ప్రేమతో కథలు చెపుదామా

    ప్రేమతో  కథలు చెపుదామా     కథలు వినటం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి.  ఎందుకంటే అదే నిజమని తేల్చి చెప్పాయి ఎన్నో రకాల పరిశోధనలు. అనగనగా...  అని మనం కథ  చెప్పటం మొదలుపెట్టగానే నోరు వెళ్లబుచ్చుకుని వినటం మొదలుపెడతారు పిల్లలు. వాళ్ళకి నచ్చిన కథ అయితే మనం మద్యలో ఆపినా ఊరుకోరు. ఇలా వినే కథల వల్ల వాళ్ళ ఆలోచనా పరిధి పెరుగుతుందట. మనం చెప్పే కథకి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ బుర్రలో దానికి తగ్గ వాతావరణాన్ని ఊహించుకుంటారట. ఇలా వినేటప్పుడు మనకి కనిపించే ఆ అమాయకపు కళ్ళ వెనక ఎన్నో అద్భుత చిత్రాలు కదులుతూ ఉండేసరికి వాళ్ళ మెదడు చురుకుగా పనిచెయ్యటం మొదలుపెడుతుంది. మధ్యమధ్యలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఒకొక్కసారి మనకే అంతు  చిక్కనివిగా ఉంటాయి. వాటికి సమాదానం ఇచ్చే ముందు దానికి తగ్గ సొల్యూషన్ ఎలా ఉంటె బాగుంటుంది అని మీరు మరో ప్రశ్న వాళ్ళకి తిరిగి వేస్తె చాలు వాళ్ళ చిన్న బుర్రలో ఎన్నెన్ని ఆలోచనలు పరుగులు తీస్తాయో చెప్పలేం. అలాంటి ఆలోచనలే వాళ్ళ మెదడుకి ఓ హేల్తి ఫుడ్ లా పనిచేస్తాయి.        ఒక కథ విని దాని గురించి ఆలోచనలో పడటం వల్ల మెదడులో నరాలు బాగా పని చేసి మైండ్ షార్ప్ అవుతుందని చెపుతున్నారు పిల్లల మానసిక నిపుణులు. ఇటీవల  జపాన్ లో జరిపిన ఒక సర్వే లో ఇంట్లో ఖాళీ సమయంలో టీవీ చూస్తూ లేదా వీడియో గేమ్స్ ఆడే పిల్లల మెదడు కన్నా,కథలు చెప్పించుకుని వినే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తోందని తేల్చి చెప్పారు. కాల్పనిక కథలు,జానపద కథలు ఇలా ఎన్నో రకాల కథలు పిలల్ని ఎంతో ఆలోచింపచేస్తాయి. పిల్లలకి గిఫ్ట్స్ రూపంలో కథల పుస్తకాలు కొని ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా పుస్తకాలు కొనివ్వటం అలవాటు చేసుకుంటారు. కథల పుస్తకాలు చదవటం వల్ల గ్రహింపుశక్తి పెరగటమే కాదు కళ్ళకి కూడా ఒక ఎక్సర్సైజ్ లా   పనిచేస్తుందిట.     రాత్రిళ్ళు పడుకునే ముందు పిల్లలు అడిగి చెప్పించుకునే కథల ప్రభావం వాళ్ళ  నిద్ర మీద పడుతుందిట. అందుకేనేమో అమ్మమ్మలు తాతయ్యలు దేముడి కథలు,రాజకుమారుడి కథలు చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు. పిల్లలకు  దగ్గరగా  కూర్చుని కథలు  చెప్పటం వల్ల ఇంకో లాభం కూడా ఉందిట. పిల్లల్లో అభద్రతాభావం దూరమయి వాళ్ళల్లో మానసిక బలం పెరుగుతుందిట. అమ్మ ఒడిలో పడుకుని హాయిగా కథలు వింటుంటే భయం మన పిల్లల దరిదాపులకి రావటానికి కూడా భయపడుతుంది కదా. అందుకే ప్రేమతో కథలు చెప్పటం మొదలుపెట్టెదాం.   ...కళ్యాణి

పిల్లల్లో డిప్రెషన్‌..గుర్తించటం ఎలా!

పిల్లల్లో డిప్రెషన్‌.. గుర్తించటం ఎలా!     1. ‘డిప్రెషన్‌’ ఈ మధ్యకాలంలో తరచూ అందరిదగ్గర మనకి వినిపిస్తున్న మాట ఇది. ఈ  డిప్రెషన్‌ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేక, లోలోపలే కుమిలి పోయే, ఒకలాంటి అయోమయ స్థితికి తీసుకువెళుతుంది ఎవరినైనా. ఏ వయసువారినైనా ఈ డిప్రెషన్‌ చుట్టుముట్టచ్చు. కాస్త పెద్దవాళ్లకయితే తామున్న స్థితి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాని నుంచి బయట పడటానికి కనీసం ప్రయత్నమైనా చేయగలుగుతారు. కానీ పిల్లలు అలా కాదు. అసలు తమకి ఏమవుతుందో కూడా అర్థం చేసుకోలేని వయసు వారిది. కాబట్టి పిల్లల విషయంలో మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2. పిల్లలోని డిప్రెషన్‌ను సరైన సమయంలో గుర్తించకపోతే, పిల్లల వికాసాన్ని చేజేతులారా మనమే అడ్డుకున్న వాళ్ళమవుతాం అంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డా॥ గౌరీదేవిగారు. డిప్రెషన్‌తో ఉండే పిల్లల లక్షణాలు ఇలా వుంటాయంటూ కొన్ని లక్షణాలని తెలియచేస్తున్నారు. అవి ఏంటంటే ఎప్పుడు చూసినా దిగులుగా ఉండటం, ప్రతీ విషయానికి పేచీ పెట్టి ఏడవటం, ఎక్కువగా భయపడటం, ఆటపాటల పట్ల కూడా ఉత్సాహం చూపకపోవటం, అమ్మ కొంగుపట్టుకునే తిరగటం, ఎప్పుడూ ఏదో ఒక నొప్పి ఉందంటూ చెబుతుండటం, ఆహారంపట్ల ఎక్కువ ఇష్టం ఇష్టం చూపించటం, లేదా అస్సలు ఇష్టపడకపోవటం ఇలా సాధారణ స్థితికి భిన్నంగా ఉండే లక్షణాలు కనిపిస్తాయట. 3. పిల్లలోని డిప్రెషన్‌ను గుర్తించటం ఎలాగో చెప్పుకుంటున్నాం కద.. అసలు ఈ డిప్రెషన్‌ ఎందుకు వస్తుందీ అన్న దానికీ పరిశోధకులు చెబుతున్న కారణం ‘మొదడులో డోపమిన్‌, సిరోటానిన్‌ అనే పదార్ధాల ప్రమాణం ఎక్కువ, తక్కువ అవడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారట.’ అలాగే చిన్నప్పుడు బాధాకర అనుభవాలు కూడా డిప్రెషన్‌ను కలుగచేస్తాయట. కుటుంబంలోని తల్లిదండ్రుల పోట్లాటలు, స్కూలు టీచర్లు, తోటివారి ప్రవర్తన వంటివి కూడా పిల్లల్లో డిప్రెషన్‌కు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. 4. పిల్లలో అసహజ లక్షణాలు అంటే కోపం, భయం, వంటివి కనిపిస్తే ‘ఎందుకు’! అంటూ తల్లిదండ్రులుపిల్లల్ని అరిచి, తిట్టి, హేళన చేస్తుంటారు. అది వారిని మరింత కృంగదీస్తుంది. కాబట్టి పిల్లల్లో అసహజ లక్షణాలు కనిపిస్తే కారణం ఏమైవుంటుంది అని ఆలోచించి, వారిని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావటానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. 5. మన ప్రయత్నాలేవి ఫలించనపుడు మానసిక వైద్యులను సంప్రదించటానికి సంకోచించకూడదు. డిప్రెషన్‌ అనేది ఒక మానసిక స్థితి అంటే.. తగిన సమయంలో గుర్తించి స్పందిస్తే పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు అంటున్న నిపుణుల సూచనలు పిల్లల చిన్న ప్రపంచాన్ని  సంతోషంతో నింపటానికి సహాయపడతాయి.   - రమ

