పదే పదే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? దాని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాకవుతారు!!

టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.  బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది. ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది . ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.                                                       *నిశ్శబ్ద.

వర్షాకాలంలో దోమల బెడద తగ్గాలంటే ఈ టిప్స్ పాటించాలి..!

వర్షాకాలం ఇంటి పరిసరాలు చాలా చిత్తడిగా ఉంటాయి.  ఇలాంటి ప్రాంతాలు దోమలు పెరగడానికి అనువుగా ఉంటాయి.  విపరీతమైన దోమల కారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు,  మలేరియా,  చికెన్ గున్యా వంటి జ్వరాలు వస్తాయి.  అయితే ఇంటి పరిసరాలలో అసలు దోమలు ఉండకూడదంటే ఈ కింద చెప్పుకునే చిట్కాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఇలా చేస్తేనే ఈ వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా తమను తాము మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు. ఇంటి పరిసరాలలో ఉండే పూల కుండీలు,  బకెట్లు,  పాత టైర్లు వంటి వాటిలో వర్షం నీరు చేరుతూ ఉంటుంది.  ఇలాంటి వాటిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. నీరు అలాగే నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ దోమల ఉదృతి పెరుగుతుంది.  కాబట్టి ఇంటి పరిసరాలు పొడిగా, నీటితో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో  ఉన్న నీటి కాలువలు,  డ్రైనేజీ సిస్టం, నీరు నిల్వ చేసే సొంపు వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి.  వర్షం కారణంగా వీటిలో కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు అడ్డు పడి నీరు నిలుస్తూ ఉంటుంది.  ఇవి కూడా దోమలకు ఆవాసాలుగా మారతాయి. నీటి కాలువలు, డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడూ నీరు పారుతూ ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లినా,  ఇంటి చుట్టుప్రక్కల దోమల ఉదృతి ఎక్కువగా ఉన్నా దోమ కాటుకు గురి కాకుండా, చర్మాన్ని సంరక్షించగల లోషన్ లు, క్రీములు, స్ప్రే లు  ఉపయోగించాలి. ఇవే కాదు నిమ్మ, యూకలిప్టస్ నూనె వంటి సారాలతో కూడిన స్ప్రే లు దోమలను దరిదాపుల్లోకి రానివ్వవు. వీటిని వినియోగించాలి. ఇంట్లో నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె, నిమ్మ,  టీట్రీ వంటి నూనెలను ఉపయోగించాలి. ఆయిల్ డిఫ్యూజర్ లను ఉపయోగించాలి.  ఇవి దోమలను ఇంట్లో నుండి తరిమికొట్టడంలో సహాయపడతాయి. పైపెచ్చు ఇల్లంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లోనే దోమలు ఎక్కువగా వస్తుంటాయి.   ఈ సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లు ఆన్ లో ఉంచాలి.  గాలి ఉదృతి కారణంగా దోమలు సరిగా ఎగరలేక ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. ముఖ్యంగా పడకగదులలో ఫ్యాన్లు ఆన్ లో ఉంచితే పడుకునే సమయానికి దోమలు అక్కడి నుండి వెళ్లిపోతాయి. దోమల బెడద తప్పించుకోవడానికి ఇంట్లో వేప,  సాంబ్రాణి వంటి హానికరం కాని వాటితో ఇంట్లో ధూపం వెయ్యాలి.  ఇవి ఒకవైపు దోమలను తరిమికొట్టడంలోనూ, మరొకవైపు వాటి వాసన కారణంగా ఇంట్లో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ సహాయపడతాయి. ఇంటి బాల్కనీ,  ఇంటి ఆరుబయట ప్రాంతంలో సిట్రోనెల్లా,  లావెండర్,  బంతి పువ్వులు, నిమ్మగడ్డి వంటి మొక్కలను పెంచాలి.  ఈ మొక్కల సువాసన కారణంగా దోమలు ఆ దరిదాపుల్లో ఉండవు. ముఖ్యంగా ఇంటి తలుపులకు,  కిటికీలకు నెట్ కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  దీనివల్ల ఇంట్లోకి తాజా గాలి వస్తూనే దోమలు రాకుండా ఉంటాయి.                                         *రూపశ్రీ.

కొత్తకొత్తగా…అడుగులెయ్యండి!!

ఈకాలంలో అందరికి శరీరం మీద శ్రద్ధ పెరిగిందనే చెప్పుకోవాలి. ట్రెండింగ్ లో ఉన్న దేన్నీ వదలరు. తినే తిండి నుండి, తాగే ద్రవపదార్థాలు, సమయం, ప్లానింగ్, ఇంకా వ్యాయామాలు, జిమ్ లో కసరత్తులు ఇలా బోలెడు ఫాలో అవుతుంటారు. ఎంత బిజీ లైఫ్లో మునిగిపోయిన కనీసం వారానికి ఒకసారి అయినా ఔటింగ్ వెళ్లడం, స్నేహితులను కలవడం, ఎంజాయ్ చేయడం. ఇలాంటివన్నీ బోలెడు ఫాలో అవుతుంటారు.  ఇవన్నీ కూడా మనిషిని శారీరకంగానూ మరియు మానసికంగానూ దృఢంగా ఉంచేవే!! అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ముఖ్యంగా బాచ్లర్స్ వీటిని ఫాలో అవ్వగలరు. వాళ్లకున్న ఫ్రీడమ్ అలాంటిదే మరి. కానీ పెళ్ళైనవాళ్ళు అన్నిటినీ ఫాలో అవ్వాలన్నా ఎన్నో కారణాలు కనిపిస్తుంటాయి. వాటిలో నిజానికి కుటుంబం మరియు కుటుంబంతో కలసిపోయిన బాండింగ్ మొదలైనవి చిన్న అడ్డంకులుగా కనిపిస్తాయి. కానీ వాటిని బయటకు చెప్పలేరు. అందుకే చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మారినా అలవాట్లు మాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇదిగో ఇలా చేస్తే కచ్చితంగా కొత్తగా మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.  టైం ప్లానింగ్!! ఇది కేవలం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం నుండి రాత్రి పడుకునేవరకు  ప్రతిదీ ఒక సమయం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుకున్న సమయానికి ఏది పూర్తవకుండా ఇబ్బంది పెడుతుంది. కానీ దాన్ని అట్లాగే వదిలెయ్యకూడదు. ఒక పని అనుకున్న సమయం కంటే ఓ అరగంట ఆలస్యం అయినా సరే దాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఉంటే దాన్ని ఆ అరగంట సమయం ఎక్స్ట్రా తీసుకోకుండా కరెక్ట్ టైమ్ కు పూర్తిచేసే రోజు తప్పకుండా వస్తుంది. అంటే ఇదొక సాధనలాగా జరిగే ప్రక్రియ. సమయ ప్రణాళిక అనుకోగానే మొదట్లోనే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోదు. అందువల్ల కరెక్ట్ గా సెట్ అవట్లేదని నిరుత్సాహపడి దాన్ని వదిలేయకండి. ఈ సమయ ప్రణాళిక మీ నుండి మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఎంతో మేలు  చేస్తుంది. ముఖ్యంగా పిల్లల జీవితం గొప్పగా సాగేందుకు సహాయపడుతుంది. ప్రాధాన్యతలు!!  ప్రతి ఒక్కరి సమయ ప్రణాళికలో కొన్ని ప్రాధాన్యత ఎక్కువ ఉన్నవి, కొన్ని తక్కువ ఉన్నవి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం అందరూ పొరపాటు చేస్తారు. ఏదైనా ఆఫీస్ పని లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినపుడు శారీరక మరియు వ్యక్తిగత సమయాలను కుదించి వాటికి కేటాయిస్తారు. అయితే తిరిగి వాటిని భర్తీ చేయడం ఎలా అనే విషయాన్ని పట్టించుకోరు. కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యమే కానీ శరీరాన్ని, మూడ్స్ ను డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. వృత్తి పరమైన ప్రాధాన్యతల్లో పడి శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించకూడదు. ప్రణాళిక వేసుకున్నాకా ప్రతి ఒక్కటీ ముఖ్యమైనదే అని, అన్నిటికి సమప్రధాన్యత, ప్రతి పనిని ఒకే విధమైన శ్రద్ధా భక్తులతో చేయాలి. అప్పుడే మీ ప్రణాళికలకు, ఆలోచనలకు సార్థకత.  ప్రోద్బలం, ప్రోత్సాహం!! కుటుంబ సభ్యుల నుండి ఎదో ఒక విధంగా ఏదో ఒక పనిదగ్గర ఇబ్బంది ఎదురవుతూ ఉంటే సింపుల్ గా కుటుంబ సభ్యులలో ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను ఆ పని వైపు ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు కూడా వారిలో ప్రత్యేకత ఉందని గమనించి తమకంటూ ఓ గుర్తింపు వైపు సాగిపోతారు. ఇలా చేయడం వల్ల ఇతరుల సమయాన్ని గౌరవించే అలవాటు కలుగుతుంది. అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఒకరికొకరు చర్చించుకుని సమయాన్ని ఎంతో సరదాగా గడపవచ్చు. నిజానికి  ఎప్పుడూ వెన్నెల ఉంటే దాన్ని అంతగా ఇష్టపడేవాళ్ళా?? లేదు కదా!! ఇది కూడా అంతే మనుషులు ఎప్పుడూ బంధించుకున్నట్టు ఉంటే ఆ బంధంలో కొత్తదనం కనిపించదు. చివరగా చెబుతున్నా ఎంతో ముఖ్యమైన మాట. మొదట బద్ధకాన్ని వదిలి జీవితాన్ని కొత్తగా మలచుకోవాలి అనే ఆలోచనతో ఆగిపోకుండా అటువైపు అడుగులు వేయాలి. అప్పుడే కొత్తదనం కిలకిలా నవ్వుతుంది జీవితంలో. ◆ వెంకటేష్ పువ్వాడ  

