ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో బొప్పాయి, పైనాపిల్ తింటే అబార్షన్ ఎందుకు అవుతుందో తెలుసా!

ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో బొప్పాయి, పైనాపిల్ తింటే అబార్షన్ ఎందుకు అవుతుందో తెలుసా! గర్భం దాల్చడం అనేది వివాహం అయిన ప్రతి మహిళ కల.  తల్లిని కావాలని, మాతృత్వాన్ని ఆస్వాదించాలని మహిళలు ఎన్నో కలలు కంటారు. గర్బం దాల్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మహిళలు గర్బం దాల్చిన తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని చెబుతుంటారు. వాటిలో బొప్పాయి,  పైనాపిల్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా గర్బం దాల్చిన మొదటి నెలల్లో పైనాపిల్, బొప్పాయి తినకూడదని, ఒకవేళ అవి తింటే అబార్షన్ లు అవుతాయని చెబుతారు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి వివరంగా తెలుుకుంటే.. బొప్పాయి ఇలా ఉంటే తినకూడదు.. పచ్చిగా లేదా సగం పండిన బొప్పాయి తినడం మంచిది కాదు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్ , పాపైన్ వంటి సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. కొన్ని పరిశోధనలు , ప్రయోగశాల అధ్యయనాలు ఈ సమ్మేళనాలు గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తాయని ఫలితాలు ఇచ్చాయి.  ఈ కారణంగా  గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి, లేదా సగం పండిన బొప్పాయి ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ సమ్మేళనాలు గర్భాశయ సంకోచాలను పెంచుతాయని చెబుతారు, అందువల్ల, గర్భం దాల్చిన తొలినాళ్లలో పచ్చి బొప్పాయిని తినకుండా ఉండమని సలహా ఇస్తారు. ఈ కారణంగానే పచ్చి లేదా ఆకుపచ్చ బొప్పాయిని గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదని చెబుతారు. పండిన బొప్పాయి.. పూర్తిగా పండిన బొప్పాయి భిన్నంగా ఉంటుంది. పండిన బొప్పాయిలో పాలు (లేటెక్స్) గణనీయంగా తగ్గి ఉంటాయి , ఇందులో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందువల్ల, గర్భిణీ స్త్రీలు పండిన బొప్పాయిని మితంగా తీసుకోవడం ప్రమాదకరం కాదని కొంతమంది నిపుణులు చెబుతారు. అయితే వీటి గురించి పరిశోధకులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు  అందుకే పండిన బొప్పాయి అయినా చాలా మితంగా తీసుకోవడం మంచిదని చెబుతారు. పైనాపిల్.. పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుందనే మాటలు  తరచుగా చెబుతుంటారు. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ దీనికి కారణం. ఇది గర్భాశయ ముఖద్వారాన్ని మృదువుగా చేసి, గర్భాశయంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అయితే, మితమైన మోతాదులో పైనాపిల్ తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని అధిక మోతాదులో తీసుకున్నప్పుడు లేదా శరీరం ఇప్పటికే సెన్సిటివ్ గా ఉన్నప్పుడు  సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. అందుకే గర్భధారణ తొలినాళ్లలో బొప్పాయి, పైనాపిల్‌లను తినకూడదని, వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెబుతారు.  ముఖ్యంగా మహిళలకు గర్బం విషయంలో ప్రమాదాలు ఉన్నా,   గతంలో గర్భస్రావం జరిగి ఉన్నా, రక్తస్రావ సమస్యలు ఉన్నా ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించమని డాక్టర్ సలహా ఇస్తారు. ముఖ్యంగా పండ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోమని చెబుతున్నారు.                           *రూపశ్రీ.

నెలసరి సమయంలో మహిళలు ఈ ఆహారాలు తినకూడదట!

నెలసరి సమయంలో మహిళలు ఈ ఆహారాలు తినకూడదట! మహిళలకు తప్పనిసరిగా ప్రతి నెల నెలసరి వస్తుంది.  నెలసరి సమయంలో మహిళల శరీరంలో  హార్మోన్ల మార్పులు చాలా వేగంగా జరుగుతాయి, ఇవి వారి మానసిక స్థితి, శక్తి , జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, తిమ్మిర్లు, అలసట , చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. నెలసరి సమయంలో ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలియక చాలామంది మహిళలు చాలా గందరగోళానికి గురవుతూ ఉంటారు.  సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల నొప్పి, అసౌకర్యం పెరగడమే కాకుండా, వాపు , నీరసం కూడా కలుగుతాయి. అందుకే నెలసరి సమయంలో ఏ ఆహారాలు తినాలనే విషయం కంటే.. ఏ ఆహారాలు తినకూడదు అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.  నెలసరి సమయంలో మహిళలు తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. ఉప్పు.. నెలసరి సమయంలో అధిక ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరం, ఒళ్ళు బరువుగా అనిపించడం, వాపు వంటి సమస్యలు పెరగవచ్చు. చిప్స్, నూనెలో వేయించిన ఆహారాలు, , ప్యాక్ చేసిన ఆహారాలు , ప్రాసెస్ చేసిన స్నాక్స్‌లో ఉప్పు అధిక మొత్తంలో ఉంటుంది, అందువల్ల వాటిని తినకపోవడం మంచిది.  నెలసరి సమయంలో తేలికగా , సౌకర్యవంతంగా ఉండాలనుకుంటే, ఉప్పు తక్కువగా ఉండే సమతుల్య ఆహారం తినడం చాలా మంచిది. కెఫీన్.. టీ, కాఫీ, కోల్డ్ కాఫీ , ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్, కొంతమంది మహిళల్లో నెలసరి సమయంలో అసౌకర్యాన్ని పెంచుతుంది.  కెఫీన్‌ను  తీసుకోవడం వల్ల శరీరంలో చంచలత్వం, చిరాకు , నిద్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి.  ఇది కొంతమంది మహిళల్లో కడుపు నొప్పి , తలనొప్పిని కూడా పెంచుతుంది. నెలసరి సమయంలో కెఫిన్ తీసుకోవడం తగ్గించి, దానికి బదులుగా నీరు, కొబ్బరి నీరు లేదా హెర్బల్ పానీయాలు తీసుకోవడం మంచిది. వేయించిన ఆహారాలు.. ఫాస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ , ఇతర వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగించి, గ్యాస్, అజీర్ణం లేదా కడుపులో భారంగా అనిపించడం వంటి వాటికి కారణమవుతాయి. నెలసరి సమయంలో శరీరం ఇప్పటికే అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతూ ఉంటుంది, అటువంటి పరిస్థితిలో జంక్ ఫుడ్‌ను  తీసుకోవడం వల్ల కడుపు నొప్పి , అసౌకర్యం పెరగవచ్చు. తీపి పదార్థాలు.. నెలసరి సమయంలో తీపి పదార్థాలు తినాలనే కోరిక చాలా మందికి పెరుగుతుంది. కానీ చక్కెరను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధికంగా చక్కెర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, దీనివల్ల మానసిక స్థితిలో మార్పులు, అలసట , నీరసం వంటివి కలగవచ్చు. అధిక చక్కెర శరీరంలో వాపును కూడా పెంచుతుంది.  నెలసరిలో తీపి తినాలనిపిస్తే, తాజా పండ్లు, ఖర్జూరాలు లేదా డార్క్ చాక్లెట్ వంటి వాటిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. కార్బోనేటెడ్ పానీయాలు.. శీతల పానీయాలు , ఇతర కార్బోనేటెడ్ పానీయాలలో గ్యాస్ , అదనపు చక్కెర అధికంగా ఉంటాయి. నెలసరి సమయంలో వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం , అసౌకర్యం పెరగవచ్చు. చాలా సార్లు ఈ పానీయాలు శరీరానికి తగినంత నీటిని అందించలేవు. ఈ సమయంలో శీతల పానీయాలకు బదులుగా సాదా నీరు, నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా తాజా పండ్ల రసం తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.                                         *రూపశ్రీ..

నెయ్యి కలిపిన పాలు తాగితే.. సాధారణ ప్రసవం జరుగుతుందా? డాక్టర్ చెప్పిన నిజం ఇదే!

నెయ్యి కలిపిన పాలు తాగితే.. సాధారణ ప్రసవం జరుగుతుందా? డాక్టర్ చెప్పిన నిజం ఇదే! గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రసవం కోసం చాలా రకరకాల టిప్స్ పాలో అవుతూ ఉంటారు.  ఎంతో మంది మహిళలు సాధారణ ప్రసవం కోసం ఎంతో ట్రై చేస్తుంటారు. సిజేరియన్ లు పెద్ద ఆప్షన్ గా మారిన  ఈ కాలంలో కూడా చాలామంది మహిళలు నార్మల్ డెలివరీ కావాలని అడుగుతూ ఉంటారు. అయితే నార్మల్ డెలివరీ కూడా మరింత సులువుగా, సుఖంగా గడవాలని కూడా అనుకుంటారు. సుఖంగా, సులభంగా నార్మల్ డెలివరీ కావాలని కోరుకునేవారు పాటించే  ఎన్నో సలహాలలో ఒకటి నెయ్యి కలిపిన పాలు తాగడం. ఇది సాధారణ ప్రసవానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. అయితే  దీని గురించి వైద్యులు చాలా షాకింగ్ నిజం చెప్పారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పాలలో నెయ్యి  కలుపుకుని తాగడం వల్ల సాధారణ ప్రసవం జరుగుతుందన్న మాట అపోహ అని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయ కండరాల సంకోచానికి ఖర్జూరాలు, నెయ్యి కలిపిన పాలు ఖచ్చితంగా సహాయపడతాయి. కానీ సాధారణ ప్రసవానికి కణజాలాలు, కండరాలే కారణం. గర్భాశయం ఆరోగ్యంగా ఉండి, కండరాలు మృదువుగా, తెరుచుకుని ఉంటే, అది దానంతట అదే జరిగిపోతుంది. ఆ తర్వాత శారీరక శ్రమ కూడా పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  యోగా, నడక వంటి శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాలు చేస్తే  కండరాలు సాధారణ ప్రసవానికి, గర్భాశయం తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాయని అంటున్నారు. నార్మల్ డెలివరీ గురించి అసలు నిజం.. ఖర్జూరాలు మెగ్నీషియం, ఐరన్ మరియు పొటాషియంను అందించి, ప్రయోజనకరంగా ఉంటాయి. పరిమిత పరిమాణంలో నెయ్యి , పాలు తీసుకుంటే  మహిళలకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను , శక్తిని అందించి, సాధారణ ప్రసవం కోసం సహాయపడతాయి . అందుకే  సాధారణ ప్రసవం కావాలంటే, పాలలో నెయ్యి కలుపుకుని తాగడం, ఖర్జూరాలు తినడం వంటివి మంచివే.. కానీ చురుకుగా ఉండటం అన్నింటి కంటే ఎక్కువ ముఖ్యం.శరీరం చురుగ్గా ఉండాలి,  తేలికపాటి వ్యాయామం,  వాకింగ్ వంటివి తప్పని సరిగా చేయాలి. ఇవి మాత్రమే కాకుండా.. నార్మల్ డెలివరీ అనేది  మహిళ శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది.                                 *రూపశ్రీ.

