కార్యకర్తలకే విసుగొచ్చేసిన జగన్ స్పీచ్!.. ఫక్తు రొటీన్
posted on Jun 29, 2023 @ 5:00PM
రాజకీయ నాయకులలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ స్పీచ్ ఉంటుంది. కొందరు వినమ్రంగా మాట్లాడుతూనే చురకలు అంటిస్తారు. ఇంకొందరు అర్ధవంతమైన ప్రసంగంతో ఎదురువారిని ఆలోచింపజేస్తారు. మరికొందరు ఆవేశంతో మాట్లాడి ఎదుటివారిలో పౌరుషాన్ని రగిలిస్తారు. అయితే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలలో మాత్రం ఇందులో ఏదీ కనిపించదు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర నుండి ఇప్పుడు సీఎంగా వివిధ సభలలో, బటన్ నొక్కుడు కార్యక్రమాలలో ఎక్కడైనా జగన్ ప్రసంగాలు ఒకే విధంగా ఉంటాయి. ఓదార్పు యాత్ర చేస్తుండగా వాహనం పైన ప్రసంగిస్తూ పేపర్ లో రాసుకున్నది ముక్కలు ముక్కలు చూసుకొని చెప్పేవారు. పాదయాత్ర సందర్భంగా సభలలో పెద్ద పుస్తకమే తెచ్చుకొని చదివేవారు. ఇక సీఎం అయ్యాక లైవ్ మీడియా సమావేశాలకు వస్తే మాట్లాడిన మాటలు భీభత్సంగా ట్రోల్ అవడంతో ఇక లైవ్ కి రావడమే మానేశారు.
సీఎం అయ్యాక బహిరంగ సభలలో మాట్లాడే సమయంలో పేపర్ చూసే తమ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని చెప్పేవారు. అది ఆయనే రాసుకొచ్చారా? ఎవరో రాసిచ్చిందే చదివే వారో కానీ.. సభ ఏదైనా పేపర్ చూసే మాట్లాడతారు. అయితే, ఈ పేపర్ స్క్రిప్ట్ లో కూడా ఓదార్పు యాత్ర దగ్గర నుండి ఇప్పటి సభల వరకూ ఎలాంటి మార్పులు లేవు. చివరికి ప్రతిపక్షాలపై చేసే విమర్శలలో సైతం ఒకటే పంథా. అదే నాలుగు మీడియా ఛానెళ్లను తిట్టడం.. అదే టీడీపీని విమర్శించడం. తనకు పొత్తులు ఎవరూ లేరని సానుభూతి కోసం ప్రయత్నించడం.. తనకూ అన్నీ మీరేనని దగ్గరయ్యే ప్రయత్నం చేయడం. చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి నాలుగు పెళ్లిళ్లు డైలాగ్ కూడా ఐదేళ్ల క్రితం నుండి అప్పుడప్పుడు అంటున్నదే. పవన్ మీద జగన్ చేసిన నాలుగు పెళ్ళిళ్ళు, అవేశాలు, పూనకాలు, ఊగిపోవడాలు అంటూ పేల్చిన డైలాగ్ కూడా పేపర్ చూసి చదవడంతో కిక్కు లేకుండా పోయింది.
నిజానికి రాజకీయ నేతలకు ప్రజల మధ్యకి వెళ్ళినపుడు హావభావాలు చాలా ముఖ్యం. ఉదాహరణకి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకుంటే సందర్భాన్ని బట్టి హ్యాండ్ మూమెంట్ ఒక్కోలా ఉంటుంది. చంద్రబాబును చూస్తే అక్కడ పరిస్థితిని బట్టి యువతతో ఒకలా పెద్దవారిని ఉద్దేశించి మరోలా మాట్లాడతారు. అప్పుడప్పుడు చంద్రబాబు కూడా కామెడీ చేస్తుంటారు.. సీరియస్ అవుతుంటారు. కానీ, జగన్ సీరియస్ గా మాట్లాడినా, సెటైర్లు వేసినా, తన పనితనం గురించి చెప్పినా అన్నిటికీ ఒక్కటే నవ్వు కనిపిస్తుంది. దీంతో ప్రజలు ఆయన ప్రసంగాలకు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నారు. చివరికి వైసీపీ కార్యకర్తలే ఎప్పుడూ ఒక్కటేలా కాకుండా కాస్త స్టైల్ మార్చి మాట్లాడితే చూడాలని ఉందని తెగ ఇదైపోతున్నారు.
ఉదాహరణకి జనసేన పవన్ కళ్యాణ్ స్పీచెస్ చూస్తే ఈ మధ్య చాలా తేడా కనిపిస్తుంది. పంచ్ డైలాగులతో పవన్ కార్యకర్తలలో హుషారు నింపుతున్నారు. ఎంత రాసిచ్చిన స్క్రిప్ట్ అయినా ప్రజలను ఆకట్టుకొనేలా మాట్లాడగలగాలి. అలా పవన్ గత ఎన్నికలకు ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. గతంలో స్పీచ్ మధ్యలో ఆవేశంతో కంట్రోల్ తప్పిపోయే పవన్ ఇప్పుడు ఒద్దికగా ఉంటూనే సెటైర్లతో అధికార పార్టీని ఆగమాగం చేస్తున్నాడు. 'ఏపీ బాగుపడాలి అంటే వైసీపీ ఓడాలి'.. 'జనం బాగుండాలంటే జగన్ పోవాలి'.. 'హలో ఏపీ బై బై వైసీపీ' ఇలా కొన్ని స్లొగన్స్ కూడా పవన్ స్వయంగా ప్రకటిస్తూ ప్రజలలోకి వెళ్లేలా చేస్తున్నారు.
మరోవైపు నారా లోకేష్ సైతం ప్రసంగాలలో చాలా పరిణితి సంపాదించుకున్నారు. సింపుల్ గా మాట్లాడుతూనే అర్ధవంతంగా ఉండేలా లోకేష్ స్పీచ్ సాగిపోతుంది. తనపై వైసీపీ నేతలు వేసే సెటైర్లకు నొచ్చుకున్నట్లు ఎక్కడా కనిపించకుండా అవే సెటైర్లను గుర్తు చేస్తూనే వారికి కౌంటర్లు ఇవ్వడంలో లోకేష్ ఎప్పుడో మాస్టర్స్ చేశారు. ఇక ఇప్పుడు ఎటు తిరిగీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే స్పీకర్ గా వెనకబడి ఉన్నారు. ఫక్తు రోటీన్ గా మారిన ఈ స్పీచ్ లతో విసిగిపోయిన వైసీపీ కార్యకర్తలే.. ఒక్కసారి ఈ స్పీచ్ మారిస్తే చూడాలని ఉందని మాట్లాడుకుంటున్నారు.