RELATED NEWS
NEWS
ఘనంగా ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తొలి తరగతులు

 

 

ఘనంగా ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తొలి తరగతులు

 

 


ఉన్నత చదువులకోసమో, ఉద్యోగాలకోసమో అమెరికా చేరడం మామూలే కానీ, అమెరికాలో భారతీయ  సంప్రదాయ కళలని నేర్పించే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి చరిత్ర సృష్టించింది సిలికానాంధ్ర. 15 ఏళ్ళ క్రితం తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనే నినాదంతో జగమంత తెలుగు కుటుంబంగా మొదలైన సిలికానాంధ్ర తరతరాల మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించే దిశగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. జనవరి 30 సోమవారం నాడు, క్యాలిఫోర్నియా రాష్ట్రం లోని మిపిటాస్ నగరంలో తమ స్వంత భవనం 'డా. లకిరెడ్డి హనిమిరెడ్డి భవన్ ' ప్రాంగణం లో  కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతంలలో  సర్టిఫికేట్, డిప్లొమా, మాస్టర్స్లో  చేరిన  విద్యార్ధులకు మొదటి సెమిస్టర్ తరగతులు ఘనంగా ప్రారంభించారు.

 

 

ఈ కార్యక్రమం కోసం  భారతదేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన సలహా మండలి మరియు అధ్యాపక బృందం లోని సభ్యులు  డా. పప్పు వేణుగోపాలరావ్, డా. పద్మ సుగవనం, డా. అనుపమ కైలాష్, డా. యశోదా ఠాకూర్, డా. సుమిత్ర, డా. రమాదేవి, తదితరుల సమక్షంలో నిర్వహించబడిన సరస్వతీ పూజలో , అమెరికాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన  విశ్వవిద్యాలయం విద్యార్ధులు పాల్గొన్నారు. 


సాయంత్రం జరిగిన సభాకార్యక్రమంలో మిల్పిటాస్ నగర మేయర్ రిచర్డ్ ట్రన్, మిల్పిటాస్ వైస్ మేయర్ మార్ష గ్రిల్లి, మిల్పిటాస్ కౌన్సిల్ మెంబర్ బాబ్ నునెజ్, సెరటోగా కౌన్సిల్ సభ్యులు రిషి కుమార్, కాంగ్రెస్ సభ్యులు రొ ఖన్న, ఆష్ కర్ల ల ప్రతినిధులు హాజరై, ప్రతిష్టామకమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మిల్పిటాస్ నగరంలో ఏర్పాటు కావడం, సంతోషకరమని, విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయసహకారాలు అందించడానికైనా తాము సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

 

 

ఈ సందర్భంగా అధ్యాపక బృందాన్ని,ఘనంగా సత్కరించారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ సీ ఈ ఓ ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, రాబోయే పదేళ్లలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని, భారతీయ కళలని నేర్పించే  అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం గా తీర్చిదిద్దుతామని అన్నారు.  చీఫ్ ఎకడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కంప్యూటర్ సైన్స్, బయో టెక్నాలజీ కోర్సులను సైతం అందించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దాదాపు 100 ఎకరాల సువిశాల విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2 నుండి 4 వరకు కాలిఫోర్నియాలో జరగబోయే 'అమెరికా కూచిపూడి నాట్య సమ్మేళనం ' గోడ పత్రికను  దాతలు డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారు, విజయలక్ష్మి గార్లు, అమెరికాలోని కూచిపూడి గురువుల సమక్షంలో ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ కొండిపర్తి, ప్రభ మాలెంపాటి, అజయ్ గంటి, రత్నమాల వంక, రవీంద్ర కూచిభొట్ల, సంజీవ్ తనుగుల, సాయి కందుల, స్నేహ వేదుల, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డా. పద్మ సుగవనం శాస్త్రీయ సంగీత కచేరి ఆహుతుల ప్రశంసలందుకుంది. తరగతుల ప్రారంభం సందర్భంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ అధ్యాపక బృందంలోని డా. శేషులత, డా. టీకే సరోజ, పౌర సంబంధ అధికారి డా. చెన్నయ్య, మీడియా కన్సల్టెంట్ మిమిక్రీ జనార్ధన్ తదితరులు భారతదేశం నుంచి తమ  అభినందనలు తెలియజేసారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో ప్రవేశం కోసం   www.universityofsiliconandhra.org చూడవచ్చు. 

 

TeluguOne For Your Business
About TeluguOne
;