తీపి దగ్గర తడబడుతున్నారా!

తీపి దగ్గర తడబడుతున్నారా! అమ్మాయిలకు స్వీట్స్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఇంకా తీపి పదార్థాలు అంటే చెప్పలేనంత ఇష్టం. మరీ ముఖ్యంగా బయటకు ఎక్కడికైనా వెళితే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుక చేసుకుంటే తీపి పదార్థాల వల్ల కలిగే ఇబ్బందుల గురించి మనసులో ఒకవైపు భయం ఉన్నా వాటిని వదల్లేక తినేస్తుంటారు.  అయితే ఇలా తీపి పదార్థాలను తినడం అనేది సాధారణమైన అలవాటు కాదని. దీని వెనుక కారణం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తీపి పదార్థాలు తినాలని అనిపించడం వెనుక కారణం అనే మాట వినగానే చాలామంది షాక్ కు గురవుతారు కచ్చితంగా. అయితే దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమి లేదు. తీపి పదార్థాలు తినాలని అనిపించడానికి గల కారణాలు తెలుసుకుంటే తీపి వల్ల కలిగే అన్ని రకాల సమస్యలనూ పరిష్కరించుకోవచ్చు. తీపి తినాలని అనిపించడానికి కారణాలు!! ◆ ఒత్తిడికి లోనవడం తీపి తినడానికి కారణం అవుతుంది అనే మాట ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ ఇది నిజమని తెలిసింది. ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగానే శరీరానికి నిస్సత్తువ ఆవరించినట్టు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తెలియకుండానే ఏదైనా తీపి తినాలని అనిపిస్తుంది. అలా అనిపించగానే మహిళలు ఇంట్లోనూ, బయట పనిచేసేచోటా తీపి కోసం చాక్లెట్ ల మీదా బయట అమ్మే తీపి పదార్థాల మీద ఆధారపడతారు. ◆ చాలామంది మహిళలను వేధించే సమస్యలలో నిద్రలేమి ముఖ్యమైనది. నిద్రలేమి ఉన్నవారికి శరీరంలో కలిగే హార్మోన్స్ ప్రభావం వలన తీపి తినాలని అనిపిస్తుంది. ◆ అలసట అనేది మనిషిలో అంతర్లీనంగా భాగమైపోయి కనిపించే సమస్య. చాలామంది అలసటను గురైనప్పుడు చాక్లెట్ నోట్లో వేసుకోగానే ఎనర్జీ వచ్చినట్టు ఫీలవతారు. ఆ కారణంతో చాక్లెట్ లకు స్వీట్ లకు అలవాటు పడితే వాటికి ఆడిక్ట్ అయిపోతారు. ◆ శారీరక శ్రమ లేనివాళ్ళలో స్వీట్లంటే ఎక్కువ ఇష్టం ఉంటుందట. శరీరంలో ఏర్పడ్డ మార్పులు దీనికి కారణమవుతాయి. శారీరక శ్రమ లేనప్పుడు సహజంగానే మనుషులు మహా బద్ధకంగా కనిపిస్తుంటారు. వారికి స్వీట్లు, చాక్లెట్లు అంటే చెప్పలేని మక్కువ ఏర్పడుతుంది. ◆ శరీరంలో తగినంత నీతి శాతం లేకపోయినప్పుడు కూడా తీపి మీదకు మనసు మల్లుతుందట. బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు తీపి తినాలని అనిపించినా సందర్భాలు గుర్తుచేసుకుంటే ఇది నిజమేనని అనిపిస్తుంది. నోరు తడి ఆరిపోవడం తీపి తినాలని అనిపించడం గమనించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టాలి ఇలా…. తీపి తినాలని అనిపించినప్పుడు ఎక్కువ చెక్కెరలు కలిగిన పదార్థాలను టచ్ చేయకూడదు. తీపిని కంట్రోల్ లో పెట్టాలంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి. ◆ తీపి తినాలని అనిపించినప్పుడు చాక్లెట్ లు తినడం చాలామంది అలవాటు.  డార్క్ చాక్లెట్ లు పెద్ద పెద్దవి కొనుక్కుని లాగిస్తారు. అలా చేస్తే చాలా మొత్తంలో కేలరీలు పొట్టలోకి చాలా సులువుగా వెళ్లిపోతాయి. పైపెచ్చు అంత పెద్ద చాక్లెట్ లు ప్రతిసారి కొనడం అంటే కష్టమే. అందుకే చిన్న చిన్న చాక్లెట్  లేదా పెద్ద చాక్లెట్ లో చిన్న ముక్కలు ఒక రెండు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కాసింత ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ◆ తీపి అంటే స్వీట్లు, చాక్లెట్లు మాత్రమే కాదు. తీపిని ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి. చిలగడ దుంప, స్వీట్ కార్న్ మొదలైన వాటిలో తీపిదనం బానే ఉంది. కాబట్టి తీపి తినాలని అనిపించినప్పుడు వాటిని తీసుకోవచ్చు. ◆ తీపికి కేరాఫ్ అడ్రస్ గా డ్రై ఫ్రూట్స్ ని పేర్కొనవచ్చు. కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ మొదలైన ఎండు ఫలాలలో తీపిదనం ఎక్కువ కాబట్టి తీసుకోవచ్చు. ◆ అన్నిటికంటే ఉత్తమమైనవి ఆరోగ్యమైనవి సహజమైన పండ్లు. అరటి, బొప్పాయి, దానిమ్మ, ఆరెంజ్, సపోటా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండు తీపిదనాన్ని నింపుకున్నదే. కాబట్టి తీపి కోసం మనసు కొట్టుకుంటున్నప్పుడు హాయిగా పండ్లను తీసుకోవచ్చు. ◆ తీపికి మరొక ఆప్షన్ తేనె, బెల్లం. తీపి తినాలని అనిపించినప్పుడు టీ స్పూన్ తేనె లేదా ఓ ముక్క బెల్లం నోట్లో వేసుకుంటే మంచిది. అమ్మో తీపి తినాలని అనిపిస్తుంది. తింటే లావైపోతాం. అనే సందేహాలు పెట్టుకోకుండా పైన చెప్పుకున్న ప్రత్యామ్నాయాలు ఫాలో అయితే సమస్యే ఉండదు.                                     ◆నిశ్శబ్ద.

శరీరం ఏమి చెబుతుందో వింటున్నారా!

