ఏపీ నీది.. తెలంగాణ నాది.. జగన్, షర్మిల వ్యూహం?

పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే అన్నది నానుడి. రాజకీయాలలో కూడా సాధారణంగా అదే పరిస్థితి ఉంటుంది. రాజకీయం కోసం అన్నా తమ్ముళ్లు, అక్కా చెళ్లెల్లు, భార్యాభర్తలు పోటీ పడటం కామనే. కానీ వైసీపీ కుటుంబంలో మాత్రం ఆ పోటీ పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నతో తగాదాలు (అవి ఆస్తితగాదాలని పెద్దగా ప్రచారంలో ఉంది) కారణంగా ఏపీ సీఎం వైస్ జగన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పుట్టిల్లు వదిలేసి అంటే ఏపీని వదిలేసి మెట్టినిల్లంటూ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. ఆమె వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, వారానికో దీక్ష చేసినా, తెలంగాణలో అధికార పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించినా, ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా విమర్శలు చేసి, ధర్నాలు చేసి అరెస్టైనా ఆమెకు కానీ, ఆమె వైఎస్సార్టీపీ కి కానీ పెద్దగా  మైలేజీ రాలేదు. దీంతో ఆమె చూపు తండ్రి జీవించి ఉన్నంత కాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీపై పడింది. స్వయంగా ఆమె బెంగళూరు వెళ్లి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో వరుస భేటీల ద్వారా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అన్న ఊహాగానాలకు తావిచ్చారు. అక్కడ నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టి అన్న, ఏపీ సీఎం జగన్ కు పక్కలో బల్లెంగా మారతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అవి పీక్స్ కు చేరేదాకా వేచి చూసిన షర్మిల విలీనం ప్రశక్తే లేదని మెల్లిగా, తన ఆశ, శ్వాస తెలంగాణయే అంటూ గట్టిగా ప్రకటించారు. ఆమె ఎంతగా విలీనం లేదు మొర్రో అని మొరపెట్టుకుంటున్నా.. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం వార్తలు మాత్రం ఆగడం లేదు. ఆమె తన పార్టీపై పెట్టిన కాన్సన్ ట్రేషన్ ను తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన, ఆయన కుటుంబ అక్రమాలపై పెట్టండంటూ మీడియాకు హితవు పలికినా.. ఆమె వరుస భేటీలూ, ఆమె తండ్రి కుటుంబానికి సన్నిహితుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రినివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోవడం.. ఇటీవలి కాలంలో పొంగులేటి అటు జగన్ తోనూ, ఇటు షర్మిలతోనూ భేటీ కావడం వీటన్నిటినీ చూస్తుంటే.. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో ఆమె తన సోదరుడి విజయం కోసం కృషి చేసినట్లే..  వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణకే పరిమితం కావడం ద్వారా మరోసారి జగన్ కు ఆమె అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. అయితే షర్మిలను కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ ను చేస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.   తాను ఏపీకి వెళ్లేది లేదని.. తెలంగాణ బిడ్డడా.. తుది శ్వాస వరకూ తెలంగాణలో రాజకీయం చేస్తానని కొట్లాడుతానని విస్పష్టంగా చెప్పేయడం ద్వారా ఆమె ఏపీలో జగన్ కు ఇసుమంతైనా నష్టం చేయడానికి రెడీగా లేరన్నది తేటతెల్లం చేశారు.   డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా తెలంగాణ సీనియర్లు  ఆమె తెలంగాణలో అవసరం లేదని.. ఆమె పార్టీ విలీనానికి ఓకే కానీ ఆమె అవసరం తెలంగాణలో లేదనీ, ఏపీలోనే ఉందని అంటున్నారు. ఆ దిశగా ఆమెను ఒప్పించేందుకు శతథీ ప్రయత్నిస్తున్నారు. కానీ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం షర్మిలను  తెలంగాణ రాజకీయాల్లోనే  కొనసాగాలని పార్టీ నాయకులకు గట్టిగా చెబుతున్నారు.  విలీనానికి ఓకే కానీ..ఏపీకి వెళ్లనని షర్మిల అంటున్నారు. అయితే షర్మిల విలీనానికి మెగ్గు చూపుతూనే ఏపీకి దూరం అనడం వెనుక  అన్నాచెల్లెళ్ల వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను ఎలాగైనా ఒప్పించి   ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. ఏం జరుగుతుందన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. 

ఎవరికీ పట్టని ముద్రగడ సవాల్!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిన ఆయన ఆ ఒక్క అంశం తప్ప ఇప్పటి వరకూ మరే విషయాన్నీ పట్టించుకోలేదు. అందుకే కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఔను ఉండేది.. ఇప్పుడు అది లేదు. ఆయన జగన్ కోసం తన సామాజిజక వర్గంలో తనకున్న పరపతిని ఉపయోగించడం మొదలెట్టారని ఆరోపణలు వినవస్తున్నాయి. అవి ఆరోపణలకు మాత్రమే కాదు పచ్చి నిజాలు అని తాజాగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ కు రాసిన రెండు లేఖల ద్వారా బహిర్గతమైంది. అంతే కాదు ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎవరి సొమ్ములతో నడిపారో కూడా ఆయనే స్వయంగా వెల్లడించడంతో సొంత సామాజిక వర్గం నుంచే ముద్రగడపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. నాడు ఉద్యమం సందర్భంగా మీరు మాకు సరఫరా చేసిన ఉప్మా డబ్బులు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాం తీసుకోండి అంటూ కాపు యువత ఆయనకు మనీఆర్డర్లు పంపిస్తోంది. దీంతో ఆయన ఇంత కాలం కాపాడుకుంటూ వచ్చిన కాపు ఉద్యమ నేత గుర్తింపును తన లేఖల ద్వారా ఆయనే చెరిపేసుకున్నట్లైంది. ఇక ఆయన వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ పవన్ కు సవాళ్లు విసిరారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి పై పోటీ చేయకుంటే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా తానే నిలబడతానని ముద్రగడ సవాల్ విసిరారు. ప్రత్యక్ష రాజకీయాలకు  గుడ్ బై చెబుతానని గతంలోనే ప్రకటించిన ఆయన ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ పవన్ క ల్యాణ్ పై పోటీకి సై అంటున్నారు. ఇంత గట్టిగా సవాల్ విసురుతున్న ముద్రగడ పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగారంగంలోకి దిగుతానని మాత్రం చెప్పడం లేదు. అన్యాపదేశంగా తాను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తన కుమారుడి కోసం తనకు సొంత సామాజిక వర్గంలో ఉన్న గౌరవాన్ని, గుర్తింపును వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడిన ముద్రగడ.. ఇప్పుడు అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ పవన్ కు సవాళ్లు విసురుతున్నారు. మరీ ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా  చేసి రిజర్వేషన్ల ప్రశక్తే లేదన్న ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా మాట్లాడడం, అలాగే కాపు సామాజిక వర్గాన్ని చులకనగా, అసభ్య పదజాలంతో దూషించిన ద్వారంపూడికి వత్తాసుగా జనసేనానిపై విమర్శలకు దిగడమే కాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ భాష సంస్కరించుకోవాలంటూ హితవు పలకడంతో ముద్రగడ పట్ల ఆయన సొంత నియోజకవర్గ నేతలలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.   కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఆర్ధికంగా సహకారం అందించారని తన లేఖలో పేర్కొనడం కూడా ఆ సామాజికవర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి కారణమైంది. దీంతో కాపు సామాజిక వర్గ నేతలంతా ఒక్క వైసీపీలోని ఆ సామాజిక వర్గ నేతలను మినహాయిస్తే.. ముద్రగడపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.  ద్రోహిగా అభివర్ణిస్తూ నిరసనలకు దిగుతున్నారు. అని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానంటూ ముద్రగడ విసిరిన సవాల్ ను ఆయన తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. నిజంగా ఆయన పవన్ కు ప్రత్యర్థిగా నిలబడితో సొంత సామాజిక వర్గం ఆయన మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ముద్రగడ సవాల్ ను వైసీపీతో సహా ఎవరూ సీరియస్ గా పరిగణనలోనికి తీసుకోలేదు. ఉత్తర కంచి ఉద్యమం ద్వారా హీరోగా కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్రగడ ఇప్పుడు అదే సమాజికవర్గానికి ఒక ద్రోహిగా, సామాజికవర్గంలో ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న విలన్ గా కనిపిస్తున్నారు. 