అమ్మాయిలూ… ఈతప్పు చేయొద్దు!

జీవితంలో తప్పులు జరగడం అనేది సహజం. ఆ తప్పులలో కొన్నింటిని సరిదిద్దుకోవద్దు, అయితే కొన్ని తప్పులు సరిదిద్దుకోలేరు. అలా సరిదిద్దుకోలేమని చాలామందికి తెలియకుండా తప్పులు చేస్తారు. అమ్మాయిలు తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారని, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని సర్వేలలో స్పష్టమయింది. అమ్మాయిల ఆలోచనా విధానమే దానికి కారణమని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలు చేసే తప్పులు, తీసుకునే తప్పు నిర్ణయాల గురించి అమ్మాయిలు తప్పక తెలుసుకోవాలి మరి. స్వేచ్ఛను కోల్పోవద్దు!! స్వేచ్ఛ అంటే చాలామంది వేరే అర్థం తీసుకుంటారు. పొట్టి పొట్టి బట్టలేసుకుని ఇష్టమొచ్చినట్టు తిరుగుతూ నా ఇష్టం నా స్వేచ్ఛ అనే వాళ్లకు నిజమైన స్వేచ్ఛ అంటే అర్థం తెలియకపోవచ్చు.  కానీ స్వేచ్ఛ అంటే ఒకరి చెప్పుచేతల్లో లేకుండా ఇష్టమైనదాన్ని పొందడం.  నచ్చినది తినడం, నచ్చినది చదవడం, నచ్చినది భయం లేకుండా అడగడం. ఇవన్నీ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసపు స్థాయిలను చాలా గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా అడిగితే ఇంట్లో ఏమంటారో అనే భయాన్ని వదిలిపెట్టాలి. అవసరమైన వస్తువు ఎందుకు అవసరం అనే విషయాన్ని వివరించాలి. భారంగా ఆలోచించొద్దు!! చాలామంది ఇళ్లలో అడపిల్లల్ని భారంగా చూస్తారు. ఇది చిన్నతనంలో ఎక్కువగా కనిపించకపోయినా పెద్దయ్యే కొద్దీ ఈ భావాన్ని తల్లిదండ్రులు ఆడపిల్లల దగ్గర మాటల్లో వ్యక్తం చేస్తుంటారు.  ఆడపిల్లలు ఏదైనా ఖరీదైన వస్తువులు అడిగినప్పుడు "నీకోసం ఇంత దాచిపెట్టాలి. ఇప్పుడే ఇంతింత ఖర్చులు భరించాలంటే ఎలా??"  "నువ్వు ఇలా అడిగితే ఎలా రేపు నీ పెళ్లికి చాలా డబ్బు కావొద్దు" అని అంటుంటారు. అవన్నీ విని విని ఆడపిల్లలు కుటుంబానికి భారం అవుతారేమో అని చదువు విషయంలో పెద్దపెద్ద కలలవైపు వెళ్లకుండా ఆగిపోతారు. నిజానికి భారం అవుతున్నామేమో అనే ఆలోచనతోనే ఆడపిల్లలు ఇంటి భారాన్ని మోస్తున్నవాళ్ళున్నారు. ఇంటి భారం మోయడం తప్పుకాదు కానీ తామే ఇంటికి భారం అనుకోవడం తప్పు. కాంప్రమైజ్ అవ్వద్దు!! ఆడపిల్ల అంటేనే కాంప్రమైజ్ కి మారుపేరు అన్నట్టు పెంచుతారు కొందరు. తినే విషయం దగ్గర నుండి అవసరమైన వస్తువుల వరకు ప్రతిదాంట్లో కాంప్రమైజ్ అవడం నేర్పిస్తారు. ఇలా  కాంప్రమైజ్ ల మధ్య బతికి ఆడపిల్లలు వేసే ఒక పెద్ద రాంగ్ స్టెప్ ఏమిటంటే జీవితకాల నిర్ణయం అయిన పెళ్లి విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోవడం. ఇంట్లో వాళ్లకు భారం తగ్గిపోతుంది, ఏదో ఒక సంబంధం అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి నా పెళ్లైపోతే అంత సెట్ అయిపోతుంది అని ఆలోచించే అమ్మాయిలు ఈకాలంలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే వేస్తుంది. ఇష్టాలు వదిలిపెట్టద్దు!! అందరికీ ఇష్టాలుంటాయి. అలాగే ఆడపిల్లలకు కూడా. కానీ ఇంట్లో తల్లిదండ్రుల కష్టాలను చూసే ఆడపిల్లలు తమ ఇష్టాలను బయటపెట్టరు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇష్టాలను బయటపెట్టని వాళ్ళున్నారు. అలాగని అందరూ ఇలా త్యాగం చేసేస్తారని అనడం లేదు. కానీ ఆడపిల్లలు తమకున్న చిన్న చిన్న ఇష్టాలను వధులుకోకూడదు. ఆ అసంతృప్తి చాలా మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక సంపాదన మానుకోవద్దు!! కొంతమంది మగవాళ్లకు సంపాదన బాగుంది కదా అనే ఆలోచనతో ఆడపిల్లలను సంపాదించడానికి ప్రోత్సహించరు. తల్లిదండ్రులేమో ఆడపిల్లను బయటకు పంపించాలంటే భయమనే సాకుతో ఉద్యోగానికి పంపరు, పెళ్లయ్యాక భర్త, అత్తమామలు ఏమో మా సంపాదన ఉందిగా ఇంట్లో హాయిగా ఉంటే చాలు అంటారు. ఇలా రెండు వైపులా ఆడపిల్లలను ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు. తమకంటూ ఆర్థిక సంపాదన లేకపోతే పెళ్లి కాని వాళ్ళు అయినా, పెళ్లి అయిన వాళ్ళు అయినా తమ అవసరాల కోసం భర్త దగ్గర, అత్తమామల దగ్గర చెయ్యి చాపుతూనే ఉండాలి. అందుకే తమ చేతిలో ఏ విద్య ఉన్నా, దాని సహాయంతో తమకంటూ కొంత సంపాదించుకోవాలి. ఏమో ఎవరు చెప్పొచ్చారు ఇలా సంపాదించే ఆడపిల్లలు ఆర్థిక వేత్తలు కూడా కాగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.