శరీరం ఏమి చెబుతుందో వింటున్నారా? గమనించాలే కానీ మన చుట్టూ ఉండే ప్రతిదీ ఏదో ఒకటి వ్యక్తం చేస్తూనే ఉంటాయి. నేటి గజిబిజి జీవితంలో మనం ఏవీ పరిశీలనగా చూడం. మన చుట్టూ ఉండే చెట్టు, పుట్టా, వస్తువులు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి.. ఇలా అన్ని ఏదో ఒకటి చెబుతున్నట్టే అనిపిస్తాయి. మరి అన్నీ ఎన్నో చెబుతున్నట్టు అనిపించినప్పుడు మన శరీరం మనతో ఏమీ చెప్పకుండా ఉంటుందా?? శరీరం మాట్లాడుతుందా ఏంటి?? అని ప్రశ్న వేస్తారు చాలామంది. అయితే శరీరానికి కూడా భాష ఉంటుంది, శరీరానికి బాధ ఉన్నట్టే.. ఆ భాష కూడా కొన్ని నిర్ధిష్ట వ్యక్తీకరణలు కలిగి ఉంటుంది. శరీర భాషను అర్థం చేసుకున్నవారు శరీరాన్ని చక్కగా మార్చుకోగలరు. ముఖ్యంగా మహిళల్లో దశల వారిగా శారీరకంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లి, తల్లి కావడం అనేవి శారీరకంగా ఊహించని మార్పులకు కారణం అవుతాయి. ఇలా శారీరకంగా జరుగుతున్న మార్పులతో సమన్వయం అయితే వాటితో కలసి తమను తాము మార్చుకుంటే… కనీసం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే..  నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టు, శరీరం కూడా ఎన్ని దశలు దాటినా వాటికి తగ్గట్టు తాను మారుతూ శరీరాన్ని మాత్రం దృఢంగా.. అందంగా ఉంటుంది. మార్పు.. చేర్పు.. ఒక మార్పుకు సన్నద్ధం అవడం అంటే చేర్పుకు సిద్ధమవడమే.. ఉదాహరణకు పెళ్ళైన అమ్మాయిలు గర్భవతులయ్యి బిడ్డను మోయడం మొదలుపెట్టాక దానికి తగ్గట్టు ఆహారం నుండి ఎన్నో విషయాలలో మారతారు. కొన్ని ఇష్టాలు దూరం పెడతారు, మరికొన్ని ఇష్టం లేకపోయినా అలవాటు చేసుకుని ఇష్టంగా మార్చుకుంటారు. అయితే అదంతా కడుపులో బిడ్డ మీద ఉన్న ప్రేమతో చేస్తారు. అదే సాధారణంగా డెలివరీ తరువాత లావైతే… ఆ లావు తగ్గకపోతే… చాలా మంది చెప్పేమాట ఏముంది పెళ్ళై బిడ్డ కూడా అయింది. ఈ మాత్రం ఉండరా ఏంటి?? అందరూ ఇలా కామెంట్ చేసేవాళ్లే కానీ ప్రెగ్నెన్సీ, డెలివరీ వల్లే ఇలా అయ్యాను అని ఎవరూ అర్థం చేసుకోరు.. వంటి మాటలు చెబుతారు. అయితే ఒకరు ఏదో అనుకోవడం, ఆ ఇంకొకరికి సంజాయిషీ చెప్పడం ఇవన్నీ కాదు ముఖ్యం. మన శరీరాన్ని మనం ఎంత ఫిట్ గా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అందుకే చక్కని ఆహారం, తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి అందేలా తీసుకోవాలి. తక్కువ మొత్తాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేవడం, కాసింత యోగా, ధ్యానం, మనసును ఆహ్లాదపరిచే పనులు చేయడం ఇవన్నీ చేస్తుంటే మనసు ఉల్లాసంగా మారి సహజంగానే శరీరం కాస్త తేలికపడిన భావన అనిపిస్తుంది. ప్రేమించడం.. ప్రేమ చాలా గొప్పది. అది అనిర్వచనీయమైన భావాన్ని వ్యక్తం చేసే గొప్ప మార్గం. అయితే ఎవరో బయటి వాళ్ళను, వస్తువులను, సినిమా తారలను ఇలా వీళ్లను కాకుండా మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. మన శరీరంలో ఎంతో గొప్ప అవయవాలు ఉన్నాయి. గుండెకు ఏదైనా సమస్య వస్తే అది ఎన్ని లక్షలు పెట్టినా దొరకడం కష్టం కిడ్నీలు ఫెయిల్ అయితే జీవితానికి అనుక్షణం గండం ఊపిరితిత్తులు చెడిపోతే ప్రాణం ఆనంతవాయువుల్లో కలిసిపోతాయి కళ్ళకు  ఏమైనా అయితే ప్రపంచమే చీకటి వినికిడి లేకపోతే ఎంతో గొప్పవైన శబ్దాలను వినలేక ఎప్పుడూ నిశ్శబ్దలోకంలో ఉండిపోతారు. ఇలా ఒకటా రెండా… మన శరీరంలో ఎంతో అమూల్యమైన అవయవాలు ఉన్నాయి. మరి ఇంతకంటే గొప్ప వస్తువు ఎక్కడైనా ఉంటుందా?? చేతిలో పట్టుకునే బొడి 20వేల ఫోన్ గురించి ఆలోచించి స్క్రీన్ గార్డ్, బాక్ కవర్ అన్నీ వేయించి జాగ్రత్త పెట్టుకునే మనం శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా.. అందుకే శరీరాన్ని ప్రేమించుకోవాలి. మనల్ని ఈ శరీరం ఎంతో కాలంపాటు మోస్తుంది. ఎప్పటికప్పుడు శరీర అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి. దృఢంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. పాజిటివ్ మైండ్.. పాజిటివ్ మైండ్ అనేది మనిషిని ఎలాంటి పరిస్థితులలో అయినా పర్ఫెక్ట్ గా, బ్యాలెన్స్ గా ఉండేలా చేస్తుంది. ఏది జరిగినా మన మంచికే అనే పెద్దలు చెప్పిన మాట నిజమే.. కొన్ని సంఘటనలు, సందర్భాలు మనకు తెలియకుండా జరుగుతూ.. చెప్పకుండా వస్తుంటాయి. అలాంటి వాటి విషయంలో పాజిటివ్ మైండ్ ఉండటం ఎంతో అవసరం. ఒక పెద్ద గీత పక్కన దాని కంటే పెద్ద గీత గీసి మీదట గీసిన గీతను చిన్నగా చేయచ్చు. అలాగే మనకున్న సమస్యను ఎప్పుడూ మనకంటే సమస్యలు ఎక్కువ ఉన్న వారితో కంపెర్ చేసుకుని మనకే నయం కదా అన్న తృప్తిని మనలోకి ఒంపుకోవాలి.  మనిషి ఎప్పుడైతే ఏదైనా విషయానికి పాజిటివ్ గా ఉంటాడో అప్పుడు అతని చుట్టూ పాజిటివ్ ప్రపంచం మెల్లగా నిర్మాణమవడం మొదలు పెడుతుంది. ఆ పాజిటివ్ అనేది మనిషికి చెప్పలేనంత శక్తిని అందిస్తుంది. కాబట్టి పాజిటివ్ గా ఉండటం ఎంతో ముఖ్యం. మనం పాజిటివ్ గా ఉంటే మన శరీరం కూడా మనం చెప్పినట్టు వింటుంది. చెప్పినదానికి  స్పందిస్తుంది. కాబట్టి మనిషి శరీరం ఏమి చెబుతుందో అర్థం చేసుకోవాలి. దానితో సంభాషించాలి, దాన్ని ప్రేమించాలి. అప్పుడు శరీరం కూడా మనకు తగ్గట్టు స్పందిస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

మండే ఎండలో శరీరాన్ని చల్లగా ఉంచే రోజ్ సిరప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేస్కోవచ్చు!

మండే ఎండలో శరీరాన్ని చల్లగా ఉంచే రోజ్ సిరప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేస్కోవచ్చు! వేసవిలో మండే ఎండ, చెమట అందరినీ అలసిపోయేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో అలసట, నీరసం చాలా ఎక్కువగా ఉంటాయి.  వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది వివిధ రకాల డ్రింక్స్ తాగడానికి మొగ్గు చూపుతారు.  వెంటనే శరీరాన్ని చల్లబరిచి, శరీరానికి ఎనర్జీ ఇచ్చే పానీయాలు తాగాలని అనుకుంటారు. అయితే.. బయట తాగే పానీయాలలో అయినా, ఇంట్లో తయారు చేసుకోవాల్సి వచ్చినా వేసవిలో చాలా మంది రోజ్ సిరప్ ను  వాడుతుంటారు.  మార్కెట్లో దొరికే రోజ్ సిరప్ తెచ్చి ఇంట్లో వివిధ పానీయాలు తయారు చేసుకోవడం కంటే.. ఇంట్లోనే రోజ్ సిరప్ కూడా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బు కూడా చాలా ఆదా  అవుతుంది.  ఇంట్లోనే రోజ్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. రోజ్ సిరప్ తయారీకి కావలసిన పదార్థాలు.. గులాబీ రేకులు.. నాటీ గులాబీ రేకులు 2కప్పులు.. బాగా కడగాలి. చక్కెర  1.5 కప్పులు నీరు.. 2 కప్పులు నిమ్మరసం.. 1టేబుల్ స్పూన్ యాలకుల పొడి.. సవానన కోసం 1/2 స్పూన్ బీట్ రూట్ రసం.. 1 లేదా 2 స్పూన్లు. రోజ్ సిరప్ తయారీ విధానం.. స్టెప్ 1.. ముందుగా నాటీ గులాబీ రేకులను వాటిపై ఉన్న మురికి, మలినాలు పోయేలా  2-3 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. హైబ్రిడ్ గులాబీల కంటే నాటీ గులాబీలనే ఉపయోగించడం మంచిది., ఎందుకంటే వాటికి మంచి ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది. ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు పోసి, కడిగిన గులాబీ రేకులను వేయాలి. దీనిని 5-7 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి.  గులాబీ రంగు నీటిలో పూర్తిగా ఇంకిపోయి, గులాబీ రేకులు లేత తెలుపు రంగులోకి  కనిపించినప్పుడు, మంటను ఆపివేయాలి.  మరిగించిన నీటిని స్ట్రైనర్  ద్వారా వడకట్టాలి. గులాబీ  సువాసనగల సహజమైన రోజ్ వాటర్ బేస్ సిద్ధమైనట్టే. స్టెప్ 2.. మరొక లోతైన బాణలిలో 1 కప్పు నీరు,  1.5 కప్పుల చక్కెర వేయాలి. చక్కెర పూర్తిగా కరిగే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. అది కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి. తీగపాకంలా చిక్కబడకుండా చూసుకోవాలి.  కేవలం కొద్దిగా జిగురుగా ఉండాలి. ముందే తయారు  చేసుకున్న గులాబీ నీటిని వేడి పాకంలో పోయాలి. సువాసన కోసం యాలకుల పొడిని,  ఎరుపు రంగు బాగా కనిపించడం  కోసం బీట్‌రూట్ రసాన్ని కూడా కలపాలి అన్నీ బాగా కలవడానికి దీనిని మరో 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మంట ఆపి పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా అయ్యాక, నిమ్మరసం వేసి బాగా కలపాలి.  నిమ్మరసం వేయడం వల్ల చక్కెర స్పటికాలుగా మారకుండా సిరప్ లాగా ఉంటుంది. కాబట్టి నిమ్మరసం తప్పకుండా వేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత స్వచ్ఛమైన గులాబీ సిరప్ సిద్ధమైనట్టే. దీనిని ఒక శుభ్రమైన గాజు సీసాలో లేదా జాడీలో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఈ సిరప్ నెలల తరబడి నిల్వ ఉంటుంది. ఉపయోగించే విధానం.. పైన తయారు చేసుకున్న రోజ్ సిరప్ ను ఫలూదా,  లస్సీ, మొహబ్బత్ కా షర్బత్  వంటి పానీయాలలోనే కాకుండా,  కేక్ టాపింగ్ డెకరేషన్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు.                               *రూపశ్రీ.

మహిళలు తమ ఆహారంలో ఈ పదార్థాలు అస్సలు మిస్ కాకూడదు!