పిల్లల మెను

పిల్లల మెను   పిల్లలకి పోషకాహారం ఇస్తున్నామా లేదా.. క్యాలరీలు, ప్రొటీన్లు సరిగ్గా అందుతున్నాయా లేదా.. అమ్మకి అన్నీ సందేహాలే! అందుకే మూడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ పిల్లలకు రోజుకెన్ని క్యాలరీలు తప్పనిసరిగా అందాలి. ఎంత ప్రొటీన్ ఆహారంలో వుండేలా చూసుకోవాలి... వంటి వివరాలు వివరంగా ‘అమ్మకోసం’. * 3 సంవత్సరాల చిన్నారులకు రోజుకు 1200 క్యాలరీల ఆహారం అందులో 22 గ్రాముల ప్రొటీన్లు వుండాలి. * ఇక 4 నుంచి 6 ఏళ్ళ వయసు వారికి రోజూ 1700 క్యాలరీలు, అందులో 40 గ్రాముల ప్రొటీన్లు తప్పనిసరి. * ఇక ఏడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసు చిన్నారులకు రోజూ 1950 క్యాలరీలు అందులో 41 గ్రాముల ప్రొటీన్లు వుండాలి. కేవలం ప్రొటీన్లనే కాకుండా కాల్షియం, ఐరన్... తదితర పోషకాలూ పిల్లలకి సమానంగా అందినప్పుడే వారి శారీరక, మానసిక ఎదుగుదల సంపూర్ణంగా వుంటుంది. ఈ లెక్కలన్నీ ఎలా సరిచూసుకోవటం అంటే నిపుణులు కొన్ని ఆహార పదార్ధాలని సూచిస్తున్నారు. వీటిని పిల్లలకి తయారుచేసి పెట్టడం ద్వారా పిల్లలకు తగినన్ని క్యాలరీలు, ప్రొటీన్లు అందించవచ్చు.     ఉదయాన్నే... పాలు తాగించాలి. ఆ తర్వాత ఈ క్రిందివాటిల్లో రోజుకు ఓ రకం వారికి తినిపించాలి. ఉడకబట్టిన కోడిగుడ్డు బ్రెడ్ ఆమ్లెట్ గుడ్డు పొరటు పాలక్ రోటీ ఆలూ రోటీ ఇడ్లీ క్యారట్ ఇడ్లీ మేతీ రోటీ సోయా జావ సోయా, గోధుమపిండి కలిపిన చపాతీ. పై వాటిల్లోంచి ప్రొటీన్లతోపాటు విటమిన్-ఎ పుష్కలంగా లభించి పిల్లలు చురుకుగా వుంటారు. కంటి చూపు బావుంటుంది. బ్రేక్ టైమ్‌లో... ఇక స్కూలు విరామ సమయంలో పిల్లలకు స్నాక్స్ ఇవ్వాల్సినప్పుడు... 1. టమాటో సూప్ 2. వెజ్ సూప్ 3. పండ్ల రసాలు 4. కస్టర్డ్ 5. బాదం పాలు 6. రాగిజావ వీటిల్లో రోజుకు ఒకటి ఇవ్వగలిగితే చాలు. అలానే వీటిని తయారు చేసేప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే పిల్లలకి తగినంత ఐరన్ కూడా అంది శక్తి లభిస్తుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో.... లంచ్ బాక్స్‌లో వీలయినంత వరకు రోజుకు ఒక వెరైటీ అందించడానికి ప్రయత్నించాలిట. రంగు, రుచి ఈ రెండూ పిల్లలని ఆకర్షించే అంశాలు కాబట్టి బాక్స్‌లో పెట్టే భోజనం రుచిగానే కాక ఆకర్షణీయంగా కూడా వుండేలా చూసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్‌లో భోజనం వదిలేయడం వంటివి చేయరు. లంచ్ బాక్స్‌లో తప్పనిసరిగా ఆకుకూర, కూరగాయలు, పప్పు వుండాలి. ఆకుకూర పప్పు, కూరలతో బాక్స్ కట్టవచ్చు. లేదంటే.... 1. కిచిడి 2. వెజ్ రైస్ 3. ఆకు కూరలతో రైస్ ఐటమ్స్. ఉదాహరణకి పాలక్ రైస్, మేతీ రైస్... 4. టమాటా రైస్ లాంటివి ఇలా రైస్ ఐటమ్స్ పెట్టినప్పుడు తప్పనిసరిగా క్యారట్, టమాట వంటి కూరగాయలతో చేసిన రైతాను ఇవ్వాలి. మొత్తానికి ఆకుకూరలు, కూరగాయలు పిల్లలకు రోజు అందేలా చూసుకుంటే చాలు వాళ్ళ ఎదుగుదలకి కావలసిన పోషకాలు అందినట్టే. సాయంత్రం ఏం పెట్టొచ్చు అంటే... పాలతోపాటు కార్న్ ఫ్లేక్స్ ఇవ్వచ్చు. లేదా అటుకులు, పాలు, బెల్లంతో తయారుచేసే కీర్ వంటివి పిల్లల ఆకలిని తీర్చడంతోపాటు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. రాత్రి భోజనానికి... పప్పులతో చేసే కిచిడీ, పన్నీర్‌తో చేసిన రోటీ, కూరగాయలతో భోజనం ఇస్తూ తప్పనిసరిగా ఓ కప్పు పెరుగు తినిపించాలి. రాత్రిపూట భోజనం పడుకునే ముందు కాక రాత్రి ఏడు గంటలకల్లా పెట్టి పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తాగిస్తే ఆ రోజుకి పిల్లలకి అందాల్సిన పోషకాలన్నీ అందినట్టే. ఇటీవలి కాలంలో పిల్లల్లో పోషక లోపం ఎక్కువైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం అవగాహన వున్నా పాటించకపోవటం అంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి పిల్లలు పేచీ పెట్టకుండా తింటే చాలని కాకుండా ఎదుగుదలకి అవసరమైన పోషకాలన్నీ వారికి అందేట్టు రోజువారీ ఆహారాన్ని ముందే ప్లాన్ చేసుకుని అందిస్తే పిల్లలు ఉత్సాహంగా, ఆరోగ్యంగా వుంటారు. ఆట పాటల్లో, చదువులో రాణిస్తారు అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ‘అమ్మలూ’ ఆలోచించండి.   - రమ

