RELATED NEWS
NEWS
డాల్లస్ లో 19వ మహాసభలకు రెజిష్ట్రేషన్ నేడే ప్రారంభం!

తానా తెలుగు పూతోటలో విరిసిన సాహితీ సుమాల గుభాళింపు: సాహిత్యానికి అగ్ర  తాంబూలం!
డాల్లస్ లో 19వ మహాసభలకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు: రెజిష్ట్రేషన్ నేడే ప్రారంభం!

 

1977 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు వారి భాష, సాంస్కృతిక, అత్యవసర అవసరాలను తీర్చడానికి స్థాపించబడి గత మూడున్నర దశాబ్దాలకు పైగా అత్యుత్తమ సేవలందిస్తున్న జాతీయ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి 19వ మహాసభలు 2013, మే నెల 24 నుండి 26వ తేదీ వరకు టెక్సస్ లోని  డాల్లస్ మహానగరంలో జరుగ నున్నాయి. 1986 లో భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం స్థాపించబడిన  స్థానిక  తెలుగు సంస్థ “ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం” (టాంటెక్స్) ఈ మహాసభలకు సహ ఆతిధ్యం అందిస్తున్న విషయం మీకు తెలిసిందే.

 
తానా అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ తోటకూర మరియు 19వ  మహాసభల సమన్వయకర్త శ్రీ మురళి వెన్నం, మహాసభల కార్యదర్శి శ్రీ చలపతి కొండ్రకుంట  వివిధ శాఖలలో ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుండి దాదాపు పదివేలకు పైచిలుకు తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.   భారీ ఎత్తున జరుగనున్న తానా  మహాసభల్లో సాహిత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

అవధాన అగ్రగణ్యుల విశిష్ఠ విశ్లేషణ ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక ఆకర్షణ

 

 
తానా మహాసభల సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ విజయ చంద్రహాస్ మద్దుకూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ “తెలుగువారికే ప్రత్యేకమైన అవధాన ప్రక్రియ గురించిన ప్రత్యేక కార్యక్రమం ‘అవధాన కళావైభవం’ లో అవధాన దిగ్గజాలు శ్రీ మేడసాని మోహన్,  శ్రీ గరికిపాటి నరసింహారావు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మొదలైన వారు అవధాన కళ లోని అనేక పార్శ్వాలను సోదాహరణంగా వివరించనున్నారు.  మామూలుగా జరిగే అవధానంలా కాకుండా కొత్తగా విశ్లేషణాత్మకంగా అనేకమంది అవధానులతో జరిగే ఈ ముఖాముఖీ అందరికీ అలరించబోతోంది” అని అన్నారు. 

రిజిష్ట్రేషన్ నేడే ప్రారంభం

 

 
మహాసభల నూతన వెబ్ సైట్ www.tana2013.org ను ఇటీవల ఆవిష్కరించిన విషయం మీకు తెలుసు. ఇంటర్నెట్ ద్వారా 19వ  మహాసభలకు రిజిష్ట్రేషన్ సదుపాయం ఈ రోజే ప్రారంభించారు.  పైన పొందుపరచిన వెబ్ సైట్ లో “రిజిష్ట్రేషన్” మీద నొక్కి మీ కుటుంబ సభ్యల వివరాలతో మీ పేరును నమోదు చేసుకోవచ్చు. మహాసభలకు  సంబందించిన అన్నీ వివరాలను ఎప్పటికప్పుడు ప్రపంచమంతా విస్తరించి ఉన్న పదహారు కోట్ల తెలుగు వాళ్లకు తెలియజేయడం ఈ వెబ్ సైట్ ప్రధానోద్దేశ్యం. చీరలమ్మా చీరలు ....ఊప్పాడొప్పాడా చీరలు! అవునండీ.. ఈ మహాసభలకు తమ పేరు నమోదు చేసుకొన్న వారి జాబితా నుండి ప్రతివారం ఒక లక్కీ డిప్ విజేతకు రెండు వందల డాలర్ల విలువ చేసే ఉప్పాడ చేర బహుమతిగా ఇవ్వడానికి కంకటాల సంస్థ వారు ముందుకు వచ్చారు. అధిక వివరాలకు కంకటాల వెబ్ సైట్ ను దర్శించండి
 
సినీ వినీలాకాశంలో ధ్రువతారల తెలుగు వెలుగుల జిలుగు

 

 
తానా అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రవాసంలో తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణకు పెద్ద పీట వేసి గత మూడున్నర దశాబ్దాల కాలంపాటు తానా సంస్థ నిరాటంకంగా  చేస్తున్న కృషి మీకు తెలిసిందే. చలన చిత్రాలకు రసవత్తరంగా సాహిత్యాన్ని అందిస్తున్న రచయితలకు ఈ మహాసభలలో ఒక ప్రత్యెక వేదిక ఏర్పాటు చేయబడింది. చలనచిత్ర రచయితలు సిరివెన్నె ల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, చంద్రబోస్, వడ్డేపల్లి కృష్ణ, రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరాం మరొక వైవిధ్యభరితమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.  వీనులవిందుగా ప్రముఖగాయకుల పాటలు, అవి వ్రాసిన రచయితల మాటలు, సభికుల ప్రశ్నలకు సమాధానాలు వీటన్నింటితో చలనచిత్ర గీత సాహిత్యం మీద జరుగబోయే ఈ కార్యక్రమం తానా సభలలో వన్నెల హరివిల్లు వెలయిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు” అని అన్నారు.

అందరినీ ఆకర్షించే విభిన్న కార్యక్రమాలు

 


తెలుగు భాషాసాహిత్యాలకు పట్టాభిషేకం చేయనున్న ఈ మహాసభలలో ఇతర సాహిత్య ప్రక్రియల మీద జరుగబోయే కార్యక్రమాల వివరాలు త్వరలో తెలియజేస్తామనీ, వినూత్నరీతులలో వినోద ప్రధానంగా సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేవిధంగా కార్యక్రమాలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నామనీ తానా అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్, 19వ తానా మహాసభల సమన్వయకర్త శ్రీ మురళి వెన్నం, మహాసభల కార్యదర్శి శ్రీ చలపతి కొండ్రగుంట మరియు సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త శ్రీ విజయచంద్రహాస్ మద్దుకూరి ఒక తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేసారు.   

TeluguOne For Your Business
About TeluguOne
;