కేసీఆర్ కే అంతు చిక్కని కాంగ్రెస్ రాజకీయాలు!

రాజకీయాలలో అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయన రాజకీయ చతురత ఏంటో పెద్దగా ఎవరికీ తెలియదు కానీ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం దక్కించుకున్న అనంతరం ఆయన ఏమిటో, ఆయన చాణక్యం ఏమిటో అందరికీ అంతుబట్టింది. తెలంగాణ మూలలోకి వెళ్లి వారిని పలకరించేలా మాట్లాడే ఆయన మాటలు, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయన  రచించే ప్రణాళికలు ఇలా ఒక్కొక్కటీ బయటకొచ్చే కొద్దీ ఆయన రాజకీయం ఏంటో అందరికీ అవగతమైంది. గిట్టని వాళ్ళు, ప్రతిపక్షాలు ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన ఒక్కసారి మైకు అందుకుంటే వాటన్నిటికీ తనదైన శైలిలో మూడే ముక్కలలో సమాధానం చెప్పగల నేర్పరి ఆయన. అయితే, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నడంలో దిట్టగా.. రాజకీయ దురంధ‌రుడిగా పేరున్న ఆయనకే అర్ధం కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయం చేస్తుందా అనిపిస్తుంది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చకచకా రాజకీయాలను చక్కబెట్టే పనిలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కలిసి కట్టుగా నేతలను లాగేసుకొనే పనిలో ఉన్నారు. అంతర్గత కుమ్మలాటలను కాసేపు పక్కన పెట్టేసి అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే పనిలో పడ్డారు. అసలు  వీరి కలయిన సాధ్యమయ్యే పనేనా అన్నట్లుగా భావించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా చేయి చేయి కలిపి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఇతర పార్టీల నేతలకు సాదర స్వాగతాలు పలుకుతున్నారు. ఎవరినైతే కేసీఆర్ కాదనుకున్నారో వాళ్లందరినీ పోగుచేసి గులాబీ బాస్ కి చుక్కలు చూపించే పనిని మూకుమ్మడిగా నెత్తికి ఎత్తుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఉన్న ఈగోకి వీళ్ళేం చేస్తార్లే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకటికి వంద మెట్లు దిగి మీరు వస్తే చాలు మీదే రాజ్యం అన్నట్లు అసలైన రాజకీయాన్ని అవలంబిస్తున్నారు.దీంతో ఇప్పుడు గులాబీ బాస్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తున్నది.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి వంటి వారికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా గాలం వేసి పట్టేసింది. హస్తం నీడకి వీరు చేరడం ఇక లాంఛనప్రాయమే. వీరిని ఇప్పటికే బీఆర్ఎస్ ముప్పుతిప్పలు పెట్టిసి వదిలేసింది. దీంతో వీరు తమ వర్గాన్ని కూడగట్టుకొని మరింత బలంగా మారి ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు రాజకీయ ఉద్దండులైన వీరిని బీఆర్ఎస్ లైట్ తీసుకోవడంతో వీరు అసంతృప్త వర్గాన్ని మోపుజేసి ఒక జట్టుగా చేసి పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ముందు వీళ్ళని ఎలాగైనా పట్టేస్తే.. మిగిలిన పని సులభంగా చక్కపెట్టేయొచ్చని కాళ్లకు బలపం కట్టుకొని వీళ్ళ కోసం వీర ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్లేనని భావిస్తున్నారు. ఇప్పటికే సొంత పార్టీలో పనితీరులో అట్టడుగులో ఉన్న ఎమ్మెల్యేల జాబితా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కేసీఆర్ కు.. వాళ్ళలో రెబల్స్ అయ్యే వారిని ఎలా బుజ్జగించాలో అర్ధం కాని పరిస్థితిలో ఉండగా.. కాంగ్రెస్ వాళ్ళకి కూడా గాలమేసి ఉసిగొల్పితే జరిగే నష్టం లెక్క వేయలేనిది. మరోవైపు వైఎస్ షర్మిలను కూడా రంగంలోకి దింపేందుకు శక్తిమేరా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరోవైపు టీడీపీ ఎవరితో పొత్తుకు వెళ్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఇటు షర్మిల, అటు టీడీపీ అంశం కూడా క్లారిటీ వస్తే అన్ని వైపులా బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగిసి అష్టదిగ్బంధనంగా మారుతుంది. అయితే, ఎలాంటి చిక్కుముడినైనా చాకచక్యంగా విప్పగల నేర్పరిగా పేరున్న కేసీఆర్ ఈ పొలిటిల్ రైడ్ ను ఎలా గమ్యానికి చేరుస్తారో చూడాలి.

