RELATED NEWS
NEWS
అట్లాంటాలో మనబడి తెలుగు మాట్లాట పోటీలుమే 17, 2015 రోజున అట్లాంటాలో తెలుగు వికాసం వెల్లివిరిసింది. సిలికానాంధ్ర మరియు అట్లాంటా తెలుగు సంఘం (తామా) వారు నిర్వహించిన మనబడి తెలుగు మాట్లాట పోటీలలో 60 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు పదాలను సరైన అక్షరాలతో వ్రాయడాన్ని పరీక్షించే “పదరంగం”, వివిధ విభాగాలలో తెలుగు భాషా విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే “తిరకాటం”, మరియు తెలుగులో స్పష్టంగా మాట్లాడడాన్ని పరీక్షించే “ఒక నిమిషం మాత్రమే (ఒనిమా)” లాంటి ఆటల పోటీలు జరిగాయి.

మొట్టమొదటిసారిగా అట్లాంటా ప్రాంతీయ పోటీలలో మూడు వర్గాల విజేతలు జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారు. మనబడి విద్యార్థులే కాక, తమ ఇళ్ళలో తల్లిదండ్రుల దగ్గర తెలుగు నేర్చుకునే 20 మందికి పైగా చిన్నారులు ఈ ఆటలలో పాల్గొన్నారు. 5 నుండి 7 సంవత్సరాల వయసు పిల్లలు పలువురు "బుడతల" వయో వర్గంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.

ఈ పోటీలకు ముఖ్య నిర్వాహకులైన తామా విద్యా కార్యదర్శి గద్దె వెంకి, తామా అధ్యక్షులు మద్దినేని వినయ్ గార్లు మాట్లాడుతూ, “మూడు సంవత్సరాల క్రిందట 25 మందితో మొదలైన మనబడి తరగతులు దినదినాభివృద్ధి చెందుతూ, ఈ సంవత్సరం 110 కి పైగా చేరటం గర్వించదగ్గ విషయం. ఈరోజు బాలబాలికల ఉత్సాహాన్ని చూసి, తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో అట్లాంటా ప్రజల ముందుకు తీసుకువస్తాము” అని  అన్నారు.
ఈ పోటీలను పర్యవేక్షించిన సిలికానాంధ్ర అట్లాంటా ప్రాంతీయ సమన్వయకర్త రావిళ్ళ విజయ్, “ఈ సంవత్సరం అట్లాంటా ప్రాంతీయ పోటీలలో గెలిచిన ఉద్దండులు తప్పక జాతీయ పోటీలలో రాణిస్తారని మా విశ్వాసం” అని అన్నారు. విచ్చేసిన పెద్దలని మనబడిలో వారి పిల్లలని చేర్చి, ప్రోత్సహించమని కోరారు. మనబడి తరగతుల గురించి మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org ని సందర్శించండి.

ఈ పోటీలలో గెలుపొందిన బాలబాలికల వివరాలు:
బుడతలు (5-9  సంవత్సరాల వయసు) :

తిరకాటం:  (1) కొల్లా మనస్వి             (2) కొల్లా మన్విత్
పదరంగం: (1) కసవరాజు తన్మయ్     (2) కేసనశెట్టి ఆద్య
ఒనిమా:       (1) నాగరాజు జయలాస్య   (2) ఆలపాటి అలేఖ్య
 
సిసింద్రీలు (10-13 సంవత్సరాల వయసు):
తిరకాటం:  (1) ఘంటసాల శ్రీ వైష్ణవి    (2) ఉయ్యూరు వైష్ణవి
పదరంగం: (1) ఘంటసాల శ్రీ వైష్ణవి    (2) క్రొత్తపల్లి ప్రణతి
ఒనిమా:       (1) ఘంటసాల శ్రీ వైష్ణవి   (2) లగిశెట్టి అక్షధ
 
చిరుతలు (14-16 సంవత్సరాల వయసు):
తిరకాటం:  (1) ఘంటసాల మానస      (2) కొక్కిరాల నిఖిత
పదరంగం: (1) ఘంటసాల మానస    
ఒనిమా:       (1) ఘంటసాల మానస

ఈ కార్యక్రమాలకు మద్దాలి సుబ్బారావు, చుండూరి రాజశేఖర్, జూజల సుష్మ, వజ్రాల రామకృష్ణ, బొజ్జా కృష్ణ, శ్రీనివాస్ క్రొత్తపల్లి, కాంచనపల్లి సుచేత, అన్నే భారతి, దేవరపల్లి కిషోర్, ధూళిపూడి సురేష్, జొన్నలగడ్డ యశ్వంత్, కొత్త కృష్ణ, తడికమళ్ళ రాజేష్, నర్రా ఉపేంద్ర, బలుసు ప్రియ, మద్ది రామ్, బొడ్డు మురళి, జంపాల రాజేష్, రావిళ్ళ విజయ్, దొడ్డాక నగేష్, కొండూర్ దేవానంద్, మహేష్ పవార్, మీసాల వెంకట్, మద్దినేని భరత్, మద్దినేని వినయ్, గద్దె వెంకి ఇంకా అనేక మంది భాషా సైనికులు కృషి చేసారు.


 

ఈ కార్యక్రమానికి పోషక సంస్థ ఐ.డి.ఆర్.ఐ.ఎల్ సర్వీసెస్ వారికి నిర్వాహకులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే స్కైల్యాండ్ బిజినెస్ సెంటర్ లో మాట్లాట కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయటానికి సహకరించిన వారి అధినేత సజ్జా సురేష్ గారికి అందరి తరఫున కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని తమ కెమెరాలో అందంగా పొందుపరిచిన ముదిగొండ కిరణ్ గారికి, కొత్త కృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.

మనబడి ఉనికితో ప్రవాసంలో తెలుగుపై మమకారం, ఆసక్తి ఇంకా మరెంతో పెంపొందాలని ఈ కార్యక్రమాలకు హాజరైన అనేక మంది పిల్లల తల్లిదండ్రులు, తెలుగు వారు ఆకాంక్షించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;