ఈటలకు ప్రాణహాని నిజమే!

ఈటల రాజేందర్  భద్రతకు ముప్పు ఉందని నిర్ధారణ అయ్యింది. డీజీపీ అంజనీకుమర్ ధృవపరచుకున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తన సతీమణి జమునతో కలిసి  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విలేకరుల సమావేశంలో ఈటల జమున తన భర్త రాజేందర్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ ఈటలకు వై కేటగిరి భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒకటి రెండు రోజులలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో  ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే భద్రత కల్పించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారిని ఈటల ఇంటికి పంపించి భద్రతకు సంబంధించిన వివరాలు సేకరించాలని డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశించారు. డీజీపీ ఆదేశాల మేరకు గురువారం (జూన్ 29) మేడ్చల్ డీసీపీ సందీప్,  ఏసీపీ వెంకట్ రెడ్డి  ఈటల ఇంటికి వెళ్లి అరగంటపాటు ఆయనతో మాట్లాడారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా ఈటల డీసీపీకి తెలిపారు. హుజురాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు వెళ్ళినపుడు అనుమానాస్పద కార్లు వెనక వస్తూ కనిపిస్తున్నాయని ఈటల వారికి చెప్పారు. ఆ తర్వాత డీసీపీ ఈటల ఇంటి పరిసరాలను పరిశీలించి, అందుకు సంబంధించిన సమాచారాన్ని   సీల్డ్ కవర్‌లో డీజీపీకి అందచేశారు. ఈ క్రమంలో ఈటలకు భద్రతను పెంచుతూ త్వరలోనే రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించే అవకాశాలున్నాయని అంటున్నారు. 

స్పీడ్ న్యూస్- 4

31.బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు నేడు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలతో ప్రజలకు అసౌకర్యం కలగకూడదని లక్నో ఈద్గా ఇమామ్ స్కాలర్, మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి   ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.  32.ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశానికి అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలుపై కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. మోదీ చెపుతున్న ఉమ్మడి ఎంతవరకు ఉమ్మడిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 33.కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. 34.టీమిండియా కోచ్‌లపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌ల పేరు ప్రతిష్ఠలకు క్రికెటర్లే కారణం అన్నాడు. 35.బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గొర్రెలకు డిమాండ్ పెరిగింది. తాజాగా రాజస్థాన్‌లో చూరూ జిల్లాలో ఓ పొట్టేలు ఏకంగా రూ.కోటి ధర పలికింది. 36.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని  కర్టాటకలో     కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.  ఉచిత బియ్యానికి బదులు నగదును అందిస్తామని సిద్ద రామయ్య ప్రభుత్వం  తెలిపింది. 37.బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. 38.కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ప్రణామ్, యూరియో గోల్డ్ స్కీమ్ ల కొనసాగింపునకు పచ్చజెండా ఊపింది. 39.కాంతి కిరణాల సాయంతో ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేసే సరికొత్త లేజర్ టెక్నాలజీ కాలిఫోర్నియాలోని ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ లేజర్ ఆధారిత ఇంటర్నెట్ సాంకేతికతను అభివృద్ధి చేసింది.  40.అమెరికాలో ఓ వ్యక్తికి అద్భుతమైన ఆఫర్ లభించింది. విమానంలో ఫస్ట్ క్లాస్ లో, అది కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది. 

మోడీ వరంగల్ పర్యటన ఖరారు.. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే నెల 8న ప్రధాని మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా వరంగల్ నగరంలో టెక్స్ టైల్ పార్కుకు కూడా మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత వరంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందు కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా ఉండగా ప్రధాని మోడీ పర్యటన కారణంగా అదే రోజు అంటే జూలై 8న హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన జరగాల్సి ఉన్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశం ఎప్పుడు జరిగేదీ తరువాత ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది. 

స్పీడ్ న్యూస్- 3

21.ఉమ్మడి పౌర స్మృతికి తమ పార్టీ సూత్రప్రాయ మద్దతు తెలుపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపాకే ముందుడగు వేయాలన్నారు. 22.చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్‌లో 45 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్సై బెదిరింపులకు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినందుకు కేసులు పెట్టారు. 23.తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు.  24.రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానని సీఎం జగన్ చెప్పుకోవడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ కుటుంబంలో కూడా జగన్ వంటి మేనమామ ఉండకూడదని అన్నారు. 25.ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతపరమైన అంశాలపై ఫిలింమేకర్లు సినిమాలు తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. 26.ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచ కప్ నెగ్గిన క్షణాలను వీరేంద్ర సెహ్వాగ్ పంచుకున్నాడు. సచిన్ ను భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో మొత్తం కలియదిరిగారు. 27.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.  సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ అప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. 28.ఇక నుంచి తాను పాత పద్ధతిలో మాట్లాడనని, ఇక నుంచి కొత్త పద్ధతిలో మాట్లాడతానని జన సేన అధినేత వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక నుంచి ఇలా ఇలా ఇలా అని మాట్లాడుతా ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా  కనుక్కుందాం అని వ్యాఖ్యానించారు. 29. కర్ణాటక‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు లేక, రోజంతా ఆటో తోలినా ఆశించిన డబ్బులు రాక ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. 30. తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌‌రెడ్డి చేసిన ట్వీట్‌ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.  దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు.