బ్రేక్ తీసుకుంటారా?

కొంచెం బోర్ కొడితే చాలు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఇంట్లోనూ, బయట, ఉద్యోగంలో, సహా ఉద్యోగులతో, చుట్టాలు ఇంకా చుట్టుపక్కల గందరగోళ వాతావరణం వల్ల మనసు చాలా చికాకు పడుతుంది. "అబ్బా!! ఎక్కడికైనా పారిపోదాం బాస్" అని ఏదో ఒక మూమెంట్ లో ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు, అనుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి నుండి అలా అనుకోకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?? మనసు చికాకు పడకుండా ఉంటే చాలు అలా అనుకోకుండా హమ్మయ్య అనేసుకుంటాం. ఈ గందరగోళం నుండి తప్పించుకోవడం ఎలా అనే ప్రశ్న ఏదైతే ఉందో అది మనిషిని మళ్ళీ ఆలోచనల్లోకి నెడుతుంది. కానీ వీటన్నిని దూరంగా తరిమెయ్యడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే బ్రేక్ తీసుకోవడం. బ్రేక్ తీసుకోవడం ఏంటి అంటే…… చేసే పనులు నుండి చిన్నపాటి విరామం కావాలి మనిషికి. నిజానికి ఈ కాలంలో మనిషికి శారీరక శ్రమ అంటూ ఎక్కువ లేదు. ఊపిరి ఆడనివ్వని ట్రాఫిక్ జాముల్లో ప్రయాణం చేయడం, ఆఫీసుల్లో గంటల కొద్దీ సిస్టం ల ముందు కూర్చుని ఉండటం మాత్రమే శరీరానికి పని. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంది కాబట్టే బ్రేక్ అవసరం.  ఎలా ??..... ఇలా….. బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడం ఎలా అని అనుకుంటారు అందరూ. కొత్తదనం ఎప్పుడూ మనిషిని కొన్ని ఇర్రిటేషన్స్ నుండి బయటకు తీసుకొస్తుంది. అందుకే అక్కడక్కడే ఉక్కిరిబిక్కిలో ముంచే ప్రాంతాల్లో నుండి కాస్త దూరం వెళ్తుండాలి అప్పుడప్పుడు. ఇంట్లోనే ఒకే గదిలో 24 గంటలు ఉండాలంటే చెప్పలేనంత చిరాకు కలుగుతుంది. తప్పనిసరిగా అలా ఉండాల్సి వస్తే రోజు రోజుకు అది ఒత్తిడికి దారి తీస్తుంది. అలాంటిదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాకపోతే గదుల లాంటి నుండి బయటపడగానే ప్రయాణం, ఆఫీసు, తోటి ఉద్యోగులు, అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి మళ్ళీ ఇల్లు, ఇంట్లో గదిలో నిద్ర. కొందరికి అలా నిద్రపోవడం కూడా చెప్పరానంత అసహనం కలుగుతూ ఉంటుంది. అందుకే బ్రేక్ కావాలి.  ఎటు వెళ్ళాలి?? కొత్తదనం అనేది మనిషిలోకి కొత్త ఎనర్జీని పాస్ చేస్తుంది. కొత్తదనం అంటే కొత్త బట్టలు కట్టుకుని మెరిసిపోవడం కాదు, మన పరిధిలో ఉన్న ఆలోచనలను మార్చేసుకోవడం కాదు. తాత్కాలిక ఉపశమనం అనేమాట వినే ఉంటారు కదా. టెంపరరీ రిలాక్సేషన్ అనేది మనిషి ఎప్పటికప్పుడు రీఛార్జి అవ్వడానికి సహాయపడుతుంది.  విహారాయత్రలు మనిషికి మానసికంగా ఊరట ఇవ్వడంలో పర్ఫెక్ట్ గా సహాయపడతాయి. ప్రకృతికి దగ్గరగా పీస్ ఫుల్ గా!! ఈ టెక్నాలజీ ప్రపంచం గురించి ఎంతన్నా చెప్పండి. అక్కడ కలిగే మానసికపరమైన ఒత్తిడిని తొక్కేసి మనిషిని తిరిగి ఉత్సాహవంతుడిగా చేసేది ప్రకృతి మాత్రమే. అదే గొప్ప మెడిసిన్. పచ్చదనం, చల్లని గాలి, చెట్ల నీడలు, మట్టి దారులు, పువ్వులు, పక్షుల కిలకిలలు, నీటి ప్రవాహాలు ఎంత గొప్ప ఊరట లభిస్తుందో  మాటల్లో చెప్పలేం.  అవి మాత్రమే కాకుండా ఆసక్తికర ప్రదేశాలు, చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎంతో అద్భుతం. నిజానికి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కడైనా ఉన్నాయంటే అవన్నీ ప్రకృతికి నిలయమైన పంచభూతాలు పుష్కలంగా ఉన్న చోటులోనే ఉంటాయి. అడవులు, కొండల మధ్య అలరారుతూ జటాయి. రిలాక్సేషన్!! రోజూ అవే రోడ్ లలో పడి ప్రయాణిస్తూ, అదే ఆఫీసులో నలిగిపోతూ, కుటుంబ బాధ్యతలను మోస్తూ మానసిక ఒత్తిడిలో మునిగి తేలుతున్నవాళ్ళు నచ్చిన ప్రాంతానికో, కొత్త ప్రదేశాలకో అపుడపుడు పోతుండాలి. అందుకోసమే బ్రేక్ తీసుకోవాలి.  రిలాక్స్ అయిపోవాలి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

అవసరమైన పని మాత్రమే చేయడం ఎందుకు ముఖ్యం?