బోసినవ్వులే బలం

బోసినవ్వులే బలం 1) పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడిగా ఉంటుంది. పిల్లల అల్లరి సరే దానితో సమానంగా పెద్దలు  పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరమట కూడా. లల్లాయి పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటు, ఇటు ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది అంటున్నారు, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు. 2) పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని తారంగం తారంగం అంటూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి  బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వాళ్ళ ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా బలపడుతోందని, దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. 3) పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లి బిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద " ఫ్లోరిడా అట్లాంటిక్ యునివర్సిటీ " పరిశోధకులు ఇటీవల విస్తృతంగా పరిశోధనలు చేసారు, అ పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కులుగుతోందని తేలింది. 4)  చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషాపరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్ధం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన అటా- పాటా బాగా ఉపకరిస్తాయి అంటున్నారు ఈ పరిశోధన చేసిన " లుకోవిట్జ్". 5)  పిల్లల్ని ఒకచోట ఉంచి, రకరకాల బొమ్మల్ని చూపిస్తూ అడించిన దాని కన్నా, పిల్లల్ని ఒక బొమ్మగా ఆడించి , ఊపుతూ కదపటం, వారు కిలకిల నవ్వేలా చేయటం వంటివి తప్పకుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. కాబట్టి తారంగం , తారంగం వంటి అటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ అడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు. -రమ

ఇలా నేర్పించండి

ఇలా నేర్పించండి     ప్రతి పేరెంట్ కల ఒక్కటే తమ పిల్లలు చక్కగా హ్యాపీగా ఏదగాలని మంచి పొసిషన్ లో వుండాలని వాళ్ళు అందరితో శబాష్ అనిపించుకోవాలని ప్రతి పేరెంట్ కల అదే. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు అయితే మనం పిల్లలతో వ్యవహరించే తీరును బట్టి వుంటుంది అని అంటున్నారు చిట్టి విషు ప్రియ గారు.          పిల్లలని అర్ధం చేసుకుంటూ వారికీ అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనం పేరెంట్ మరియు అడల్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పసి పిల్లలు కాబట్టి వారికీ కొన్ని నేర్పించాల్సి వస్తుంది ఒకసారి కొంచెం బుజ్జగించాల్సి వస్తుంది. ఇంకోసారి కటినంగా మాట్లాడాల్సి వస్తుంది. దీనిని ఒక పేరెంట్ గా బాలన్స్ చెయ్యాలి. ములితంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సడన్ గా ఒక్కసారి కన్ను ఎర్ర చేసి వాళ్ళు వినగానే హక్కున చేర్చుకోవడం లాంటిది ములితం అంటే. వారికి నీడలాగ పక్కన వుండాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి ఎందుకు మాటి మాటికి ఈ డ్రెస్ వేసుకుంటున్నావ్ అని అడగ కుండ అసలు ఎందుకు ఆ డ్రెస్ నే ఇష్టపడుతుందో తెలుసుకోవాలి.              2 సంవత్సరాల వయస్సు నుండే వారికీ ప్రతిది నేర్పించాలి ఆడుకున్న తరువాత తన వస్తువులు తమ బాగ్స్ లో పెట్టుకోవటం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం లాంటివి నేర్పించాలి ఆలాగే తిన్న తరువాత తమ ప్లేట్ మీరు తీసుకోకుండా తమతో ఆ ప్లేట్ పక్కన పెట్టించాలి ఇలా చిన్న చిన్న పనులుకి అలవాటు పడి ఒక హబిట్ గా మారిపోతుంది. మరి కొంత మంది పిల్లలు మొండిగా ఉంటారు ఏ పని చెప్పిన చెయ్యరు . అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలంటే 'ఛాలెంజ్' అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి పిల్లలో నేను సాధించాలి అనే తపన వారిలో క్రియేట్ అవుతుంది అమ్మ కన్నా ముందు నేను చెయ్యాలి అనే తాపాత్త్రయం వాళ్ళలో మొదలవుతుంది.             టైం మేనేజ్మెంట్ అనేది కూడా పిల్లలకి నేర్పించాలి ఇది 4th or 5th క్లాసు నుండి ప్రారంబించాలి అప్పుడైతే పిల్లలకి అర్ధం అవుతుంది. వాళ్ళ ని ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా నెమ్మదిగా వర్క్ చేయడం నేర్పించాలి. ఇది ఒక అలవాటు గా మారిపోతుంది మీరు చెప్పకుండానే వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఒక పెద్ద భారంగా కూడా అనిపించదు ఎంజాయ్ చేస్తూ పనిని ముగిస్తారు  అని మంచి మాట అనే కార్యక్రమంలో చిట్టి విష్ణు ప్రియ గారు చెబుతున్నారు.

ఫాంటసీ ప్లే మంచిదే!

