NEWS
లాస్ ఏంజిలిస్ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి మేళా

 

లాస్ ఏంజిలెస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి మేళా వినోద భరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1900 మందికిపైగా లాస్ ఏంజిలస్ ప్రాంత తెలుగువారు పాల్గొన్నారు. లాస్ ఏంజిలిస్ తెలుగు అసోసియేషన్ (LATA) నిర్వహించిన రెండో ఏడాది సంక్రాంతి వేడుకలివి. ఈ కార్యక్రమంలో పలు జానపద కళా రీతులు ప్రేక్షకులను అలరించాయి. జానపద నృత్య రీతులైన కోలాటాన్ని మహిళలు అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే చిన్నారులు ప్రదర్శించిన జడకోలాటం చూపరులను విశేషంగా ఆకర్షించింది. లాటా ప్రధాన వినోద కార్యక్రమమైన ఫ్లాష్‌మోబ్ ఈసారి కూడా ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రికార్డింగ్ డాన్స్ కాన్సెర్ట్‌లు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి సమీర్ భావనిభట్ల, శ్రీకాంత్ కొచ్చెర్లకోట వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 150 మందికి పైగా లాస్ ఏంజిల్స్ తెలుగువారు వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఐదు గంటలపాటు వినోద కార్యక్రమాలు జరిగాయి.

 

లాటా మేళాను వైభవంగా నిర్వహించడానికి 110 మంది లాటా కార్యకర్తలు రెండు నెలలకు పైగా స్వచ్ఛందంగా శ్రమించారు. ఈ మేళాలలో తెలుగు నేలపై జరిగే తిరునాళ్ళను జ్ఞప్తికి తెచ్చేలా 10 నుంచి 12 ఏళ్ళ లోపు పిల్లలు శ్రీహరి అట్లూరి ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ నిర్వహించారు. లాటా ప్రెసిడెంట్ రమేష్ కోటమూర్తి LATA young achievement పురస్కార గ్రహీతలైన అఖిల కీతిరెడ్డి (మిస్ యు.ఎస్. రన్నర్ అప్), అద్వైత్ కార్తీక జాతీయ రాకెట్ బాల్ ఛాంపియన్ అండర్ 8లను సత్కరించారు. చివరగా నవీన్ కాంతాభాయి, కృష్ణ సామంతు టీమ్ చేసిన నృత్యాలు సభను ఉర్రూతలూగించాయి. మేళాకు హాజరైన అతిథితులకు రుచికరమైన తెలుగు విందు భోజనం అందించారు.

 

ఈ సందర్భంగా లాటా ప్రెసిడెంట్ రమేష్ కోటమూర్తి లాటా ముగ్గురు నూతన బోర్డు సభ్యులు శ్రీహరి అట్లూరి, సురేష్ అయినంపూడి, విజయ భాస్కర్ నెక్కంటిలను సభకు పరిచయం చేశారు. లాటా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ కొమిరిశెట్టి, రవి తిరువైపాటి, హరి మాదాల, తిలక్ కడియాల, లక్ష్మి చిమట ఈ మేళా జయప్రదం కావడానికి సహకరించిన కార్యకర్తలకు, విచ్చేసిన అతిథులకు తమ ధన్యవాదాలను తెలియచేశారు. భారత, అమెరికా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;