మన దైనందిన జీవితంలో ప్రతీ ఒక్కరికీ అవసరాలు వుంటాయి. కానీ- ఏవి అవసరం ఏవి అనవసరం అనే విషయం తెలుసుకోలేక సందిగ్ధంలో పడిపోయి వాటికోసం కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చాలా మంది.  ఇలా సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల  మనకు లభించేది ఏదీ వుండదు అవకాశాలు చేయి జరిపోవడం, కాలం గడిచిపోవడం. ఇవి రెండూ నష్టాలు తప్ప ఏమాత్రం వారికి కొంచెం కూడా ఉపయోగకరం కాదు. ఎప్పుడైనా సరే మనం ఒక పనిని ప్రారంభించేటప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అసలు మనకు ఈ పని ద్వారా ప్రయోజనం వుందా లేదా అనే విషయం ఆలోచించాలి. అలాగే చాలామంది అప్పటికప్పుడు కలిగే ప్రయోజనాల కోసం పనులు చేస్తారు. ఇలా తాత్కాలిక ప్రయోజనాలు కోసం మనం పనులు ప్రారంభించకూడదు. మనం ఇలాంటి పనులు చెయ్యటం ద్వారా ప్రయోజనం లేదు. కాని కాలక్షేపం కోసం చేస్తున్నాను అని అనుకుంటే ఆ పని చెయ్యడం అంత సమంజసం కాదు. మనకు ప్రయోజనం లేని ఏ పనికోసమైనా కూడా మన కాలాన్ని వృధాగా ఖర్చుపెట్టకూడదు. కాలం అంటే జీవితం, కాలాన్ని వృధా చేస్తున్నామంటే మన జీవితాన్ని మనం చేజేతులా వృథా చేసుకుంటున్నట్లే, మనకు జీవితంలో ఉన్నతమైన స్థానం కావాలి అంటే మన జీవితంలో అధిక సమయాన్ని మన విజయానికి దోహదపడే అంశాలపైనే కేటాయించాలి.  అనవసర విషయాల కోసం సమయాన్ని కేటాయించటం ద్వారా అవసరమైన విషయాలు మరుగున పడిపోతాయి. అంటే అంత ప్రాముఖ్యత లేని పనులు చేస్తూ జీవితంలో మంచి స్థానానికి వెళ్లాల్సిన మనం, అవకాశాలు ఉన్నా వాటిని గుర్తించక  విజయానికి దూరంగా వుండడం జరుగుతుంది. అందుకే ముందుగానే మనకు ఏది అవసరమో నిర్ణయించుకొని దానికోసం మన జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. తద్వారా విజయ సాధనకు దగ్గరగా వుంటాము. విజయం చేరువ కావాలంటే దాఞ్జకోసం సమయాన్ని ఎక్కువ కేటాయించడమే ఉన్నతమైన మార్గం.  సాధారణంగా మన దైనందిన జీవితంలో కొన్ని సాధారణ విషయాలు వుంటాయి. ఇవేమీ పెద్ద ప్రాముఖ్యం లేని విషయాలులే అనుకుని, అలాంటి సాధారణ విషయాలను విస్మరిస్తే అవే కొంతకాలానికి అవే అత్యవసరమైనవిగా మారవచ్చు. అందువల్ల దైనందిన విషయాలే కదా అని తాత్సారం చెయ్యకూడదు. ఫలానా పనులు చెయ్యాలని నిర్ణయించుకునే ముందు ఆ పనులకు ప్రాధాన్యతా క్రమాలను ఇవ్వగలిగితే అవి సునాయాసంగానే జరుగుతాయి.  ప్రాధాన్యతా క్రమం అంటే మనం ఒక పనిని చెయ్యాలనుకుంటున్నామని అనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలంటే, ఆ పని అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం వుందా లేదా? అది ముఖ్యంగా నిర్వహించాలా లేదా? లేకపోతే ఈ పని చెయ్యటం మంచిదా కాదా? ఈ పనిని ఎవరికైనా అప్పగించవచ్చా లేదా? దీనిని వెంటనే చెయ్యకపోతే నష్టం ఏమైనా వుందా లేదా అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే మనం మన కాలాన్ని వృధా చేయకుండా విజయసాధనకు దగ్గరవ్వగలుగుతాము. మనకు ఏది అవసరం, ఏది అనవసరమో నిర్ణయించుకోగలగటంపైనే సమయ పాలన అనేది ఆధారపడుతుంది. అయితే కొన్ని విషయాలు తాత్కాలికంగా ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోయినా భవిష్యత్తులో తప్పక గొప్ప పలితాన్ని ఇస్తాయి. అలాంటి వాటిని గురించి ఆలోచించి తప్పక మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవడంలో సఫలమైనట్టు.                                       ◆నిశ్శబ్ద.

మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి?

ప్రతి మనిషీ తన జీవితంలో తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి గమనించుకుని విశ్లేషించుకుంటే  తను సరిగానే ఉన్నాడా లేదా తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయం అర్థమవుతుంది. మనం చేసే ప్రతికార్యమూ, శరీరంలోని ప్రతిచలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనస్సులో ఒక విధమైన సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచెయ్యడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి. ఇప్పుడీ క్షణంలో ఉన్న  స్థితి ఇంతకు క్రితం  జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సాముదాయక ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి స్వభావము అతనికి ఉన్న అన్ని సంస్కారాలచే నిర్ణయించబడుతుంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదౌతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా వుంటే స్వభావం చెడ్డదౌతుంది.  ఒకవ్యక్తి ఎప్పుడూ చెడుమాటలను వింటూ, చెడు ఆలోచనలను చేస్తూ, చెడుపనులు చేస్తూవుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, చేతలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పని చేస్తూంటే చెడే వాటి ఫలితమౌతుంది. చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడుపనులను చేయించడానికి బలీయ ప్రేరకమవుతున్నది.  ఒకరి వ్యక్తిత్వాన్ని నిజంగా నిర్ణయించాలని చూస్తే అతడు చేసిన  మహత్కార్యాలను పరికించకూడదు. ప్రతి మూర్ఖుడూ ఏదో ఒకానొక సందర్భంలో వీరుడు కావచ్చు. మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనించాలి. ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని అలాంటి పనులే వ్యక్తం చేస్తాయి. గొప్ప సందర్భాలు అట్టడుగు వ్యక్తిని సైతం ఏదో కొంత గొప్పదనం సంతరించుకొనేలా చేస్తాయి. కాని ఎక్కడ ఉన్నప్పటికీ సర్వదా ఎవరు గుణసంపన్నుడో అతడే నిజానికి మహోన్నతుడు.  మన భావనలు తీర్చిదిద్దిన మేరకే మనం రూపొందుతాం కాబట్టి  భావనల విషయంలో శ్రద్ధ వహించాలి. మాటలు అప్రధానం. భావనలు సజీవాలు, అవి సుదూరాలకు పయనిస్తాయి. మన ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రితమై ఉంటుంది.. మంచి పనులు చేయడానికి నిరంతర దీర్ఘకాలం ప్రయత్నం అవసరం. అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు. మనం చేసే ప్రతి కార్యం  సరస్సు పైభాగంలో చలించే అల లాంటిది. ఇదంతా అభ్యాసమే.. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే. కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవటం లేదా వదలిపెట్టటం మన చేతులలోనే ఉంది. అందుకని ప్రస్తుతమున్న మన స్వభావం గూర్చి మనం నిరాశ చెందనవసరం లేదు.  ఒకవ్యక్తి ఎంత చెడ్డవాడైనాసరే, 'అతనిక మంచివాడు కాలేడు' అని చెప్పవద్దు. ఎందుకంటే, అతని ప్రస్తుత ప్రవర్తన అతను గతంలో చేసిన పనుల ఫలితం. అదే అతను కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే అతను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది.  మనిషి తన వ్యక్తిత్వాన్ని అలాగే మార్చుకోవాలి.                                       ◆నిశ్శబ్ద.

భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఏం చేయాలి?