పట్నా సిగపట్లు కుదరని ఏకాభిప్రాయం

అనుకున్నదే జరిగింది. 2024 సార్వ‌త్రిక స‌మ‌రంలో పాల‌క బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా  బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత  నితీష్ కుమార్ నివాసంలో జ‌రిగిన విప‌క్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ స‌మావేశంలో ఏకాభిప్రాయం వ్య‌క్తం కాక‌పోవ‌డంతో త్వ‌ర‌లో సిమ్లాలో మ‌రోసారి భేటీ కావాల‌ని విప‌క్ష నేతలు నిర్ణ‌యించారు. బీజేపీ నిలువ‌రించేందుకు విప‌క్ష నేత‌లు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌న్న విషయంలో  ఈ భేటీలో ఏకాభిప్రాయం వ్య‌క్త‌మైనా అందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై నేత‌లు ఓ అంగీకారానికి రాలేక‌పోయారు.  సమావేశానికి హాజరైన పార్టీలతో పాటుగా, హాజరు కానీ, ఆహ్వానం అందని పార్టీల నాయకులు కూడా ఇది అయ్యేది కాదు .. పొయ్యేది కాదు .. అనే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. కాగా సమావేశంలో పాల్గొన్న పార్టీల నాయకులు ఎవరి జెండా, ఎజెండాను వారు బయట పెట్టుకోవడంతో పరస్పర దూషణలతో సమావేశం వేడెక్కింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ భేటీలో బెంగాల్‌లో కాంగ్రెస్ తీరును ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌ప్పుప‌ట్ట‌గా, లోక్ సభలో  కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజ‌న్ చౌధ‌రి టీఎంసీని దొంగ‌ల పార్టీగా అభివ‌ర్ణించారు.  మ‌నలో మ‌నం విభేదాల‌తో వీధికెక్కితే అంతిమంగా బీజేపీకి ల‌బ్ధి చేకూరుతుంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్న‌ట్టు స‌మాచారం. ఢిల్లీ ఆర్డినెన్స్ విష‌యంలో పార్టీల‌న్నీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కోర‌గా, ఆర్టిక‌ల్ 370పై కేజ్రీవాల్ వైఖ‌రిని ఒమ‌ర్ అబ్ధుల్లా త‌ప్పుప‌ట్టారు. మద్దతు ఇవ్వక పోతే తదుపరి సమావేశాలకు ఆప్ ‘హాజరు కాదని ఆప్ నేతలు స్పష్టం చేశారు.   కాగా, పట్నా సమావేశంలో పాల్గొనని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజ‌కీయ పార్టీలు ఒక్క‌టి కావ‌డం ముఖ్యం కాదు, దేశంలో ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా.. ప్ర‌జ‌లంతా ఏకం కావడం ముఖ్య‌మ‌ని  అన్నారు. దేశంలో ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌స్య‌ల‌కు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలే కార‌ణ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆ రెండు పార్టీల వ‌ల్లే దేశంలో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మైన‌ట్లు చెప్పారు. ఒక‌వేళ విప‌క్ష పార్టీల‌న్నీ రాజ‌కీయంగా బీజేపీ వైపో లేక కాంగ్రెస్ వైపో మ‌ళ్లితే అప్పుడు దేశానికి ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఇక బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ మండిప‌డ్డారు.నితీష్ దేశ ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు. తాను నిజాలు మాట్లాడ‌తాన‌నే త‌న‌ను విప‌క్షాల స‌మావేశానికి పిలవ‌లేద‌ని అన్నారు. కాగా  క‌నీస ఉమ్మ‌డి కార్య‌క్ర‌మం రూపొందించాల‌ని ఈ స‌మావేశంలో ప‌లు పార్టీలు అభిప్రాయ‌ప‌డ్డాయ‌ని తెలిసింది. విప‌క్ష కూట‌మికి ఓ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను నియ‌మించాల‌నే అంశంపైనా ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం. ఈ స‌మావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, శివ‌సేన నేత‌లు (యూబీటీ) ఆదిత్య ఠాక్రే, సంజ‌య్ రౌత్ స‌హా ప‌లువురు విప‌క్ష నేత‌లు హాజ‌ర‌య్యారు. విప‌క్షాల స‌మావేశంలో కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, ఎన్సీపీ, శివ‌సేన‌, డీఎంకే, జేఎంఎం, ఎస్‌పీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ నేత‌లు పాల్గొన్నారు.

సంక్షిప్త వార్తలు

1.రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశాడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని నిలదీశారు. 2. పనితీరు మెరుగు పరుచుకోలేని, గ్రాఫ్ ను పెంచుకోలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనంటూ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరు అత్యంత దారుణంగా ఉందని ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా జగన్ చెప్పారు.  3. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎప్పుడో 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్ కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు. వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.  4. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధానితో పాటూ ఇతర భారతీయ ప్రముఖులతో కలిపి మొత్తం 400 మంది అతిథులు ఈ విందులో పాలుపంచుకున్నారు.  5. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాల్లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయనకు ఉన్న పాపులారిటీపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని వెలువరించింది.  6. జగన్ పాలనలో  అడుగ‌డుగునా దౌర్జ‌న్యాలు జరుగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.  జగన్ మాత్రం తాను తీయబోయే సినిమాపై రామ్ గోపాల్ వర్మ తో సమీక్షా సమావేశం పెట్టుకున్నాడని విమర్శించారు. 7. ప్రయాణీకుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు తాంబరం నుంచి సంబల్‌పూర్‌కు గురువారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైలు  నడిపారు. తిరిగి ఇదే రైలు  ఈ నెల 24వ తేదీ ఉదయం 5 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి మరునాడు ఉదయం 7 గంటలకు చెన్నై బీచ్‌ చేరుకుంటుంది.  8. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ అవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 9. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాపు నేత ముద్రగడ పద్మనాభం పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. ముద్రగడ ఈరోజు పవన్ కు సవాల్ విసురుతూ మరో ఘాటు లేఖను సంధించారు.  10. శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.  రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 11. ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని వారు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 12. ప్రతి ఒక్కరూ తమ పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు  ఈ నెల 30 వరకు గడువు పొడిగించింది. 13. ఈ ఏడాది చివరిలోగా జరగనున్న తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మనం గెలవబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇకపై బీజేపీ ఎక్కడా కనిపించదని  ఆయన జోస్యం చెప్పారు. 14. జమ్మూకశ్మీర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్  నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. 15.అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ప్రధాని గురువారం అమెరికన్ చట్ట సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. 16. బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌, సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీ పెద్దలు ఈ ఇద్దరినీ ఈ రోజు ఢిల్లీ పిలిపించుకున్నట్టు తెలుస్తోంది.  17. తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 18. పాట్నాలో ఈరోజు జరిగిన  విపక్షాల సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పారు. 19.రిలయన్స్ జియో 5జీ ఫోన్ ను తక్కువ ధరలోనే ఈ ఏడాది చివర్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఫొటోలు అప్పుడే ఆన్ లైన్ లోకి చేరాయి. 20. మధ్య ప్రదేశ్ లో మనుషులపై దాడులు చేస్తూ రెండు వారాలుగా ముప్పు తిప్పలు పెట్టిన కోతిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. డ్రోన్ సాయంతో గాలించి, మత్తు ఇంజెక్షన్ చేసి బోనులో పెట్టారు.