మహిళలు తమ ఆహారంలో ఈ పదార్థాలు అస్సలు మిస్ కాకూడదు! మగవారితో పోలిస్తే మహిళల శరీరం చాలా విభిన్నం, అలాగే ప్రత్యేకం.  మహిళల శరీరం ప్రతి దశలో చాలా మార్పులకు లోనవుతుంది. ఈ కారణంగా ప్రతి దశలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరానికి కావలసిన పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే  మహిళలు ప్రతి వయస్సులోనూ తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన పోషణ శక్తి స్థాయిలను కాపాడటమే కాకుండా, హార్మోన్ల సమతుల్యతను, ఎముకల బలాన్ని, చర్మం,  జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.  ఈ కారణం వల్ల మహిళలు సరైన ఆహారాలను ఎంచుకోవడం మహిళల ఆరోగ్యానికి ఎంతో అవసరం.  మహిళలు ఏ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అది వారికి చేసే మేలు ఏమిటి? పూర్తీగా తెలుసుకుంటే.. ప్రోటీన్.. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది మాంసం, పప్పుధాన్యాలు, గుడ్లు , చీజ్‌లో లభిస్తుంది. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి సహాయపడి, శక్తిని అందిస్తుంది. మహిళలు తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల బలాన్ని కాపాడుకోవడంతో పాటు అలసట కూడా తగ్గుతుంది. విటమిన్-డి.. ఎముకలకు , రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి చాలా అవసరం. ఇది పాలు, జున్ను, పుట్టగొడుగులు  వంటి ఆహారాలలో మాత్రమే కాకుండా.. నేరుగా ఉదయం ఎండలో కాసేపు గడవడం వల్ల కూడా  లభిస్తుంది. తగినంత విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి , శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్-సి.. విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది నారింజ, కివీ , స్ట్రాబెర్రీ వంటి నిమ్మ జాతి పండ్లలో లభిస్తుంది. విటమిన్ సి ని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు , చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఐరన్.. రక్తం ఏర్పడటానికి , శరీరంలో శక్తిని నిలుపుకోవడానికి ఐరన్ చాలా అవసరం. ఇది పాలకూర, చిక్కుడు కాయలు, బీన్స్ ,  రాగులు, మునగాకు వంటి వాటిలో  లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత , అలసట వంటి సమస్యలను నివారించడానికి ఐరన్ అవసరం. కాల్షియం.. ఎముకలు , దంతాలను బలంగా ఉంచడానికి కాల్షియం సహాయపడుతుంది. ఇది పాలు, పెరుగు, జున్ను , బాదంపప్పు వంటి వాటిలో లభిస్తుంది. తగినంత కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి , వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపొరోసిస్‌ను నివారించవచ్చు. ఫైబర్.. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి ఫైబర్ సహాయపడుతుంది. ఇది ఓట్స్, బ్రౌన్ రైస్, పండ్లు , కూరగాయలలో లభిస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం , జీర్ణ సమస్యలు తగ్గుతాయి , ఎక్కువసేపు నిలిచే శక్తి లభిస్తుంది. పైన పేర్కొన్న పదార్థాలను  మహిళలు తమ ఆహారంలో ఉండేలా తప్పక చూసుకోవాలి.                                  *రూపశ్రీ.

డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు పీరియడ్స్ రావాలి.. ఎంత కాలం రాకపోతే వైద్యుడిని కలవాలి!

డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు పీరియడ్స్ రావాలి.. ఎంత కాలం రాకపోతే వైద్యుడిని కలవాలి! గర్భం దాల్చడం వివాహం అయిన ప్రతి మహిళ జీవితంలో చోటు చేసుకునే ప్రక్రియ.  ఇది మహిళల శరీరంలో చాలా మార్పులను తీసుకువస్తుంది.  మొదటిసారి గర్బం దాల్చిన మహిళలకు ఈ ప్రయాణం చాలా కొత్తగా, మరెంతో గందరగోళంగా అనపిస్తూ ఉంటుంది. గర్బం దాల్చినప్పుడు నెలసరి రాకపోవడం జరుగుతుంది.  అయితే డెలివరీ తర్వాత మళ్లీ నెలసరి రావడం మొదలు అవుతుంది.  కానీ ఈ విషయంలో చాలా మంది మహిళలు ఎంతో గందరగోళం ఫీలవుతూ ఉంటారు. డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎప్పుడు తిరిగి వస్తాయనే ప్రశ్నకు సమాధానం ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటుంది.  ఇది మహిళల శరీరంలో కొన్ని పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. సర్వే ఏం చెప్తోందంటే.. 2023 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం.. భారతదేశంలో దాదాపు 65 శాతం మంది స్త్రీలకు ప్రసవించిన ఆరు నెలల్లోపే మళ్లీ నెలసరి మొదలైంది. అయితే పూర్తిగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో నెలసరి 18 నెలల వరకు ఆలస్యం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. డెలివరీ తర్వాత పీరియడ్స్ తిరిగి రావడాన్ని ప్రభావితం చేసే అంశాలు.. డెలివరీ తర్వాత తిరిగి పీరియడ్స్ రావడం అనే దాని మీద తల్లిపాలు ఇవ్వడం కీలక పాత్ర పోషిస్తుంది. తల్లిపాలు ఇచ్చే సమయంలో శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పాల ఉత్పత్తికి సహాయపడుతుంది,  అండోత్సర్గమును అణిచివేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా,   పగలు,  రాత్రి పాలిచ్చే స్త్రీలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.   ఇది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు.  ఇది తదుపరి గర్భధారణ మధ్య అంతరాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.  డెలివరీ తర్వాత వచ్చే పీరియడ్స్ చాలా బాధాకరంగా ఉంటుందని చెబుతున్నారు.  తీవ్రమైన సమస్య ఉంటే వైద్యులను తప్పక సంప్రదించాలి. మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఏం చేయాలంటే.. ప్రసవం తర్వాత శరీరం తిరిగి బాలెన్స్డ్ గా మారడానికి సరైన జాగ్రత్త అవసరం. పోషకాహారం,  హైడ్రేషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. సమతుల్య,  పోషకమైన ఆహారం హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి,  శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు, పప్పుధాన్యాలు,  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు,  ఐరన్ అధికగా ఉన్న ఆహారాలు  కోల్పోయిన రక్తాన్ని తిరిగి నింపడానికి సహాయపడతాయి. చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి,  శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం కూడా చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో అన్ని విధులు సరిగా  జరగడానికి ఇది సహాయపడుతుంది. వ్యాయామం కూడా.. ప్రతి రోజూ తేలికపాటి శారీరక శ్రమ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజువారీ నడక లేదా తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది,  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డెలివరీ తర్వాత  యోగా,   సున్నితంగా శరీరాన్ని సాగతీసే  వ్యాయామాలు శరీర ప్లెక్సిబిలిటీ పెంచడానికి  హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి,  క్రమంగా పీరియడ్స్‌ నార్మల్ గా రావడానికి సహాయపడతాయి.                              *రూపశ్రీ

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఇదిదో ఇవి తినాలి..!

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఇదిదో ఇవి తినాలి..! కీళ్ల నొప్పులు మహిళలలోనే ఎక్కువ కనిపిస్తుంటాయి.  సాధారణంగా పురుషుల కంటే మహిళలలోనే ఎముకల బలహీనత ఉంటుంది. ఈ కారణంగా కాల్షియం లోపం కూడా బయటపడుతూ ఉంటుంది.  మరీ ముఖ్యంగా గర్భధారణ,  బరువు పెరగడం, తిరిగి బరువు తగ్గడం, కేవలం ఇంటి పనులు మాత్రమే చేస్తూ వ్యాయామం వంటివి చేయకపోవడం, ఆహారం పట్ల నిర్లక్ష్యం.. ఇలా చాలా విషయాలు మహిళలలో కీళ్ళ నొప్పులు రావడానికి కారణం అవుతాయి.  కీళ్ల నొప్పులను వైద్య భాషలో ఆర్థరైటిస్ అని అంటారు.  ఆర్థరైటిస్ ఉన్నవాళ్లలో కీళ్ళ నొప్పులతో పాటు కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి.  కూర్చోవడం, లేవడం వంటి పరిస్థితులలో ఇది చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఈ కీళ్ల నొప్పులకు చెక్ పెట్టడానికి ఆహారం చాలా కీలకం అని వైద్యులు,  పోషకాహార నిపుణులు  అంటున్నారు.  ఇంతకూ కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఏం తినాలి? తెలుసుకుంటే.. కీళ్ల నొప్పులకు ఒమేగా-3.. ఒమేగా-3 శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల వాపు,  నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులకు అవిసె గింజలు.. అవిసె గింజలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో ప్రభావవంతగా పని చేస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవిసె గింజలలోని పోషకాలు..  అవిసె గింజలలో ఫైబర్, కాల్షియం,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి,  ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఈ విత్తనాలను  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడమే కాకుండా,  మొత్తం గుండె ఆరోగ్యం,  జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట. అవిసె గింజలు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభించే  ఉత్తమ శాఖాహార పదార్థాలలో అవిసె గింజలు  ఒకటి.  ముఖ్యంగా ALA అంటే.. ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం వీటిలో ఉంటుంది. ALA శరీరంలో శోథ నిరోధక సమ్మేళనంగా మారుతుంది. అవిసె గింజలను పొడిగా చేసి పెరుగు, ఓట్ మీల్ లేదా స్మూతీలలో కలపి తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. చియా విత్తనాలు.. చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న విత్తనాలు నీటిని పీల్చుకుని, కీళ్లను ద్రవపదార్థం చేయడానికి సహాయపడే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. చియా గింజలను రాత్రిపూట నీటిలో లేదా పెరుగులో నానబెట్టి  చియా పుడ్డింగ్‌గా తయారు చేయవచ్చు. గుమ్మడి.. గుమ్మడికాయ గింజలలో  జింక్,  మెగ్నీషియం  పుష్కలంగా ఉంటాయి. ఆర్థరైటిస్‌లో మంటను నియంత్రించడంలో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. నువ్వులు.. నువ్వులలో సెసామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. నువ్వుల గింజలు కాల్షియం,  ఐరన్  కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి,  మరమ్మత్తుకు అవసరం. సన్ ఫ్లవర్ సీడ్స్..  విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పరిగణించబడుతుంది.  అలాంటి విటమిన్-E పుష్కలంగా లభించే విత్తనాలలో పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రధానమైనవి.  విటమిన్ E వాపును తగ్గించడంలో,  కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాలు మెగ్నీషియం ను  కూడా అందిస్తాయి.  పైన పేర్కొన్న విత్తనాలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే మహిళలలో కీళ్ల నొప్పు,  ఎముకల సమస్యలు నెమ్మదిగా తగ్గిపోయి ఎముకలు దృఢంగా మారతాయి.                             *రూపశ్రీ.

అశ్వగంధ మహిళలు వాడితే జరిగేదేంటి..

