అదానీకి అమెరికా షాక్!?
అదాని భారత వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్ లో కూడా ఈ పేరు గట్టిగా వినబడుతుంది. అదాని వ్యాపార సామ్రాజ్య విస్తరణకు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పడిన బీజం.. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ వేగంగా పెరిగి ఒక మహావృక్షంగా మారిందని బీజేపీ వ్యతిరేకులు ఆరోపిస్తుంటారు. అటువంటి అదానీ వ్యాపార సామ్రాజ్యం ఒకే ఒక్క నివేదికతో వేగంగా పతనం కావడం వెనుక మోడీ వ్యతిరేకుల కుట్ర ఉన్నదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అదానీ వ్యాపార సామ్రాజ్య పతనం వెనుక కుట్రలో భారత్ కే చెందిన మరో వ్యాపార దిగ్గజం విప్రో ప్రేమ్ జీ హస్తం కూడా ఉందని ఒకానొక సమయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
హిడెన్ బర్గ్ నివేదికతో మొదలైన అదానీ వ్యాపార సామ్రాజ్య పతనం.. మోడీ సర్కార్ అండదండలతో ఆగినా.. పూర్వ వైభవాన్ని మాత్రం అందుకోలేదన్నది కాదనలేని వాస్తవం. హిడెన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పతనమౌతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని అప్పట్లో ఆర్గనైజర్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్ష ణ ముసుగులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ, అదానీవాచ్ డాట్ ఓఆర్ జి అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. హిండెన్‌బర్గ్ కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ, అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు ఉన్నారని ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అలాగే, ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారాం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని, ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే ది వైర్ కథనాలు రాసిందని ఆర్గనైజర్ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే, అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ అనీ, అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని, ఆర్గనైజర్ ఆరోపించింది.
అయితే, ఎంత కాదన్నా నిప్పు లేనిదే పోగారాదు. అలాగే, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఎంతగా ఎదురు దాడి చేసినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇది గతం అయితే ప్రస్తుతానికి వస్తే మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఆ దేశం మోడీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అదానీకి గట్టి షాక్ ఇచ్చింది. మోడీ పర్యటన పూర్తి చేసుకుని అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భాతర పారిశ్రామిక దిగ్గజం అదానీకి అమెరికా ప్రభుత్వం అవకతవకలకు సంబంధించి సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అతలాకుతలమైన అదానీ గ్రూప్‌పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో విదేశీ ఫండ్స్ బాసటతో రెండు నెలలుగా ఊపిరి పీల్చుకుంటున్న అదానీ గ్రూప్ షేర్లు గత వారం ఒక్కసారిగా కుప్పకూలాయి.
అదానీ గ్రూప్‌లో పెద్ద వాటాల్ని కొన్న అమెరికా ఫండ్స్‌కు బ్రూక్లిన్‌లోని యూఎస్ అటార్నీ ఆఫీస్ నుంచి సమన్లు వెళ్లాయని బ్లూంబర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. హిండన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత కొద్ది రోజులకు విదేశీ ఫండ్స్ నుంచి అదానీ గ్రూప్ భారీ నిధుల్ని సమీకరించి, రుణ ఊబి నుంచి తాత్కాలికంగా గట్టెక్కింది.
ఈ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అమెరికా ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ ఏమి చెప్పిందన్న అంశాలపై ఆరా తీస్తూ అటార్నీ ఆఫీసు సమన్లు పంపిందనేది సమాచారం. ఇదే తరహా దర్యాప్తును మార్కెట్ రెగ్యులేటర్ యూఎస్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ (సెక్) కూడా చేస్తున్నదని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ బ్లూంబర్గ్ తెలిపింది. అయితే తమ ఇన్వెస్టర్లకు తమ ఇన్వెస్టర్లకు అమెరికా రెగ్యులేటర్లు సమన్లు జారీచేసిన విషయం తెలియదని అదానీ గ్రూప్ అంటోంది.