కార్యకర్తలకే విసుగొచ్చేసిన జగన్ స్పీచ్!.. ఫక్తు రొటీన్

రాజకీయ నాయకులలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ స్పీచ్ ఉంటుంది. కొందరు వినమ్రంగా మాట్లాడుతూనే చురకలు అంటిస్తారు. ఇంకొందరు అర్ధవంతమైన ప్రసంగంతో ఎదురువారిని ఆలోచింపజేస్తారు. మరికొందరు ఆవేశంతో మాట్లాడి ఎదుటివారిలో పౌరుషాన్ని రగిలిస్తారు. అయితే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలలో మాత్రం ఇందులో ఏదీ కనిపించదు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర నుండి ఇప్పుడు సీఎంగా వివిధ సభలలో,  బటన్ నొక్కుడు కార్యక్రమాలలో ఎక్కడైనా జగన్ ప్రసంగాలు   ఒకే విధంగా ఉంటాయి. ఓదార్పు యాత్ర చేస్తుండగా వాహనం పైన ప్రసంగిస్తూ పేపర్ లో రాసుకున్నది ముక్కలు ముక్కలు చూసుకొని చెప్పేవారు. పాదయాత్ర సందర్భంగా సభలలో పెద్ద పుస్తకమే తెచ్చుకొని చదివేవారు. ఇక సీఎం అయ్యాక లైవ్ మీడియా సమావేశాలకు వస్తే మాట్లాడిన మాటలు భీభత్సంగా ట్రోల్ అవడంతో ఇక లైవ్ కి రావడమే మానేశారు. సీఎం అయ్యాక బహిరంగ సభలలో మాట్లాడే సమయంలో పేపర్ చూసే తమ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని చెప్పేవారు. అది ఆయనే రాసుకొచ్చారా? ఎవరో రాసిచ్చిందే చదివే వారో కానీ.. సభ ఏదైనా పేపర్ చూసే మాట్లాడతారు. అయితే, ఈ పేపర్ స్క్రిప్ట్ లో కూడా ఓదార్పు యాత్ర దగ్గర నుండి ఇప్పటి సభల వరకూ ఎలాంటి మార్పులు లేవు. చివరికి ప్రతిపక్షాలపై చేసే విమర్శలలో సైతం ఒకటే పంథా. అదే నాలుగు మీడియా ఛానెళ్లను తిట్టడం.. అదే టీడీపీని విమర్శించడం. తనకు పొత్తులు ఎవరూ లేరని సానుభూతి కోసం ప్రయత్నించడం.. తనకూ అన్నీ మీరేనని దగ్గరయ్యే ప్రయత్నం చేయడం. చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి నాలుగు పెళ్లిళ్లు డైలాగ్ కూడా ఐదేళ్ల క్రితం నుండి అప్పుడప్పుడు అంటున్నదే. పవన్ మీద జగన్ చేసిన నాలుగు పెళ్ళిళ్ళు,  అవేశాలు, పూనకాలు, ఊగిపోవడాలు అంటూ పేల్చిన డైలాగ్ కూడా పేపర్ చూసి చదవడంతో కిక్కు లేకుండా పోయింది. నిజానికి రాజకీయ నేతలకు ప్రజల మధ్యకి వెళ్ళినపుడు హావభావాలు చాలా ముఖ్యం. ఉదాహరణకి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకుంటే సందర్భాన్ని బట్టి హ్యాండ్ మూమెంట్ ఒక్కోలా ఉంటుంది. చంద్రబాబును చూస్తే అక్కడ పరిస్థితిని బట్టి యువతతో ఒకలా పెద్దవారిని ఉద్దేశించి మరోలా మాట్లాడతారు. అప్పుడప్పుడు చంద్రబాబు కూడా   కామెడీ చేస్తుంటారు.. సీరియస్ అవుతుంటారు. కానీ, జగన్ సీరియస్ గా మాట్లాడినా, సెటైర్లు వేసినా, తన పనితనం గురించి చెప్పినా అన్నిటికీ ఒక్కటే నవ్వు కనిపిస్తుంది. దీంతో ప్రజలు  ఆయన ప్రసంగాలకు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నారు. చివరికి వైసీపీ కార్యకర్తలే ఎప్పుడూ ఒక్కటేలా కాకుండా కాస్త స్టైల్ మార్చి మాట్లాడితే చూడాలని ఉందని తెగ ఇదైపోతున్నారు. ఉదాహరణకి జనసేన పవన్ కళ్యాణ్ స్పీచెస్ చూస్తే ఈ మధ్య చాలా తేడా కనిపిస్తుంది. పంచ్ డైలాగులతో పవన్ కార్యకర్తలలో హుషారు నింపుతున్నారు. ఎంత రాసిచ్చిన స్క్రిప్ట్ అయినా ప్రజలను ఆకట్టుకొనేలా మాట్లాడగలగాలి. అలా పవన్ గత ఎన్నికలకు ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. గతంలో స్పీచ్ మధ్యలో ఆవేశంతో కంట్రోల్ తప్పిపోయే పవన్ ఇప్పుడు ఒద్దికగా ఉంటూనే సెటైర్లతో అధికార పార్టీని ఆగమాగం చేస్తున్నాడు. 'ఏపీ బాగుపడాలి అంటే వైసీపీ ఓడాలి'.. 'జనం బాగుండాలంటే జగన్ పోవాలి'.. 'హలో ఏపీ బై బై వైసీపీ' ఇలా కొన్ని స్లొగన్స్ కూడా పవన్ స్వయంగా ప్రకటిస్తూ ప్రజలలోకి వెళ్లేలా చేస్తున్నారు.  మరోవైపు నారా లోకేష్ సైతం ప్రసంగాలలో చాలా పరిణితి సంపాదించుకున్నారు. సింపుల్ గా మాట్లాడుతూనే అర్ధవంతంగా ఉండేలా లోకేష్ స్పీచ్ సాగిపోతుంది. తనపై వైసీపీ నేతలు వేసే సెటైర్లకు నొచ్చుకున్నట్లు ఎక్కడా కనిపించకుండా అవే సెటైర్లను గుర్తు చేస్తూనే వారికి కౌంటర్లు ఇవ్వడంలో లోకేష్ ఎప్పుడో మాస్టర్స్ చేశారు. ఇక ఇప్పుడు ఎటు తిరిగీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే స్పీకర్ గా వెనకబడి ఉన్నారు. ఫక్తు రోటీన్ గా మారిన ఈ స్పీచ్ లతో విసిగిపోయిన వైసీపీ కార్యకర్తలే.. ఒక్కసారి ఈ స్పీచ్ మారిస్తే చూడాలని ఉందని మాట్లాడుకుంటున్నారు.

టేలర్‌ హైస్కూల్ చరిత్ర కాలగర్భంలో!

నూట డెబ్భై ఏళ్ల చరిత్ర కలిగిన నరసాపురం టేలర్ హైస్కూల్ ఘనత ఇక గత చరిత్రగా కాలగర్భంలో కలిసిపోయింది.  150 కోట్ల విలువైన ఆస్తులున్నప్పటికీ ఈ హైస్కూల్ మూతపడే పరిస్థితికి రావడానికి కారణాలెన్నో ఉన్నాయి. అయితే ప్రధాన కారణం మాత్రం ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరించిన, అనుసరిస్తున్న విధానమే కారణం అని చెప్పాలి. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ హైస్కూల్ ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోయింది. ఈ హైస్కూల్ చరిత్ర ఆషామాషీది కాదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ హైస్కూల్ లోనే చదివారు. అంతేనా ప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు, నటుడు కృష్ణం రాజు వంటి ఉద్దండులెందరో ఈ హైస్కూల్ లోనే చదివారు.  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్‌ హైస్కూల్‌  అంటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు వంటి మహానీయులు  ఇక్కడే విద్యాభ్యాసం చేశారు.  ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలగా ఉన్న ఈ హైస్కూలు బుధవారం (జూన్ 28)నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది.   ప్రస్తుత కరస్పాండెంట్‌ పోతుల జగన్ ఈ విద్యా సంస్థను ప్రభుత్వానికి అప్పగిస్తూ.. సంబంధింత పత్రాలను జిల్లా అధికారులకు అందజేశారు. ‘స్కూల్‌కు ఆదరణ తగ్గడం, సిబ్బంది కొరత, ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి తదితర కారణాలతో స్కూల్‌ మూతపడే పరిస్థితి వచ్చింది.

గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

అప్రమత్తంగా ఉంటే బాగా  అలవాటైన పనులు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ముఖ్యంగా పోలీసులు తమ విధినిర్వహణలో భాగంగా  తమ ఆయుధాలను క్లీన్ చేయడం దాదాపుగా రోజువారీ వ్యవహారం. ఎంతగా అలవాటైన పనైనా సరే  అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ప్రమాదమో ఈ ఉదంతాన్ని బట్టి మరో సారి తేటతెల్లమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే గన్ మిస్ ఫైర్ అయ్యి ఒక కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మింట్ కాంపౌడ్ లో జరిగింది. తుపాకీ శుభ్రం చేస్తుండగా అది పొరపాటున పేలి హెడ్ కానిస్టేబుల్ రామయ్య మరణించాడు. తుపాకి మిస్ ఫైర్ అవ్వడంతో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ రామయ్యను నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. రామయ్య స్వస్థలం మంచిర్యాల లక్సెట్టిపేటగా చెబుతున్నారు.  

స్పీడ్ న్యూస్- 2

11.చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు.  12.దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన నగరారం బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 13.ఢిల్లీ మెట్రో ఇటీవల తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. రైలులో అసభ్యకర చేష్టలు.. ముద్దుసీన్లు, డ్యాన్సింగ్ రీల్స్‌తో తరచూ దర్శనమిస్తున్నాయి. 14.వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటజరిగింది. బుధవారం పొద్దుపోయాక జరిగిన ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. 15.ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ కదులుతోందనే భయంతోనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీగల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమో, మెట్రో రైలు కోసమో, కంటోన్మెంట్ రోడ్ల కోసమో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం లేదని విమర్శించారు.  16.తనకు నచ్చి, పది మందికి ఉపయోగపడుతుందని, ఆలోచించేలా చేస్తుందని భావిస్తే చాలు.. అది ఫొటో అయినా, వీడియో అయినా, సందేశం అయినా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో తన కోటి మంది ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా ఆయన ఓ గ్రామంలోని ఇంటిలో స్థలం ఆదా చేసుకునే దానికి సంబంధించి ఫొటోని షేర్ చేశారు. 17.అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన సబ్‌మెర్సిబుల్ ‘టైటాన్’ శకలాలను తీరానికి తీసుకొచ్చారు. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రాడార్ ఫ్రావిన్సులోని సెయింట్ జాన్స్‌ ఓడరేవుకు నిన్న వాటిని తీసుకొచ్చారు.  18. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. జూలై 12 నుండి 19 మధ్యన చేపట్టనున్నట్లు చెప్పారు. 19.హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక్కసారిగా భూమి కుంగడంతో స్థానికంగా కలకలం రేగింది. గౌతమ్ నగర్ కాలనీలోని ఓ సంస్థ భవనం నిర్మాణ పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. 20.పాకిస్థాన్ విధానాన్ని భారత విదేశాంగ మంత్రి తప్పుబట్టారు. రాత్రి ఉగ్రవాదం నడిపించే దేశంతో పగలు వాణిజ్యం చేయలేమని తేల్చి చెప్పేశారు.

కామ్రేడ్ ల స్నేహ ‘హస్తం’ ఎవరికి?

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలాంటి అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు దృష్టి సారిస్తుంటే.. కమ్యూనిస్టులు మాత్రం  ఎన్నికల్లో గెలిచే రాజకీయ పార్టీల కోసం అన్వేషణ ప్రారంభించాయి. గతేడాది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నికల్లో కారు పార్టీతో కలిసి ప్రయాణం చేసిన కామ్రేడ్‌లు... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసుకోని ఆ పార్టీతో కలిసి అడుగులో అడుగు వేసి నడిచేందుకు సిద్దమవుతోన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇప్పటికే కర్ణాటకలో బీజేపీకి ఝలక్ ఇచ్చి ...  కాంగ్రెస్ పార్టీకి కన్నడీగులు పట్టం కట్టారు. అలాగే రానున్న ఎన్నికల్లో తెలంగాణ సమాజం.. ఏ పార్టీకి పట్టం కట్టి వెన్నుదన్నుగా నిలుస్తుందనే ఆలోచనతో కామ్రేడ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.  ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో స్నేహగీతం ఆలపించేందుకు ఆ పార్టీ అగ్రనాయకులకు క్రామేడ్‌లు లాల్ సలాం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఓ చర్చ సైతం కొనసాగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి నడిస్తే..  తమకు సైతం శంకరిగిరి మాన్యాలే అనే ఓ   సందేహం  వామపక్షాలలో మొలకెత్తినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ , బీజేపీకి ప్రత్యామ్నయంగా టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందడంతో పాటు కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కామ్రేడ్లు అంచనా వేస్తున్నారు. తమ అంచనాలకు అనుగుణంగానే    హస్తినలోని వామపక్ష పార్టీల అగ్రనేతలు కూడా యోచిస్తున్నారని.. అ క్రమంలో కామ్రేడ్‌లు పొత్తుల కోసం పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం  హల్‌చల్ చేస్తోంది.   అందులో భాగంగానే ఇటీవల పాట్నాలో జరిగిన బీజేపీయేతర పార్టీల సమావేశానికి సీపీఐ, సీపీఏం అగ్రనేతలు సీతారాం ఏచూరి, డీ రాజాలు హజరయ్యారు. మరోవైపు.. ఈ భేటీలో పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ హడావుడి సదరు పార్టీల అధినేతలకు సైతం అర్థమైందని.. అదీ కాక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత పేరు దేశవ్యాప్తంగా మారుమోగిందని.. ఆ క్రమంలో ఆమెను ఈడీ పలుమార్లు విచారించిందని.. దీంతో కల్వకుంట్ల కవిత అరెస్ట్ తప్పదనే ఓ ప్రచారం జోరుగా సాగినా.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ... కేసీఆర్ కుమార్తెకు శ్రీ కృష్ణ జన్మస్థాన యోగం ప్రాప్తించలేదని.. ఈ మొత్తం ఎపిసోడ్‌ నేపథ్యంలో కారు పార్టీ అధినేతతో కలిసి నడిస్తే.. ఐఎస్ఐ మార్కు లాంటి ఎర్రంరంగు పార్టీ రంగు సైతం ప్రజల్లో పలచన అయిపోయే అవకాశాలు ఉన్నాయని..  దీంతో హస్తం పార్టీతో కలిసి నడిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ది చూకూరే అవకాశాలు ఉంటాయని కామ్రేడ్‌లు ఆలోచిస్తున్నట్లు ఓ ప్రచారం   పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.   రేపటి నుంచి బస్సు చార్జీలు లేదా విద్యుత్ ఛార్జీలు పెరుగుతోన్నాయంటే.. గతంలో ఎర్ర జెండా ఎర్ర జెండా ఎన్నియేల్లో...  అనుకొంటూ సామాన్య ప్రజల తరఫున రోడ్లపైకి వచ్చి.. ధర్నాలు, ఆందోళనలు ... వగైరా వగైరా చేపట్టి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ.. నిత్యం అవమాన పడుతూ.. కామ్రేడ్‌లు జైలుకు వెళ్లి వచ్చే వారు. అయితే ప్రస్తుతం గద్దెనెక్కిన ప్రభుత్వాలు.. కామ్‌గా బస్సు చార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచుకొంటూ పొతున్నాయి. అంటే.. ఛార్జీలు పెంచుతోన్నట్లు ప్రభుత్వాలు ప్రకటించడం లేదు.. అలాగే తమకు ఏమి తెలియదన్నట్లు కామ్రేడ్లు సైతం వ్యవహరిస్తున్నారు. దీంతో వామపక్షాలు, ఆ పార్టీ శ్రేణులకు పక్షవాతం  వచ్చి అన్ని అవయువాలు చచ్చుబడిపోయినట్లుగా మరో పార్టీతో అంటకాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్షాలపై సామాన్య ప్రజల్లో బలమైన ముద్ర అయితే పడిపోయిందనేది సుస్పష్టమనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తోంది.

