మీరేం ఉద్ధరించారని.. ముద్రగడకు ఘాటు లేఖ!
ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలలో తీవ్రంగా వినిపిస్తున్న పేరు ముద్రగడ పద్మనాభం. ఈ పేరు చాలా కాలంగా ఏపీ రాజకీయాలలో వినిపిస్తున్నా.. అప్పుడప్పుడు తళుక్కున మెరిసి ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో కానీ ఫోకస్ లోకి రాకపోవడం ఈయన నైజం. గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు కూడా రిజర్వేషన్ కావాలని ముద్రగడ ఓ ఉద్యమం లేవనెత్తారు. మరీ తెలంగాణ ఉద్యమం అంత కాకపోయినా అప్పట్లో ఈ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. ఆ సమయంలో రాజకీయంగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. రైళ్లు తగలబడ్డాయి.. మరికొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, ఇదంతా ఒక్క ముద్రగడ లేవనెత్తిన ఉద్యమం వలన మాత్రమే కాదు. కాపులలో సామాజికంగా, ఆర్ధికంగా, రిజర్వేషన్ పరంగా ఉన్న అసమానతల కారణంగా ముద్రగడ ఎత్తుకున్న ఉద్యమం వారికి ఆసరాగా దొరికింది.
అయితే, ముద్రగడ ఉద్యమంతో ఏం సాధించారు? ఆయన అన్నట్లే కాపులకు రిజర్వేషన్ తెచ్చారా? రిజర్వేషన్ రాకుండానే ముద్రగడ ఎందుకు సైలెంట్ అయ్యారు? అసలు ముద్రగడ అనే వ్యక్తి కాపు సామజిక వర్గానికి రిజర్వేషన్ కోసమే ఉద్యమం చేశారా? లేక హిడెన్ అజెండా ఏదైనా ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో ఉద్యమాన్ని ఓ స్థాయిలో నడిపించిన ముద్రగడ ప్రభుత్వం మారి జగన్ సీఎం అయ్యాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర మొదలు పెట్టాక మాత్రమే బయటకొచ్చారు. అది కూడా ఫక్తు వైసీపీ వాదిగా.. కేవలం పవన్ ను విమర్శిస్తూ లేఖలను రాయడానికి మాత్రమే కనిపిస్తున్నారు.
దీంతో అసలు ముద్రగడ నిజ స్వరూపం ఏంటన్నది ప్రజలకు అర్ధం అవుతుంది. అసలు అప్పుడు ముద్రగడ అనే వ్యక్తిని చూసి మాత్రమే అతన్ని కాపు సామజిక వర్గం ఒక బ్రాండ్ గా భావించలేదు. నిజానికి ఆయన్ను మించి ఆయన కుటుంబానికి దక్కిన గౌరవం అది. ముద్రగడ కుటుంబం ఏంటి? ఆయనను కాపు సామజిక వర్గం ఎందుకు ఒక ఐకాన్ గా భావిస్తుంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ముద్రగడ పద్మనాభం తాత పద్మనాభం సుమారు 700 ఎకరాల భూస్వామి, కిర్లంపూడి చుట్టుప్రక్కల 10, 12 గ్రామాలకు మునసుబుగా ఉన్నారు. పద్మబనాభం తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరరాఘవరావు మంచికి మారు పేరుగా జీవించారు. అందుకే అప్పట్లోనే తండ్రి పద్మనాభం ఆస్థి 700 ఎకరాల నుండి 300 ఎకరాలకు తగ్గింది. ఆయన నిజాయతీ, మంచితనానికి మెచ్చి ఆ ప్రాంతంలో చాలామందికి పిల్లల పేర్లు ఆయన పేరు కలిసేలా పెట్టుకున్నారు. ఆ తర్వాత పద్మనాభం హయం వచ్చేసరికి అది కాస్త 7,8 ఎకరాలు మాత్రమే మిగిలింది.
ఇక, ఇప్పుడున్న పద్మనాభం విషయానికి వస్తే తాత, తండ్రికి పూర్తిగా విరుద్ధం. సొంత సామాజికవర్గంలో చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకోవాలని తాపత్రయంపడుతున్న వ్యక్తిగా మాత్రమే కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన సహచరుడు, మిత్రుడు, ఆయనను దగ్గరగా చూసిన సలాది వెంకటరమణ అనే నేత ఘాటు లేఖ రాశారు. గౌరవనీయులైన మద్రగడ పద్మనాభం అంటూనే ముద్రగడ శైలిని తూర్పార పట్టారు. ఆయన రాసిన రేఖను యధాతదంగా చూస్తే.. అమలాపురం నుండి మీతో సుమారు 15 సంవత్సరాలుగా మిమ్ముల్ని అనుసరిస్తూ మీరు తీసుకొనే ప్రతి నిర్ణయంలో మిమ్మల్నే అనుసరించే సలాది వెంకటరమణ సమస్కరిస్తూ వ్రాయునది అంటూ లేఖను మొదలు పెట్టారు.