అశ్వగంధ మహిళలు వాడితే జరిగేదేంటి.. ఆయుర్వేదం భారతదేశానికి అందిన గొప్ప వైద్య శాస్త్రం.  భారతీయ ఋషులు,  మహర్షులు రూపొందించిన ఈ వైద్య శాస్త్రం జబ్బు చేసిన ప్రాంతాన్ని మూలాల నుండి రిపేర్ చేయడం ద్వారా  జబ్బును నయం చేస్తుంది. భారతదేశంలో శతాబ్దాలుగా వివిధ వ్యాధుల చికిత్సకు మూలికలను ఉపయోగిస్తున్నారు.  వాటి ప్రయోజనాలను కాలక్రమేణా వైద్య శాస్త్రం నిర్ధారించింది. ఎన్ని శతాబ్దాలు దాటినా ఆయుర్వేద మూలికలకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికీ ఏవైనా  వ్యాధుల కోసం ఈ మూలికలను ఉపయోగించుకోవడానికి చాలా  మంది ఇష్టపడతారు. . అటువంటి శక్తివంతమైన మూలికలలో  అశ్వగంధ ఒకటి.   అశ్వగంధ.. అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో చాలా ప్రజాదరణ పొందిన,  శక్తివంతమైన ఔషధం. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అశ్వగంధను తరచుగా పురుషులకు మాత్రమే ప్రయోజనకరంగా పరిగణిస్తున్నప్పటికీ, కొన్ని రకాల సమస్యకు పరిష్కారంగా వైద్యులు మహిళలకు కూడా అశ్వగంధను రికమెండ్ చేస్తుంటారు.  అశ్వగంధను ఉపయోగించడం వల్ల మహిళలకు కలిగే అద్బుతమైన ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన.. నేటి బిజీ కాలంలో ఒత్తిడి లేని జీవితాలు అరుదు.  చాలామంది ఎప్పుడూ ఒత్తిడి అనుభవిస్తూ ఉంటారు.  ఆందోళన చెందుతుంటారు.  వీటి నుండి ఉపశమనం పొందడానికి అశ్వగంధను  ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది సహజంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. హార్మోన్స్.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పురుషులు,  స్త్రీలలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యలకు చికిత్స చేయడానికి అశ్వగంధను ఉపయోగించవచ్చు. అశ్వగంధను తీసుకోవడం వల్ల హార్మోన్లను బాలెన్స్  చేయడంలో సహాయపడుతుంది.  థైరాయిడ్ సమస్యలు, PCOS,  మెనోపాజ్ వంటి సమస్యలకు  సహాయపడుతుంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్,  సంతానోత్పత్తిని కూడా పెంచుతుంది. నిద్ర.. అశ్వగంధ శరీరంలో శక్తి పెంచడంలో సహాయపడుతుంది.   అలసటను తగ్గిస్తుంది.  రోజూ రాత్రి మంచి నిద్ర కావాలి అనుకునేవారు అశ్వగంధను గోరు వెచ్చని పాలతో తీసుకోవాలి.  ఇది ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. బరువు..  ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడానికి  ఇబ్బంది పడేవారికి  అశ్వగంధ ఒక వరం లాంటిది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. ఇది మొండిగా ఉండే  బొడ్డు కొవ్వును వదిలించుకోవడానికి కూడా  సహాయపడుతుంది. అశ్వగంధ ఎలా వాడాలి.. పౌడర్..  పడుకునే ముందు వెచ్చని పాలు లేదా నీటితో సగం లేదా ఒక టీస్పూన్ అశ్వగంధను కలపి తాగాలి. టాబ్లెట్స్.. పడుకునే ముందు ఒక టాబ్లెట్ లేదా వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. అశ్వగంధ టీ..  ఒక వేరును నీటిలో మరిగించి, పడుకునే ముందు సిప్ టు సిప్ త్రాగాలి.                             *రూపశ్రీ.

వేయించిన పదార్థాలు.. మొటిమలు.. అసలు నిజాలు ఇవే.. !

వేయించిన పదార్థాలు.. మొటిమలు.. అసలు నిజాలు ఇవే.. ! మొటిమలు అమ్మాయిలకు పెద్ద శత్రువులు.  సాధారణంగానే అమ్మాయిలు అందమైన చర్మం కోసం చాలా ప్రయోగాలు చేయడం,  చాలా రకాల ఉత్పత్తులు వాడటం చేస్తుంటారు. అయితే మొటిమలు అందాన్ని చెడగొడతాయి.  ఎప్పుడైనా ఒక మొటిమ వస్తే అదేమంత పెద్ద సమస్య కాదు.  కానీ పదే పదే మొటిమలు రావడం, మొటిమలలో చీము, రక్తం ఎప్పుడూ కారుతూ ఉండటం,మొటిమల చుట్టూ   చర్మం అంతా ఎర్రగా కందిపోవడం వంటివి చాలామందిలో ఎదురవుతుంటాయి.  చాలామంది మొటిమలు రావడానికి వేయించిన ఆహారాలు తినడమే కారణం అని చెబుతూ ఉంటారు. ఇంతకూ వేయించిన ఆహారాలు మొటిమలు రావడానికి కారణం అవుతాయా? మొటిమలు పదే పదే ఎక్కువగా వస్తుంటే ఏం చేయాలి? తెలుసుకుంటే... మొటిమలు.. వేయించిన ఆహారం.. వేయించిన ఆహారాన్ని  తినడం వల్లే మొటిమలు  వస్తాయని అనుకోవడం చాలా పొరపాటు అని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  మొటిమలు రావడం  వెనుక చాలా కారణాలు ఉంటాయి. వాటిలో చర్మ రకం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, శరీరానికి సరిపడినంత నీరు తాగకపోవడం, వాతావరణం,  ఆహారం మొదలైన చాలా రకాల కారణాల వల్ల మొటిమలు వస్తాయి. వేయించిన ఆహారాల పాత్ర.. వేయించిన ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయనేది వాస్తవం.  ఇది చర్మంలో సెబమ్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. ఇది రంధ్రాలను మూసుకుపోయి మొటిమలకు దారితీస్తుంది. అయితే ఇది కొంతమందిలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి వేయించిన ఆహారాల వల్ల అందరికీ మొటిమలు వస్తాయనేది వాస్తవం కాదు. ఎవరికి సమస్య? ఇప్పటికే జిడ్డుగల చర్మం, పదే పదే  మొటిమల బారిన పడే చర్మం ఉంటే వేయించిన ఆహారం తినడం వల్ల సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. చర్మ  రంధ్రాలు మూసుకుపోయే సమస్య ఉండే వ్యక్తులు మొటిమల సమస్యకు చాలా తొందరగా గురవుతారు.  అందుకే ఇలాంటి  వ్యక్తులు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మొటిమలు వస్తే ఏం  చేయాలి? మొటిమలు వచ్చినప్పుడు  ముఖాన్ని రోజుకు రెండుసార్లు తేలికపాటి ఫేస్ వాష్ తో కడుక్కోవాలి. ఫేస్ వాష్ లో కెమికల్స్ ఎక్కువ ఉండకూడదు. మొటిమలు వచ్చినప్పుడు కంగారు పడటం కంటే ముందు మొటిమలు  రాకుండా చూసుకోవాలి. మొటిమలు వచ్చిన తరువాత  వాటి గుర్తులు తొలగిపోవాలన్నా చాలా సమయం పడుతుంది. సాలిసిలిక్ యాసిడ్, వేప లేదా టీ ట్రీ ఆధారిత జెల్ రాయాలి.  ఇవి మొటిమలు తగ్గించడంలో ప్రబావవంతంగా ఉంటాయి. ముఖంపై ఐస్ పూయడం వల్ల ఎరుపు తగ్గుతుంది. పదే పదే మొటిమలు వస్తున్నా, మొటిమలు తగ్గకుండా చీము, రక్తం వస్తూ చర్మాన్ని ఇబ్బంది పెడుతున్నా వీటిని ఇంటి చిట్కాలతో నయం చేయాలని చూడకూడదు. ఇలాంటి సమస్యలున్నప్పుడు చర్మ సంరక్షణ నిపుణులను సంప్రదించి వైద్యం చేయించుకోవడం మంచిది.                             *రూపశ్రీ.

శీతాకాలంలో పిల్లల ఇమ్యూనిటీ పెంచే సూపర్ టిప్స్..!