ఫాంటసీ ప్లే మంచిదే!   పగటికలలు ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతూ వుంటారు. అంటే, ఊహలలో విహరించడం. నిజ జీవితంలో చేయలేమనుకునే పనులని ఊహలలో నిజం చేసుకోవడం. ఈ పద్ధతి వల్ల టెన్షన్ తగ్గి కొంత మానసిక సంతృప్తి, విశ్రాంతి కూడా లభిస్తాయని అంటున్నారు నిపుణులు. ఇది పెద్దలకే కాదు... పిల్లలకీ వర్తిస్తుంది. అయితే వారికి తెలిసి చేసే పని కాదు. తెలియకుండానే వారి మనసులలోని భయాలనో, అసహనాన్నో, అయిష్టాన్నో, ఇష్టాన్నో వారి ఊహాజనితత ఆటల ద్వారా బయటపెడుతుంటారు. పిల్లల ఆటపాటల్ని దగ్గరగా గమనించే తల్లిదండ్రులందరికీ ఇది అనుభవమే. పిల్లలు టీచర్ ఆట, అమ్మ ఆట, డాక్టర్ ఆట అంటూ రకరకాల పాత్రాలను పోషిస్తూ, ఆ పాత్రల్లా ప్రవర్తిస్తూ ఆడుతూవుంటారు. అలాగే సూపర్ మేన్, హనుమాన్ అంటూ తమని తాము అతి బలవంతులుగా ఊహించుకుంటూ విన్యాసాలు చేస్తూ వుంటారు. అయితే, ఇవన్నీ పిల్లల ఆటలేనని కొట్టిపారేయడానికి  లేదు అంటున్నారు పిల్లల మనస్తత్వవేత్తలు.   నిజానికి సూపర్ మేన్, హనుమాన్ వంటి ధీరోదాత్త పాత్రలని అభియనించే పిల్లలు అతి పిరికితనం కలిగి వున్నవారో, అలాగే బిడియస్తులో కావచ్చు. వారిలోని ఆ లక్షణాలని జయించడానికి వారికి తెలియకుండా వారు చేసే ప్రయత్నమే ఆ ఆటలు. వారు పదేపదే నేను ఇలా చేస్తాను.. అలా చేస్తాను అని చెబుతుంటే ఆ విషయంపై పిల్లలు ఎక్కువ వత్తిడికి గురవుతున్నారని గ్రహించాలని అంటున్నారు నిపుణులు. చీకటంటే భయపడే ఓ కుర్రాడు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి ఒక్కడే వెళ్ళలేని వాడు వాడి ఆటలలో భాగంగా ‘‘నేను విమానమెక్కి దూరంగా వున్న కొండపైకి వెళ్తున్నాను. రాక్షసుడు వస్తే ఫైట్ చేసి పడేస్తాను’’ అంటాడు. అంటే మనసు మూలలలో వాడిలోని భయాన్ని జయించడానికి వాడు పెద్ద ప్రయత్నమే  చేస్తున్నాడు. అది ఈ విధంగా వాడి ఆటలో బయటపడుతోంది అని అర్థం. టీచర్ ఆట ఆడుతూ పిల్లల్ని కొట్టడం, అమ్మ ఆట ఆడుతూ అందర్నీ విసుక్కోవడం వంటివి ఆ పాత్రలోని నిజమైన వ్యక్తుల ప్రవర్తన పట్ల పిల్లల మనసులో వున్న వ్యతిరేకతనితెలియపరుస్తాయి. ‘ఫాంటసీ ప్లే’ అని పిలవబడే ఈ ఊహాజనిత ఆటలు కేవలం పిల్లల మానసిక బలహీనలతనే కాదు. వారిలో గాఢంగా దాగున్న ఆశలు, వారి బలాలని కూడా బయటపెడతాయి.   ‘‘నేను పెద్దయ్యాక డ్రైవర్ని అవుతా’’ అని ఓ పిల్లాడు అన్నాడనుకోండి. ఆ తల్లిదండ్రులు వెంటనే ‘‘నోర్ముయ్’’, ‘‘పిచ్చివాగుడు’’ ఏ డాక్టరో అవుతానని అనక అని అరిచి పిల్లాడి నోరు మూసేస్తారు. కానీ, అది చాలా పెద్ద పొరపాటు అంటున్నారు పిల్లల మనస్తత్వవేత్తలు. ఎందుకంటే ‘‘డ్రైవర్’’ అవుతాననో, ఇంకేదో పిల్లాడు చెబుతుంటే, అది వాడి ఇష్టం అని గ్రహించాలి. నిజానికి ఆ ఇష్టాలు రోజుకొకటి చొప్పున మారుతుంటాయి కూడా. అయినా వాటిలో చిన్నప్పుడు వాడు తెలిసీ తెలియక వ్యక్తం చేసిన ఓ విషయంపై ఇష్టం వాడి మనసులో పెరిగి పెద్దదయ్యే నిజమైన సందర్భాలూ వుంటాయి. ఏ పైలెట్టో అవ్వొచ్చు డ్రైవర్ అవుతానన్న కుర్రాడు. నిజానికి చిన్నతనంలో పిల్లలు ఆడుకునే ఆటలన్నీ వారి ఊహాజ్ఞానాన్ని వృద్ధిపరిచేవే. ఎక్కడో విన్న ఓ కథకు మరిన్ని మార్పులు, చేర్పులు చేసి పిల్లలు ఆటలాడటం మనకి తెలిసిందే. ‘‘ఫాంటసీ ప్లే’’ పిల్లల ఊహాపరిజ్ఞానాన్ని బయటపెడుతుంది. ఇది ఒకవిధంగా వారి మానసికాభివృద్ధికి సహాయపడే ఓ ప్రక్రియ. ఇది గ్రహించకుండా తమ కల్పనాశక్తిని వ్యక్తం చేస్తున్న పిల్లలు ఆడుకునే ఆటలను పెద్దవాళ్ళు నిరుత్సాహపరచకూడదు. వీలయితే పెద్దలూ అందులో చేరి  వాటిని ప్రోత్సహించాలి. లేదా చూసీ చూడనట్టు వదిలేయాలి. అంతేకాని పొంగుతున్న పాలమీద చన్నీరు పోసినట్టుగా వారి ఉత్సాహాన్ని నీరుగార్చకూడదు. అలా చేస్తే పిల్లలలోని కల్పనాశక్తి అడుగంటిపోయే ప్రమాదం వుంది. వారి ఆలోచనలు, భావాలు పదును తేలవు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సహజంగా పిల్లలు ఆడుకునే ‘‘ఫాంటసీ ప్లే’’ని ప్రయత్నపూర్వకంగా వారితో ఆడించే ప్రయత్నం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. అంటే. ‘‘నువ్వు నీకు నచ్చిన పాత్ర చేసి చూపించు’’ అని అడగటం, నువ్వే హీరోవి అయితే ఏం చేస్తావ్ అని అడిగి వారి మనసులోని మాటలు పైకి చెప్పించడం, వారు విన్న కథలలోని పాత్రలని అనుకరించమని ప్రోత్సహించడం వంటివి పిల్లల ఊహాశక్తికి పనిచెబుతాయి. అంతేకాదు, పిల్లల్లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ‘‘ఫాంటసీ ప్లే’’ పిల్లల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అంటున్నారు నిపుణులు. మరి ఆలోచిస్తారు కదూ!

