ఇంత ఇగో లేకుండా చెప్పేస్తే ఎట్లా స్వామీ?!
స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ రూటే సపరేటు. స్టార్ పొలిటీషియన్లలోనూ జనసేనాని దారి రహదారి. అనేకమంది రాజకీయ నాయకుల మాదిరిగా ఆయనకు డొంకతిరుగుడు మాటలు రావు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. దానివల్ల సొంత మనుషులు, అభిమానులు ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఆయన చేయరు. వాళ్లు హర్టయినా సరే, దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా నిజం చెప్పడానికి ఆయన వెనుకాడరు. ఇప్పుడు వారాహి యాత్రలో భాగంగా తోటి స్టార్ హీరోల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయా హీరోలకు, వాళ్ల ఫ్యాన్స్‌కు మహదానందాన్ని కలిగిస్తుంటే, పవన్ సొంత ఫ్యాన్స్‌లో గందరగోళాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్, మహేశ్ తనకంటే పెద్ద హీరోలని, వాళ్లు తనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారనీ ఆయన తన స్పీచ్‌లో కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ గ్లోబల్ స్టార్స్ అయ్యారనీ, వాళ్లకున్న రీచ్ తనకు లేదనీ ఒప్పేసుకున్నారు. ఈ విషయం ఒప్పుకోవడానికి తనేమీ ఇగో ఫీలవట్లేదని కూడా పవన్ అన్నారు.
సాధారణంగా పవన్ కల్యాణ్ స్థాయిలో ఉన్న స్టార్ హీరో ఎవరూ ఇలాంటి విషయాలు పబ్లిగ్గా చెప్పరు, ఇతర స్టార్లకంటే తను తక్కువ అని ఒప్పుకోరు. కానీ ఈయన పవన్ కల్యాణ్! మిగతా హీరోలతో ఆయనను వేరు చేసేది ఈ స్వభావమే. అయినా ఇప్పుడు పవన్ ఈ విషయాలు ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే.. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను, తన పార్టీ జనసేనను గెలిపించమని అడగడానికి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పిన పవన్.. సినిమాల వరకు మీ మీ హీరోలను అభిమానించండి, రాజకీయలకి వస్తే అందరూ తనకు అండగా నిలబడమని ఆయన పిలుపునిచ్చారు, విజ్ఞప్తి చేశారు.
"మహేశ్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, రాంచరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియక పోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరు హీరోల అభిమానులు నాకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి." అని మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి. దటీజ్ పవన్ కల్యాణ్!
ఆయన తన వారాహి వాహనంపై నిల్చొని ఈ మాటలు చెప్తుంటే ఆయన ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ ఇప్పుడు వైరల్ అయ్యింది. అదే వేదికపై ఫ్యాన్స్ ఆ స్పీచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "వెయ్యి, రెండు వేల రూపాయల కోసం ఓట్లు వేసే జనాల కోసం, చీప్‌గా క్యాస్ట్ చూసి ఓట్లు వేసేవాళ్ల కోసం నువ్వు తగ్గుతున్నావా అన్నా?" అని ఒకరు వాపోతే, ఇంకొకరు "ఇండియాలోనే ఇగో ఏమాత్రం లేని నటుడు పవన్" అనీ కామెంట్ చేశారు. ఇంకో అభిమాని, "ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మా నాయకుడు" అంటూ 'అత్తారింటికి దారేది' డైలాగ్‌ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్ కొంతమంది అయితే, తమ ఓటు, తమ మద్దతు జనసేనకే అని చెప్పేస్తున్నారు.
ఒక్కటి మాత్రం నిజం.. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో అది సంచలనం సృష్టించింది. అందరు స్టార్ హీరోల అభిమానుల్లో పెద్ద చలనాన్ని కలిగించింది. ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌తో తమ హీరో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ, సంబరపడిపోతున్నారు. ఆయన కంటే తమ హీరోనే పెద్ద అని ఆయన ఒప్పుకున్నాడంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.
కాగా దూరదృష్టితోనే పవన్ కల్యాణ్ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చాడని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇగో అంటూ కూర్చుంటే పని కాదనీ, అందుకే అందరు హీరోల ఫ్యాన్స్‌కు పిలుపునివ్వడం ద్వారా తనపై వ్యతిరేకత తగ్గించుకోవడమే కాకుండా, వారి సానుభూతినీ, మద్దతునూ పొందవచ్చుననీ ఆయన భావించాడని వారు అంటున్నారు. మొత్తానికి ఆయన ప్రకటన వల్ల జనసేనకు ఎంతో కొంత లాభమే ఉంటుంది తప్ప నష్టమైతే ఉండదని చెప్పాలి.