ఈ లేఖలో 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ముద్రగడ గెలిచి అసెంబ్లీకి వచ్చిన రోజున ఫోటో దిగిన రోజున జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోలో పీవీఎస్ రామారావు, పడాల అమ్మిరెడ్డి, పంఠంశెట్టి సత్తిరాజు, ఎమ్మీఎస్ సుబ్బరాజు, బిరుదా ఫకీర్‌రావు కూడా జనతాపార్టీ ఎమ్మెల్యేలుగా ఆ ఫోటోలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో 1978లో మీతో పాటు తొలి సారిగా అసెంబ్లీకి వచ్చిన Y.S.రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, ఆ తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నారు?.. వారి కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వారు వారి కులాల వారి ద్వారా ఏ స్థాయి అభివృద్దిలో ఉన్నారు. ఒక సారి మీరు ఆలోచించండి అంటూ లేఖలో చురకలు వేశారు.
మీ కుటుంబం మిగిల్చిన కాకినాడలో కళ్యాణ మండపం, కిర్లంపూడిలో పాత సినిమా ధియేటర్ ఆస్థితో రాజకీయ జీవితం ప్రారంభించిన మీరు ఏ స్థాయికి ఎదిగారు? మీరు ఉద్యమం చేసిన కాపులను ఏ స్థాయికి ఉన్నతులుగా చేసారో చెప్పాలని ప్రశ్నించారు. కాపు కులాన్ని మీరు మీకు రాజకీయ గుర్తింపు లేని సమయాల్లో రోడ్డు ఎక్కించడం.. ఆ తర్వాత ఆపివేయడం.. మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వారికి పోలీసులు కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మీరు పరామర్శించడం, ఇతర కులాలు అందరూ ఈ కులాన్ని విరోధులుగా చూసే స్థాయికి తీసుకెళ్లడం మీరు కాపు కులానికి చేసిన మేలు. కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసే సమయంలో బోనం వెంకటచలమయ్య(BVC కాలేజ్ అధినేత) ఒరే రమణా ఎందుకురా ఈబిసి రిజర్వేషన్లు, వీటి కోసం ఆందోళనలు తద్వారా యువకులను ప్రక్కదారి పట్టించడం మన జాతిలో యువతీ యువకులు చక్కగా చదువుకుంటే సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళితే ఏ రిజర్వేషన్లు అక్కర్లేకుండా సామాన్యుడు కూడా లక్షాధికారులు అవుతారు కదా అందుకే ఈ కాలేజ్‌లు నిర్మిస్తున్నాను అన్నారు.
ఆనాడు ఆయన అన్న ఆ మాటల పరమార్ధం ఏమిటో నేను ఈ రోజు చూస్తున్నాను. మా ప్రాంతంలో సాధారణ రైతులు రైతు కూలీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు పిల్లలు ఎంతో ఉన్నత స్ధితిలోకి దేశ విదేశాల్లో స్ధిరపడియున్నారు. ఇటువంటి విజన్‌తో మీరు ఎందుకు ఆలోచించ లేదో నాకు అర్ధం కావడం లేదు. నిజంగా కాపు సామాజికవర్గం బాగు కోరుకొనే వారైతే ఈ విధంగా ఆలోచన చేసి ఉంటే బాగుండేది. అప్పట్లో చిరంజీవి, దాసరి నారాయణరావు, తులసి రామచంద్రప్రభు లాంటి ఎందరో పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు ఎందరో మీ వద్దకు వచ్చి సంఫీుభావం తెలిపినా మీరు వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు. ఎందుకో మీకు ఇగో ఫీలింగ్. మీరు చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేసిన 5వ రోజున చిరంజీవి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్తే.. ఆయన ఎంతో సాధరంగా ఆహ్వానించి మీతో ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. కానీ, మీరు ఈ మధ్య లేఖలో మీరు మెగా కుటుంబం కులానికి ఏమి చేసింది అని అడుగుతున్నారు.