మీ బుజ్జాయి బాడీ మసాజ్ కోసం

మీ బుజ్జాయి బాడీ మసాజ్ కోసం బెస్ట్ ఆయిల్స్ ఎంపిక..     పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. వయసు ఏదైనా సరే శరీరానికి చేసే ఆయిల్ మాసాజ్ ఎన్నో మంచి ఫలితాలనిస్తుంది. అలసట, బడలికలను దూరం చేసి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మాసాజ్ వలన ఎముకలు గట్టిపడతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుండే నరాలకు బలం కలిగి వారిలో రోగ నిరోధక వ్యవస్ధ పటిష్టమవుతుంది. సాధారణంగా పిల్లలకు వచ్చే వర్షాకాల జలుబులు, దగ్గులు వంటివి కూడా దరిచేరకుండా వుంటాయి. పిల్లలు ఎంతో హాయిగా, హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. శరీర వికాసంతోపాటు బుద్ధి కూడా వికసిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత పిల్లలు హాయిగా నిద్రించటం మన ఇండ్లలో గమనిస్తూనే వుంటాం.. అన్నిటిని మించి మసాజ్ చేసే తల్లి మమతానురాగాల స్పర్శ పిల్లలకు పూర్తి రక్షణ నిస్తుంది. తల్లి ప్రేమపూర్వక పెంపకంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు.     పిల్లలకు శారీరక మర్దన తల్లి చేయటమే ఎంతో మంచిది. వేరెవరైనా అయితే, వారి చిన్నిపాటి శరీరాలకు మర్దనా బలం ఎక్కువ, తక్కువలయ్యే అవకాశం కూడా వుంది. తల్లి మమతే పిల్లలకి కొండంత బలం. వారిది విడదీయరాని అనుబంధం. తల్లినుంచి పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. పిల్లల నడవడికకు తల్లే ఆదర్శం మార్గదర్శి. అయితే, పిల్లల చర్మం ఎంతో సున్నితంగా వుంటుంది. మాసాజ్ కు వాడే ఆయిల్ ఎంతో నాణ్యతలతో కూడుకున్నదై వుండాలి. ఇది శరీరంలోకి ఇంకి ప్రతి కణాన్ని ఉత్తేజపరచేలా వుండాలి. నేడు మార్కెట్ లో లభ్యమవుతున్న బేబీ ఉత్పాదనలలో బేబీ ఆయిల్ కూడా వుంటుంది. బేబీకి ఏది వాడినప్పటికి నాణ్యతా ఉత్పత్తులే వాడి చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో శ్రధ్ధ వహించండి. అందుకు మీ బేబీ బాడీ మసాజ్ కు ఉపయోగించేటటువంటి కొన్ని నూనెల ఎంపిక మీ కోసం...     1. వెజిటేబుల్ లేదా ప్లాంట్ ఆయిల్: ఈ నూనెలో బేబీ చర్మంలోనికి చర్మ రంధ్రాల ద్వారా శోషించబడతాయి కాబట్టి కొంత మంది ఎక్సపర్ట్స్ మీ బేబీ మసాజ్ కు ఈ ఆయిల్స్ ను వాడమని సలహా ఇస్తుంటారు. ఈ నూనెలో సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఆయిల్ మసాజ్ చేసే సమయంలో మీ బేబీ వెళ్ళను నోట్లో పెట్టుకొని చుంబిస్తుందనే భయం అవసరం లేదు.     2. కొబ్బరి నూనె: ఇది చాలా ఆదర్శవంతమైన మరియు అత్యంత సాధారణంగా ఉపయోగించే మసాజ్ ఆయిల్. గోరివెచ్చిని కొబ్బరి నూనెతో బేబీకి మసాజ్ చేయడం వల్ల బేబికి ఓదార్పు కలుగుతుంది. మరియు బేబీ చర్మం, జుట్టు మరియు ఎముకలకు మేలు చేస్తుంది. చాలా మంది ఈ నూనెను పిల్లల బాడీ మసాజ్ కు వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.     3. ఆవాల నూనె(మస్టర్డ్ ఆయిల్): ఈ నూనెను చాలా ఇల్లలో చాలా మంది బాడీ మసాజ్ కు తరచూ వినియోగిస్తుంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు, ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ఇంకా జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శీతాకాలంలో ఈ నూనెతో బేబీకి బాడీ మసాజ్ చేయడానికి సూచిస్తుంటారు. ఈ వెచ్చని మస్టర్డ్ ఆయిల్ తో బేబీ బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం మీద కేశాలు రాకుండా నిరోధిస్తుంది. అతి చిన్న వయస్సులోనే బేబీ చెస్ట్, కాళ్ళు, చేతుల మీద అనవసరంగా వచ్చే కేశాలను నిరోధిస్తుంది.     4. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. మీ బేబీకి హెయిర్ గ్రోత్ తక్కువగా ఉన్నట్లైతే ఆలివ్ ఆయిల్ తో తలకు బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయించాలి. ఇంకా బేబీ కను బొమ్మల చక్కటి ఆక్రుతి కోసం ఈ ఆయిల్ ను కనుబొమ్మల మీద మర్ధన చేయవచ్చు. మీ బేబీ బాడీ మసాజ్ కోసం ఈ బెస్ట్ మసాజ్ ఆయిల్ ఎంపికచేసుకొంటే బేబీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నాకూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించబడుతాయిప. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు ఎటువంటి హాని జరగకుండా మీ చేతి గాజులు, ఉంగరాలు మరియు ఇతర ఆభరణాలను తొలగించండి

పిల్లల ఆలోచన ప్రవర్తనలలో మార్పు తేవాలంటే...?

పిల్లల ఆలోచన ప్రవర్తనలలో మార్పు తేవాలంటే...? పిల్లలు పెరిగి పెద్దవారవుతుంటే వారి ఆలోచన ప్రవర్తనలలో మార్పు వస్తుంటుంది. అయితే పిల్లల మనస్తత్వం మారుతోందన్న విషయం గమనించక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మొండిగా తయారవుతున్నారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొందరి మగపిల్లల్లో పది, పన్నెండేళ్ళు వచ్చేసరికి వారి ప్రవర్తన అనూహ్యంగా మారిపోతుంది. అప్పటివరకు ఇంట్లో సరదాగా ఉంటూ, ఇంటి పనుల్లో సహకరిస్తూ సర్దుకుపోతు ఉండేవాళ్ళు, కాస్తా అన్నింటికి విసుక్కోవడం వాదన చేయడం మొదలు పెడతారు. ఏ పని చెప్పిన, ఏ సలహా చెప్పిన తీవ్రంగా స్పందిస్తారు. గట్టిగ అరుస్తారు. తోడ పుట్టినవాళ్ళతో ఊరికే గొడవ పెట్టుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలకు, తల్లిదండ్రులకూ కూడా ఇది కొంత కష్టకాలమే మరి దీనిని ప్రశాంతంగా దాటాలంటే? నిపుణులు చేస్తున్న సూచనలు ఇవి. తమ హెయిర్ స్టైయిల్ నుంచి వేసుకునే బట్టలు దాకా అన్నీ తమకు నచ్చినట్లు ఉండాలనుకుంటారు. అవి ఇంట్లో పెద్దవాళ్ళకు నచ్చవు.ఇలా ప్రతి విషయంలో పిల్లల అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అసలు పది పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి పిల్లల్లో ఇలా మార్పు రావటానికి కారణం ఏంటి అన్న విషయంపై అవగాహనా వస్తే పిల్లలు గాడి తప్పకుండా చూసుకోవడం సులువవుతుంది అంటున్నారు నిపుణులు. పది పన్నెండేళ్ళ వయసంటే బాల్యానికి దూరంగా జరుగుతూ, క్రమేపి టీనేజ్ లోకి అడుగుపెడుతున్నదశ. ఈ దశలో హార్మన్ల ప్రభావం అధికంగా ఉంటుందట. దాని వలన శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయట. నిజానికి పది పన్నెండేళ్ళ పిల్లలు స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కావాలని ఆరాటపడుతుంటారు. ఒకోసారి పెద్దవారిలా వాదనలు పెట్టుకునే ఈ పిల్లలే మరోసారి చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా పెద్దల అజమాయిషీని ఎదుర్కోవడానికే, తమ ఇష్టాలను కాపాడుకోవడానికే మాత్రమే వీళ్ళు మొండిగా ప్రవర్తిస్తుంటారు. కాని అది మనకు మూర్ఖత్వంగా కనిపిస్తుంది. దానికి తల్లిదండ్రుల కూడా చేయి దాటిపోతున్నడంటూ కఠినంగ వ్యవహరించడమ మొదలు పెడతారు. దానితో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి దూరం మొదలవుతుంది. ఎవరికీ వాళ్ళు ఎదుటి వల్ల తీరు అంతే మారారు అనుకుంటూ ప్రతీ విషయంలో గొడవ పడటం మొదలవుతుంది. అయితే పిల్లల ఎదుగుదలలో భాగంగా వచ్చే మార్పులో ఇవన్నీ అని తెలిసుకుంటే తల్లిదండ్రులు పిల్లలలో వచ్చే మార్పుకు అంత తీవ్రంగా స్పందించారు అంటున్నారు నిపుణులు. ఎదురుతిరగటం, తన ఇష్టాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం, స్వంత నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా పిల్లల ఎదుగుదలలో భాగంగా చూడాలి. అయితే పిల్లలు కోరే స్వేచ్చ ఇస్తూనే కొన్ని పరిమితులు విధించాలి. లేకపోతే పిల్లలు దరి తప్పే అవకాశం వుంది. అందుకు ఒకటే మార్గం. పిల్లల పరిమితులు, వారి ప్రవర్తకి సంబందించిన నిబంధనలను వారికీ వివరించాలి. అంటే "నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు కానీ ఈ పరిమితులు మాత్రం దాటకూడదు" అని ముందే వారికీ స్పష్టంగా చెప్పాలి. దానితో పిల్లలకి కూడా ఎంతవరకు తాము స్వేచ్చగా ఉండొచ్చో తెలుస్తుంది. అమ్మ నాన్న తనని కట్టిపడేయటం లేదని అర్ధమవుతుంది.. ఎదుగుతున్నకొద్ది వాళ్ళ స్వంత అభిప్రాయాలను ఇష్టాలను ఏర్పరచుకుంటారు. మనం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళు ఎదురు తిరగరు. ఆత్మ రక్షణగా మాత్రమే పిల్లలు ఎదురు తిగుతుంటారు. అందుకే వారికీ అవకాశం ఇవ్వకుండా వారికీ ఏది చెప్పాలన్న చర్చగా మార్చాలి. అంటే నేను చెబుతాను నువ్వు విను అన్నట్టు కాకుండా.. పిల్లలకి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ తరవాత వారి అభిప్రాయం తప్పనిపిస్తే ఆలోచించు అని మాత్రమే చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఏ విషయమైన అమ్మానాన్నలతో చెప్పటానికి సంశయించారు. పిల్లలని ఈ వయసులో దారిలోకి తేవటానికి ఒక్కటే సిక్రెట్. కమాండింగ్ గా వారికీ ఏది చెప్పకూడదు. కేవలం సూచనా చేస్తున్నట్టు మాత్రమే ఉండాలి. ఈ చిన్న సీక్రెట్ తో పిల్లలు టీనేజ్ జర్నీని సేఫ్ గా, హ్యాపీ గా దాటెయ్యొచ్చు. పిల్లలు తల్లిదండ్రులు కూడా..   - రమ.  