శీతాకాలంలో పిల్లల ఇమ్యూనిటీ పెంచే సూపర్ టిప్స్..!   శీతాకాలంలో పిల్లలలో జలుబు,  ఫ్లూ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే పొడిగాలి,  చల్లని ఆహారాలు,  చల్లని వాతావరణం వల్ల గొంతు నొప్పి  దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి.   వైరస్‌లు చల్లని,  పొడి గాలిలో ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. పిల్లలు ఎక్కువగా  ఇంటి లోపలే ఉంటారు, దీని వలన ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. జలుబు, ఫ్లూ కారణంగా పిల్లలకు వచ్చే తుమ్ములు, దగ్గు,  అసౌకర్యాన్ని మంత్రం వేసినట్టు క్షణాలు,  నిమిషాలలో ఆపలేము.  అందుకే ఈ శీతాకాలంలో కనీసం పిల్లల రోగనిరోధక శక్తిని పెంచగలిగితే  వారి ఆరోగ్యాన్ని చాలా వరకు నయం చేయగలుగుతాము.  పిల్లలో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. పరిశుభ్రత.. పిల్లలు స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చినా,  టాయిలెట్ కు వెళ్లి వచ్చినా,  ఆటలు ఆడుకుని వచ్చినా వారికి చేతులు కడుక్కోవడం నేర్పాలి.  పరిశుభ్రత అనేది పిల్లల దినచర్యలో భాగంగా ఉండేలా చూడాలి. శానిటైజర్ లకు బదులుగా సబ్బుతో 20సెకెన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం నేర్పాలి. పిల్లలు తుమ్మినప్పుడు,  దగ్గినప్పుడు మోచేత్తో నోటికి అడ్డుగా పెట్టుకోవడం లేదా నాప్‌కిన్ వంటిది నోటికి అడ్డు పెట్టుకోవడం వంటివి నేర్పాలి.  కళ్లు,  ముక్కు, నోరును పదే పదే చేత్తో తాకకుండా ఉండేలా జాగ్రత్తలు నేర్పాలి.  ఇది పిల్లలను చాలా వరకు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా  కాపాడుతుంది. ముక్కు తో జాగ్రత్త.. పిల్లలకు చాలా వరకు జలుబు,  ముక్కు నుండి నీరు కారడం వంటి సమస్యలు వస్తుంటాయి.  కొన్ని సార్లు ముక్కు పొడిబారడం, శ్లేష్మం పేరుకుపోవడం వంటివి కూడా వస్తాయి.  వీటి నుండి ఉపశమనం కోసం 0.65% సెలైన్ నోస్ స్ప్రే ను పిల్లలకు ఇవ్వాలి.  ఇది ముక్కును తేమగా ఉంచుతుంది. శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది. 6సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు 3 నుండి 5 నిమిషాలు ఆవిరి పట్టవచ్చు. అయితే పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆవిరి పట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిద్ర.. 3-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 10-13 గంటల నిద్ర అవసరం.  అలాగే 6-12 సంవత్సరాల వయసు గల పిల్లలకు 9-12 గంటల నిద్ర అవసరం,  టీనేజ్ పిల్లలకు 8-10  గంటల నిద్ర అవసరం,  నిద్రపోవడానికి కనీసం 30నిమిషాల ముందు టీవీ,  ఉదయాన్నే 10 నిమిషాలు సూర్యరశ్మిలో గడిపేలా చూసుకోవాలి.  ఇలా చేస్తే శరీరంలో నిద్ర గడియారం బాలెన్స్డ్ గా ఉంటుంది. ఆహారం.. శీతాకాలంలో పిల్లలకు ఇచ్చే ఆహారం కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్, రంగురంగుల కూరగాయలు,  వెచ్చగా ఉన్న  ద్రవాలను ఆహారంలో చేర్చాలి. ప్రోటీన్ కోసం గుడ్లు, పప్పులు, కాటేజ్ చీజ్ లేదా టోఫు,  పెరుగును ఇవ్వాలి. విటమిన్ సి కోసం ప్రతిరోజూ  ఆహారంలో జామ, ఉసిరి, నారింజ, టమోటాలు లేదా క్యాప్సికం లను ఇవ్వాలి.   జింక్ కోసం వేయించిన శనగలు, గుమ్మడికాయ గింజలు, గుడ్లు,  పప్పులు ఇవ్వాలి. ప్రోబయోటిక్స్ కోసం తాజా పెరుగు లేదా మజ్జిగను ఇవ్వాలి. పిల్లలకు వెచ్చని సూప్‌లు,  తేలికపాటి కషాయాలు, నిమ్మకాయ, అల్లం,  తులసి ఇవ్వాలి. పిల్లలు శీతాకాలంలో తక్కువ నీరు త్రాగుతుంటారు.  కాబట్టి సరిపడినంత నీరు తాగేలా జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామం.. పిల్లల శరీరం చురుగ్గా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం. పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు.  అందుకే ఆటల్లో వ్యాయామాలను భాగం చేసి ఇంట్లోనే వ్యాయామాలు చేయించాలి. స్కిప్పింగ్, యోగ, ఎరోబిక్స్ వంటివి ఎంకరేజ్ చేయవచ్చు. మందులు.. పిల్లలకు ఏ చిన్న నలత అనిపించినా చాలామంది యాంటి బయాటిక్స్ ఇస్తుంటారు. పిల్లలు నలతను ఎక్కువ సేపు భరించలేరు.  వారి ఇబ్బందిని చూసి యాంటిబయాటిక్స్ ఇవ్వడం తప్పు.  మిగిలిపోయిన సిరప్ లు, ఇంట్లో టాబ్లెట్స్ తో పిల్లలకు నయం చేయాలనే ఆలోచన చేయకూడదు.  వీలైనంత వరకు ఇంటి చిట్కాలను ట్రై చేయాలి.  అల్లం, తేనె, తులసి,  జీలకర్ర, దనియాలు వంటివి ఔషద గుణాలను కలిగి ఉంటాయి. వీటిని తగు విధంగా వాడితే  సమస్యలు మెల్లిగా తగ్గిపోతాయి. కానీ పిల్లలు రెండు రోజులకు మించి అసౌకర్యాన్ని అనుభవిస్తే వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లడం చాలా ముఖ్యం.                                     *రూపశ్రీ.

మహిళలు ప్రెగ్నెన్సీ టైం లో వీటికి దూరంగా ఉండాలి..!

మహిళలు ప్రెగ్నెన్సీ టైం లో వీటికి దూరంగా ఉండాలి..! మహిళల ఆరోగ్యం చాలా క్లిష్టమైనది. చిన్నతనం నుండి ఒక్కో దశలో ఒక్కో మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ మార్పులు అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మహిళ జీవితాన్ని, శరీర తత్వాన్ని పూర్తీగా మార్చేసే దశ గర్భం దాల్చడం.  గర్బం దాల్చడం, ప్రసవించడం చాలా పెద్ద మార్పులకు కారణం అవుతాయి.  గర్భధారణ సమయంలో తల్లి తన ఆరోగ్యం గురించే కాకుండా తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది.  ఈ క్రమంలో ఏ ఆహారాలు, పానీయాలు  తీసుకోవడం వల్ల మహిళల ఫిట్‌నెస్,  ఆరోగ్యం దెబ్బతింటుందో తెలుసుకుంటే.. తల్లిబిడ్డలు క్షేమంగా ఉండొచ్చు. అవేంటో తెలుసుకుంటే.. కెఫీన్.. గర్భాధారణ సమయంలో టీ, కాఫీ వంటి కెఫీస్ కలిగిన ఆహారాలను నివారించాలని వైద్యులు చెబుతున్నారు.  ఇవి శిశువు ఎదుగుదలకు, అభివృద్దికి ఆటంకం కలిగిస్తుంది అంటున్నారు. పండ్లు.. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఏ పండ్లు తినాలి, ఏవి  తినకూడదు అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి,  ద్రాక్ష, మామిడి, పైనాపిల్ తినడం వల్ల గర్భిణి స్త్రీలకు వెన్ను నొప్పి, అకాల ప్రసవం లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయట. ఆహారం.. తీసుకునే ఆహారం మీదే చాలామంది ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండాలి.   ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోవడం మానేయాలి.  వీటిలో ఎక్కువ రసాయనాలు ఉంటాయి.  వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. శుభ్రత.. మార్కెట్ నుండి తెచ్చిన ఏదైనా పండ్లు లేదా కూరగాయలను కడగకుండా తినడం లేదా తయారు చేయడం ప్రమాదకరం.  వీటిలో క్రిములు, రసాయనాలు ఉంటాయి.  ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. శుభ్రం చేయకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ధూమపానం, మద్యపానం.. బారతీయ మహిళలు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగానే ఉంటారు. కానీ కొందరు విదేశీ కల్చర్ పట్ల ఆకర్షితులై గర్భధారణ సమయంలో పొగతాగడం,  మద్యం సేవించడం వంటివి చేస్తారు. ఇవి కడుపులో బిడ్డ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. వీటిలోని నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ శిశువు ఎదుగుదలను దెబ్బ తీస్తాయి. జంక్ ఫుడ్.. నేటికాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వ్యసనంగా మారిన ఆహారపు అలవాటు జంక్ ఫుడ్ తినడం.  వీటి వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభించవు.  కేవలం కేలరీలు, ఫ్యాట్స్ తప్పితే వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు ఏమీ ఉండవు. జంక్ ఫుడ్ తినడం వల్ల స్త్రీలు, పిల్లలు ఇద్దరికీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పచ్చి ఆహారాలు.. చాలామందికి పచ్చి మాంసం, పచ్చి గుడ్లు, అలాగే పచ్చిగా ఉన్న ఆహారాలు తినే అలవాటు ఉంటుంది. సాల్మోనెల్లా, పాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా కారణంగా తల్లి, బిడ్డ  ఇద్దరికీ అనారోగ్యం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                                 *రూపశ్రీ.

మహిళల్లో PCOS ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవి..!