ఇకపోతే 1978 నుండి మీ వ్యక్తిగత రాజకీయ విధానాలను చూస్తే 1983 వరకు జనతా పార్టీలో ఉండి 6 మాసాలు ముందే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిడిపి పార్టీలో చేరారు. 1983 ఎమ్మెల్యేగా గెలిచిన మిమ్మల్ని డ్రైనేజీ బోర్డు ఛైర్మన్‌గా నియమించగా మీరు ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వచ్చేశారు. తదుపరి నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం జరిగితే మీరు ఎన్టీఆర్ కు మద్దతుగా 1985లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని మొదటి క్యాబినేట్‌లో ట్రాన్స్‌పోర్టు మంత్రిగా నియమించారు. 1986లో విజయవాడ సిటిబస్‌లు వ్యవహారంలో మీరు కోపం ప్రదర్శించి మంత్రి పదవికి రాజీనామా చేసి కిర్లంపూడికి వచ్చేశారు. ఆ తర్వాత పెద్దలు వచ్చి మిమ్మల్ని శాంతింపజేసి మళ్ళీ ఎన్.టి.ఆర్ వద్దకు తీసుకుని వెళితే.. అప్పుడు మిమ్మల్ని ఎక్సైజ్ శాఖకు మార్చారు.
1988లో కాపునాడు ఉద్యమం కాకినాడ ఆనంద భారతిలో ఆకుల శివయ్యనాయుడు, మిరియాల వెంకట్రావు, పోతుల సీతారామయ్య ఆధ్వర్యంలో మీరు ముఖ్య అతిధులుగా పాల్గొని విజయవాడలో కాపునాడుకి పిలుపు ఇచ్చారు. అప్పుడు తెలుగునాడు పార్టీ ఏర్పాటు చేసి తదుపరి తెలుగునాడు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తదుపరి రంగా హత్య అనంతరం జరిగిన 1989లో మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మీ నియోజకవర్గంలో మిమ్మల్ని గ్రామాల్లో అన్ని వర్గాల వారు మిమ్మల్ని రోడ్డుపై చీరలు పరిచి పువ్వులు జల్లుతూ మిమ్మల్ని నడిపించేవారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీకు ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా?
తదుపరి రాజీవ్‌గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు చెన్నారెడ్డిని తప్పించే క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కుసుమ కృష్ణమూర్తి, జనార్ధన పూజారి మీ వద్దకు సీఎం పదవి మీకే ఇస్తామని రాయబారం వస్తే మీరు తిరస్కరించి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ కారణంగానే ఎన్.జనార్ధనరెడ్డి క్యాబినేట్‌లో మీకు స్థానం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తికి మంత్రి పదవి కూడా లేకుండా పోయింది. తదుపరి నేదురుమల్లి జనార్ధనరెడ్డిని తప్పించి కె.విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రి చేసిన క్యాబినేట్‌లో కూడా మీకు మంత్రి పదవి దక్కలేదు. అప్పుడు మీకు కోపం పెరిగిపోయి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వేరే వారి పేరు చెబుతారు. మీకు మంత్రి పదవి ఇవ్వకుంటే కోపంతో రగిలిపోతారు. లాబీయింగ్ ఎవరైనా చేస్తామంటే వద్దంటారు. ఆ కోపంలో నుండి వచ్చినదే ఈ కాపు బిసి రిజర్వేషన్ల ఉద్యమం, దాని నిమిత్తం మీరు అమలాపురం వచ్చారు.
1994లో జరిగిన ఎన్నికలలో ప్రత్తిపాడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తే మిమ్మల్ని ఇతర వర్గాల ప్రజలు తిరస్కరించారు. వెంటనే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. వైట్ అండ్ వైట్ తప్ప ఖాకి కలర్ ప్యాంటు, వైట్ షర్టుతో ఎరగని మాకు అలా చూసే అదృష్టం కూడా మాకు కల్పించారు. ఆ తర్వాత అనకాపల్లి నుండి బిజేపి పార్టీ మిమ్మల్ని ఎంపిగా పోటీ చేయమంటే వద్దు అని చెప్పి కృష్ణంరాజును నిలబెట్టి మీరు అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆయనను గెలిపిస్తే ఆయన వద్దకు మీరు వెళ్ళేటప్పటికి ఆయన కుర్చీలో కూర్చుని మిమ్మల్ని ప్రక్క కుర్చిలో కుర్చోండి అన్నారని, లేచి నిలబడలేదని మీకు కోపం వచ్చి యధావిధిగా ఎప్పటిలాగే మీరు బిజేపికి రాజీనామా చేశారు. తర్వాత 1999లో బొడ్డు భాస్కర రామారావు, జిఎంసి బాలయోగి వచ్చి టీడీపీలో చేరి కాకినాడ ఎంపిగా పోటీ చేయించడం.. అప్పుడు మీరు గెలవడం జరిగింది. కానీ, 2004లో యధావిధిగా టిడిపికి రాజీనామా చేసి ప్రతిపాడులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆటో గుర్తుపై పోటీ చేస్తే 6 వేల ఓట్లు వచ్చాయి.
