రేవంత్ లో ధీమా.. సీనియర్లలో సందేహం!
posted on Jun 29, 2023 @ 12:05PM
నో డౌట్, అనుమానం లేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ,గట్టి పట్టున్న నాయకుడు. అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని బతికించారు. జీవం పోశారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని శ్రేణుల్లో కల్పించారు. సీనియర్లూ ఐక్యత గురించి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. అధిష్ఠానంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కలిగింది. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర నాయకులలో అనైక్యతను గుర్తించి అందరూ ఏకతాటిపై నడిచే విధంగా హస్తినకు పిలిపించుకుని మరీ వారికి దిశానిర్దేశం చేసింది. అన్నిటికీ మించి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగడం గత తొమ్మిదేళ్లలో ఇదే ప్రథమం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నెలల తరబడి మీమాంసకు ఫుల్ స్టాప్ పెట్టి మరీ కాంగ్రెస్ గూటికి చేరడానికి నిర్ణయించుకున్నారు. బీజేపీ నుంచీ, బీఆర్ఎస్ నుంచీ కూడా కాంగ్రెస్ లోకి చేరేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖ నేతలే క్యూకడుతున్నారన్న సమాచారం ఉంది.
అలా వచ్చే వారిలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిరువురూ ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా పని చేసిన వారే. ఈ వరుస పరిణామాలతోనే కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా గట్టిగా కనిపిస్తున్నది. అయితే వీహెచ్ వంటి అతి సీనియర్ నేతలు మాత్రం కాంగ్రెస్ లో కనిపిస్తున్న ఈ జోష్ కడవరకూ నిలబడుతుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విభేదించి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుని మరో అధికార కేంద్రం ఏర్పడేందుకు దోహదం చేయవద్దంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. విజయంపై విశ్వాసం మంచిదే కానీ, అతి విశ్వాసం కూడదంటూ సీనియర్లు సైతం సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మామూలుగానే దేశ రాజకీయాలలో ఒక నానుడి ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు.
ఆ పార్టీయే అంతర్గత విభేదాలతో కుదేలౌతుందన్నదే ఆ నానుడి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అవసరమే కానీ, కాంగ్రెస్ లో అది ఒకింత ఎక్కువ అంటుంటారు. నిన్న మొన్నటి వరకూ రేవంత్ రెడ్డి లక్ష్యంగా సీనియర్లు చేసిన హంగామా ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు కలిసి పని చేస్తామని చెబుతున్నా, సరిగ్గా సమయం వచ్చే సరికి కాడి వదిలేస్తారా అన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. నేతలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండటమే వరుస ఓటముల తరువాత కూడా ఆ పార్టీ పుంజుకోవడానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. అదలా ఉంచితే.. ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్న జోష్ ఎన్నికల దాకా కొనసాగాలంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా అందరూ సహనం, సంయమనం ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాట అంటున్నది వేరే ఎవరో కాదు కాంగ్రెస్ శ్రేణులే అంటున్నాయి. విజయం ఫస్ట్ టార్గెట్ గా విభేదాలు విస్మరించి కలిసి పని చేయాలనీ, గత ఏడాది కాలంగా కాంగ్రెస్ లో కనిపిస్తున్న కొత్త జోష్ అలాగే కొనసాగేలా వరుస కార్యక్రమాలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ లో పని చేసే కార్యకర్తలకు కొదవ లేకున్నా, వారికి మార్గదర్శనం చేసే నాయకులలో విభేదాల కారణంగా కేడర్ ను సవ్యమార్గంలో నడిపించడంలో విఫలమౌతూ వస్తోంది.
అయితే వరంగ్ లో జరిగిన రైతు భరోసా యాత్ర, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలతో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న ధీమా ప్రదర్శించడం సరికాదు. గత ఎన్నికలో ప్రజలు 18 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. చివరకు మిగిలింది ఆరుగురు మాత్రమే. దీంతో కష్టపడి గెలిపించుకున్నా నాయకులను నిలుపుకోవడంలో పార్టీ విఫలమైందన్న సందేశం కింది స్థాయి క్యాడర్ వరకూ వెళ్లిపోయింది. అందుకే సొంత ఇమేజ్ కోసం కాకుండా క్షేత్ర స్థాయిలో క్యాడర్ విశ్వాసం, ప్రజల మన్నన పొందే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయడానికి ఇప్పటి నుంచే సమాయత్తమవ్వాలని పార్టీ విజయానికి అదే దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు. అధిష్ఠానం స్పెషన్ ఫోకస్ పెట్టినందువల్ల ఎన్నికల వరకూ కాంగ్రెస్ సవ్యదిశలోనే సాగుతుందని పార్టీ క్యాడర్ ఆశాభావంతో ఉన్నారు.