ఈటలకు ప్రాణహాని నిజమే!
posted on Jun 30, 2023 @ 9:30AM
ఈటల రాజేందర్ భద్రతకు ముప్పు ఉందని నిర్ధారణ అయ్యింది. డీజీపీ అంజనీకుమర్ ధృవపరచుకున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తన సతీమణి జమునతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విలేకరుల సమావేశంలో ఈటల జమున తన భర్త రాజేందర్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ ఈటలకు వై కేటగిరి భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఒకటి రెండు రోజులలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే భద్రత కల్పించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారిని ఈటల ఇంటికి పంపించి భద్రతకు సంబంధించిన వివరాలు సేకరించాలని డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశించారు.
డీజీపీ ఆదేశాల మేరకు గురువారం (జూన్ 29) మేడ్చల్ డీసీపీ సందీప్, ఏసీపీ వెంకట్ రెడ్డి ఈటల ఇంటికి వెళ్లి అరగంటపాటు ఆయనతో మాట్లాడారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా ఈటల డీసీపీకి తెలిపారు. హుజురాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు వెళ్ళినపుడు అనుమానాస్పద కార్లు వెనక వస్తూ కనిపిస్తున్నాయని ఈటల వారికి చెప్పారు.
ఆ తర్వాత డీసీపీ ఈటల ఇంటి పరిసరాలను పరిశీలించి, అందుకు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో డీజీపీకి అందచేశారు. ఈ క్రమంలో ఈటలకు భద్రతను పెంచుతూ త్వరలోనే రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించే అవకాశాలున్నాయని అంటున్నారు.