ప్రజలకు మంత్రి ధర్మాన వార్నింగ్
posted on Jun 29, 2023 @ 2:50PM
పాపం వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరినట్లుంది. లేకపోతే మళ్ళీ తమని గెలిపించకపోతే అంటూ ఏకంగా ప్రజలకే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. తాము ప్రజల కోసం చాలానే చేశామని చెప్పుకుంటున్న వైసీపీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షాలు ఎండగట్టే వాటికి సమాధానం చెప్పుకోలేక ఇలా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే పని మొదలు పెట్టినట్లున్నారు. అది కూడా ఏ గల్లీ లీడరో.. కొత్తగా వచ్చిన తెలిసీ తెలియని ఎమ్మెల్యేనో కాదు ఏకంగా ఉత్తరాంధ్రకే సీనియర్ లీడర్, సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. వీళ్ళ అసహనం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన ప్రజలకు ఇలాంటి హెచ్చరిక చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ధర్మాన ఇంటింటికీ వెళ్లారు. అయితే.. ఈ సందర్భంగా కొందరు స్థానిక సమస్యలు ప్రస్తావించారు. దీంతో మంత్రి ధర్మానకి కోపమొచ్చింది. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఇంకా ఏదో రాలేదని, మాకు అది రాలేదు ఇది రాలేదని ఎందుకు అడుగుతున్నారని వారిని నిలదీశారు. ఏవో చిన్న చిన్న కారణాలలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవకపోతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. తనను ప్రశ్నించిన ప్రజలకు ఒక రకంగా క్లాస్ పీకిన ధర్మాన.. మళ్లీ వైసీపీని గెలిపించకపోయారో అంటూ మొదలు పెట్టి మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఆ మాటతోనే ఆపేశారు. దీంతో ఆయన చేసిన ఈ హెచ్చరికలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అలాగే ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రికి అక్కడ కూడా అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో అసలు మీ ప్రాంతంలో చాలా మంది తనకి ఓటు వేయలేదని.. అయినా దయతలచి లక్షల రూపాయలు వెచ్చించి పనులు చేస్తున్నానని.. అలాంటి సమయంలో మీకు ప్రశ్నించే హక్కే లేదని తేల్చేశారు. తన నియోజకవర్గం పరిధిలోని పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేటల్లో తనకు మెజార్టీ రాలేదని.. అందుకే అభివృద్ధి పనులు చేయమని అడిగే హక్కు ఇక్కడి ప్రజలకు లేదన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ నేతలు.. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని మంత్రి ప్రజలను ప్రశ్నించారు. కొందరు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకుని కూడా టీడీపీకి ఓటు వేస్తామని చెబుతున్నారని.. ఇది సరికాదని, అది మీకే మంచిది కాదన్నారు.
ఒక్క ధర్మాన మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వైసీపీ నేతలది ఇలాంటి పరిస్థితే. గడపగడపకు వెళ్తున్న నేతలకు ప్రజల నుండి ప్రశ్నలే ఎదురువుతుండగా.. నేతలలో సహనం నశించి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. మీకు సంక్షేమం అందిందా లేదా అని ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో కూడా వచ్చేదే ఇప్పుడు కూడా వస్తుందని.. కానీ తమ ప్రాంతంలో అభివృద్ధి ఏదని నేతలను నిలదీస్తున్నారు. తమ గ్రామంలో, తమ కాలనీలో చేసిన ఒక్క అభివృద్ధి గురించి చెప్పాలని ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు నేతలు భయపడి ఏదో తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. మరికొందరు ఇలా ప్రజలనే బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. అసలే ఎన్నికల కాలం.. వాళ్ళ కాళ్ళు, గడ్డాలు పట్టుకుంటేనే పనికాని రోజులు. ఇలాంటి సమయంలో వాళ్లనే బెదిరిస్తే ఊరికే ఉంటారా! మరి వైసీపీ నేతలు ఈ లాజిక్ ఎలా మర్చిపోతున్నారో!