కామ్రేడ్ ల స్నేహ ‘హస్తం’ ఎవరికి?
posted on Jun 29, 2023 @ 3:34PM
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలాంటి అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు దృష్టి సారిస్తుంటే.. కమ్యూనిస్టులు మాత్రం ఎన్నికల్లో గెలిచే రాజకీయ పార్టీల కోసం అన్వేషణ ప్రారంభించాయి. గతేడాది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నికల్లో కారు పార్టీతో కలిసి ప్రయాణం చేసిన కామ్రేడ్‌లు... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసుకోని ఆ పార్టీతో కలిసి అడుగులో అడుగు వేసి నడిచేందుకు సిద్దమవుతోన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీకి ఝలక్ ఇచ్చి ... కాంగ్రెస్ పార్టీకి కన్నడీగులు పట్టం కట్టారు. అలాగే రానున్న ఎన్నికల్లో తెలంగాణ సమాజం.. ఏ పార్టీకి పట్టం కట్టి వెన్నుదన్నుగా నిలుస్తుందనే ఆలోచనతో కామ్రేడ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో స్నేహగీతం ఆలపించేందుకు ఆ పార్టీ అగ్రనాయకులకు క్రామేడ్‌లు లాల్ సలాం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఓ చర్చ సైతం కొనసాగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి నడిస్తే.. తమకు సైతం శంకరిగిరి మాన్యాలే అనే ఓ సందేహం వామపక్షాలలో మొలకెత్తినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ , బీజేపీకి ప్రత్యామ్నయంగా టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందడంతో పాటు కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కామ్రేడ్లు అంచనా వేస్తున్నారు. తమ అంచనాలకు అనుగుణంగానే హస్తినలోని వామపక్ష పార్టీల అగ్రనేతలు కూడా యోచిస్తున్నారని.. అ క్రమంలో కామ్రేడ్‌లు పొత్తుల కోసం పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది.
అందులో భాగంగానే ఇటీవల పాట్నాలో జరిగిన బీజేపీయేతర పార్టీల సమావేశానికి సీపీఐ, సీపీఏం అగ్రనేతలు సీతారాం ఏచూరి, డీ రాజాలు హజరయ్యారు. మరోవైపు.. ఈ భేటీలో పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ హడావుడి సదరు పార్టీల అధినేతలకు సైతం అర్థమైందని.. అదీ కాక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత పేరు దేశవ్యాప్తంగా మారుమోగిందని.. ఆ క్రమంలో ఆమెను ఈడీ పలుమార్లు విచారించిందని.. దీంతో కల్వకుంట్ల కవిత అరెస్ట్ తప్పదనే ఓ ప్రచారం జోరుగా సాగినా.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ... కేసీఆర్ కుమార్తెకు శ్రీ కృష్ణ జన్మస్థాన యోగం ప్రాప్తించలేదని.. ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో కారు పార్టీ అధినేతతో కలిసి నడిస్తే.. ఐఎస్ఐ మార్కు లాంటి ఎర్రంరంగు పార్టీ రంగు సైతం ప్రజల్లో పలచన అయిపోయే అవకాశాలు ఉన్నాయని.. దీంతో హస్తం పార్టీతో కలిసి నడిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ది చూకూరే అవకాశాలు ఉంటాయని కామ్రేడ్‌లు ఆలోచిస్తున్నట్లు ఓ ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.
రేపటి నుంచి బస్సు చార్జీలు లేదా విద్యుత్ ఛార్జీలు పెరుగుతోన్నాయంటే.. గతంలో ఎర్ర జెండా ఎర్ర జెండా ఎన్నియేల్లో... అనుకొంటూ సామాన్య ప్రజల తరఫున రోడ్లపైకి వచ్చి.. ధర్నాలు, ఆందోళనలు ... వగైరా వగైరా చేపట్టి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ.. నిత్యం అవమాన పడుతూ.. కామ్రేడ్‌లు జైలుకు వెళ్లి వచ్చే వారు.
అయితే ప్రస్తుతం గద్దెనెక్కిన ప్రభుత్వాలు.. కామ్‌గా బస్సు చార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచుకొంటూ పొతున్నాయి. అంటే.. ఛార్జీలు పెంచుతోన్నట్లు ప్రభుత్వాలు ప్రకటించడం లేదు.. అలాగే తమకు ఏమి తెలియదన్నట్లు కామ్రేడ్లు సైతం వ్యవహరిస్తున్నారు. దీంతో వామపక్షాలు, ఆ పార్టీ శ్రేణులకు పక్షవాతం వచ్చి అన్ని అవయువాలు చచ్చుబడిపోయినట్లుగా మరో పార్టీతో అంటకాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్షాలపై సామాన్య ప్రజల్లో బలమైన ముద్ర అయితే పడిపోయిందనేది సుస్పష్టమనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తోంది.