జగన్ వైజాగ్ ఆశలు ఆవిరి.. షిఫ్టింగ్ ఇక లేనట్లే!

త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధాని కాబోతుంది.. నేను కూడా త్వరలోనే విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నా. ఇదీ ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇప్పటికి ఐదు నెలలు గడిచింది. ఆ మాటకొస్తే విశాఖ గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు అసెంబ్లీలో, మీడియా సమావేశాలలో, పలు కార్యక్రమాల సభలలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. విశాఖ నుండే పరిపాలన సాగుతుందని.. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. నాలుగు రోడ్లు, ఇంకో ఐదారు బిల్డింగులు కట్టుకుంటే అదే రాజధాని అవుతుందని చెప్పారు. ఒకసారి ఈ సంక్రాంతికి వైజాగ్ వెళ్తామని.. ఇంకోసారి ఈ దసరాకే ఫిక్స్ అని ఎప్పటికప్పడు ముహుర్తాలు మారాయి కానీ.. జగన్ మాత్రం తాడేపల్లి పాలెస్ దాటలేదు.    ఒక దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు వైజాగ్ లో ఇంటి కోసం అధికారులు సెర్చ్ మొదలు పెట్టారని, బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారనీ కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటికీ జగన్ మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. విశాఖ నుండే పరిపాలన అన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అయితే  అసలు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా? రాజధాని ఎలా ఉన్నా ఆయనే చెప్పినట్లు విశాఖ నుండే పరిపాలన సాగిస్తారా? లేక ఇప్పటి వరకు విశాఖ గురించి చెప్పిన మాటలన్నీ ఉత్తి మాటలేనా? అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అందుకు తగ్గట్లే విశాఖ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాయి. జగన్ ఇక విశాఖ రావడం కలేనని భావించాలని గంటా వెల్లడించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన విషయాన్ని అందరూ చూశారన్న గంటా.. ఆ సంఘటన చూశాక ఇక సీఎం జగన్ విశాఖపట్నానికి రాలేరన్నారు. విశాఖకు ప్రస్తుత పరిస్దితుల్లో ప్రముఖులు గానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కానీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అందుకే సీఎం జగన్ కూడా విశాఖ రారని తాను అంచనా వేస్తున్నట్లు గంటా చెప్పుకొచ్చారు. విశాఖకు రావాలన్న తన ఆలోచనను సీఎం జగన్ మానుకుంటారని ధీమాగా చెప్పారు.  అంతే కాదు, సీఎం జగన్ విశాఖకు వస్తే ఏ విశ్వసనీయతతో ఆయన ల్యాండ్ పూలింగ్ చేస్తారని అందరూ అడుగుతున్నారని గంటా శ్రీనివాస్ ప్రశ్నించారు. అదే సమయంలో వైజాగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపైనా గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ లో అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రమంతా కలకలం రేపితే.. డీజీపీ మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, పోలీసులు భేషుగ్గా పని చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  గంటా సంగతెలా ఉన్నా ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇక జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం కష్టమే. ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నిండా పది నెలలే  సమయం ఉంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రాజధాని అమరావతి వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందో క్లారిటీ లేదు. మరో వైపు విశాఖలో పరిస్థితులకు ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదంతమే అద్దం పడుతోంది. ఎన్నికల సమయానికి చక్కదిద్దుకోవాల్సిన అంశాలు ఇప్పటికే జగన్ కు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి విశాఖకు తరలి వెళ్తారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అన్నట్లు అసలు వైసీపీ కాన్సెప్ట్ విశాఖను రాజధానిని చేయాలనుకోవడం కంటే అమరావతిని నాశనం చేయడం.. రాష్ట్రానికి అనువైన రాజధాని లేకుండా చేయడమే. మరి అది ఎలాగూ జరుగుతుంది కనుక విశాఖ అంశంలో  జగన్ లైట్ తీసుకోవడం విడ్డూరం ఏమీ కాదు!