రెండు విభిన్న మనస్తత్వాలు కలిసి జీవితం సాగించడం అంటే అది చాలా క్లిష్టమైన సమస్యే. కానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసి ఇద్దరూ కలసి బ్రతికేలా చేస్తుంది. అయితే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరితో మరొకరు గొడవ పడుతూ ఉంటారు.  అలాంటిది వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య గొడవ రావడం అనేది చాలా సాధారణ విషయం.  గొడవ లేని భార్యాభర్తల బంధం అసలు ఉండదని చెప్పవచ్చు. కానీ గొడవ పడిన ప్రతి భార్యాభర్త విడిపోవడం అనే  ఆప్షన్ వరకు వెళ్లరు.  ఇప్పటి జనరేషన్ లో మాత్రం గొడవలు వర్షాకాలంలో వర్షం కురిసినట్టు ఎడాపెడా జరుగుతూనే ఉంటాయి.  ఇలాంటి వారు విడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.  గొడవ జరిగినా సరే.. భార్యాభర్తలు విడిపోని పరిస్థితి రాకూడదు అంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలి? గొడవ జరిగేటప్పుడు అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది శ్రద్దగా వినాలి. అవతలి వాళ్లు ఫిర్యాదులు చేస్తూ ఉండవచ్చు.  సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కానీ అవతలి వాళ్లు చెప్పేది వినాలి.  వారు చెప్పేది నచ్చకపోతే అప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వగుండా ప్రశాంతంగా రియాక్ట్ అవ్వాలి. మీ వైపు ఏదైనా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. భాగస్వామికి క్షమాపణ చెప్పే విషయంలో ఎప్పుడూ అహం చూపించకూడదు.  ఒకవేళ భాగస్వామి ముందు చెప్పలేనంత కోపం వస్తే ఆ కోపాన్ని బయటకు వ్యక్తం చేయకుండా సింపుల్ గా నెంబర్స్ కౌంట్ చేయాలి. కోపం కంట్రోల్ లోకి వచ్చే వరకు ఇలా నెంబర్స్ కౌంట్ చేయడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది.  కోపం కాస్తో కూస్తూ తగ్గుతుంది. ఏం చేయకూడదు? భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు కేకలు వేయకూడదు.  అలాగే అరవకూడదు.  గొడవను కూడా ప్రశాంతంగా మెల్లిగా మాట్లాడుతున్నట్టే పడాలి. అలా చేస్తే మీరు దేనికి బాధపడుతున్నారనే విషయాన్ని అవతలి వారు కూడా బాగా అర్థం చేసుకుంటారు. మీ మీద తిరిగి కోపం చేసుకోరు. భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవల్లో పొరపాటున కూడా ఇరు కుటుంబ సభ్యుల గురించి,  వారి వ్యక్తిగత విషయాల గురించి ఎత్తి చూపి మాట్లాడి విమర్శించకూడదు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఇద్దరి గురించే ఉండాలి. గొడవ జరిగేటప్పుడు ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడకూడదు. ఇది ఒకరి మీద మరొకరికి ఉండే మంచి అభిప్రాయం పోయేలా చేస్తుంది. కొన్ని సార్లు ఇలా చెడుగా మాట్లాడటం అనేది శాశ్వతంగా బంధం తెగిపోవడానికి కారణం అవుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక విషయం గురించి గొడవ జరిగి అది పరిష్కారం అయిన తరువాత తిరిగి  అదే విషయం గురించి మళ్లీ గొడవ పడకూడదు.  ఇది ఇద్దరి మధ్య బంధాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మర్యాద ఉండాలి.. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నట్టే గొడవలు కూడా వస్తాయి.  అయితే భార్యాభర్తలు ఇలా గొడవ పడే విషయంలో కూడా మర్యాద మరచిపోకూడదు. ఇద్దరి మధ్య ఒక  ఒప్పందం ఉండాలి. ఎప్పుడూ మూడవ వ్యక్తి ముందు గొడవ పడకూడదు. గొడవలు జరిగేటప్పుడు ఒకరిని మరొకరు కించపరుచుకోకూడదు. వేళ్లు చూపించి మాట్లాడటం, వెక్కిరించి మాట్లాడటం,  లోపాలను లేవనెత్తడం, చేతకాని వ్యక్తులనే అర్థం వచ్చేలా దూషించడం చేయకూడదు. ఇవన్నీ ముందే కూర్చొని మాట్లాడుకుని ఒప్పందం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే భార్యాభర్తల మధ్య  గొడవలు రావడం కూడా తగ్గుతుంది.  ఒకవేళ వచ్చినా భార్యాభర్తలు కొద్దిసేపటికే మాములుగా మారిపోతారు.                                             *రూపశ్రీ.

పిల్లలకు చదువు మీద ఏకాగ్రత ఉండట్లేదా? ఈ ఒక్క పని  చేస్తే చురుగ్గా ఉంటారు..!

పిల్లలు చక్కగా చదువుకోవాలన్నది ప్రతి తల్లిదండ్రి కోరిక. అందుకే పిల్లలున్న ప్రతి ఇంట్లో పిల్లల చదువుపట్ల ఆందోళన పడే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదని ఎప్పుడూ పిల్లలను వేపుకు తింటూ ఉంటారు కూడా. పిల్లలు తల్లిదండ్రుల బాధ పడలేక పుస్తకం ముందు అయితే కూర్చొంటారు కానీ వారికి పుస్తకం మీద దృష్టి ఉండదు.  ఒకవేళ చదువుకోవాలని దృష్టి పెట్టినా వారికి ఏకాగ్రత నిలవదు.  పిల్లలకు ఏకాగ్రత నిలవడం లేదని తల్లిదండ్రులు లైట్ తీసుకోలేరు.  అలాగని ఏం చేయాలో వారికి అర్థం కాదు.   కానీ ఒకే ఒక్క పని చేయడం వల్ల పిల్లలు తిరిగి చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. చదువులో చురుగ్గా ఉండగలుగుతారు.  అదేంటో తెలుసుకుంటే.. పిల్లలు చదువు మీద దృష్టి పెట్టాలన్నా.. చదువులో చురుగ్గా ఉండాలన్నా,  విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలన్నా, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలన్నా ధ్యానం చక్కగా సహాయపడుతుంది. పిల్లలు ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..  పిల్లలు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.  ఇలా క్రమం తప్పకుండా ధ్యానం  చేసినప్పుడు పిల్లల దృష్టి,  ఏకాగ్రత మెరుగుపడుతుంది.  పిల్లలు ధ్యానం చేయడం మొదలు పెట్టిన కొన్ని రోజులకే పిల్లలు  చదువుపై బాగా దృష్టి పెట్టడం గమనించవచ్చు. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ధ్యానం ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మెరుగ్గా పని చేయడం,  మెరుగ్గా చదువుకోవడం సాధ్యమవుతుంది.  సమయాన్ని మెరుగైన రీతిలో నిర్వహించుకోగలుగుతారు. ధాన్యం చేసే పిల్లలు సమయపాలన నిర్వహించడంలో ఎప్పుడూ మెరుగ్గా ఉంటారు.  దీని వల్ల చదువులో చురుగ్గా ఉంటారు. ధ్యానం చేయడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేరింగ్  పెరుగుతాయి.  ఆత్మవిశ్వాసం,  కృతజ్ఞతా భావం మొదలైనవి పెంపొందుతాయి. ఇది చదువులపై సానుకూల ప్రభావం చూపుతుంది. ధ్యానం  IQ స్థాయిని మెరుగుపరుస్తుంది. పరీక్షల సమయంలో మెరుగ్గా ఉండాలంటే  ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది. ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ధ్యానం చేయడం ద్వారా మీరు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠాలు వినడం నుండి,  ఏదైనా నేర్చుకోవడం, ఏదైనా పని చేయడం వరకు ప్రతి విషయంలో చాలా శ్రద్దగా ఓపికగా ఉండగలుగుతారు. ఇది వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.                                            *రూపశ్రీ.

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను మర్చిపోవద్దు..!

చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు

చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు * రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. * చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి . * పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. * గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.  

భారతదేశానికి పన్ను విధానాన్ని తీసుకొచ్చింది ఈ మహానుభావుడే..!