మహిళల్లో PCOS ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవి..! PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. చాలా మంది మహిళలు  తరచుగా  ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.  కానీ దీన్ని గుర్తించడం మాత్రం చాలా కష్టం. ఇందులో  కష్టమైన విషయం ఏమిటంటే ఈ అకస్మాత్తుగా అకస్మాత్తుగా కనిపించేది కాదు. కానీ క్రమంగా చిన్న లక్షణాలతో  మొదలవుతుంది. పిసిఓఎస్ సమస్య ఉన్న చాలామంది మహిళలు తమకు అసలు ఆ సమస్య ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. మరికొంతమంది మహిళలు లక్షణాలు కనిపిస్తున్నా తాత్కాలిక పరిష్కారాలతో సమస్యను పట్టించుకోరు.  పిసిఓఎస్ సమస్య ప్రారంభంలో కనిపించే లక్షణాలేంటో తెలుసుకుంటే..  పిసిఓఎస్ ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం.. PCOS ను ముందుగానే గుర్తిస్తే దాని ప్రభావాలను చాలా వరకు నియంత్రించవచ్చు. ఇది భవిష్యత్తులో సంతానోత్పత్తిని కాపాడటమే కాకుండా డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి శరీరంలో కనిపించే  ముందస్తు  సంకేతాలను గమనించాలి. నెలసరి.. ప్రతి మహిళకు పీరియడ్ సైకిల్  28 రోజులు ఉండదు.  కొన్నిసార్లు ఒత్తిడి, ప్రయాణం లేదా నిద్ర సమస్యల కారణంగా ఈ పీరియడ్ సైకిల్ మారుతుంది.  అయితే, PCOS ఉన్నవారిలో ఈ వ్యత్యాసం బాగా పెరుగుతుంది. కొంతమంది మహిళలకు నెలసరి 35 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది లేదా కొన్నిసార్లు నెలల తరబడి కూడా రాదు. కొంతమంది మహిళలకు నెలసరి వచ్చినప్పుడు అధిక రక్తస్రావం,  అలసట ఉంటాయి.  ఎందుకంటే PCOSలో అండోత్సర్గము సక్రమంగా ఉండదు.  దీని వలన హార్మోన్ల అసమతుల్యత,  శరీరంలో బ్యాలెన్స్ తగ్గుతుంది. అందుకే మహిళలలో నెలసరి విషయంలో ఏ చిన్న మార్పు గమనించినా, ఏ అసౌకర్యం అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. బరువు.. ఎంత  పనిచేసినా  బరువు నియంత్రణలో ఉండకపోగా బరువు పెరగడం జరుగుతుంది. PCOS ఉన్న మహిళలకు ఇది తరచుగా జరుగుతుంది.  ఎందుకంటే పిసిఓఎస్ ఉన్న మహిళల శరీరాలు ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తాయి. అంటే వారి శరీరం  చక్కెరను సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది బరువు పెరగడాన్ని సులభం చేస్తుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ లావుగా మారుతుంది. దీన్ని తగ్గించడం కష్టం. చాలామంది దీన్ని లేజీనెస్ వల్ల వచ్చిన సమస్య అని,  బరువు తగ్గడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య అని అనుకుంటారు. కానీ ఇది శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చిన సమస్య. అవాంఛిత రోమాలు.. గడ్డం మీద వెంట్రుకలు, పై పెదవిపై సన్నని గీతలు, కడుపు లేదా ఛాతీపై వెంట్రుకలు పెరగడం ఇవన్నీ PCOS  సాధారణ లక్షణాలు. వైద్యులు దీనిని హిర్సుటిజం అని పిలుస్తారు. కానీ చాలా మంది మహిళలు దీనిని అర్థం చేసుకోరు. PCOSలో శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల సాధారణంగా జుట్టు పెరగని ప్రదేశాలలో జుట్టు పెరుగుతుంది. తరచుగా వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వెంట్రుకలు పదే పదే మందంగా,  ముతకగా తిరిగి వస్తే అది హార్మోన్ల మార్పులకు స్పష్టమైన సంకేతం. తలజుట్టు.. PCOS లో  చాలా గందరగోళపరిచే విషయమిది.  శరీరంలో అవాంఛిత రోమాలు పెరుగుతున్నప్పటికీ, తలపై కూడా వెంట్రుకలు రాలడం జరుగుతుంది. చాలా మంది మహిళలు హెయిర్ ఫాల్ అవ్వడాన్ని, జుట్టు బాగా పలుచగా మారడాన్ని ఎదుర్కొంటారు. ఈ మార్పులు అకస్మాత్తుగా కాకుండా నెమ్మదిగా  జరుగుతాయి.  అధికంగా వెంట్రుకలు రాలడం, తల చర్మం పైకి కనిపించడం వంటివి కూడా జరుగుతాయి. చర్మంపై మచ్చలు, గుర్తులు.. PCOS అంటే నెలసరి రాకపోవడమే కాదు..  కొన్నిసార్లు దీని లక్షణాలు  చర్మంపై కనిపిస్తాయి. మెడ వెనుక, చంకలు లేదా తొడలపై ముదురు, మృదువైన లేదా మందమైన మచ్చలు వస్తుంటాయి. దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిలుస్తారు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం. ఈ మచ్చలు హానిచేయవు. కానీ శరీరం రక్తంలో చక్కెరను నిర్వహించడంలో ఇబ్బంది పడుతోందని ఇవి సూచిస్తాయి.  ఇది PCOS లో కీలకమైన విషయం. గర్బం సమస్యలు.. చాలా మంది మహిళలు గర్భం రాలేదని వైద్యులను సంప్రదించినప్పుడు  తమకు PCOS ఉందని తెలుసుకుంటారు. అండోత్సర్గము క్రమం తప్పకుండా జరగనందున, గర్భం దాల్చడం కష్టమవుతుంది. దీని అర్థం గర్భం అసాధ్యమని కాదు,  దీనికి కొంత సమయం పడుతుంది,  వైద్యుల సహాయం అవసరమవుతుంది.                           *రూపశ్రీ.  

ప్రాణాయామం చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రాణాయామం చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు. ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి. నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు. నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి. ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది. ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం..

గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం.. గర్భవతులు చాలా సున్నితంగా ఉంటారు. అయితే గర్భవతులు దృఢంగా ఉండాట్సన్ ఎంతో అవసరమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. గర్భవతులు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుందనేది గైనకాలజిస్ట్ లు చెప్పే మాట. అయితే గర్భవతులు, వ్యాయామం అనే మాట వినగానే గయ్యిమని అరిచే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. కానీ వ్యాయామం అనేది గర్భవతులకు చాలా ముఖ్యం.  ప్రసవానికి ముందు కాలములో  వ్యాయామము చేయడం వల్ల గర్భవతులలో భయాందోళనలు ఏమైనా ఉంటే అవన్నీ  తొలగిపోతాయి. తెలియని విషయానికి భయపడటం సాధారణంగా అందరి విషయంలో జరిగేదే.. దీనికి చిన్న పిల్లల నుండి గర్భవతులు, మహిళలు, వృద్ధులు, పురుషులు ఇలా ఎవరూ మినహాయింపు కాదు. అయితే గర్భవతులలో భయం కలిగినప్పుడు సాధారణంగానే ఆందోళన కలుగుతుంది. ఈ ఆందోళన కాస్తా.. తలనొప్పికి దారితీస్తుంది. అలాంటి సమయంలో ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా ఉండలేరు. మనసులో ఏ మూలో ఎంతో కొంత భయం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. అలాంటి సమయాల్లోనే లేని అనుమానాలు పుడుతూ ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్న భయానికి అవి తోడయ్యి గోరంత సమస్యను కొండంత చేస్తాయి.  వ్యాయామము చేస్తే గర్భవతులలో ఉన్న ఈ ఆందోళన తగ్గిపోతుంది. వ్యాయామం వల్ల శరీరం విశ్రాంతిని బాగా కోరుకుంటుంది. దీని ఫలితంగా ఎలాంటి గందరగోళం లేకుండా హాయిగా నిద్రపోతారు. ఇక ప్రసవానికి ముందు మహిళలు వ్యాయామం చేస్తుందం ద్వారా మరొక అద్భుత ప్రయోజనం ఉంటుంది. అదే గర్భవతిలో కండరాలను దృఢంగా చేయడం. ప్రసవం సమయంలో గర్భవతులలో కండరాల సంకోచం వ్యాకోచాలు అధికంగా జరుగుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల కారణంగా కండరాలు మరింత బలహీనం అవుతాయి. అదే వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా మారితే ప్రసవ సమయంలో నొప్పులను భరించడం సాధ్యమవుతుంది.  అకాలపు ప్రసవాలు, ప్రసవ సమయంలో ప్రమాదాలు, సాధారణ ప్రసవాన్ని భరించలేక సిజేరియన్ వైపు మొగ్గు చూపడం వంటి వాటిని గర్భవతులు వ్యాయామం ద్వారా దూరం ఉంచవచ్చు.  గర్భాశయము అంటే బోలుగా ఉండే ఒక కండరము.  ఈ కండరము ప్రపన సమయములో శిశువును బయటికి నెట్టడానికి సహకరిస్తుంది. ఈ కండరము గర్భాశయ ద్వారము దగ్గర ఉండి ఇతర కండరాల ఒత్తిడిని ప్రతిఘటించి కడుపులో బిడ్డను బయటకు నెట్టేందుకు సహకరిస్తుంది. వ్యాయామం వల్ల ఈ కండరం దృఢంగా మారుతుంది.   ఒక వైపు నొప్పులు మరో వైపు భయము చేరి ప్రసవ సమయములో కండరములు సరిగా పని చేయకుండా అవరోధము కలిగిస్తుంటాయి. అందుకే గర్భవతులు  వ్యాయామము చేస్తూ,  ప్రసవానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉంటే గర్భవతులకు ప్రవేశం సమయంలో ఆందోళన ఏర్పడకుండా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి గర్భవతులకు వ్యాయామం ఎంతో ముఖ్యం. అయితే నిపుణులను అడిగి వారి నెలలను బట్టి వ్యాయామాలను తెలుసుకుని చేయాలి.                                    ◆నిశ్శబ్ద.  

పెదవులు పగులుతున్నాయా..ఈ విటమిన్ లోపమే కారణం!

పెదవులు పగులుతున్నాయా..ఈ విటమిన్ లోపమే కారణం!   పెదవులు పగలడం చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య.  చలికాలంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  పెదవులు పగిలినప్పుడు తినడంలోనూ, తాగడం లోనూ, కొన్ని సార్లు మాట్లాడటంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.  అయితే ఇలా పెదవులు, పెదవుల మూలాలు పగలడం అనేది  వాతావరణ మార్పుల వల్ల జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా జరగడం  విటమిన్  లోపం వల్లనే అని అంటున్నారు ఆహార నిపుణులు, చర్మ సంరక్షణ నిపుణులు.  ఇలా విటమిన్ లోపం వల్ల పెదవులు పగిలితే ఎన్ని క్రీములు రాసినా,  ఎన్ని చిట్కాలు ఫాలో అయినా అది తగిన ఫలితాలు ఇవ్వదట. విటమిన్ లోపం.. కొన్ని సార్లు పెదవులు పగలడం,  పెదవులు చివర్లు చీలడం జరుగుతుంది.  దీని వల్ల కొన్ని సందర్భాలలో   రక్తం కారడం కూడా జరుగుతుంది. ఇది విటమిన్-బి, విటమిన్-సి లోపం వల్ల జరుగుతుందని అంటున్నారు. విటమిన్-బి, విటమిన్-సి లోపిస్తే శరీరం చాలా తొందరగా పొడిబారుతుంది.  దీని వల్ల చర్మం మీద దురద,  పొలుసులు ఏర్పడటం, మొటిమలు రావడం జరుగుతాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ విటమిన్ -బి లోపం వల్లనే జుట్టు రాలే సమస్య, జుట్టు బలహీనంగా మారడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.  ఇవన్నీ జుట్టును బాగా దెబ్బతీస్తాయి. విటమిన్-బి లోపాన్ని భర్తీ చేయాలంటే గుడ్లు, చేపలు, గింజలు, తృణధాన్యాలు, పాలకూర, బచ్చలి కూర,  మాంసం.. ముఖ్యంగా చికెన్.. మొదలైనవి తినాలి. ఇవి తింటే విటమిన్-బి భర్తీ అవుతుంది. ఇక విటమిన్-సి లభించాలి అంటే నిమ్మరసం,  నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్  పండ్లు తీసుకోవాలి.  ఇవన్నీ విటమిన్-సి ని భర్తీ చేస్తాయి.  ఇవి పుష్కలంగా తీసుకుంటే పెదవుల పగుళ్లు, పెదవుల మూలలు చీలడం వంటివి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా మెల్లగా తగ్గిపోతాయి.                                      *రూపశ్రీ

30ఏళ్ల తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..!