నవరత్నాలు కాదు నవ మోసాలు

నవరత్నాల పేరిట జగన్నాటకాన్ని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు బట్టబయలు చేశారు. జగన్ నవరత్నాల బాగోతంపై తెలుగుదేశం నివేదికను ఆయన విడుదల చేశారు.    ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో జగన్ సర్కార్ అబద్ధపు హామీల నిగ్గు తేల్చారు.   వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని అచ్చన్నాయుడు పేర్కొన్నారు. పాదయాత్ర హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదనీ, నవరత్నాల హామీల్లో 25 శాతం కూడా అమలు చేయలేదనీ పేర్కొన్నారు. ఫేక్ సీఎం ఫేక్ మాటలు తప్పుడు ప్రచారంతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారనీ, రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదనీ నివేదిక పేర్కొంది. అలాగే  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదనీ, పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2  ఇంత వరకూ అమలు కాలేదని పేర్కొంది.  అమ్మఒడి కింద ఇచ్చిన  రెండు హామీలూ అమలు కాలేదని అచ్చన్నాయుడు అన్నారు. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీల పరిస్థితీ అంతేనని అన్నారు.   బోధనారుసుం కింద ఇచ్చినరెండు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3మూడు హామీలూ పెండింగ్‍లోనే ఉన్నాయన్నారు.  మద్యనిషేధమంటూ ఇచ్చిన  హామీ  పరిస్థితీ అంతేనని, అలాగే వైఎస్సార్ ఆసరా, చేయూత కింద  ఇచ్చిన నాలుగు హామీలూ నెరవేరలేదని అచ్చన్నాయుడు అన్నారు.   నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదనీ, జగన్ చెప్పే మాటలన్నీ అసత్యాలేనని అచ్చన్నాయుడు విమర్శించారు.  ఎన్నికల ముందు చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటి అన్నారు.  అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామన్నారనీ, కానీ ఇచ్చింది మాత్రం రూ.13 వేలేనన్నారు.  రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నారన్నారు.  తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమంద్వారా ప్రతి మహిలకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించామని అచ్చన్నాయుడు చెప్పారు. ఫించన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చాం - మేం 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే ప్రస్తుత వైసీపీ సర్కార్ మాత్రం 62 లక్షల మందికి  మాత్రమే పిఛను ఇస్తోందన్నారు.  జగన్ సర్కార్ 10 లక్షల మందికి పింఛన్ తొలగించిందనీ, ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తోందనీ అచ్చన్నాయుడు విమర్శించారు. 

ప్రజలకు మంత్రి ధర్మాన వార్నింగ్

పాపం వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరినట్లుంది.  లేకపోతే మళ్ళీ తమని గెలిపించకపోతే అంటూ ఏకంగా ప్రజలకే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. తాము ప్రజల కోసం చాలానే చేశామని చెప్పుకుంటున్న వైసీపీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షాలు ఎండగట్టే వాటికి సమాధానం చెప్పుకోలేక ఇలా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే పని మొదలు పెట్టినట్లున్నారు. అది కూడా ఏ గల్లీ లీడరో.. కొత్తగా వచ్చిన తెలిసీ తెలియని ఎమ్మెల్యేనో కాదు ఏకంగా ఉత్తరాంధ్రకే సీనియర్ లీడర్, సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. వీళ్ళ అసహనం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన ప్రజలకు ఇలాంటి హెచ్చరిక చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ధర్మాన ఇంటింటికీ వెళ్లారు. అయితే.. ఈ సంద‌ర్భంగా కొంద‌రు స్థానిక స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించారు. దీంతో మంత్రి ధ‌ర్మానకి కోపమొచ్చింది. పేద ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంద‌ని, ఇంకా ఏదో రాలేద‌ని, మాకు అది రాలేదు ఇది రాలేదని ఎందుకు అడుగుతున్నార‌ని వారిని నిల‌దీశారు. ఏవో చిన్న చిన్న కార‌ణాలలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవకపోతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. తనను ప్రశ్నించిన ప్రజలకు ఒక రకంగా క్లాస్ పీకిన ధర్మాన.. మ‌ళ్లీ వైసీపీని గెలిపించ‌క‌పోయారో అంటూ మొదలు పెట్టి మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఆ మాటతోనే ఆపేశారు. దీంతో ఆయ‌న చేసిన ఈ హెచ్చ‌రికలు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అలాగే ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రికి అక్కడ కూడా అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో అసలు మీ ప్రాంతంలో చాలా మంది తనకి ఓటు వేయలేదని.. అయినా దయతలచి లక్షల రూపాయలు వెచ్చించి పనులు చేస్తున్నానని.. అలాంటి సమయంలో మీకు ప్రశ్నించే హక్కే లేదని తేల్చేశారు. తన నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేటల్లో తనకు మెజార్టీ రాలేదని.. అందుకే అభివృద్ధి పనులు చేయమ‌ని అడిగే హక్కు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు లేద‌న్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ నేత‌లు.. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని మంత్రి ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించారు. కొందరు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకుని కూడా టీడీపీకి ఓటు వేస్తామ‌ని చెబుతున్నార‌ని.. ఇది స‌రికాద‌ని, అది మీకే మంచిది కాదన్నారు. ఒక్క ధర్మాన మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వైసీపీ నేతలది ఇలాంటి పరిస్థితే. గడపగడపకు వెళ్తున్న నేతలకు ప్రజల నుండి ప్రశ్నలే ఎదురువుతుండగా.. నేతలలో సహనం నశించి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. మీకు సంక్షేమం అందిందా లేదా అని ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో కూడా వచ్చేదే ఇప్పుడు కూడా వస్తుందని.. కానీ తమ ప్రాంతంలో అభివృద్ధి ఏదని నేతలను నిలదీస్తున్నారు. తమ గ్రామంలో, తమ కాలనీలో చేసిన ఒక్క అభివృద్ధి గురించి చెప్పాలని ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు నేతలు భయపడి ఏదో తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. మరికొందరు ఇలా ప్రజలనే బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. అసలే ఎన్నికల కాలం.. వాళ్ళ కాళ్ళు, గడ్డాలు పట్టుకుంటేనే పనికాని రోజులు. ఇలాంటి సమయంలో వాళ్లనే బెదిరిస్తే ఊరికే ఉంటారా! మరి వైసీపీ నేతలు ఈ లాజిక్ ఎలా మర్చిపోతున్నారో!

స్పీడ్ న్యూస్ -1

1. ప్రవాసాంధ్రురాలు స్వాతిరెడ్డి పోరాటానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన టీడీపీ అధినేత ఆమెపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 2.మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వ్యతిరేక నిరసనల్లో తమ లోగో వినియోగించడంపై ఫోన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా తమ లోగోను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది. 3.రాజకీయ రంగ ప్రవేశంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహాగానాలకు తెరదించాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. 4.మొత్తానికి కరోనా వైరస్ సహజంగా పుట్టినది కాదన్న విషయం బహిర్గతమైంది. వైరస్‌ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు చావోషావ్ వెల్లడించాడు. 5. తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 6. ఉత్తరప్రదేశ్ విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నియామక పరీక్షలో నకిలీల బెడదకు కృత్రిమ మేధతో చెక్ పడింది. మంగళవారం జరిగిన ఈ పరీక్షకు ఏకంగా 87 మంది నకిలీ అభ్యర్థులు హాజరయ్యారు. 7ప్రొటీన్ షేక్‌లతో ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే ఆ విషయాన్ని ప్యాకింగ్‌పై స్పష్టంగా ముద్రించాలని బ్రిటన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తాజాగా అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం ప్రొటీన్ షేక్ తాగిన భారత సంతతి టీనేజర్ రోహన్ గోధానియా మరణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 8.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తల్లో వాస్తవం లేదన్నారు.  9.భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డులను సాధించడమే కాక ఇప్పుడు ఆ సినిమా టీమ్ ఏకంగా ఆస్కార్ జ్యూరీ మెంబర్లు అయ్యేంత గొప్ప స్థాయిని తీసుకొచ్చింది. 10.హాలీవుడ్ శృంగార తార, సింగర్ మడొన్నా వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   

ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన.. కేసీఆర్ కుర్చీకి ఎసరేనా?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. జులై 2వ తేదీ ఖమ్మంలో ఆయన  కాంగ్రెస్ గుటికి చేరనున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు భారీగా ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అందులోభాగంగా ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వహణ పనులను పొంగులేటి అండ్ కో స్వయంగా పర్యవేక్షిస్తోంది.  అయితే ఈ బహిరంగ సభకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సభకు దాదాపు 5 లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు నాయకగణం ఏర్పాట్లు చేస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులపై తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన విషయం విదితమే ఆ క్రమంలో వీరిద్దరు కాంగ్రెస్ గూటికా, కమలం గూటికా అన్న మీమాంశలో చాలా కాలం గడిపేశారు.   అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ కూడా వీరి కోసం తమ తమ పార్టీల తలుపులు బార్లా తెరిచాయి. మా పార్టీలో చేరతారంటే.. మా పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నాయి.   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్  విజయఢంకా మోగించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జోష్ మీద ఉన్న బీజేపీ  డీలా పడగా... హస్తం పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఒకటికి రెండు స్లారు.. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో వరుస  భేటీలు నిర్వహించారు. దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమై.. ముహూర్తం ఖరారు అయింది. ఆ క్రమంలో జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచుకోనున్నారు.   ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న జిల్లా . అలాంటి జిల్లాలో గత ఏడాది డిసెంబర్‌లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత అంటే ఈ ఏడాది జనవరిలో తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన...  ఇదే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ సైతం విజయవంతమైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సైతం జులై 2వ తేదీన ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ సైతం గ్రాండ్ సక్సెస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ సభకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు తెలంగాణలోని పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవడానికి వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్న గులాబీ బాస్ కేసీఆర్‌ కుర్చీకి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందనే ఓ చర్చ  తెలంగాణ సమాజంలో హల్‌చల్ చేస్తోంది.

రేవంత్ లో ధీమా.. సీనియర్లలో సందేహం!

నో డౌట్, అనుమానం లేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ,గట్టి పట్టున్న నాయకుడు.  అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని బతికించారు. జీవం పోశారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని శ్రేణుల్లో కల్పించారు. సీనియర్లూ ఐక్యత గురించి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. అధిష్ఠానంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కలిగింది. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర నాయకులలో అనైక్యతను గుర్తించి అందరూ ఏకతాటిపై నడిచే విధంగా హస్తినకు పిలిపించుకుని మరీ వారికి దిశానిర్దేశం చేసింది. అన్నిటికీ మించి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగడం గత తొమ్మిదేళ్లలో ఇదే ప్రథమం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నెలల తరబడి మీమాంసకు ఫుల్ స్టాప్ పెట్టి మరీ కాంగ్రెస్ గూటికి చేరడానికి నిర్ణయించుకున్నారు. బీజేపీ నుంచీ, బీఆర్ఎస్ నుంచీ కూడా కాంగ్రెస్ లోకి చేరేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖ నేతలే క్యూకడుతున్నారన్న సమాచారం ఉంది. అలా వచ్చే వారిలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిరువురూ ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా పని చేసిన వారే. ఈ వరుస పరిణామాలతోనే కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా గట్టిగా కనిపిస్తున్నది. అయితే వీహెచ్ వంటి అతి సీనియర్ నేతలు మాత్రం కాంగ్రెస్ లో కనిపిస్తున్న ఈ జోష్ కడవరకూ నిలబడుతుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విభేదించి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుని మరో అధికార కేంద్రం ఏర్పడేందుకు దోహదం చేయవద్దంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. విజయంపై విశ్వాసం మంచిదే కానీ, అతి విశ్వాసం కూడదంటూ సీనియర్లు సైతం సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మామూలుగానే దేశ రాజకీయాలలో ఒక నానుడి ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు.  ఆ పార్టీయే అంతర్గత విభేదాలతో కుదేలౌతుందన్నదే ఆ నానుడి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అవసరమే కానీ, కాంగ్రెస్ లో అది ఒకింత ఎక్కువ అంటుంటారు. నిన్న మొన్నటి వరకూ రేవంత్ రెడ్డి లక్ష్యంగా సీనియర్లు చేసిన హంగామా ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు కలిసి పని చేస్తామని చెబుతున్నా, సరిగ్గా సమయం వచ్చే సరికి కాడి వదిలేస్తారా అన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. నేతలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండటమే వరుస ఓటముల తరువాత కూడా ఆ పార్టీ పుంజుకోవడానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.  అదలా ఉంచితే.. ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్న జోష్ ఎన్నికల దాకా కొనసాగాలంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా అందరూ సహనం, సంయమనం ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాట అంటున్నది వేరే ఎవరో కాదు కాంగ్రెస్ శ్రేణులే అంటున్నాయి. విజయం ఫస్ట్ టార్గెట్ గా విభేదాలు విస్మరించి కలిసి పని చేయాలనీ, గత ఏడాది కాలంగా కాంగ్రెస్ లో కనిపిస్తున్న కొత్త జోష్ అలాగే కొనసాగేలా వరుస కార్యక్రమాలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ లో పని చేసే కార్యకర్తలకు కొదవ లేకున్నా, వారికి మార్గదర్శనం చేసే నాయకులలో విభేదాల కారణంగా కేడర్ ను సవ్యమార్గంలో నడిపించడంలో విఫలమౌతూ వస్తోంది. అయితే వరంగ్ లో జరిగిన రైతు భరోసా యాత్ర, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలతో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న ధీమా ప్రదర్శించడం సరికాదు.  గత ఎన్నికలో ప్రజలు  18 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. చివరకు  మిగిలింది ఆరుగురు మాత్రమే. దీంతో కష్టపడి గెలిపించుకున్నా నాయకులను నిలుపుకోవడంలో పార్టీ విఫలమైందన్న సందేశం కింది స్థాయి క్యాడర్ వరకూ వెళ్లిపోయింది. అందుకే సొంత ఇమేజ్ కోసం కాకుండా క్షేత్ర స్థాయిలో క్యాడర్ విశ్వాసం, ప్రజల మన్నన పొందే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయడానికి ఇప్పటి నుంచే సమాయత్తమవ్వాలని పార్టీ విజయానికి అదే దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు. అధిష్ఠానం స్పెషన్ ఫోకస్ పెట్టినందువల్ల ఎన్నికల వరకూ కాంగ్రెస్ సవ్యదిశలోనే సాగుతుందని పార్టీ క్యాడర్ ఆశాభావంతో ఉన్నారు. 