ముద్రగడ టిఫిస్ సెంటర్.. ఉప్మా డబ్బులు ఇవిగో అంటూ మనీయార్డర్లు

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాపు సామజిక వర్గ ఓటర్ల కోసం పెద్ద యుద్ధమే మొదలైంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ సామజిక వర్గాన్ని ఔట్ రేటెడ్ గా తన ఖాతాలో వేసుకోవాలని ప్రణాళికలు రచించి అమలు చేస్తుంటే.. దాన్ని అడ్డుకొనేందుకు అధికార వైసీపీ రకరకాల పన్నాగాలు వేస్తుంది. మొత్తంగా ఇప్పుడు కాపులు సెంటర్ పాయింట్‌గా మారిపోయారు. కాపుల మద్దతు విపక్షానికి దక్కకుండా ఎలాగైనా అడ్డుకోవాలనే పన్నాగంలో భాగంగానే ముద్రగడలాంటి పాత కాపులను వైసీపీ ప్రయోగిస్తోంది. చాలాకాలం సీరియస్ నేతగా తనపై ఉన్నముద్ర  ఇంత కాలం నిలబెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం ద్వారంపూడికి మద్దతుగా పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగి దిగజారారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటుగా ఓ లేఖ రాసిన ముద్రగడ ఇప్పుడు తాజాగా మరో లేఖ కూడా రాశారు. లేఖలతో ముద్రగడపై కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత మొదలవగా జనసైనికులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని పర్యవసానంగా ఇప్పుడు ముద్ర గడకు ఉప్మా డబ్బుల మనీ ఆర్డర్ల వెల్లువ మొదలైంది. ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల  లేఖ రాసిన ముద్ర‌గ‌డ వైసీపీకి అమ్ముడుపోయాడంటూ రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి జిల్లాల కాపు సామజిక వర్గ యువత ఇప్పుడు వినూత్నంగా ఓ నిరసన మొదలు పెట్టారు. గ‌తంలో కాపు ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చిన యువ‌త‌కు ద్వారంపూడినే ఉప్మా పెట్టించార‌ని.. వారి త‌ర‌లింపుకు లారీలు ఏర్పాటు చేశార‌ని ముద్రగ‌డ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో అప్పుడు నాడు ఆ కార్యక్రమానికి వెళ్లిన యువత ఇప్పుడు ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ ముద్రగడకి మనీ ఆర్డర్లు పంపిస్తున్నారు. జ‌న‌సేన నేత పంతం నానాజీ ముందుగా ఈ మనీ ఆర్డర్ల నిరసన మొదలు పెట్టారు. తాము తిన్న ఉప్మాకు బ‌దులుగా వెయ్యి రూపాయలు పంపిస్తున్నా అంటూ నానాజీ ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ చేశారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌ సైనికులు పెద్ద ఎత్తున అదే త‌ర‌హాలో ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ పంప‌డానికి క్యూ కట్టారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు, కాపు సామజిక వర్గ యువత ముద్రగడకు రూ.1000 రూపాయలు చొప్పున మనీ ఆర్డర్ పంపుతున్నారు. దీనికోసం భారీ సంఖ్యలో యువకులు పోస్ట్ ఆఫీస్ ల వద్ద క్యూ కట్టారు. తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని.. ఇప్పుడు తప్పు తెలుసుకున్నామని.. మనీ ఆర్డర్ పంపే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. నిజానికి సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన ముద్ర‌గ‌డ పద్మ‌నాభంకు ఒక‌ప్పుడు కాపు యువ‌త‌లో మంచి క్రేజే ఉండేది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే, 2019 ఎన్నిక‌లకు ముందు కాపుల‌కు రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. కానీ.. గ‌త నాలుగేళ్ల‌లో ఆ వ‌ర్గానికి జ‌గ‌న్ చేసిందేమీ లేకపోగా కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని తెగేసి చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టేశారు. దీంతో ఆ సామజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత మొదలైంది. అయితే, ఇప్పుడు ఆయన్నే వైసీపీ.. పవన్ కళ్యాణ్ ను ఆ సామజిక వర్గానికి దూరం చేసేందుకు పావుగా వాడుకుంటుంది. ఈ క్రమంలోనే ఇలా నిరసనలు చూడాల్సి వస్తుంది. మరి.. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

బీఆర్ఎస్ లో‘సర్వే’యే సర్వస్వం

ఆగస్టు తరువాత ఏ క్షణంలోనైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడొచ్చన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించేశాయి. బీఆర్ఎస్ సహా  ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. అదే సమయంలో అన్ని పార్టీలూ కూడా సర్వేలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల కంటే అధికార బీఆర్ఎస్ సర్వేలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు. ఆ సర్వేలన్నిటిలోనూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిందని ప్రకటిస్తూ క్యాడర్ లో  బూస్ట్ నింపుతున్నారు. అలాగే సిట్టింగతులందరికీ టికెట్లని ప్రకటించిన ఆయన సర్వేల ఆధారంగా కొందరు సిట్టింగులను పక్కన పెట్టక తప్పదన్న నిర్ణయానికి వచ్చారని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ గెలుపు ఓటములపైనే కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుపు అవకాశాలు ఉంటాయన్న విషయంపై కూడా సర్వే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.   గతంలోనే సిట్టింగులకందరికీ టికెట్లు అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సిట్టింగులందరికీ టికెట్లు గ్యారెంటీ కాదు అని మాట మార్చడం వెనుక కూడా సర్వేలే ఉన్నాయని అంటున్నారు.   తాజాగా మరో సర్వే నిర్వహించిన ఆయన వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలు ఎవరన్న విషయంలో ఒక స్పష్టతకు వచ్చేశారని, ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు సమాయత్తమౌతున్నారని అంటున్నారు.  గతంలో పలు సందర్భాలలో  సిట్టింగ్‌లందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించిన సందర్భంలో  పార్టీలో ఒక్క సారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసిపడిన సంగతి తెలిసిందే.   ఆపరేషన్ ఆకర్ష్ పేరిట 2019 ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసి.. ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు.. ఇప్పుడు గత ఎన్నికలలో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇచ్చి వారిని గెలిపించడం కోసం పని చేయాలని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లని ప్రకటించినప్పుడు పార్టీ శ్రేణులూ, నాయకులూ అన్న తేడా లేకుండా అందరిలోనూ ఒక్క సారిగా అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంది. దీంతో ఆయన సిట్టింగులందరికీ కాదు కొందరికే అని తన మాటను, ప్రకటనను సవరించుకున్నారు. ఇందుకు కారణం సీఎంకు అత్యంవిశ్వసనీయుడిగా  పేరొందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వంటి మంత్రులు సిట్టింగులలో అత్యథికులు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించి సీఎం కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేశారు. దీంతో ఇప్పుడు సిట్టింగులలో కనీసంలో కనీసం పాతిక మందికి టికెట్లు లేవని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు.  అందుకే సర్వేల ఆధారంగానే పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తామనీ, తాను నిర్వహించిన, నిర్వహించనున్న సర్వేలలో గెలుపు గుర్రాలుగా తేలిన వారికే టికెట్లని చెప్పారు. తన వద్ద సర్వే వివరాలన్నీ ఉంచుకుని త్వరలో ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆశావహులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఆయా ఎమ్మెల్యేల పట్ల ఆయా నియోజకవర్గాలలోని ప్రజల్లో ఉన్న అభిప్రాయం,  విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి,  ప్రజలలో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ అన్న అంశాలపై కేసీఆర్ చేయించిన సర్వే ఫలితం ఆధారంగానే పార్టీ టికెట్లు ఇస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ తతంగమంతా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే పూర్తి చేసి ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా  తయారవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  

ముసుగులు తొలగిపోనున్నాయా?

బీఆర్ఎస్, బీజేపీ రహస్య మైత్రి ఇక బహిరంగం కానుందా? ఇంత కాలం వేసుకున్న ముసుగులను ఆ రెండు పార్టీలూ తొలగించేయనున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు సాక్షీభూతంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాను కలవనుండటాన్ని పరిశీలకుల చూపుతున్నారు. ఔనున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తిన వెడుతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏమిటన్నదానిపై కంటే కేటీఆర్ అమిత్ షాతో భేటీ కానుండటమే రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీని కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి ఒక్కసారిగా జాతీయ రాజకీయాలలోకి లాంగ్ జంప్ చేసిన కేసీఆర్.. తన కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని, సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొని అరెస్టు అంచుల దాకా వెళ్లగానే సైలెంట్ అయిపోయారు. తండ్రి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతుంటే తెలంగాణలో సీఎం పగ్గాలు చేపట్టి అధికార పగ్గాలు అందుకోవాలన్న లక్ష్యంతో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ కూడా కవిత ఇబ్బందుల్లో పడగానే కేంద్రంపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ ఏదో మహారాష్ట్రలో సభలు పెట్టడం, ఏవో కొన్ని చేరికలను ఆహ్వానించడం వినా జాతీయ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అన్నిటికీ మించి శుక్రవారం పాట్నా వేదికగా జరిగిన విపక్షాల భేటీకీ ఆయన దూరంగా ఉన్నారు. అసలాయనకు ఆ భేటీకి ఆహ్వానమైనా అందిందా అంటే అనుమానమే. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మోడీ నినాదాన్ని తెలంగాణలో నిజం చేయడానికే  కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీకి లేని హైప్ తీసుకువచ్చారనీ, నిజానికి కేసీఆర్ పార్టీ బీజేపీకి బీటీమ్ అని గతం నుంచీ వినవస్తున్న విమర్శలు నిజమేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలు వాస్తవమే అనిపించేలా బీజేపీ, బీఆర్ఎస్ లు రహస్య మిత్రులు అని కేటీఆర్ తన హస్తిన పర్యటనలో అమిత్ షాతో భేటీ కానుండడాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ బేటీతో ఇరు పార్టీలూ ముసుగులు తొలగించేస్తాయని కూడా అంటున్నారు.  