  నెలలవారీ జీతం తీసుకునే వ్యక్తి నుండి ఎవైనా వస్తువులు కొనుగోలు చేయడం, పెద్ద మొత్తం నగదు బహుమతులు, ఇల్లు, కారు సహా చాలా రకాల వస్తువులపై ఇప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తోంది.  భారతదేశంలో అసలు ఈ పన్ను చెల్లించే విధానం ఎప్పుడు అమలు అయ్యింది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో పన్ను విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు జేమ్స్ విల్సన్.  ఈయన స్కాటిష్ వ్యాపారవేత్త, మరియు ఆర్థికవేత్త కూడా. 1860 లో ఈస్టిండియా కంపెనీ పాలనలో భారతదేశంలో మొదటిసారిగా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా జూలై 24,  1860లో పన్నును అమలు చేశారు. అందుకే జూలై 24ను ఆదాయ పన్ను దినోత్సవంగా జరుపుకుంటారు. కేవలం పన్నును మాత్రమే కాకుండా జేమ్స్ విల్సన్ బ్రిటీష్ వారపత్రికను కూడా స్థాపించాడు. వార్తాపత్రికతో పాటూ జేమ్స్ విల్సన్ స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను కూడా భారతదేశంలో స్థాపించాడు. అంతకు ముందు ఈ బ్యాంక్ చార్టర్డ్  బ్యాంక్ పేరుతో  ఆస్ట్రేలియా, చైనా, భారతదేశంలో ఉండేవి. కానీ ఈ మూడు బ్యాంకులు 1969 సంవత్సరంలో స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో విలీనం చేయబడ్డాయి. పన్ను విధానాన్ని,  వారపత్రికను,  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను స్థాపించిన జేమ్స్ విల్సన్ మొదట్లో టోపిల తయారీదారుగా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ ఆ తరువాత ఆర్థిక శాస్త్రాన్ని ఇష్టపడ్డాడు. ఈ కారణంగా ఆర్థిక రంగంలో తన వృత్తిని కొనసాగించాడు.  1859లో బారతదేశానికి వచ్చాడు. 1859లో భారతదేశానికి వచ్చిన జేమ్స్ విల్సన్ బ్రిటీష్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాడు.  1860లో భారతదేశంలో మొదటి ఆంగ్ల మోడల్ పన్ను బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇందులో లైసెన్స్ పన్ను, పొగాకు పన్ను కూడా ఉన్నాయి.                                  *రూపశ్రీ.  

వంటల్లో నుండి ఇంటి క్లీనింగ్ వరకు.. బేకింగ్ సోడా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే..!

బేకింగ్ సోడా.. బేకింగ్ పౌడర్ అని రెండు రకాలు ఉంటాయి.  వీటిలో బేకింగ్ సోడాను సాధారణంగా వంటల్లోనూ, బేకింగ్ పౌడర్ ను కేకులు, బేకింగ్ ఆహారాలలోనూ ఉపయోగిస్తారు. అయితే బేకింగ్ సోడాను కేవలంలో వంటల్లో మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాల కోసం వాడుతుంటారు.  దీన్ని వంటింటి నుంచి ఇల్లు క్లీన్ చేయడం వరకు బోలెడు రకాలుగా ఉపయోగిస్తారు.  ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే.. బేకింగ్ సోడాను ఇంట్లో కర్టెన్ల నుండి  సోఫా కవర్ లు,  కార్పెట్ లు, దిండు కవర్ లు, దుప్పట్లు ఇలా చాలా రకాల క్లాత్ లను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.  ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.  మురికి బాగా వదలడమే కాకుండా క్లాత్ లు మాసిన వాసన పూర్తీగా వదులుతాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి స్టవ్ శుభ్రం చేసుకోవచ్చు. ఇది స్టవ్ మీద పేరుకున్న మొండి జిడ్డును, గ్రీజు వంటి పదార్థాన్ని చాలా సులభంగా తొలగిస్తుంది. స్టవ్ కొత్త దానిలా మెరుస్తుంది కూడా. వెనిగర్,  బేకింగ్ సోడా రెండింటిని మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి.  దీన్ని స్టవ్,  ఓవెన్,  ఇతర జిడ్డు ప్రాంతాలలో స్ప్రే చేయాలి.  ఆ తరువాత తడి గుడ్డ సహాయంతో శుభ్రంగా తుడిచి తరువాత పొడి బట్టతో నీట్ గా తుడుచుకోవాలి. వంటగదిలోనూ, బాత్రూమ్ లలోనూ, హాల్ లో సింక్ దగ్గరా కుళాయిలు తరచుగా తుప్పు పడుతూ ఉంటాయి. ఈ తుప్పును, తుప్పు మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని తుప్పు పట్టిన కుళాయి మీద స్ప్రే చేసి ఆ తరువాత క్లాత్ తో శుభ్రం చేస్తే తుప్పు వదిలిపోతుంది.  బేకింగ్ సోడాతో కలిపి ఉపయోగించడానికి వెనిగర్ అందుబాటులో లేకపోతే నిమ్మరసం అయినా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం బేకింగ్ సోడా, వెనిగర్ ను ఒక గిన్నెలో వేసి ఆ తరువాత దాన్ని కుళాయికి అప్లై చేయాలి.  కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రస్సులు,  చీరల మీద మరకలు పడినట్లైతే వాటిని తొలగించడానికి   బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాను మరకల మీద వేసి  కొద్దిసేపటి తరువాత శుభ్రం చేయాలి. తరువాత దాన్ని సాధారణంగా సర్ఫ్ లేదా వాషింగ్ మెషీన్ లో వాష్ చేయాలి. బాత్రూమ్ మూలలలోనూ,  బాత్రూమ్ లో ఇతర ప్రాంతాలలోనూ మురికి ఎక్కువగా ఉంటే దానికి బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది.  బేకింగ్ సోడా, వెనిగర్ ను మిక్స్ చేసి బాత్రూమ్ లో స్ప్రే చేయాలి.  కొద్దిసేపు అలాగే వదిలేసి ఆ తరువాత బ్రష్ సహాయంతో మూలలు క్లీన్ చేయాలి.  మురికి మొత్తం బాగా వదులుతుంది.                                         *రూపశ్రీ.

పిల్లలకు 5 ఏళ్ల లోపే ఈ 5 విషయాలు నేర్పిస్తే వారి భవిత బంగారం..!

పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి. ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.  తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి. తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.                                                      *రూపశ్రీ.

పిల్లల ప్రపంచం మాయమైపోతోంది!!