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి గోదావరి జిల్లాలకు మిమ్మల్ని నాయకత్వం వహించమని రాయబారం పంపితే రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్ళి పిఠాపురం కాంగ్రెస్ టికెట్ పుచ్చుకుని పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్ధి శ్రీమతి వంగా గీత చేతిలో మూడవ అభ్యర్ధిగా ఓడిపోయారు. 2014 ఎన్నికలకు మీరు హాలీ డే ప్రకటించి.. 2016లో చంద్రబాబు కాపు కులానికి రిజర్వేషన్ కల్పిస్తానని హామి ఇచ్చి ఇంకా చేయలేదని ఈ లేఖలు వ్రాయడం మొదలు పెట్టారు. మీ ఒత్తిడి వల్ల మేమందరం మీ వెనుక వస్తే.. తుని సభను విజయవంతం చేయడానికి అన్ని ప్రాంతాల నుండి మీకు మద్దతుగా వస్తే.. ఒక్క నాయకుడుని కూడా ప్రసంగించనీయకుండా సభకు వచ్చిన అశేష జనవాహిణిని రోడ్డు రోకోకు, రైలు రోకోకు తరలించడం ఎంతవరకు సమంజసం?. ఆ సంఘటన ద్వారా అన్ని జిల్లాలోని పోలీసులు సభకు వెళ్ళిన వారి వివరాలు తీసుకుని ఆయా పోలీస్‌స్టేషన్లలో ఎందరో యువకుల్ని, మాలాంటి నాయకుల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. అయినా సహించి మీరు కంచాలు బాదమంటే ఇంటిళ్ళపాది పిల్లజల్ల, ముసలి ముతక అందరం కంచాలు బాదారు.
ఈ ఉద్యమంలో మీరు నిస్వార్ధంగా మా కోసం మీ కుటుంబాన్ని ఫణంగా పెట్టి పోరాడుతున్నారని మేము గుడ్డిగా నమ్మి.. ఈ ఉద్యమంలో రహస్య అజెండా ఉందని అనుమానించలేదు. ప్రస్తుతం జనసేన వారాహి యాత్ర ద్వారా మీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలు ప్రపంచానికి మీరే స్వయంగా చాటి చెప్పారు. చౌకబారు సహాయాల్లో కూడా అందరి వద్ద మీరు ఇలా చేతులు చాచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు. నా వద్దకు ఎందరో యువకులు వచ్చి మిమ్మల్ని నానా మాటలు అంటుంటే నేను భరించలేక నేను సూచన చేస్తున్నాను. ఇప్పటికైనా మీ వయస్సు రీత్యా, మీ భార్య ఆరోగ్య రీత్యా మీరు ఏ విధమైన టెన్షన్లు లేకుండా ఏ వివాదాలకు తావు లేకుండా వ్యవహరించి మీ అబ్బాయికైనా మంచి భవిష్యత్‌ను ఏర్పాటు చేయండి.
పద్మనాభం గారు మనతరం వేరు, ఇప్పటి యువతరం వేరు, మీరు ఎంతో ఉన్నత కుటుంబం అని పొగిడిన రెడ్డి గారి తాతను, తండ్రిని బేడీలు వేసి పోలీసులు తీసుకుని వెళ్ళడం ఉన్న ఫోటోను 24 గంటల గడవక ముందే ప్రపంచానికి చూపించారు. అది ఇప్పటి యువత ఘనత. అటువంటి యువత అంతా ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలబడుతున్నది. లోగడ చంద్రశేఖర్‌రెడ్డి పబ్లిక్ ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టి ఓడించి తీరుతాను అని చెప్పారు. మీరు అతని ఆధ్వర్యంలో ఎక్కడైనా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటివంటి పరిస్ధితులకన్నా... ఇంకా చులకన అయిపోతారు. ఇప్పుడు ఉన్నటివంటి యువతకు ఆవేశం వస్తే మనవంటి పెద్దలను కూడా లెక్కచేయరు. ఈ విషయాన్ని గమనించి మన గౌరవ మర్యాదలు మనం కాపాడుకోవడం మంచిదని భావిస్తున్నానని రాసుకొచ్చారు.