జగనన్న బాణం రివర్స్.. రచ్చకెక్కనున్న వైఎస్ కుటుంబ కలహాలు

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు  వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో పొత్తుల కోసం ఏపీలో ప్రతిపక్షాలు ఏకమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తుంటే.. రాష్ట్ర విభజనలో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లో దక్కిన విజయంతో   తెలుగు రాష్ట్రాలలో కూడా కోలుకునేందుకు ఆపరేషన్స్ మొదలు పెట్టింది. ఒకవైపు తెలంగాణలో నాయకులను చేర్చుకొని ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా పావులు కదుపుతూనే.. ఏపీ లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలు పెట్టింది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా జరగాలంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా లేకుండా వలస పోయారు. అలాంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ పుంజుకోవాలంటే అందుకు తగ్గట్లే వ్యూహాలు ఉండాలి. కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. అదే జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఏపీలో వైఎస్ బ్రాండ్ ను తిరిగి దరి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ మరణానంతరం  జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేధించి బయటికి వచ్చి ఓదార్పు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, యాత్ర మధ్యలో ఉండగానే అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు పాలయ్యారు. దీంతో ఆయన చెల్లెలు షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేపట్టారు. మొదట్లో కాస్త తడబడినా, ఆ తర్వాత పార్టీకి ఆమె పెద్ద దిక్కుగా మారి తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ అభిమానులను, పార్టీ క్యాడర్ ను కాపాడారు. ఇంకా చెప్పాలంటే షర్మిల రాష్ట్రవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగి జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత వైఎస్ కుటుంబంలో విబేధాలొచ్చాయి. షర్మిల అన్న జగన్ ను కాదని తెలంగాణలో తండ్రి పేరుతో మరో పార్టీతో ప్రజల మధ్యకి వచ్చారు. ఆ తర్వాత తల్లి విజయమ్మ కూడా కొడుకును, కొడుకు పార్టీని కాదని.. కూతురు షర్మిల వద్దకే చేరారు. ఆ మధ్య వైఎస్ వివేకా కేసు అంశంలో కూడా పరోక్షంగా అన్న జగన్ మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై కూడా షర్మిల విమర్శలు చేయగా.. వివేకా కుమార్తె సునీతతో కలిసి షర్మిల పరోక్షంగా యుద్ధమే చేస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే వివరంగా ఉన్నాయి. అయితే, అప్పుడు అన్నకు మద్దతుగా కాంగ్రెస్ తో విభేదించిన షర్మిలను ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని టాక్ నడుస్తుంది. షర్మిల కూడా కాంగ్రెస్ తో సయోధ్యకు సిద్దమైనట్లు కథనాలొస్తున్నాయి. రాజన్న రాజ్యం పేరుతో ఆమె పార్టీ అనుకున్న మేర సక్సస్ కాకపోవటంతో పొత్తు లేదా విలీనం దిశగా కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించగా.. చివరి క్షణం వరకు తండ్రి నడిచిన కాంగ్రెస్ పార్టీతోనే ఇక ఆమె ప్రయాణించేందుకు ఇడుపులపాయ కేంద్రంగా కీలక అడుగులకు రంగం సిద్దం అవుతోందని రాజకీయ వర్గాల సమాచారం.

పాతిక మంది సిట్టింగులకు నో టికెట్?

బీఆర్ఎస్ లో టికెట్ల వ్యవహారం హీటెక్కింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల హడావుడి తగ్గగానే ముఖ్యమంత్రి కేటీఆర్ పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఆయన పార్టీ వ్యవహారాలపై సీరియస్ గా దృష్టి సారించారు. పార్టీలో అసమ్మతిని, అసంతృప్తులను బుజ్జగించడమో, వీలు కాకపోతే సాగనంపడమో చేయడానికి అవసరమైన కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇక పార్టీ నాయకులతో ప్రగతి భవన్ లో వరుస భేటీలకు సమాయత్తమౌతున్నారు. ముఖ్యంగా సిట్టింగులకు పార్టీ టికెట్ల విషయంలో ప్రజలలో వారికి ఉన్న ఆదరణ, పని తీరు వంటివి పరిగణనలోనికి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికిప్పడైతే ఓ పాతిక మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పాతిక మందిపైనా  వారి వారి నియోజకవర్గాలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. అలాగే పార్టీ వర్గాలు, శ్రేణులూ కూడా వారికి టికెట్ ఇస్తే పని చేసేది లేదని ఖరాకండీగా చెప్పేశారని కూడా బీఆర్ఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ కూడా ఆ పాతిక మందినీ మార్చే నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలలో అసంతృప్తులను బుజ్జగించి వారికి పార్టీ విజయానికి కార్యోన్ముఖులుగా మార్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారనీ, ఒకటి రెండు రోజులలో విడతల వారీగా వివిధ నియోజకవర్గాల బాధ్యలు, కీలక నేతలతో వరుస భేటీలకు ఆయన సమాయత్తమౌతున్నారని అంటున్నారు.   రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఆగస్టు తరువాత ఎప్పుడైనా విడుదల కావచ్చునన్న అంచనాతో కేసీఆర్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారని అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోగానే  పార్టీకి మైలేజ్ పెరిగే విధంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారనీ, అన్ని కార్యక్రమాలలోనూ ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయడం ద్వారా వారికీ ప్రజలలో మైలేజ్ పెరిగే విధంగా కార్యాచరణ రూపొందించారనీ పార్టీ వర్గాలు చేబుతున్నాయి.  

ఈటల, కోమటిరెడ్డిలకు హస్తిన పిలుపు!

తెలంగాణ  రాష్ట్రంలో పరిస్థితులపై బీజేపీ అధిష్ఠానంలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో అధికారం ఖాయమన్న భావనలో ఉన్న హై కమాండ్ గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించింది. బీజేపీ ఇంటింటి కార్యక్రమానికి డుమ్మా కొట్టిన పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీ కి పిలిచింది. ఈ ఇరువురూ శుక్రవారం (జూన్ 23) సాయంత్రం హస్తినకు బయలు దేరి వెళ్లనున్నారు. శనివారం (జూన్ 24) వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ  భేటీలో తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయి. పార్టీ పిలుపు మేరకు జరిగిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి కారణాలను వీరు అమిత్ షాకు వివరించే అవికాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే రాష్ట్ర పార్టీలో వీరిరువురికీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ రాష్ట్ర బీజేపీలో జోరుగా సాగుతోంది.  తెలంగాణలో  ఒక్క సారిగా జోరు  తగ్గి డీలా పడిన తరుణంలో  పార్టీ హైకమాండ్ ఈటల, కోమటిరెడ్డిలను హస్తినకు పిలిపించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   గత కొంత కాలంగా ఈ ఇరువురిలోనూ వ్యక్తమౌతున్న  అసంతృప్తి కి కారణాలను కనుగొని దానిని తొలగించి తిరిగి వారిని క్రియాశీలంగా మార్చేందుకు బీజేపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే వారికి హస్తిన పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు. 

