జనంపై స్పీకర్ శివాలు.. ఖర్మరా రాష్ట్రానికి!
జగన్ ఏ ముహూర్తాన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో కానీ అప్పటి నుంచీ వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి పరాభవాలు ఎదురయ్యాయి. వారి నిరసనాగ్రహాన్ని తట్టుకోలేక చాలా మంది ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. లేదా ఏదో చేశామన్నట్లుగా మమ అనిపించేశారు.
అయితే ఆ కార్యక్రమంపైనే ఆశలు పెట్టుకున్న జగన్ వర్క్ షాపులు పెట్టి, టికెట్టివ్వబోనని ఎమ్మెల్యేలనూ, పదవులు ఊడబెరికేస్తానని మంత్రులను హెచ్చరించి, బెదరించి మరీ వారిని జనం ముందుకు తోలారు. ఒక ఒక విధంగా బలవంతంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు తోశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఆ కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని చవిచేసి కొన్ని చోట్ల పారిపోతే, మరికొన్ని చోట్ల ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసి చులకన అయ్యారు. తాజాగా ఆ కోవలోకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేరారు. ఆ జాబితాలోకి మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చేరారు. వీరిరువురూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రజలపై విరుచుకుపడిన తీరును గమనించిన వారంతా ఇదేం ఖర్మరా బాబూ మన రాష్ట్రానికి అంటూ తలలు బాదుకుంటున్నారు.
పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ ప్రచారాలకు దూరంగా ఉండాల్సిన స్పీకర్ తమ్మినేని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏకంగా తనకు ఓటేయని వారు తనను ప్రశ్నించేందుకు అర్హత లేని వారేనని బాహాటంగా చెప్పేశారు. అంతే కాదు ఈ విషయం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పో అంటే ఓ మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ విలువలకూ, విధానాలకూ తిలోదకాలిచ్చేసినట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఇసుమంతైనా లెక్క చేయకుండా సంక్షేమ సొత్తు పందేరాలపైనే పూర్తి ఆశలు పెట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. అందుకు అనుగుణంగానే ప్రజా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదరింపులకు దిగడానికి కూడా వెనుకాడటం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పార్టీలు తమ అస్త్రాలను బయటకి తీస్తున్నారు. టీడీపీ పాదయాత్రలు, జనసేన వారాహి యాత్ర, వైసీపీ గడప గడపకి కార్యక్రమాలతో ప్రజలలోకి వెడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కార్యక్రమాలకు, యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే.. గడప గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రజల వద్దకు వెడుతున్న వైసీపీ నాయకులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చక పోగా,మంత్రులు, ఎమ్మెల్యేలు,వచ్చి హడావుడి చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఉపయోగపడే ఒక్క పనికూడా ప్రభుత్వం అమలు చేయలేదని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు , నవరత్నాలు,సంక్షేమ పథకాలు , ప్రజలకి ఉపయోగ పడే ఏఒక్క పనిని కూడా చేయలేదంటూ మండిపడుతున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ కు సొంత నియోజక వర్గం రామాసముద్రంలో నిరసన సెగలు తగిలాయి. రైతులకు ఇచ్చే ఉపకరణాలు పంపిణి జరిగాక, తిరిగి వెళ్తున్న క్రమంలో చేదు అనుభవ ఎదురైంది. ఏ మొకం పెట్టుకొని వచ్చారు అని మహిళలు చుట్టూ ముట్టారు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాక గ్రామంలోకి అడుగు పెట్టాలని, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ఊహించని పరిణామంతో కంగు తిన్న మంత్రి అక్కడనుండి జారుకున్నాడు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులే తమ జేబులు నింపుకున్నారని, ప్రజలకి వైసీపీ చేసిందేమి లేదని జనం నిర్బయంగా మంత్రుల ఎదుటే చెబుతుండటంతో వైసీపీ నేతలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్ల లేక.. జగన్ కు సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.