పిల్లలకి ‘ఆర్ట్ ఆఫ్ సేవింగ్’ నేర్పాల్సిందే

  పిల్లలకి ‘ఆర్ట్ ఆఫ్ సేవింగ్’ నేర్పాల్సిందే   డబ్బు పొదుపు చేయటం కూడా ఒక కళే. అవసరాలకు తగ్గట్లు ఒక క్రమపద్ధతిలో డబ్బు ఖర్చు చేయటం, మిగిలినది భవిష్యత్తు కోసం పొదుపు చేయటం మంచిదని అందరికి తెలిసిందే. అయితే ఇలాకాక డబ్బును దుబారా చేయటం, లేదా అవసరాలకు కూడా ఖర్చు చేయకుండా తాము ఇబ్బంది పడుతూ, ఇంట్లో వారినీ ఇబ్బంది పెడుతూ అతిగా పొదుపు చేయటం రెండు తప్పే. అందుకే డబ్బు పొదుపు చేయటం ఒక కళ ఒక్కరోజులో అలవాటు కాదు. సంపాదన మొదలవ్వగానే డబ్బును మేనేజ్ చేయటం వస్తుందనుకోవటం పొరపాటు. అది చిన్నతనం నుంచే అలవడాల్సిన కళ. డబ్బు విలువ చిన్నప్పటి నుంచి తెలిసిన వారు పెద్దయిన తరువాత డబ్బును చక్కగా మేనేజ్ చేయగలరుట. తమ తెలివితేటలను, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి అవసరమైనంతవరకే డబ్బు ఖర్చుపెట్టే పొదుపరులుగా పిల్లలు రేపు పెద్దయ్యాకా ఉండాలంటే అందుకు చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు వారికి డబ్బు విలువ తెలియచేయాలి. పిల్లల ప్రతీ అవసరాన్ని తామే గుర్తించి తీర్చటం కాకుండా, పిల్లలు తమ అవసరాలు ఏంటో తామే గుర్తించి తల్లిదండ్రులను అడిగే అవకాశం ఇవ్వటం మొదటి ప్రయత్నం. ఆ తరువాత కాస్త ఎదిగిన పిల్లలకి కొంత డబ్బు ఇచ్చి వాటిని తమ అవసరాలకు ఉపయోగించుకోమనటం రెండో ప్రయత్నం. ఇందులో తల్లిదండ్రులు ఎంతో నిక్కచ్చిగా ఉండాలి. ఇచ్చిన డబ్బును అనవసర ఖర్చులకు ఉపయోగించి, తిరిగి అవసరానికి చేయిచాచితే "లేదు" అని ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే పిల్లలు ఉన్న డబ్బుని అవసరాల మేరకు ఖర్చు చేసుకోవటం నేర్చుకోగలుగుతారుట. పిల్లలకు పాకెట్ మనీ ఏ వయసు నుంచి ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు అనేది చాలా మంది తల్లిదండ్రులకు వచ్చే అనుమానం. 6 ఏళ్ళు దాటిన పిల్లల నుంచి పాకెట్ మనీ ఇవ్వటం ప్రారంభించవచ్చు అంటున్నారు నిపుణులు. వారానికి ఒకసారిగా ఇంత అని ప్రారంభించి, పిల్లలు పెద్దవుతున్న కొద్దీ దానిని నెలకి ఒకసారిగా మార్చాలి. వాటిని వారి ఇష్టాలు, అవసరాలు, భవిష్యత్తులో కొనుక్కోవాలనుకుంటున్న పెద్ద వస్తువులు ఇలా విభజించి ఖర్చు చేయటం, దాచుకోవటం నేర్పించాలి. ప్రతీ వారం మీరు పిల్లాడికి కొంత డబ్బు ఇస్తుంటే, అప్పుడు తనకి చెప్పాలి. ఈ డబ్బును నువ్వు ఇప్పటి అవసరాలకి ఖర్చుచేసుకుని, మిగిలినది దాచుకుంటే ఆ మిగిలిన డబ్బు కొంత మొత్తం అయ్యాకా నీకు నచ్చిన బైసికిల్, వీడియోగేమ్ వంటి పెద్ద ఇష్టాలను తీర్చుకోవచ్చని! అప్పుడు డబ్బు విషయంలో అబ్బాయి నైజమేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది మనకు. పూర్తిగా దుబారా చేస్తున్నాడా? అవసరాలు కూడా తీర్చుకోకుండా పిసినారిగా ఉంటున్నాడా? గమనించగలిగితే చిన్నతనంలోనే డబ్బు పట్ల సరైన దృక్పథం ఏర్పరచుకునేలా తనని మలచవచ్చు.  డబ్బు విలువ పిల్లలకు తెలియాలన్నా, దానిని సరిగ్గా మేనేజ్ చేయటం నేర్చుకోవాలన్నా పిల్లలకు తప్పకుండా డబ్బు ఇవ్వాలి. పర్యవేక్షించాలి. అవసరం మేరకు సలహాలు ఇవ్వాలి. అప్పుడే పిల్లలు పెరిగి పెద్దయ్యాక డబ్బును సక్రమంగాఉపయోగించుకోగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా చిన్నతనం నుంచి అలవాడాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆలోచిస్తారు కదూ! -రమ ఇరగవరపు  

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు?

