటీలలో కూడా చురుకైన కార్యకర్తగా వుంటూ తన సేవా పరిధిని రోజురోజుకూ విస్తరించుకుంటున్నారు. సేవాభావం వున్న వ్యక్తులను పదవులు వరించి వస్తాయి. శైలజా అడ్లూరును కూడా అలాగే వరించాయి. ఆమె గ్రేటర్ ఫిలడెల్ఫియా తెలుగు సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. తానా, నాటా, ఆటా వంటి అమెరికా జాతీయ తెలుగు సంఘాల్లో కూడా చురుకుగా బాధ్యతలు నిర్వర్తించారు. భర్త డాక్టర్ రమేష్, పిల్లలు నితిష, నిశాంత్ కూడా శైలజ సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వుండటం ఆమెకు దక్కిన మరో అదృష్టం.

 

సేవా కార్యక్రమాలలో మాత్రమే కాకుండా కళలు, సంస్కృతి పరిరక్షణకు శైలజా అడ్లూరు తనవంతు కృషి చేస్తున్నారు. ఎంతోమంది కళాకారులకు ఆర్థిక సాయం కూడా చేశారు... చేస్తున్నారు. అలాగే భర్తల చేతిలో మోసపోయిన మహిళలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమాన్ని తన బాధ్యతగా స్వీకరించారు. ఎన్నారై భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సదరు మగమహారాజుల్లో మార్పు తెచ్చే విధంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ దారికిరాని వారిని పోలీసుల సహకారంతో సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి వారి సంసారాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని తెలుగువారు పోలీసులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వారి తరఫున నిలిచే ఆదర్శ మహిళగా శైలజా అడ్లూరు గుర్తింపు పొందారు. అమెరికాలో చదువుకుంటూ సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.


సేవా కార్యక్రమాల్లో మాత్రమే కాకుండా ప్రొఫెషనల్‌గా కూడా శైలజా అడ్లూరు మంచి పురోగతిని సాధిస్తున్నారు. అమెరికాకు వెళ్ళిన కొత్తలో  పర్సనల్‌ హెల్త్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి, ఆ తర్వాత పిల్లలు, సమాజసేవా కార్యక్రమాల కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. శైలజ భర్త డాక్టర్ రమేష్ స్థాపించిన హాస్పిటల్స్‌ వ్యవహారాలను కూడా చూస్తూ వుంటారు. అలాగే ఆమె ఎంట్రప్రెన్యూరర్‌గా ఉంటూ సొంతంగా ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు.



ఇటీవలి కాలంలో శైలజా అడ్లూరు దంపతులు చేసిన ఒక మంచి పని వారికి మరిన్ని అభినందనలు తెచ్చిపెట్టింది. అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయిన సందర్భంలో ఆ టవర్లలో వున్న ప్రజలు ప్రాణభయంతో టవర్ల నుంచి దూరంగా పరిగెత్తుతుంటే  ఫైర్ స్క్వాడ్ వాళ్ళు, పోలీసులు జనాన్ని కాపాడటానికి టవర్ల లోపలకి పరిగెడుతున్నారు. ఆ దృశ్యాన్ని, ప్రాణాలను లెక్కచేయని వారి నిబద్ధత చూసిన శైలజా అడ్లూరు అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని సంకల్సించారు. ఫైర్ స్క్వాడ్ సేవానిధికి ఆమె విరాళాలు అందిస్తూ వుంటారు. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిరంతరం రక్షణ కల్పించే పోలీసు విభాగానికి కావలసిన అధునాతన సాంకేతిక వ్యవస్థ కోసం, స్క్వాడ్ కార్ల కొనుగోలు కోసం శైలజ, రమేష్ దంపతులు భారీ విరాళాన్ని ఇటీవల పెన్సిల్వేనియా కాలేజ్‌ విల్లా ప్రాంతంలోని పోలీసు శాఖకు అందించారు.



అప్పర్‌ ప్రొవిడెన్స్‌ బోర్డ్‌ చైర్‌ ఉమెన్‌ లిసా మోసీ, పోలీస్‌ అధికారి మార్క్‌ టూమ్ని  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు డాక్టర్ రమేష్, శైలజా అడ్లూరు దంపతుల సేవాభావాన్ని వేనోళ్ళ కొనియాడారు. ఈ సందర్భంగా రమేష్ దంపతులు మాట్లాడుతూ, భారతదేశం నుంచి వచ్చిన తమను అమ్మలాగా ఆదరించిన ఆమెరికా సమాజానికి సేవ చేయడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ డెలావేర్‌ వ్యాలీ తెలుగు సంఘం అధ్యక్షురాలు శైలజ, మాంట్‌ గోమెరి కౌంటీ మాజీ కమిషనర్‌ రుష్‌ దమస్కర్‌, డాక్టర్‌ జయేందర్‌ రెడ్డి, డాక్టర్‌ భాస్కర్‌ రాజు, డాక్టర్‌ రవి రాళ్ళపల్లి, సాయి ఉయ్యూరు, శ్రీకాంత్‌ సెగిరెడ్డి, సురేష్‌ రెడ్డి వెంకన్నగారి, రమేష్‌ కొండూరు, రామ్‌ దుగ్గిరెడ్డి, నిశాంత్‌ ఏలూరి, శ్రీలత సంగరాజు, ప్రణవి చామర్తి, నితిష ఏలూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;