కళకళ లాడుతున్న గాంధీ భవన్!
posted on Jun 29, 2023 @ 9:30AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి హైదరాబాద్ లోని గాంధీ భవన్ కళకళలాడుతూ కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి కూడా తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వలసెళ్లిపోయారు. తనకు రాష్ట్రంలో పోటీనే లేకుండా చేసుకొనే క్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ లోపం కూడా తోడై తెలంగాణలో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ పేలవమైన ఫలితాలతో కాంగ్రెస్ చతికిల పడింది. ఆ పార్టీ నేతలు కూడా చప్పబడ్డారు.
అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. అందులో కొంతమేర సక్సెసై పార్టీ క్యాడర్ తో పాటు నేతలను పెంచుకుంది. అయితే, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ నేతలలో కూడా మునుపెన్నడూ లేని విధంగా హుషారు కనిపిస్తున్నది. హైకమాండ్ కూడా అందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో నేతల చేరికలు మొదలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ టూ ఢిల్లీ కాంగ్రెస్ నేతల రాకపోకలూ పెరిగిపోయాయి. అదే సమయంలో వచ్చే నేతలు, పోయే నేతలు, సమావేశాలు, సంప్రదింపులతో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ బిజీబిజీగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలియదు కానీ ఇప్పుడైతే గాంధీ భవన్ కళకళలాడుతూ కనిపిస్తుంది.
కర్ణాటక ఫలితాలను అడ్వాంటేజ్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి ఇతర పార్టీల నుండి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించటమే కాకుండా కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీలో రాహుల్ గాంధి సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరటంతో పార్టీకి ఊపొచ్చినట్లయ్యింది. ఇదే ఊపులో మరికొందరిని పార్టీలోకి లాగేందుకు పార్టీ పెద్దలు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ప్రముఖ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
దీంతో ఎటు తిరిగీ ఉదయం నుండి సాయంత్రం వరకు నేతల రాకతో గాంధీ భవన్ సందడి సందడిగా కనిపిస్తున్నది. కారణం ఏదైనా కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నమ్మకం పెరిగింది. కర్ణాటకలో హిందూత్వ అజెండా అందుకున్న బీజేపీ ఓటమిని ఇక్కడ కూడా హైలెట్ చేయడం, అదే సమయంలో హామీల అమల్లో విఫలమైన కేసీఆర్ అనే అంశాలతో ఈసారి కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు.. గాంధీ భవన్ కు కొత్త కళ వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇదే టెంపోను రాష్ట్ర పార్టీ ఎన్నికల వరకు కొనసాగించగలరా? నేతల మధ్య ఆధిపత్య పోరు ఆగిపోతుందా? పాత నేతలు, కొత్త నేతల మధ్య సంఖ్యత కుదురుతుందా అన్నది చూడాల్సి ఉంది.