భోపాల్ లో కవితపై మోడీ విమర్శల ఆంతర్యమేమిటంటే?

ప్రధాని మోడీ ఉన్నట్లుండి.. కేసీఆర్ కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదీ తెలంగాణ గడ్డ మీద నుంచి కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వేదికగా ప్రధాని మోదీ  కేసీఆర్ కుటుంబపాలనపై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారి తీశాయి. పార్టీలో ఉండాలా? వద్దా? అని లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్న వారిలో పునరాలోచన రేపాయి. మోదీ వ్యాఖ్యలు నమ్మాలా? వద్దా?  మోడీ నిజంగా కవితపై చర్యలు తీసుకునేందుకే   ఆ వ్యాఖ్యలు చేశారా?   మోడీ వ్యాఖ్యలలో సీరియస్ నెస్ ఉందా?  పార్టీ మారే విషయంలో మరికొంత కాలం వేచిచూద్దామా? అని రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులు మీమాంసలో పడ్డారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండ ని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొనసాగాలా? నిష్క్రమించాలా? సరైన సమయంలో కాంగ్రెస్‌లోకి వెళ్లాలా? అని సందిగ్ధంలో ఉన్న సీనియర్లను మరింత గందరగోళంలో పడేశాయనడంలో సందేహం లేదు. అసలు ప్రధాని   భోపాల్ వేదికగా తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అన్న చర్చ  బీజేపీలో విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులు నమోదై, విచారణ కూడా జరిగింది. అయినా ఆమెను ఇప్పటివరకూ అరెస్టు చేయకుండా, కేవలం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని, తెలంగాణ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ముంగిట.. బీజేపీ, బీఆర్ఎస్ లాలూచీ అన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. కేవలం క విత విషయంలో బీజేపీ హైకమాండ్ తీరు కారణంగానే బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన హైప్ బుడగలా పేలిపోయింది. మద్యం కుంభకోణం కేసు నుంచి కవితను రక్షించేందుకే ఏపీ సీఎం జగన్ ద్వారా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మర్చడంలో బీజేపీ అగ్రనాయకత్వం పాత్ర, ప్రమేయం ఉందని రాష్ట్ర బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఏపీలో అవినాష్ రెడ్డిని  ఏ విధంగా అయితే అరెస్టు కాకుండా అడ్డుపడుతోందో, తెలంగాణలో కవితను కూడా బీజేపీ అగ్రనాయకత్వం అలాగే కాపాడుతోందని సామాన్య జనమే కాదు, తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు, శ్రేణులూ కూడా భావిస్తున్నాయి.  ఆ కారణంగానే తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజలలో విశ్వసనీయత తగ్గిందనీ, గత నాలుగున్నరేళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకాన్ని బీజేపీ అగ్రనాయకత్వం చేజేతులా వమ్ము చేసిందని పార్టీలోని ఒక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ విషయంలో అగ్రనాయకత్వం ఎలా వ్యవహరించినా ఫరవాలేదనీ, ఎందుకంటే అక్కడ పార్టీ నామమాత్రమేననీ, కానీ తెలంగాణలో మాత్రం పార్టీకి గట్టి పట్టు ఉందనీ, ప్రజలు కూడా బీజేపీకి ఓ చాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావనలో ఉన్నారనీ వారంటున్నారు. అయితే మద్యం కుంభకోణంలో కవితకు బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రం కొమ్ముకాసేలా వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వారి ఆప్షన్ గా ఇంత కాలం ఉన్న బీజేపీ ఇప్పుడు వెనుకబడిపోయిందనీ, ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి చేరిందని చెబుతున్నారు.  కవిత  అరెస్టు కారన్న బలమైన భావన  ప్రజలలో ఏర్పడిందనీ,  ఇక బీఆర్‌ఎస్‌పై తాము చేసే పోరాటాలను, ప్రజలు ఎందుకు విశ్వసిస్తారని తెలంగాణ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాయి.  కేసీఆర్-కవితను జైలుకు పంపిస్తామని ఇప్పటికి కొన్ని వందల సార్లు హెచ్చరించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఆధారాలుంటే కచ్చితంగా అరెస్టు చేస్తారని మాటమార్చడంపై  పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇంత కాలం ఎలాంటి ఆధారాలు లేకుండా కవితపై తెలంగాణ బీజేపీ ఆరోపణలు గుప్పించిందా అని ప్రజలు నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాల వద్ద ఇదే విషయాన్ని ఈటల, కోమటటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రస్తావించారని అంటున్నారు.  కవిత విషయంలో కేంద్రం తీరు కారణంగా  బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలు రాజకీయ డ్రామాగానే ప్రజలు భావిస్తున్నారని వారు కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీని బతికించుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోడీ భోపాల్ వేదికగా కవితపై ఆరోపణలను ప్రస్తావించారని పరిశీలకులు అంటున్నారు.  భోపాల్‌లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదు. అక్కడ ఆ పార్టీ ఉనికే లేదు. పోనీ  మధ్యప్రదేశ్ లో బీఆర్‌ఎస్‌ను విమర్శించడం వల్ల అక్కడ ఓట్లు పడతాయా అంటే అదీ లేదు.  ఏరకంగా చూసినా మోడీ వ్యాఖ్యలు బీజేపీకి ఇసుమంతైనా ఉపయోగపడవు. అదే సమయంలో బీఆర్ఎస్ కు వీసమెత్తు నష్టం జరగదు.  కేవలం కేంద్రం- పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న.. తెలంగాణ బీజేపీ నేతలను సంతృప్తిపరిచేందుకే, మోడీ  కవిత పేరు ప్రస్తావించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విజయసాయికి సీక్రెట్ మిషన్ అప్పగించిన జగన్!