జగన్ వైఫల్యంపై కేసీఆర్ చురకలు

తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు. ఇదీ తెలంగాణ సాధించిన ప్రగతి. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఎకరం కొనాలంటే తెలంగాణలో పది ఎకరాలు అమ్మాల్సిందేనని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ఈ విషయాన్నీ చంద్రబాబునాయుడే చెప్పారు. మనం ఏం సాధించామో ఇంతకంటే ఆధారాలు కావాలా?.  పటాన్ చెరులో ఎకరం కొనాలంటే రూ.మూడు కోట్లు కావాలి.  ఇవీ పటాన్ చెరులో రూ.143 కోట్ల వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. గతంలో కూడా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం.. అది కూడా ఆనాడు చంద్రబాబు ఇలా అన్నారని గుర్తు చేయడంతో ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి సూచికగా ఈ వ్యాఖ్యలు చేసినా.. అది ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చురకలే. ఎందుకంటే గతంలో ఆంధ్రా, తెలంగాణ మధ్య ఉన్న వ్యత్యాసం తారుమారైందంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎంత సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారో.. ఆంధ్రా ప్రభుత్వం అంత ఫెయిల్ అయినట్లేనని చెప్పినట్లే అవుతుంది. అంతెందుకు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఏపీలో భూముల ధరలకు ఎక్కడలేని రెక్కలొచ్చాయి. అమరావతి ప్రాంతమైన కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో రియల్ ఎస్టేట్ మూడు వెంచర్లు, ఆరు ప్లాట్లు అన్నట్లుగా బూమ్ లోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ మహా నగరంలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్న వాళ్ళు కూడా.. ఏపీ వైపు వచ్చేశారు. టీడీపీ హయం ఐదేళ్లలో ఏపీ రియల్ ఎస్టేట్ లో ఇదే జోరు, జోష్ కనిపించింది. కానీ, ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయవాడ, గుంటూరు, విశాఖ లాంటి నగరాలతో పాటు రాజధాని అమరావతిలో సైతం ఎలాంటి అభివృద్ధి లేక రియల్స్ ఎస్టేట్ ఢమాల్ మంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుండే రాష్ట్రంలో ఇసుక కొరత, ఇసుకపై విధించిన ఆంక్షలు, రియల్ ఎస్టేట్ లో వైసీపీ నేతల ఆగడాలు, అయోమయమమైన చట్టాలతో నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయి రియల్ ఎస్టేట్ పై భారీగా ప్రభావం కనిపించింది. ఒకవైపు అభివృద్ధి లేక మరోవైపు నిర్మాణం జరగక ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించే వారంతా తెలంగాణ వైపు వెళ్లిపోయారు. ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతోనే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ వైపు మొగ్గు చూపారన్నది ఓపెన్ టాక్. వ్యాపారస్తులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కలిసి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో మాత్రమే రియల్ ఎస్టేట్ అనేలా రియల్టర్లు ఫిక్సయిపోయారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అప్పుడు తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడమే  అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, గతంలో మంత్రులు ఇలాంటి కామెంట్స్ చేసిన సమయంలో ఏపీ నుండి వైసీపీ నేతలు  వారిపై మాటల దాడి చేశారు. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇక సీఎం కేసీఆర్ సాక్షాత్తు చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడిని కాదనుకోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇదని.. ఓ అసమర్ధుడిని ముఖ్యమంత్రి చేయడం వలన పొరుగు రాష్ట్రాలలో మనం పరువు పోతుందని.. పక్క రాష్ట్రాలు మనపై జాలి చూపిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి.

కాంగ్రెస్ లో చేరికల గ్రాఫ్ పైపైకి..

భారత్ జోడో యాత్ర వల్లనేమి.. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో భారీ విజయం వల్లనేమి.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత వల్లనేమి.. కాంగ్రెస్ మాంచి ఊపు మీదుంది.  ఆ పార్టీలో చేరికలు, వలసలు సైతం.. భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల అనూహ్యంగా రేసులోకి వచ్చిన కాంగ్రెస్ లోకి బీఆర్‌ఎస్ నేతలు క్యూ కట్టారు. భారీ స్థాయిలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ముఖ్యంగా .. బీఆర్‌ఎస్ లో అసంతృప్తులు, సీట్లు దక్కని వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ లోకి వచ్చేవారు చాలావరకు ప్రజా బలం ఉన్నవారు కావడం విశేషం. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. తాజాగా ఆ ఇద్దరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరుతో కొందరు కీలక నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు  రాజేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, కొడంగల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరితోపాటు ఖమ్మంకు చెందిన పలువురు నాయకులు, మరోవైపు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఎం.రఘునాథ్‌యాదవ్‌ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంకా కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. పొంగులేటి వర్గం నుంచి భారీ చేరికలు ఉండనున్నాయి. ఇటు షర్మిల అంశం కూడా చర్చకు వస్తుంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ముందుకెళుతున్న ఆమె..కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంది. ఇదే సమయంలో ఈ మధ్య ఆమె కర్నాటక డిప్యూటీ సి‌ఎం డి‌కే శివకుమార్‌ని కలిశారు..అక్కడ గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం ఉంది. కానీ పార్టీ పెట్టింది..వేరే పార్టీలో విలీనం చేయడానికి కాదని షర్మిల ఇటీవల చెప్పారు. అటు రేవంత్ సైతం..షర్మిల ఏపీకి చెందిన వారు అని అక్కడ కాంగ్రెస్ లో చేరితే తమకు అభ్యంతరం లేదని అన్నారు.ఇదే క్రమంలో కాంగ్రెస్ జాతీయ నేత కే‌సి వేణుగోపాల్ తో షర్మిల భేటీ అయ్యారని తెలిసింది. దీంతో ఆమె కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం పెరిగింది. త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరే వార్త రావచ్చు. ఎందుకంటే.. రాజకీయ పొత్తులు..ఎత్తుల్లో.. ఎప్పుడు ఏం జరుగుతుందనేది.. చెప్పలేం కదా..!

పాట్నా ప్రయోగం సక్సెస్ అవుతుందా?

