విజయసాయికి సీక్రెట్ మిషన్ అప్పగించిన జగన్!
posted on Jun 29, 2023 @ 9:48AM
జగన్ పార్టీలో.. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్... తర్వాత స్థానం ఎవరిది అంటే.. గతంలో అయితే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిది అని ఎవరైనా ఠపీమని ఇట్టే చెప్పేస్తారు. ఇటీవలి కాలంలో పార్టీలో విజయసాయి ప్రభ మసకబారింది. ఆయన నుంచి ఒక్కో బాధ్యతనూ తప్పించిన జగన్ ప్రస్తుతం కేవలం నామమాత్రపు పోస్టులో ఉంచి పార్టీలో కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ నెల 21న సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష కార్యక్రమంలో భాగంగా.. సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. విజయసాయి గురించి ఓ సంచలన ప్రకటన చేశారు. సాయన్న ముసలోడు అయిపోయాడు.. అందుకే అనుబంధ విభాగాల బాధ్యతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించానంటూ అందరిలో విజయసాయి పరువును గంగలో కలిపారు. దీంతో విజయసాయి అలగారనీ, బుంగమూతి కూడా పెట్టుకున్నారనీ పార్టీలోనే కాకుండా రాజకీయవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక వైసీపీతో విజయసాయి బంధం పుటుక్కుమందన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమైంది. అయితే విజయసాయికి పార్టీ బాధ్యతలు ఒక్కటొక్కటిగా తప్పించడం, ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచడం వెనుక జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలోని కీలక నేతల నుంచి అందుతున్న సమాచారం. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం కోసం పార్టీ వ్యవహారాలతో సంబంధం లేకుండా అత్యంత కీలకమైన బాధ్యతలను జగన్ విజయసాయి భుజస్కంధాలపై పెట్టారనీ, ఆ పనిలో విజయసాయి తలమునకలై ఉన్నారనీ ఆ వర్గాలు అంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పార్టీవిజయావకాశాలపై సీఎం జగన్ తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానే కాకుండా ఐ ప్యాక్ సైతం సొంతంగా చేపట్టిన సర్వేల్లో దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయనీ, పార్టీ వచ్చే ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అని ఆ రెండు సర్వేల్లో తేలడంతో ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. వరుసగా రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా దూసుకోపోవాలని పార్టీ వర్గాలకు జగన్ స్పష్టంగా దిశానిర్దేశం చేయడమే కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి నిధులను సేకరించే బృహత్తర బాధ్యతను జగన్ విజయసాయికి అప్పగించారంటున్నారు. అందుకే ఆయన నుంచి పార్టీ బాధ్యతలు ఒక్కటొక్కటిగా తొలగించారనీ చెబుతున్నారు. ఇప్పటికే విజయసాయి నిధుల సమీకరణ కోసం పని చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ‘గడప గడపకూ’ సమీక్షలో జగన్ విజయసాయిని ముసలోడని అన్నప్పటికీ.. అది పైపై ముచ్చటే కానీ, అంతర్గతంగా విజయసాయి మామూలోడు కాదు మహానుభావుడు అన్నదే జగన్ ఉద్దేశమని ఆ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు గతంలో సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉండి.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధినేతలపై నానా బూతులు, వ్యంగ్య బాణాలతో కామెంట్లు ఫోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం చాలా మర్యాదగా.. చాలా పద్దతిగా కామెంట్లు పెట్టడంపై కూడా చర్చ మొదలైంది.
అదీకాక విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె భర్త నందమూరి తారకరత్న మరణించిన సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వ్యవహరించిన తీరు నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం సైతం హల్ చల్ చేసింది. ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డిపై జగన్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం సైతం నడిచింది.
అలా వారిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్.. ప్రస్తుతం ఇలా పైకి కనిపించని బంధంగా కొనసాగుతోందని పార్టీలోని కీలక వర్గాల సమాచారం. మరి ఎన్నికల నాటికి జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించేందుకు మరోసారి విజయసాయిరెడ్డి తెర చాటు రాజకీయానికి శ్రీకారం చుట్టానున్నరనే ఓ ప్రచారం పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో అడిటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ విజయసాయిరెడ్డి.. నాటి నుంచి నేటి వరకు ఆయన ఎదిగిన పరిణామ క్రమాన్ని ఓ సారి పరిశీలిస్తే.. ఈ ఆడిటర్‌గారు మామూలోడు కాదనే ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.
పార్టీ అధినేత జగన్.. ఢిల్లీలో ఏ పని అప్పగించినా.. లేదా ఓ మారుమూల ప్రాంతంలోని ఓ సాధారణ గల్లిలో పని అప్పగించినా క్షణాల్లో ఆ పని పూర్తి చేయడం ఈ ఆడిటర్ కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సూటికేస్ ఓపెన్ చేసి.. క్లోజ్ చేసింత ఈజీగా చేసేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.