పిల్లల్ని తోటలో పువ్వులుగా అభివర్ణిస్తాడు ప్రముఖ విద్యా సంస్కర్త ఫ్రెడరిక్ ప్రోబెల్. ఆయన పిల్లల కోసం ఎంతో కృషి చేశాడు. వారి కోసం కిండర్ గార్డెన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. పిల్లల తోట అని దాని అర్థం.పిల్లల ప్రపంచం ఒక తోట అయితే పిల్లలు మొక్కలకు పూచే పువ్వుల లాంటి వారు. వారు ఎంతో సున్నితమైనవారు, వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. నిజానికి దీని ఆధారంగా రూపొందినదే ప్లే స్కూల్ అని కూడా చెప్పవచ్చు.  కానీ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇలాంటి పిల్లల ప్రపంచం. కిండర్ గార్డెన్ లో చెప్పిన ఆడుకోవడం ద్వారా నేర్చుకోవడం అనే పద్ధతిని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఉపయోగిస్తున్నారు. ఎంతసేపు వాళ్ళను పుస్తకాలకు కట్టేసి చదివించినవే చదివించి, వాటిని బట్టి పట్టించి పిల్లల్ని ఒక కృత్రిమ జీవితంలో పెద్దలే నాటుతున్నారు. ఏది పిల్లల ప్రపంచం?? నిజానికి బాల్యం ఎంతో అందమైనది. ఒక వయసొచ్చాక ఆ బాల్యాన్ని చూసి సంతోషపడి వాటిని చాలా గొప్ప జ్ఞాపకాలుగా చేసుకోవడం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు రేపటి రోజున తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటే వాళ్లకు కనిపించేది ఏమిటి?? పుస్తకాలు, బట్టి పట్టిన గంటలు, తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన కాఠిన్యం, ఉపాధ్యాయుల ముఖాలలో ఎరుపు, ఇంకా వారి చేతి బెత్తం దెబ్బలు. ఇవేనా??  ఒకప్పుడు పిల్లల ప్రపంచం ఎలా ఉండేది?? బాల్యాన్ని గురించి వర్ణించాలంటే ఆ బాల్యాన్ని రుచిచూసిన వారికే సాధ్యం అని అనిపిస్తుంది. స్వేచ్ఛగా బుల్లి గువ్వలా ఎలాంటి సమస్య లేకుండా ఇల్లంతా దొగ్గాడుతూ మొదలై అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యల దగ్గర కథలు వింటూ, నీళ్లతోనూ, మట్టితోనూ, ప్రకృతికి దగ్గరగా పెరుగుతూ ఓ పచ్చని మొక్కలాగే ఆహ్లాదంగా అనిపిస్తారు.  కానీ ఇప్పుడు!! మట్టిలో ఆడటం, నీళ్లలో తడవడం, తుళ్లుకుంటూ బయట తిరుగుతూ ఆడటం మొదలైనవన్నీ ఒక అసహ్యపు చర్యగా చూస్తారు. ఇంకా పాఠ్యపుస్తలను మాత్రమే చదవడం నిజమైన జ్ఞానం అనే భ్రమలో ఉన్నారు. బయట ప్రపంచం ఏమీ తెలియకుండా పెంచుతారు. ఇలా బయట ప్రపంచానికి దూరంగా పెంచడం వల్ల పిల్లలకు సంపాదించడం,ఉద్యోగాలు చేయడం తప్ప ఇంకేమీ తెలియకుండా పోతుంది.   అమాయకపు నవ్వులు, అల్లరి చేష్టలు, ఆటలు, పాటలు, ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ తన శైశవ గీతిలో చెప్పినట్టు మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లరా!! అంటూ సంతోషంగా చూసుకోవడానికి ఇప్పటితరానికి బాల్యమనేది మధురంగా ఉందా?? ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవులు, శుభకార్యాలు వంటి వాటికి సొంత ఊళ్లకు వెళ్లడానికి, బంధువులు, స్నేహితులలో కలవడానికి చాలామంది తల్లిదండ్రులు చెప్పుకుంటున్న సమర్థింపు "పిల్లలకు స్కూల్ పోతుంది" అని. వేసవిలో అటు ఇటు పంపకుండా ఎదో ఒక కోర్స్ లోనో, లేదా తదుపరి తరగతులకు స్పెషల్ కోచింగ్ లలో తోసేయడమో ఇలా పిల్లలకు ఎలాంటి సరదాలు, సంతోషాలు అనేవి ఏమీ లేకుండా చిన్నతనం నుండే వాళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్, ias, ips అంటూ ఎన్నెన్నో ఆలోచనలు నాటి చివరకు విలువలు లేని జీవితాన్ని వాళ్లకు అప్పగిస్తున్నారు. విలువలు అంటే పుస్తకాల నుండి నేర్చుకునేవి కాదని, అవి జీవితాలను, సమాజాన్ని, బయట ప్రపంచాన్ని చూస్తూ నేర్చుకోవడం అని. కింద పడి దెబ్బ తగిలితే ఇంకోసారి పడకూడదు అనే జాగ్రత్త పిల్లలకు అర్థమవుతుందని పెద్దలు తెలుసుకోవాలి. అంతేకానీ పిల్లలు కిందపడకుండా వాళ్ళను ఎత్తుకునే తిప్పడం వల్ల వాళ్లకు నడవడం ఎలాగో తెలియకుండా పోతుంది. అందుకే చాలామందికి జీవించడం ఎలాగో తెలియకుండా పోతోంది. మాయమైపోతున్న పిల్లల ప్రపంచాన్ని ఏ డాక్యుమెంటరీలలో, కార్టూన్ చానల్స్ లో పిల్లలకు చూపించకుండా వారిని వారిగా ఎదగనిస్తే పిల్లల జీవితాలు పచ్చగా ఉంటాయి.                                ◆ వెంకటేష్ పువ్వాడ.

పిల్లలు గుణవంతులుగా ఉండాలంటే ఇలా పెంచాలి..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.

సాలీడు ఆధారంగా ఓ అద్భుత కథ!

నేనేగనక దేవుడినయితే నా సృష్టి రహస్యాలను కనుగొనడానికి శాస్త్రజ్ఞులకు కొంత అవకాశమిస్తాను అంటారు విశ్వవిఖ్యాత చైనీస్ రచయిత లిన్ యూటాంగ్. ఆయన ఇంకా ఇలా అంటారు. నా అంతట నేను వారికి అట్టే సహాయమందివ్వక పోయినా, వారు చేసే కృషిలో మాత్రం అడ్డం రాను. ఒకటి రెండు శతాబ్దాల పరిశోధన ద్వారా వారేమీ కనుక్కుంటారనేది శ్రద్ధగా గమనిస్తుంటాను. శాస్త్రజ్ఞుడి దృష్టి సాలీడువంటి సామాన్య పురుగు మీదికి మళ్లిందనుకుందాం. అది ఎట్లా నిర్మింపబడిందీ, ఏ రసాయనాల ప్రభావం చేత అది ఆ విధంగా చరిస్తున్నదీ, మొదలైన విషయాలన్నీ అతడు తన పరిశోధన ద్వారా తెలియజేస్తాడు. నిర్మాణం యాంత్రికంగా జరిగిందనే విషయంలో ఎవరికీ సందేహ ముండనక్కరలేదు. అతడు సత్యమే ప్రకటించాడని అనవచ్చు. శాస్త్రజ్ఞుడి అన్వేషణ అతడ్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. సాలీడు దవడలు, జీర్ణప్రక్రియ ఎలాంటివో, అది తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నీ కనిపెడతాడు. సాలీడు నుండి వెలువడే మెత్తటి సన్నని దారం వంటిది ఎలా ఉత్పత్తి అవుతుందో, గాలి తగిలినప్పుడు కూడా అది అది ఎందుకు ఎండిపోదో కనిపెట్టవలసి వుంటుంది. ఈ ఆన్వేషణలో మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతాయి. తాను అల్లినగూడులో తానే చిక్కుకోకుండా వుంటానికి సాలీడు కాళ్ళల్లో బంకని నిరోధించే శక్తి ఏమున్నదనేది అంతుబట్టదు. ఇలా మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతై. ఈ లోగా కాన్సర్ వ్యాధిని పరిశోధిస్తున్న సంస్థ ఏదో అనుకోకుండా, ఈ బంక నిరోధక శక్తి ఎలా ఉద్భవిస్తుందనే విషయాన్ని కనుగొని, అలాంటి కృత్రిమ రసాయనాన్ని తాను ఉత్పత్తి చేస్తున్నానని ప్రకటిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. కానీ శాస్త్రజ్ఞుడికి ఇపుడొక ప్రధానమైన సమస్య ఎదురవుతుంది. తల్లి యొక్క శిక్షణ లేకుండానే పిల్లసాలీడు గూడు అల్లుకోడం ఎలా సాధ్యం? ఇది పుట్టుకతో వస్తుందా తల్లిని చూచి నేర్చుకుంటుందా, పుట్టగానే తల్లినుండి వేరుచేస్తే నేర్వగలదా అనే తర్కవితర్కాలలో పడిపోతాడు. అప్పుడు శాస్త్రజ్ఞుడు దేవుడితో ముఖాముఖి సంభాషించ కోరుతాడు. "శాస్త్రజ్ఞుడి కోరికపై, సాలీడు మెదడులో దానికి అవసరమైన విజ్ఞానమంతా స్మృతిరూపంలో ఎలా నిక్షిప్తం చేసిందీ దేవుడు విశదీకరించవచ్చు. అటు తర్వాత సంభాషణ ఈ రూపంలో వుండచ్చునని అంటాడు లిని యూటాంగ్.   "జీవరసాయనిక శాస్త్రాధారంగా సాలీడు జీన్స్ ఎలా ప్రవర్తిల్లేదీ నీకు తెలియజేశాను కదా శాస్త్రజ్ఞా” అంటాడు దేవుడు. "తెలియజేశారు భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "సాలీడు ప్రవర్తనను యాంత్రిక సరళిలో వివరించాను కదా?” "కృతజ్ఞుణ్ణి” భగవాన్ అంటాడు శాస్త్రజ్ఞుడు. "తృప్తి కలిగిందా నాయనా?” అని అడుగుతాడు.  "ధన్యుణ్ణి " అంటాడు శాస్త్రజ్ఞుడు. "అంతా అర్థమైనట్లే కదా?” అని మళ్ళీ అడుగుతాడు దేవుడు.  "అందుకు సందేహమా స్వామీ? ఏ రసాయనిక మిశ్రమం వలన, ఏ పదార్థాల ద్వారా ఈ ప్రపంచం నిర్మించబడినదో తెలుసుకోగలిగితే ఈ సమస్తాన్ని అర్థం చేసుకోవచ్చని నా నిశ్చితాభిప్రాయం” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదలావుంచి ఈ అద్భుతమంతా ఏమైవుంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శాస్త్రజ్ఞా?" అని అడుగుతాడు దేవుడు. "మీ సృజనాశక్తికి అచ్చెరువొందుతూనే వున్నాను, భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదికాదు శాస్త్రజ్ఞ, ఇదంతా ఎలా సంభవిస్తున్నదీ, ఏ పదార్థాలు, రసాయనాలు ఇందులో ప్రయోగించారు అనే వివరణ కొంత కనుగొన్నావు. నేను మరికొంత తెలియజేశాననుకో, కానీ అసలీ విధంగా ఎందుకు జరుగుతున్నది దీని అంతరార్థం ఏమైవుంటుంది. ప్రయోజనమేమిటి అనే విషయం నీకు నేను చెప్పలేద సుమా. ఎలా సంభవిస్తున్నదనే ప్రశ్న వేరు. మొదటి ప్రశ్న అలాగే వుండిపోయింది. కదా నాయనా." అంటాడు దేవుడు. శాస్త్రజ్ఞుడి కళ్ళల్లో నీళ్ళు నిండినై, గద్గద స్వరంతో "చెప్పండి స్వామి. ఇదంతా ఏమిటి? ఈ సృష్టి ప్రయోజనమేమిటి? ఎందుకదంతా?" అని ఆక్రందించాడు. “రసాయనిక సూత్రాలద్వారా అది కనుగొనలేవు బాబూ. కాని “ఎందుకు?” అనే ప్రశ్నకు నువు సమాధానం కనుగొనలేనంత కాలం సాలీడు జన్మ రహస్యాన్ని చేదించలేవు నాయనా!". "నిజమే ప్రభూ" అంటూ శాస్త్రజ్ఞుడు వినమ్రుడైనాడు. రచయిత కథనిలా అంతం చేస్తే ముచ్చటగా వుంటుందంటారు వాళ్ళంతా. చెమటలతో శాస్త్రజ్ఞుడు నిద్ర మేల్కొన్నాడు. ఏడు రోజులపాటు నోట మాటలేకుండా, స్పృహ లేకుండా పడివున్న తన భర్త కళ్ళు తెరవడం చూచి భార్య చాలా సంతోషించింది. ఆ రోజు ఇంత పథ్యం పెట్టింది. అతడు మాత్రం ఎక్కడైనా సాలీడు కనిపిస్తే అంతదూరం పరుగెడతాడు. సాలీడును గురించి అతడి కేర్పడ్డ ఈ తీవ్రమైన భయం నయమయ్యే రోగం కాదని వైద్యులు తేల్చి చెప్పారు.”                                 ◆నిశ్శబ్ద.