పాట్నా నుంచే, ఇందిరమ్మ నియంతృత్వానికి వ్యతిరేకంగా,లోక్’నాయక్’ జయప్రకాశ్’నారాయణ్ (జేపీ) సమర శంఖం పూరించారు. అవును,దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థతి (ఎమర్జెన్సీ) విధించి, ప్రజస్వామ్య, రాజ్యాంగ హక్కులన్నిటినీ హరించిన  నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విపక్షాలన్నింటినీ ఏకం చేసిన ‘జనతా’ ప్రయోగం ఇక్కడే పురుడుపోసుకుంది.  జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పురోగమనం మొదలైంది. ఇక్కడి నుంచే విపక్షాల ఐక్యత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అవును జనతా ప్రయోగం విఫలమై, ప్రాంతీయ, కుటుంబ పార్టీల పుట్టుకకు  కూడా ఇక్కడే .. పట్నాలోనే బీజం పడింది.   ఇప్పుడు, ఇంచు మించుగా అర్థ శతాబ్ది తర్వాత మళ్ళీ  శుక్రవారం( జూన్ 21) అదే పాట్నా నగరంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలో, ప్రతిపక్షాల ఐక్యత క్రతువులో మరో అధ్యాయం మొదలవుతోంది. అయితే, 1970 దశకంలో జేపీ సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు, ముఖ్యంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకగా పోరాటం సాగితే, ఇప్పుడు అదే కాంగ్రెస్  పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలలో భాగంగా, అదే జనతా పరివార్ చీలిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కుమార్  సారధ్యంలోని జేడీయూ, లాలు ప్రసాద్ యాదవ్ సారధ్యంలోని ఆర్జేడీ పార్టీలు ఆతిథ్య మిస్తున్నాయి.    సరే రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణం. కాలంతో పాటుగా రాజకీయాలు మారిపోవడం, శతృమిత్ర సంబంధాలు తారుమారు కావడం కొత్తేమీ కాదు. నిజానికి జనతా ప్రయోగానికి ముందు తర్వాత కూడా విపక్ష ఐక్యతకు అనేక ప్రయత్నాలు సాగాయి. ఇప్పడు మళ్ళీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా సమైక్య సమర  శంఖారావం పూరించేందుకు ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పాట్నాలో సమావేశమౌతున్నాయి. రాజకీయ కురు వృద్దుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడి అధినేత లాలుప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ వరకు, పశ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా  బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మొదలు తమిళ నాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత స్టాలిన్ వరకు, అవశేష శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మొదలు  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ  అధ్యక్షుడు రాహుల్ గాంధీ, లెఫ్ట్ నేతలు ఏచూరి, రాజా , ఆప్ ముఖ్యంత్రులు కేజ్రీవాల్, మాన్ జోడీ ఇలా చాలా మంది హేమాహమీలు హాజరవుతున్నారు. అదే సమయంలో ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ , జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, అయన కుమారుడు  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వంటి దక్షిణాది నేతలు ఎవరూ హాజరు కావడం లేదు. దక్షణాది నుంచి ఒక స్టాలిన్ మినహా మరెవరికీ ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది.    అదలా ఉంటే ఈ సమావేశం ఎంత వరకు సక్సెస్ అవుతుందనే విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం, గతంలో సాగిన ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఇప్పడు పాట్నా వేదికగా బీజేపీ మాజీ మిత్ర పక్షం జేడీయూ అధినాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో జరుతున్న మరో ఈ బృహత్ యత్నం ..  విషయంలోనూ అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఇప్పటికే ఒకటికి రెండు మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పాట్నా సమావేశం, సజావుగా సాగే, అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) అధినేత అరవింద కేజ్రీవాల్... సమావేశానికి ముందే విపక్షాలకు పరీక్ష పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకించాలని అప్పుడే తాను ప్రతిపక్షాలతో చేతులు కలుపుతానని, షరతు విధించారు. కాంగ్రెస్ అంగీకరించని పక్షంలో విపక్షాల మెగా సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే, విపక్షాల సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందింతే బీజేపీయేతర రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాల ద్వారా హరిస్తుందని హెచ్చరించారు. అందుకే ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టత కలిగి ఉండాలంటూ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఆయన లేఖ రాశారు.  అంతే కాదు ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇచ్చేలా విపక్ష పార్టీలు కృషి చేయాలని కేజ్రీవాల్‌ కోరారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ  ఆప్  డిమాండ్ ను పట్టించుకోలేదు. ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సో ... ఆప్ డిమాండ్ కు  విపక్షాలు ఎలాంటి పరిష్కారం చూపుతాయి అనేది చూడవలసి వుంది. అయితే, అంతిమంగా పాట్నా ప్రయోగం ఏమవుతుంది? వి పక్షాల ఐక్యత ఏమేరకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే దేశ రాజకీయాల్లో ఈ ఐక్యతా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రాఆసక్తిని  రేకిస్తోంది.

తెలంగాణలో బీజేపీ చతికిల బడిందా..?

కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలనే ధ్యేయంతో బీజేపీ అగ్ర నేతలు ఉన్నారు.ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా బిజెపిని బలోపేతం చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. దీంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ నానాతంటాలు పడుతోంది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ అగ్ర నాయకత్వం సూచించింది.దీంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బీజేపీ అనుబంధ సంఘాల ఉమ్మడి సమ్మేళనాలు, మేధావులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలనే రూట్ మ్యాప్ ఇచ్చింది. ఈనెల 15 నుంచి 22 వరకు అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు.అయితే కొన్ని కొన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరగకపోవడం, జాతీయస్థాయి నాయకులు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో తప్ప , మిగతా సమయంలో సైలెంట్ అయిపోవడం వంటివన్నీ బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది. పార్టీ నిర్ణయించిన ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చారు. ఒకటి రెండు రోజులు ఇక్కడి కార్యక్రమంలో పాల్గొన్నా. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దగా ఈ కార్యక్రమాలను పట్టించుకోలేదని సమాచారం.పార్టీలో అంతర్గత వివాదాలు పెరిగిపోవడంతోనే ఈ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ అభియాన్ కార్యక్రమానికి అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో ఆదరణ దక్కలేదని బీజేపీ అధిష్టానం గుర్తించింది. బీజేపీ  లోని పాత నాయకులకు ఇటీవల కాలంలో పార్టీలో చేరిన వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండడం, ఎక్కడికక్కడ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం వంటివన్నీ బీజేపీ దూకుడుకు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితిల్లో.. ఆ ప్రభావం పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల పైన పడుతూ ఉండడం, మరోవైపు ఇదే విధంగా కాంగ్రెస్ చేరికలపై దృష్టి సారించి బిఆర్ఎస్, బిజెపిలలోని అసమ్మతి నేతలను గుర్తించి, తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలపై బీజేపీ అధిష్టానం సీరియస్ గానే ఉంది.  భారతీయ జనతా పార్టీ.. తెలంగాణలో.. ఎన్నికల వేళ చతికిల బడి..షుప్తావస్తలోకి వెళ్లిపోయిందనేది యదార్ధం.

తెలంగాణలో కమలం రేకులు రాలిపోతున్నాయా?

సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బలోపేతం పేరుతో వాపును పెంచేసుకున్న బీజేపీకి  ఆ ప్రభావం ఇప్పుడు తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలు పెచ్చరిల్లి.. ఇంత కాలం  తెలంగాణలో  అధికారమే తరువాయి అన్నంతగా బిల్డప్ ఇచ్చిన బీజీపీకి వచ్చే ఎన్నికలలో గెలుపు ఆశలు సన్నగిల్లాయా? తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న పాత నాయకులకు.. చేరికల పేరిట వచ్చి చేరిన నేతలకు పొసగని కారణంగా తెలంగాణ బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారిందా? అంటే జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూసిన, చూస్తున్న ఎవరైనా ఔననే అంటారు.  బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో  పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడానికి ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇన్ చార్జిగా బయట నుంచి వచ్చి చేరినఈటలను నియమిస్తే..  ఇప్పుడు ఆయనే పార్టీలో ఇమడలేక పక్క చూపులు చూస్తున్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టడంతో  ఈ విషయం బహిర్గతమైంది. బీజేపీ రాష్ట్ర అథ్యక్షుడు బండి సంజయ్, ఈటల మధ్య విభేదాలు రహస్యమేమీ కాదు. వీరిరువురి పంచాయతీ ఇప్పటికే పలు మార్ల అధిష్ఠానం వద్దకు కూడా చేరింది. హై కమాండ్ ఇద్దరిలో కలిసి, విడివిడిగా సమాలోచనలు జరిపింది. అయినా బయటకు చెప్పుకోవడమే కానీ ఆల్ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపించడం లేదు. అసలు ఈటల బీజేపీలో చేరడమే అప్పట్లో రాజకీయ పరిశీలకులలో ఆశ్చర్యం కలిగింది. వామపక్ష భావజాలం ఉన్న ఈటల ఏమిటి, అందుకు పూర్తి వ్యతిరేకమైన సిద్ధాంతాలున్న బీజేపీలో చేరడమేమిటన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే ఈటల బీజేపీలో చేరిన నాటి నుంచీ ఆయనకు పార్టీలో ఉక్కపోత మొదలైందన్న వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాత్రం సమన్వయం కుదరలేదు.  ఈ తరుణంలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు అంటూ వార్తలు వస్తున్నాయి. తెరాస నుంచి బహిష్కృతులైనప్పటి నుంచీ కమలం గూటిగా, హస్తం గూటికా అని తేల్చుకోలేక సతమతమౌతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైపోయింది. ఈ విషయాన్ని వారితో భేటీ అనంతరం ఈటల చెప్పకనే చెప్పారు. అక్కడితో ఆగకుండా వారు తనకే రివర్స్ కౌన్సెలింగ్ ఇచ్చారని కూడా సెలవిచ్చారు.  అప్పటి నుంచే ఈటల బీజేపీలో కొనసాగుతారా అన్న అనుమానాలు ఇటు బీజేపీలోనూ కాకుండా అటు  రాజకీయ సర్కిల్స్ లో  కూడా వ్యక్తమౌతూ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తంగా బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలంతా పార్టీకి దూరం జరుగుతున్నారన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.   ఇందుకు ప్రత్యక్ష, తాజా తార్కానం  మోదీ పాలనను ఇంటింటికి ప్రచారం చేయాలని గురువారం (జూన్ 22)   అన్ని స్థాయిల నేతలు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వంద ఇళ్లకు వెళ్లాలని  పార్టీ నిర్దేశించింది. అయితే ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా అనేక మంది ఖాతరు చేయలేదు. దీంతో పార్టీలో  పరిస్థితి బద్దలవ్వడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందన్న విషయం తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈటల రాజేందర్ ,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, యొన్నం శ్రీనివసరెడ్డి వంటి వారు, మరి కొందరు కూడా ఇంటింటికీ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో ఈ గ్రూప్ కు  ఈటల రాజేందర్  నేతృత్వం వహిస్తున్నారన్న భావన బీజేపీలో వ్యక్తం అవుతోంది. పైగా గత కొంత కాలగా  ఈటల బండి సంజయ్ విషయంలో బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. దానిని దాచుకోవడానికి ఆయన ఇసుమంతైనా ప్రయత్నించడం లేదు. ఈ పరిస్థితుల్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నే కొనసాగించనున్నట్లు బీజేపీ అధిష్ఠానం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడంతో  ఈటల ఇక ముసుగులో గుద్దులాట ఎందుకన్నట్లుగా ‘ఇంటింటికి ’కార్యక్రమానికి డుమ్మా కొట్టి తన ఉద్దేశాన్ని చాటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని నమ్మి పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న భావనలో ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో నే  కొనసాగుతూ..తమ్ముడిని సొంత ఇంటికి చేర్చే ప్రయత్నాలలో ఉన్నారు.   ఈ పంచాయతీలు తేల్చ లేక  బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు.  

బాబు, పవన్ పొత్తు.. జగన్ లో ధైర్యం చిత్తు

జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఈ రెండు పేర్లూ అధికార వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2019 ఎన్నికలలో తమ పార్టీ విజయానికి జనసేన, తెలుగుదేశం పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేయడమే కారణమన్న సంగతి ఆ పార్టీ అధినేతకు క్లియర్ కట్ గా తెలుసు. విపక్షాల అనైక్యత కారణంగానే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా వైసీపీకి మరలడం వల్లనే అనూహ్య విజయం సిద్ధించింది. ఇప్పుడు 2024 ఎన్నికలలో తమ విజయం సాకారం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు ఉండకూడదు. ఆ పొత్తు లేకుండా చేయడమే ప్రస్తుతం వైసీపీ ముందున్న లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం  విలువలకు తిలోదకాలిచ్చి దుష్ప్రచారం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. వైసీపీ సోషల్ మీడియా పవన్ ను లక్ష్యంగా చేసుకుని క్యారక్టర్ అసాసినేషన్ కు పాల్పడేందుకు కూడా వెనుకాడటం లేదు.  పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయను అంటు చేసిన ప్రకటన వైసీపీ కాళ్ల కింద భూమిని కంపింపచేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక లేకపోతే.. తమ అధికారానికి నీళ్లొదులుకోవడమేనని వైసీపీ భావిస్తోంది. అందుకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న పవన్ కల్యాణ్  అధికార పార్టీకి వ్యక్తిగత శత్రువుగా మారిపోయారు. పవన్ కు ఆయన సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పవన్ పై విమర్శలు గుప్పించడానికి, అవి పరిధిదాటినా ఫరవాలేదన్న విధానానికి వైసీపీ నిర్ణయించుకుంది. అయితే ఆ విమర్శల పేటెంట్ హక్కులను వైసీపీలోని కాపు నేతలు గంపగుత్తగా తీసేసుకున్నారు. ఇక కాపు ఉద్యమ నేతగా ఆ సామాజిక వర్గంలో గుర్తింపు ఉన్న ముద్రగడనూ రంగంలోకి దింపింది.   ఇదంతా ఎందుకంటే.. వచ్చే ఎన్నికలలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉండకూడదన్నదే వైసీపీ లక్ష్యం. అయితే పవన్ టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీని కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తుండటంతో జగన్ కు ఊపిరాడటం లేదు.  ఎలాగైనా కూటమి ఏర్పాటుని అడ్డుకోవాలి. అడ్డంకులు సృష్టించాలి అన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అన్న ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడమే కాకుండా, మొత్తం కాపు సామాజిక వర్గాన్ని పవన్ కల్యాణ్ చంద్రబాబు ఓటు బ్యాంకుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారాన్ని తెరమీదకు తీసుకు వచ్చేందుకు ఎత్తులు వేస్తున్నారు.   అందుకే  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న వారాహి యాత్ర లక్ష్యంగా వైసీపీ విమర్శలను గురిపెట్టింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటనూ వక్రీకరించి, వక్రభాష్యం చెప్పే కుట్ర కు తెరలేపింది. తమ కూటమికి కాపు సామాజిక వర్గం ఓటర్లు దూరం అవుతారన్న భయంతోనే పవన్ తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారన్న ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు సహా అన్ని విషయాలలోనూ ఒప్పందానికి వచ్చేసిన పవన్ కల్యాణ్ హేతు రహితంగా తనకు సీఎం అయ్చ చాన్స ఇవ్వాలనడం వెనుక ఉన్నది చంద్రబాబు వ్యూహమేనంటూ విమర్శలు గుప్పిస్తోంది.   అలాగే తన ప్రాణాలకు ముప్పు ఉందని పవన్  కల్యాణ్ అనడం.. దానికి బీజేపీ వత్తాసు పలకడాన్ని కూడా వైసీపీ ఎత్తి చూపుతోంది. సింపతీ గెయిన్ చేసి కాపు సామాజిక వర్గం తనకు వ్యతిరేకం కాకుండా చూసుకోవడానికి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే తన ప్రాణానికి ముప్పు అంటూ పవన్ కల్యాణ్ చెప్పారని వైసీపీ అంటోంది.  సంక్షేమ పథకాలతో జగన్ కు దక్కిన ప్రజాభిమానాన్ని, ఆదరణకు తగ్గించేందుకే  అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతోంది.   అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకును చూసి నిర్ణయించేయవచ్చనీ, అలాగే జగన్ కు ప్రజాదరణ ఎంత గొప్పగా ఉందో ఆయన సభల నుంచి పారిపోతున్న జనాలను చూసి చెప్పేయవచ్చనీ జనసేన వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.