ఒక్క నాటికీ క్షమించరు.. ఒక్క శాతం దాట నీయరు!
బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా, ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో, ఉభయ పార్టీల నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.
ఆ సమయంలోనే, వాజ్ పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో టీడీపీని విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రునిగా పేర్కొన్నారు. గౌరవించారు. టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని, బీజేపీ నాయకులను అదే విధంగా గౌరవించారు.అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలూకూ లబ్ధి చేకూరింది. రెండు పార్టీలూ ప్రయోజనం పొందాయి. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ పార్టీలూ కలిసి పోటీ చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలాలలో భాగస్వాములయ్యాయి.
అయితే అదంతా చరిత్ర. ఒకప్పటి మాట. నిజానికి ఒక్క తెలుగు దేశం పార్టీని, పార్టీ నాయకులను మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలను, మిత్ర పక్షాల నాయకులను కూడా వాజ్ పేయి, అద్వానీ నాయకత్వంలో పనిచేసిన బీజేపీ నాయకులు గౌరవించారు. సంకీర్ణ ధర్మాన్ని చక్కగా పాటించారు. అందుకే ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ళ పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని చక్కగా నడిపించారు. అంతవరకు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు సుస్థిర పాలన ఇవ్వలేవన్న ఆనాటి కాంగ్రెస్ నాయకుల విశ్వాసాన్ని వాజ్ పేయి వమ్ము చేశారు. సరే ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిం నుకోండి అది వేరే విషయం.
అయితే బీజేపీ ప్రస్తుత నాయకత్వం ,(మోడీ షా జోడీ) మిత్ర పక్షాలకు గౌరవం ఇవ్వక పోవడమే కాదు, అవకాశం చిక్కితే మిత్ర పక్షాల అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న టీడీపీ సహా అనేక మిత్ర పక్షాలు బీజేపీకి దూరమ య్యాయి.ఇప్పుడుకేంద్రంలో ఉన్నది పేరుకు మాత్రమే ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వం. మోదీ మంత్రివర్గంలో మిత్ర పక్షాలకు పెద్దగా స్థానం లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు పెద్ద ప్రాముఖ్యత లేదు. వాస్తవానికి మోడీ కేబినెట్ లో అమిత్ షా మినహా మిగిలిన మంత్రులెవరికీ పెద్దగా ప్రాధాన్యత, ప్రాముఖ్యతా లేదు.
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడింది. బీజేపీకి నిండా ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. అయినా కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మాజీ మిత్ర పక్షం తెలుగుదేశం అడ్డు తొలిగించి ఆ తర్వాత వైసీపీనీ టార్గెట్ చేసే దీర్ఘకాల వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్ బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని మట్టు పెట్టే కుట్రలు పన్నుతున్నది. అందులో భాగంగానే చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా, చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తెర వెనక కథ నడుపుతున్నది కేంద్రంలోని కమల దళమే అయినా తెర ముందు మాత్రం రాష్ట్ర నేతలతో మరో రకం డ్రామాను నడిపిస్తోందనే నిన్నటి అనుమానాలు, ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పడు వాస్తవం అని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల విశ్లేషణలే కాదు సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు. ఇంతవరకూ జనసేనతో కలిసి తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని వైసేపీని గద్దె దించడంలో బీజేపీ తమ వంతు పాత్రను పోషిస్తుందని అనుకున్న, ఆశించిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీజీపే అసలు రంగు బయట పడిందని అంటున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో వామ్మో బీజేపీ క్రిమినల్ బ్రెయిన్ మరీ ఇంత షార్పా అని విస్తుపోతున్నారు.
అంత క్రిమినెల్ బ్రెయిన్ ఉంది కనుకనే జగన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడమన్నట్లల్లా ఆడేలా చేసుకోగలిగారని అంటున్నారు. అయితే ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు , కుతంత్రాలకు పాల్పడినా, ప్రత్యేక హోదా సహా, ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేర్చక పోగా, వైసీపీ అరాచక,అవినీతి ప్రభుత్వానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర ప్రజలు ఒక్క నాటికీ క్షమించరనీ, ఒక్క శాతం ఓటుకు మించి రానీయరనీ అంటున్నారు.