నాలుగేళ్ళ నరకం! వైసీపీపై తెలుగుదేశం పాశుపతాస్త్రం
ఏపీలో ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉన్నా రాజకీయాలు మాత్రం రోజురోజుకీ హీటెక్కుతుతూనే ఉన్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం ఆధిపత్యం కోసం కొత్త కొత్త స్ట్రాటజీలతో ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఎలాగూ ప్రతిపక్షాలకి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు బోలెడన్ని అంశాలు, అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో తులుగుదేశం ఇప్పటికే వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు, రాష్ట్రంలో పెరిగిన నేరాలపై తూర్పార పడుతూ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఓ కార్యక్రమంతో ముప్పు తిప్పలు పెట్టింది.
రాష్ట్రంలో ప్రతి దానిపై విధిస్తున్న పన్నులపై ప్రజలలో అవగాహనా కల్పించేలా బాదుడే బాదుడు అనే మరో కార్యక్రమాన్ని కూడా టీడీపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్నది. ఇప్పుడు దీనికి తోడుగా మొత్తం నాలుగేళ్ళ జగన్ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యకాండలను ప్రజలకు గుర్తు చేస్తూ జగన్ కు తగిన బుద్ది చెప్పేందుకు నాలుగేళ్ళ నరకం అనే మరో కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టింది.
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు 'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ తొలి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఇటీవల బాపట్ల జిల్లాలో బాలుడి హత్య, ఏలూరు జిల్లాలో మహిళపై జరిగిన దారుణం, అలాగే నెల్లూరు జిల్లాలో పట్టపగలు మహిళపై అత్యాచారం వంటి వాటితో పాటు, ఆయా ఘటనల్లో వైసీపీ నేతలు, ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన స్పందన వంటి వాటిని చూపించారు. ఇక, ఈ ప్రచార కార్యక్రమం 'నాలుగేళ్ళ నరకం'లో రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ.. నాలుగేళ్ళలో నలభై ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు.
జగన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడమే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం కాగా, దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో ఈ నాలుగేళ్ళ నరకం పేరుతో టీడీపీ గల్లీ నుండి పట్టణాలు, నగరాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపుతూ ముందుకు సాగనున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం తొలి నుండి లేవనెత్తుతున్న అంశం లా అండ్ ఆర్డర్. జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలు పరిధి దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచాయి ఇదే విషయంలో న్యాయస్థానాలతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిన్నది జగన్ సర్కార్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం కోర్టు బోనులలో నిలబడి న్యాయమూర్తుల చేత చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇక, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వారిని మతి స్థిమితం లేని పిచ్చి వారిని చేసిన వైనాలు కూడా రాష్ట్ర ప్రజలు చూశారు.
దీంతో పాటు వైసీపీ నేతల ఆగడాలు, ఇసుక నుండి మట్టి వరకు యథేచ్ఛగా జరిగిన దోపిడీ, కొండలను సైతం పిండిచేసి అమ్ముకోవడం ఇలా ఒక్కటేమిటీ చెప్పుకుంటూ పోతే మరో నాలుగేళ్లు కావాలేమో. ఇలాంటి వాటన్నిటినీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తూ జగన్ నాలుగేళ్లు ప్రజలకు ఎలా నరకం చూపించారో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం సమరశంఖం ఊదడంతో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. మరి ఈ కార్యక్రమంపై అటునుంచి అంటే వైసీపీ నుంచి స్పందన ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.