30ఏళ్ల తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..! 30 సంవత్సరాల వయస్సు తర్వాత శరీరంలో అనేక మార్పులు ప్రారంభమవుతాయి. వాటిలో ఒకటి ఎముకలు బలహీనపడటం. నిజానికి 30 సంవత్సరాల వయస్సు తర్వాత ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది  ఇది నొప్పి,  పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. సరైన జీవనశైలి,  ఆహారంతో ఎముకలను బలోపేతం చేయవచ్చు.  ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  ఏం చేయాలో తెలుసుకుంటే.. కాల్షియం అధికంగా ఉండే ఆహారం తినాలి.. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఒక ముఖ్యమైన పోషకం. శరీరం స్వయంగా కాల్షియంను ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి దానిని ఆహారం ద్వారా పొందాలి. ఒక వయోజన వయసు వ్యక్తికి రోజుకు దాదాపు 1000-1200 మి.గ్రా. కాల్షియం అవసరం. అందుకే  ఆహారంలో పాలు,  పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. అలాగే ఆకుకూరలు, నట్స్, గింజలు,  పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు,  బలవర్థకమైన ఆహారాలను చేర్చుకోవాలి. విటమిన్ డిని నిర్లక్ష్యం చేయకూడదు.. విటమిన్ డి  ప్రేగులలో ఉండే కాల్షియంను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. విటమిన్-డి లేకుండా  ఎంత కాల్షియం తీసుకున్నా, అది  ఎముకలకు సరిగ్గా చేరదు. విటమిన్ డి కి ఉత్తమ,  అత్యంత సహజ మూలం సూర్యకాంతి. ఉదయం సూర్యకాంతి..  ప్రతిరోజూ 15-20 నిమిషాలు తేలికపాటి ఉదయ సమయపు సూర్యకాంతిలో కూర్చోవాలి. కాంతి నేరుగా  చర్మాన్ని తాకేలా  చేతులు,  కాళ్ళను తెరిచి ఉంచాలి. ఆహారం.. సాల్మన్, మాకేరెల్ వంటి ఫ్యాటీ ఫిష్ లు, గుడ్డు పచ్చసొన, బలవర్థకమైన పాలు,  పెరుగు.. ఇవన్నీ విటమిన్-డి వనరులు.  వీటిని తీసుకోవాలి. సప్లిమెంట్స్.. సూర్యరశ్మి,  ఆహారం ద్వారా విటమిన్-డి తగినంత లభించకపోతే  వైద్యుడి సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు . క్రమం తప్పకుండా వ్యాయామం.. ఎముకలను బలోపేతం చేయడానికి  వ్యాయామం, ముఖ్యంగా బరువు మోయడం,  బలాన్ని పెంచే వ్యాయామాలు చాలా అవసరం. ఇది ఎముక సాంద్రతను నిర్వహించడానికి,  వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదనంగా, యోగా  సాధన చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్,  ఇతర పోషకాలు.. ఎముకలకు కాల్షియం మాత్రమే సరిపోదు. దాదాపు 50% ఎముకలు ప్రోటీన్‌తో తయారవుతాయి. ఎముకల బలానికి,  కాల్షియం శోషణకు తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. అదనంగా  మెగ్నీషియం, జింక్, విటమిన్ కె,  భాస్వరం కూడా ఎముకల ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్ల నుండి బయటపడాలి... మంచి అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు, కొన్ని చెడు అలవాట్లను మానుకోవడం కూడా అంతే ముఖ్యం.  ధూమపానం,  మద్యం సేవించడం మానేయాలి. అధిక ఉప్పు, సోడా లేదా కెఫిన్ ఉత్పత్తులను నివారించడం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తే ఎముకలు బలంగా ఉంటాయి.                                       *రూపశ్రీ.

40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం సరైనదేనా...

40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం సరైనదేనా.. ప్రతి మహిళకు గర్భం దాల్చడం,  మాతృత్వం పొందడం చాలా గొప్ప అనుభూతి.  అయితే చాలామంది మహిళలు ఎంత వయసు అయినా గర్బం దాల్చలేకపోతారు. మరికొందరు మొదటి బిడ్డ అయిన తర్వాత కాస్త ఆలస్యంగా మళ్లీ బిడ్డ కావాలని అనుకుంటారు. ఇలాంటి వారు ఆలస్యంగా గర్భం దాల్చడం,  తల్లికావడం జరుగుతుంది. అయితే ఇలా ఆలస్యంగా.. 40 ఏళ్ల వయసులో కూడా తల్లి కావడం సరైనదైనా?  దీని వల్ల ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు ఉన్నాయా? అసలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం సురక్షితమేనా కాదా? తెలుసుకుంటే.. గైనకాలజిస్టులు,  వైద్యుల అభిప్రాయం ప్రకారం 35ఏళ్ల తర్వాత మహిళలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుంది.  దీని కారణంగా 35 సంవత్సరాల తర్వాత మహిళలు దాదాపు మూడింటి రెండు వంతుల జంటలు బిడ్డను కనడంలో ఇబ్బందిని ఎదుర్కుంటారు.  మూడింటి రెండు వంతుల జంటలు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంటారు. ఒక నిర్థిష్ట వయసు తర్వాత  మహిళల శరీరంలో అండాల సంఖ్య తగ్గడం క్రమంగా పెరుగుతూ ఉంటుంది.  ఇది సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగానే చాలామంది మహిళలలో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక నిర్థిష్ట వయసు తర్వాత మహిళల శరీరంలో అండాలు విడుదల అయినా అవి ఆరోగ్యకరంగా ఉండవు.  మరీ ముఖ్యంగా ఫలదీకరణ ప్రక్రియ జరగడానికి తగినంత ఆరోగ్యంగా ఉండవు. 35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య తగ్గుతూ ఉండటంతో అవి సరిగ్గా విడుదల కావు.  గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా చాలా రెట్లు ఉంటుంది.  మరీ ముఖ్యంగా 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ .. గర్భం వచ్చిన తర్వాత అది అధిక ప్రమాదంతో కూడుకుని ఉంటుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు. అసలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం అనేది ఎందుకు అంత ప్రమాదం అనే విషయాన్ని చెప్టూ గైనకాలజిస్టులు చెప్పిన విషయం.. ప్రీఎక్లంప్సియా అంటే అధిక రక్తపోటు.  గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు,  మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుందట. 40 ఏళ్ల వయసులో తల్లులయ్యే మహిళలకు పుట్టే పిల్లలకు డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుందట. దీని కారణంగా 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు గర్భం దాలిస్తే వాళ్లకే కాకుండా..పుట్టే పిల్లలు కూడా ప్రమాదంలో పుట్టే అవకాశాలు చాలా ఉంటాయి. పుట్టినప్పుడు బిడ్డ బరువు కూడా తక్కువగా పుట్టే ప్రమాదం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.                            *రూపశ్రీ.

30 ఏళ్ళకే ముసలివాళ్లలా అలసటగా ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి..!

30 ఏళ్ళకే ముసలివాళ్లలా అలసటగా ఉంటుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సరి..! 30ఏళ్ళు అంటే అప్పుడప్పుడే బాధ్యత గల జీవితంలోకి అడుగుపెట్టినట్టు.  పెళ్లి,  భాగస్వామి,  పిల్లలు, ఉద్యోగం.. ఇల్లు చక్కబెట్టుకోవడం.. ఇలా చాలామంది మహిళలు 30 ఏళ్లలో బాధ్యతలలో బిజీగా ఉంటారు.  ఇలాంటి మహిళలు చాలా చురుగ్గా అన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో 30 ఏళ్లకే చాలామంది మహిళలు చాలా భారంగా ఫీలవుతూ ఉంటారు. బలహీనంగా ఫీలవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు. మరీ ముఖ్యంగా శరీరంలో ఎముకలు, కండరాలు బలం లేనట్టుగానూ.. నడుము,కీళ్లు నొప్పులు.. ఇలా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దీన్ని అధిగమించి తిరిగి ఉత్సాహంగా మారడానికి ఫిట్‌నెస్ నిపుణులు కొన్ని అద్భుతమైన చిట్కాలు పంచుకున్నారు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఖాళీ కడుపుతో మెంతినీళ్లు.. చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతుంటారు.  కానీ నానబెట్టిన మెంతి నీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్,   రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది మహిళల్లో పీరియడ్స్ క్రాంప్స్ లేదా PCOSని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. 10 నిమిషాల నడక.. ఈ రోజుల్లో చాలా మందిలో విటమిన్ డి లోపం సర్వసాధారణం. ముఖ్యంగా మహిళలలో, అందునా గృహిణులలో ఎక్కువ. ఎముకలతో పాటు, రోగనిరోధక శక్తి,  హార్మోన్ల నియంత్రణకు విటమిన్ డి చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు  కేవలం 10 నిమిషాలు ఎండలో నడిస్తే,  తగినంత విటమిన్ డి పొందవచ్చు. ఇది  మానసిక స్థితిని మెరుగుపరచడానికి,  సెరోటోనిన్ స్థాయిని పెంచడానికి కూడా పని చేస్తుంది. అల్పాహారం ఇలా.. ఉదయం అల్పాహారం ఎగ్గొట్టడం చాలామంది మహిళలు చేసే పని.  అంతేకాదు..  కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న భోజనం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్,  హార్మోన్ల అసమతుల్యత ప్రమాదం పెరుగుతుంది. 20 ఏళ్లు పైబడిన వారు తమ అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర వద్దు.. ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే  చేర్చుకోవడం ఉత్తమం.  శుద్ధి చేసిన చక్కెరను నివారించాలి. ఇది గుండె జబ్బులు, మధుమేహం,  ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది వాపు,  ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శుద్ధి చేసిన చక్కెర మూత్రపిండాలకు కూడా చాలా హానికరం. నిద్ర.. ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మొదలైన వాటిని మెరుగుపరుస్తుంది. నిద్ర లేకపోవడం  మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.  నిరాశ ప్రమాదాన్ని పెంచుతుంది. తగినంత నిద్ర శరీర కణాలను మరమ్మతు చేస్తుంది.  బరువును నియంత్రణలో ఉంచుతుంది. లింఫాటిక్ మసాజ్.. శోషరస వ్యవస్థకు గుండె లాంటి సహజ పంపు లేదు.  ప్రతి ఉదయం కేవలం 2 నిమిషాల తమకు తాము  మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది నీటి నిలుపుదలని తగ్గిస్తుంది.  రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.                              *రూపశ్రీ.