డబ్బున్నవారు చేసే పెద్ద తప్పులివే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..

చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.

సవాళ్లను ఎదుర్కోవడం ఎలా?

జంతువులకి ఆకలి, ఆరోగ్యంలాంటి భౌతికమైన సమస్యలే ఉంటాయి. వాటి సమస్యలన్నీ ఉనికి చుట్టూనే తిరుగుతాయి. కానీ మనిషి అలా కాదయ్యే! అతను ఏర్పరుచుకున్న క్లిష్టమైన సమాజజీవితంలో ప్రతిదీ ఒక సమస్యే! ఉద్యోగంలో ప్రమోషన్‌ దగ్గర్నుంచీ, పిల్లల చదువుల దాకా... ఆర్థిక సమస్యల దగ్గర్నుంచీ అత్తగారి పోరుదాకా అన్నీ సవాళ్లే. ఈ సవాళ్లను కనుక ఎదుర్కోలేకపోతే, ఎదుర్కొని ఛేదించకపోతే జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందుకే సవాళ్ల గురించి నిపుణులు ఇస్తున్న సూచనలు కొన్ని ఇవిగో...   సమస్యని అంగీకరించండి చాలామంది సమస్య ఎదురుపడగానే దాని నుంచి ఎలాగొలా తప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. తాము కాసేపు కళ్లు మూసుకుని ఉంటే ఏదో ఒక అద్భుతం జరిగి సమస్య మాయమైపోతుందన్న భ్రమలో ఉంటారు. కాలం కొన్ని సమస్యలని తీర్చగల మాట నిజమే అయినా చాలా సమస్యలకి మన చేతలే అవసరం అవుతాయి. ఆ చేతలే లేకపోతే చిన్నపాటి సవాళ్లు కాస్తా జీవన్మరణ సమస్యలుగా మారిపోతాయి. అందుకనే ముందు మన ముందు ఒక సమస్య ఉన్నదనీ... దానిని అభివృద్ధీ, వినాశనం మన చేతుల్లోనే గుర్తించడం తొలి మెట్టు.   విశ్లేషణ సమస్య పట్ల భయంతో చాలామంది దాన్ని పైపైనే తడిమేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో సమస్యని కేవలం తమ దృష్టికోణం నుంచే చూస్తారు. అలా కాకుండా సమస్యని లోతుగా, అన్నివైపులా విశ్లేషించిన రోజున దాని మూలాలు తెలుస్తాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది? దానిని ఎటునుంచి పరిష్కరించాలన్న అవగాహన ఏర్పడుతుంది.   సలహా- సంభాషణ సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.   భేషజాలను వదులుకోవాలి చాలా సమస్యలు మన అహంకారం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధాలకి సంబంధించిన సమస్యలెన్నో పంతాలు, పట్టింపుల వల్లే వస్తుంటాయి. మన తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా... నేను ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, ఎవరికీ తలవంచాల్సిన పరిస్థితి రాదు అనుకుంటూ భేషజాలకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే! ఇతరులను క్షమాపణ కోరడమో, ఇతరుల సలహాను పాటించడమో, ఎదుటివారి సాయం తీసుకోవడమో చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పకుండా భేషజాలను వదులుకోవాల్సి ఉంటుంది.   అంగీకారం కట్టుదిట్టమైన ఇనుపగోడల మధ్య ఉన్నా ఏదో ఒక సమస్య రాక మానదు. సమస్యలనేవి జీవితంలో భాగమే అని అంగీకరించినప్పుడు, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. సవాళ్లు లేకపోతే ఎదుగుదల అసాధ్యమని గ్రహించినప్పుడు ఎక్కడలేని తెగువా ఏర్పడుతుంది. ఏ సమస్యా లేనప్పుడు మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ సమస్య ఉన్నప్పుడు కూడా స్థిరిచిత్తంగా, ప్రశాంతంగా దానిని ఎదుర్కోగలిగే వారు విజయం సాధించగలుగుతారు.   సిద్ధంగా ఉండాల్సిందే! సమస్య తరువాత జీవితం ఎప్పటిలాగే ఉండకపోవచ్చు. చాలా సందర్భాలలో జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమస్యని పరిష్కరించుకునే క్రమంలో కొన్ని బంధాలు చేజారిపోవచ్చు, కొన్ని సౌకర్యాలు దూరం కావచ్చు. వీటన్నింటికీ సిద్ధంగా ఉండి, జీవితాన్ని మళ్లీ ఎప్పటిలా గడిపేందుకు సిద్ధంగా ఉండాలి.   - నిర్జర.