జగన్ పార్టీలో.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్... తర్వాత స్థానం ఎవరిది అంటే.. గతంలో అయితే ఆ పార్టీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిది అని ఎవరైనా ఠపీమని ఇట్టే చెప్పేస్తారు. ఇటీవలి కాలంలో పార్టీలో విజయసాయి ప్రభ మసకబారింది. ఆయన నుంచి ఒక్కో బాధ్యతనూ తప్పించిన జగన్ ప్రస్తుతం కేవలం నామమాత్రపు పోస్టులో ఉంచి పార్టీలో కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ నెల 21న సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష కార్యక్రమంలో భాగంగా.. సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. విజయసాయి గురించి ఓ సంచలన ప్రకటన చేశారు. సాయన్న ముసలోడు అయిపోయాడు.. అందుకే అనుబంధ విభాగాల బాధ్యతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించానంటూ అందరిలో విజయసాయి పరువును గంగలో కలిపారు. దీంతో విజయసాయి అలగారనీ, బుంగమూతి కూడా పెట్టుకున్నారనీ పార్టీలోనే కాకుండా రాజకీయవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక వైసీపీతో విజయసాయి బంధం పుటుక్కుమందన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమైంది. అయితే విజయసాయికి పార్టీ బాధ్యతలు ఒక్కటొక్కటిగా తప్పించడం, ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచడం వెనుక జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలోని కీలక నేతల నుంచి అందుతున్న సమాచారం. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం కోసం పార్టీ వ్యవహారాలతో సంబంధం లేకుండా అత్యంత కీలకమైన బాధ్యతలను జగన్ విజయసాయి భుజస్కంధాలపై పెట్టారనీ, ఆ పనిలో విజయసాయి తలమునకలై ఉన్నారనీ ఆ వర్గాలు అంటున్నాయి.  వచ్చే ఎన్నికల్లో పార్టీవిజయావకాశాలపై  సీఎం   జగన్ తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానే కాకుండా  ఐ ప్యాక్‌ సైతం  సొంతంగా  చేపట్టిన సర్వేల్లో దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయనీ, పార్టీ వచ్చే ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అని ఆ రెండు సర్వేల్లో తేలడంతో  ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. వరుసగా రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా దూసుకోపోవాలని పార్టీ వర్గాలకు  జగన్ స్పష్టంగా దిశానిర్దేశం చేయడమే కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి నిధులను సేకరించే బృహత్తర బాధ్యతను జగన్ విజయసాయికి అప్పగించారంటున్నారు. అందుకే ఆయన నుంచి పార్టీ బాధ్యతలు ఒక్కటొక్కటిగా తొలగించారనీ చెబుతున్నారు. ఇప్పటికే విజయసాయి నిధుల సమీకరణ కోసం పని చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ‘గడప గడపకూ’ సమీక్షలో జగన్ విజయసాయిని ముసలోడని అన్నప్పటికీ.. అది పైపై ముచ్చటే కానీ, అంతర్గతంగా విజయసాయి మామూలోడు కాదు మహానుభావుడు అన్నదే జగన్ ఉద్దేశమని ఆ వర్గాలు చెబుతున్నాయి.   మరోవైపు గతంలో సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉండి.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధినేతలపై  నానా బూతులు, వ్యంగ్య బాణాలతో  కామెంట్లు ఫోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం చాలా మర్యాదగా.. చాలా పద్దతిగా కామెంట్లు పెట్టడంపై కూడా చర్చ మొదలైంది.  అదీకాక విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె భర్త నందమూరి తారకరత్న మరణించిన  సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వ్యవహరించిన తీరు నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై  జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం సైతం హల్ చల్ చేసింది. ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డిపై  జగన్ వైఖరిలో  మార్పు వచ్చిందన్న ప్రచారం సైతం నడిచింది.   అలా వారిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్.. ప్రస్తుతం ఇలా పైకి కనిపించని బంధంగా కొనసాగుతోందని పార్టీలోని కీలక వర్గాల సమాచారం.  మరి ఎన్నికల నాటికి జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించేందుకు మరోసారి విజయసాయిరెడ్డి తెర చాటు రాజకీయానికి శ్రీకారం చుట్టానున్నరనే ఓ ప్రచారం పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో అడిటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ విజయసాయిరెడ్డి.. నాటి నుంచి నేటి వరకు ఆయన ఎదిగిన పరిణామ  క్రమాన్ని ఓ సారి  పరిశీలిస్తే.. ఈ ఆడిటర్‌గారు మామూలోడు కాదనే ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.  పార్టీ అధినేత  జగన్.. ఢిల్లీలో ఏ పని అప్పగించినా.. లేదా ఓ మారుమూల ప్రాంతంలోని ఓ సాధారణ గల్లిలో పని అప్పగించినా క్షణాల్లో ఆ పని పూర్తి చేయడం ఈ ఆడిటర్ కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సూటికేస్ ఓపెన్ చేసి.. క్లోజ్ చేసింత ఈజీగా చేసేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కళకళ లాడుతున్న గాంధీ భవన్!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి హైదరాబాద్ లోని గాంధీ భవన్ కళకళలాడుతూ కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్  తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి కూడా తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వలసెళ్లిపోయారు. తనకు రాష్ట్రంలో పోటీనే లేకుండా చేసుకొనే క్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ లోపం కూడా తోడై తెలంగాణలో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ పేలవమైన ఫలితాలతో కాంగ్రెస్ చతికిల పడింది. ఆ పార్టీ నేతలు కూడా చప్పబడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. అందులో కొంతమేర సక్సెసై పార్టీ క్యాడర్ తో పాటు నేతలను పెంచుకుంది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ నేతలలో కూడా మునుపెన్నడూ లేని విధంగా హుషారు కనిపిస్తున్నది. హైకమాండ్ కూడా అందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో నేతల చేరికలు మొదలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ టూ ఢిల్లీ కాంగ్రెస్ నేతల రాకపోకలూ పెరిగిపోయాయి. అదే సమయంలో వచ్చే నేతలు, పోయే నేతలు, సమావేశాలు, సంప్రదింపులతో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ బిజీబిజీగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలియదు కానీ ఇప్పుడైతే గాంధీ భవన్ కళకళలాడుతూ కనిపిస్తుంది.  కర్ణాటక ఫలితాలను అడ్వాంటేజ్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి ఇతర పార్టీల నుండి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించటమే కాకుండా కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీలో రాహుల్ గాంధి సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరటంతో పార్టీకి ఊపొచ్చినట్లయ్యింది. ఇదే ఊపులో మరికొందరిని పార్టీలోకి లాగేందుకు పార్టీ పెద్దలు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ప్రముఖ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.  దీంతో ఎటు తిరిగీ ఉదయం నుండి సాయంత్రం వరకు నేతల రాకతో గాంధీ భవన్ సందడి సందడిగా కనిపిస్తున్నది. కారణం ఏదైనా కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నమ్మకం పెరిగింది. కర్ణాటకలో హిందూత్వ అజెండా అందుకున్న బీజేపీ ఓటమిని ఇక్కడ కూడా హైలెట్ చేయడం, అదే సమయంలో హామీల అమల్లో విఫలమైన కేసీఆర్ అనే అంశాలతో ఈసారి కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు.. గాంధీ భవన్ కు కొత్త కళ వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇదే టెంపోను రాష్ట్ర పార్టీ ఎన్నికల వరకు కొనసాగించగలరా? నేతల మధ్య ఆధిపత్య పోరు ఆగిపోతుందా? పాత నేతలు, కొత్త నేతల మధ్య సంఖ్యత కుదురుతుందా అన్నది చూడాల్సి ఉంది.