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు? తల్లిదండ్రుల అవసరం లేకుండా పిల్లల్ని పెంచిన వారే ఉత్తమ తల్లిదండ్రులు. ప్రతి క్షణం పిల్లలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తల్లిదండ్రుల లక్షణం ఎలా ఉంటుందంటే…  మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టుకు కావలసిన నీరు, ఎరువులు సమకూరుస్తాం కానీ చెట్టుకు ఇలా ఎదుగు, అలా ఎదుగు అని ప్రతిక్షణం చెప్పం కదా! అలాగే పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇవ్వాలే గానీ బందీలు చేయరాదు. తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన వాటిని పిల్లల నుండి సాధించుకోవాలనే ఆలోచన పెంచుకొని వారి మీద వత్తిడి పెంచుతున్నారు. అటువంటి వారు మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లలు ఉత్తమంగా ఎదిగే వాతావరణం కల్పించేలా చేసే వారే మంచి తల్లిదండ్రులు. పిల్లల పెంపకం వ్యక్తిగతమైనదైనా తల్లిదండ్రులు ఆ పనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి సమాజానికి తమ సేవను సమర్ధవంతంగా నిర్వహించడానికి దీక్షతో కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పెద్దవారు. వారు చేసే పనులు గమనిస్తూ అనుసరిస్తారు. దానిని బట్టే వారి నడవడిక, ప్రవర్తన ఆధారపడతాయి. ప్రపంచంలో సర్వదోషాలకు ఈర్ష్య, స్వార్థాలు కారణం. ఇవి పెద్దల వలన పిల్లలపై ప్రభావం చూపి చెడును ప్రేరేపిస్తాయి. పిల్లలను హద్దులో పెట్టి బాగు చేసే ప్రయత్నం కన్నా పెద్దలలో మంచి మార్పు తెచ్చుకొని బాగుచేయడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలను భావి పౌరులుగా ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నారు. ఆ ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యతా లోపం చోటు చేసుకుంటే ఆ నష్టాన్ని సమాజం 60-70 సంవత్సరాల పాటు భరించవలసి వస్తుంది.  పిల్లలను ఎలా పెంచాలి? ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలను రాజకుమారుల్లా, అతి గారాభంగా పెంచాలి. ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించాలి. పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలాగా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకూ, దేశానికీ, కట్టుకున్న వారికీ సమస్య అవుతారు. చిన్నతనం నుంచీ మన తల్లి తండ్రి నుంచి మనం ఏమి కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి ఆ తప్పులే మళ్ళి మనం చేయకూడదు. పిల్లలు పెరిగి ప్రయోజకులుగా మారి, మనల్ని ఉద్దరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే స్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని తెలుసుకోవాలి. చిరుప్రాయంలో తల్లి ఇచ్చే శిక్షణా విధానం పిల్లల భవిష్యత్ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయంపై కొన్నేళ్ళ క్రితం ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో వెళ్ళడైన విషయం ఇది. "ఓ తల్లి పిల్లవాడికి నడక నేర్పే ప్రయత్నంలో పిల్లవాడికి కొంత దూరంలో నిలబడి తన వైపు రమ్మని ప్రోత్సహిస్తుంది. అప్పుడు పిల్లవాడు తల్లిని చేరుకోవాలని ఆశతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో పిల్లవాడు అదుపుతప్పి పడిపోయి, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తల్లి పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి ఓదారుస్తూ, చీ పాడునేల! నీవల్లే మా పిల్లాడికి దెబ్బలు తగిలాయంటూనే నేలను కొట్టింది. అప్పుడు పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. ఇదే విధంగా మరో తల్లి తన పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు, ఆ పిల్లవాడు తల్లి వైపు నడుస్తూ ఉండగా పడిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడి దగ్గరకు వెళ్ళకుండా దూరం నుండే 'లే నాయనా! లే లేచిరా!' అంటూ ఉత్సాహపరిచింది. ఆ పిల్లవాడు మెల్లగా లేచి నడుచుకుంటూ తల్లిని చేరుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయిన తరువాత వారి స్వభావాన్ని పరిశీలిస్తే తేలిందేమిటి. మొదటి పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలకు, అపజయాలకు బయట పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులే కారణమని నిందించే స్వభావం కలిగిన వాడయ్యాడు. రెండవ పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలు, అపజయాలను ఎదుర్కోగల మనోబల సంపన్నుడయ్యాడు. ఆలోచనలు మనం చేసే పనుల యొక్క సున్నిత రూపాలు. అవి మెదడులో చిన్న విద్యుత్తరంగాలుగా జీవం పోసుకొని, చుట్టూ ఉండే గాలిలాగ, పీల్చుకొనే ఊపిరిలాగ మనకు తెలియకుండానే మన బాహ్యమనోపరికరాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  ముఖ్యంగా పిల్లల పెంపక బాధ్యత స్త్రీల మీదే ఆధారపడి వుంటుంది.                                  ◆నిశ్శబ్ద.

తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి?

తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి? "చిన్నపిల్లల ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళ చిన్న ప్రపంచం వారికి ఎంతో ఆనందమైనది, అద్భుతమైంది. తల్లితండ్రులు పిల్లల ప్రపంచంలో అడుగు పెట్టి వారి అనుభూతులను పంచుకొని వారిలో ఒకరిలా కలిసిపోవాలి. అలా పిల్లలను మెల్లమెల్లగా వారి చిన్న ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి" అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.  ప్రతీ తల్లితండ్రి తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశించడం సహజం. కానీ పిల్లల శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా ఆశల ఒరవడిలో కొట్టుకుపోయి వారిని ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదు. సాధారణంగా తల్లితండ్రుల్లో మూడు రకాల మనస్తత్వాలవారు ఉంటారు. మొదటి కోవకు చెందినవారు - మనం ఎలాగూ కష్టపడ్డాం కదా! పిల్లలైనా సుఖంగా ఉండాలని వారు అడిగినవన్నీ సమకూర్చే తల్లితండ్రులు. రెండవ కోవకు చెందినవారు తాము ఎంతో క్రమశిక్షణతో పెరిగామని భావించి, పిల్లల పట్ల క్రమశిక్షణ పేరుతో కఠినమైన ఆంక్షల్ని విధించే తల్లితండ్రులు. ఇలా ఒకరు 'అతివృష్టి'కి మరొకరు 'అనావృష్టికి' తార్కాణాలుగా నిలిచే రెండు రకాల మనస్తత్వాలు గల తల్లితండ్రులు. ఇక మూడవ కోవకు చెందిన తల్లితండ్రులు - తమ పిల్లలు వారిలాగే మూస పోసినట్లుగా ఉండాలని ఆశించే తల్లితండ్రులు. ఈ కోవకు చెందినవారు చాలా ప్రమాదకరమైనవారు,  అత్యాశాపరులు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ తెలివైన విద్యార్థి గణితంలో ఎప్పుడూ 90 మార్కులకు పైనే సాధించేవాడు. కానీ హఠాత్తుగా ఆ విద్యార్థికి గణితంలో 0 మార్కులు వచ్చాయి. అందుకు కారణం విచారించగా ఆ విద్యార్థి తల్లి 'నీకు గణితంలో నూటికి నూరు మార్కులు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని బెదిరించిందని తెలిసింది. దానితో ఒత్తిడికి గురైన ఆ విద్యార్థి పరీక్షలు రాయలేకపోయాడు. ఆ విద్యార్థి తల్లి గణిత శాస్త్రంలో స్వర్ణపతకం సాధించిన మేధావి. తనలాగే తన కుమారుడు కూడా గణితంలో స్వర్ణపతకం సాధించాలనే ఆమె అత్యాశ ఆ విద్యార్థి మతిస్థిమితం కోల్పోయే స్థితికి దిగజార్చింది. తల్లితండ్రులు అతివృష్టి, అనావృష్టి, అత్యాశ - ఈ 'అ'త్రయం బారిన పడకుండా పరిపక్వతతో వ్యవహరించాలి. అందుకు ఈ సూచనలను పాటించండి. 1. పిల్లలను ఇతరులతో పోల్చకుండా ఉండడం. 2. పిల్లల తెలివితేటలను అంచనావేయడం. 3. పిల్లల అభిరుచులను అవగాహన చేసుకోవడం. 4. ఇంట్లో చదువుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం. 5. పిల్లలతో సన్నిహితంగా స్నేహితునిలా మెలగడం. 6. పిల్లల్లో ఒత్తిడి పారద్రోలే ఓదార్పును ఇవ్వడం. 7. అసహనాన్ని చూపకుండా వారు చెప్పిన విషయాన్ని వినడం. 8. పిల్లలను అవమానించకుండా వారిని అభినందించడం. 9. పిల్లల్లో అభద్రతాభావం కలగకుండా శ్రద్ధ వహించడం. 10. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే సంఘటనలను వివరించడం.  మూడు స్థాయిల్లో ఉన్న విద్యార్థులకు మనం అందించాల్సిన విషయాలు వేరుగా ఉంటాయి. విద్యార్థుల స్థాయిని బట్టి కొన్ని అవసరం, మరికొన్ని అనవసరం అవుతాయి..  తెలివైన విద్యార్థి కి మార్గదర్శకత్వం అందిస్తే చాలు.. సాధారణ విద్యార్థి కి మార్గదర్శకత్వంతో పాటు  ఆప్యాయత కూడా అవసరం అవుతుంది. అతిసాధారణ విద్యార్థి: మార్గదర్శకత్వం, ఆప్యాయతతో పాటు నువ్వు సాధించగలవు అనే ఆత్మవిశ్వాసం అందించాలి.  ఈ సూచనల్ని పాటించిననాడు 'I have found the hap- piness of parenthood greater than any other that I have experienced. - పిల్లల పెంపకంలో ఉన్న మాధుర్యం కన్నా మించినది మరొకటి లేదు' అన్న బెర్ట్రాండ్ రస్సెల్ అనుభవం నిజమవుతుంది. ఆ ఆనందానుభూతితో పిల్లల్ని ఆదరించి, వారి శక్తిసామర్థ్యాలను అర్థం చేసుకున్ననాడు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.   ◆నిశ్శబ్ద.

వర్కింగ్ ఉమెన్స్ పిల్లలకు పాలు ఇవ్వడంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..!

  వర్కింగ్ ఉమెన్స్ పిల్లలకు పాలు ఇవ్వడంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..!   ఇప్పటి కాలంలో ఆడవారు మల్టి టాస్కర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరొక వైపు ఉద్యోగం, పిల్లల సంరక్షణ అన్నీ హ్యాండిల్ చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలను కనడం, వారిని చూసుకుంటూ ఉద్యోగం చేయడం చాలా ఓపికతో కూడుకున్నది. మహిళలు ప్రయాణాలలోనూ,  ఆఫీసులకు కూడా తమ చంటి పిల్లలను  తీసుకెళ్ళి  తమ విధులు నిర్వర్తిస్తుంటారు.  అయితే  నలుగురిలో పిల్లలకు పాలివ్వడం ఇబ్బంది కలిగిస్తుంది. మరికొందరికి పిల్లలను తమతో తీసుకెళ్లే వీలు ఉండదు.  ఇలాంటి వర్కింగ్ ఉమెన్స్ పిల్లలకు పాలు ఇవ్వడంలో కొన్ని విషయాలు తెలుసుకుంటే.. అవి వారికి చాలా ఉపయోగపడతాయి.. బ్రెస్ట్ ఫీడింగ్ షెడ్యూల్.. పిల్లలకు పాలు ఇవ్వడానికి సమయాన్ని ప్లాన్ చేయాలి.  ఆఫీసుకు లేదా ఇతర పనుల మీద బయటకు వెళ్ళే ముందు,  ఆ తరువాత పిల్లలకు పాలు ఇవ్వడానికి ట్రై చేయాలి.  ఒక నిర్ణీత సమయానికి పిల్లలకు పాలు ఇవ్వడం అలవాటు చేస్తే ఆ తరువాత పిల్లలు కూడా అదే సమయంలో పాలు తాగడానికి అలవాటు పడతారు. దీని వల్ల తల్లులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బ్రెస్ట్ పంప్.. పిల్లల కోసం తల్లులకు ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చిన వస్తువు బ్రెస్ట్ పంప్. నాణ్యంగా,  సౌకర్యవంతంగా,  ఉపయోగించడానికి సులభంగా ఉండే బ్రెస్ట్ పంప్ ను కొనుగోలు చేయడం వల్ల తల్లులకు పాలు ఇవ్వడంలో కంగారు తగ్గుతుంది. కొన్ని ఎలక్ట్రిక్ పంప్ లు సెషన్ ల కోసం రూపొందించబడతాయి. సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇవి మంచివి. అలాగే తరచుగా ప్రయాణాలలో ఉంటే  పోర్టబుల్ పంప్ ను ఎంచుకోవచ్చు. వాతావరణం.. చాలా వరకు కొన్ని ఆఫీసులు, సంస్థలు స్త్రీల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తుంటాయి.  బ్రెస్ట్ మిల్క్ ను సేకరించడానికి పాలను పంప్ చేయడానికి ఇలాంటి సౌకర్యవంతమైన ప్రదేశాలు లేకపోతే పనిచేసే ఆఫీసు యజమాని లేదా అధికారులతో మాట్లాడాలి.  సౌకర్యవంతమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిల్వ.. తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష. నేరుగా తల్లులు పిల్లలకు స్తన్యం నుండి పాలు  అందివ్వకపోయినా, నేటి ప్రపంచం అభివృద్ది చెందిన కారణంగా  పాలను నిల్వ చేసే సదుపాయం, వాటిని తరువాత పిల్లలకు ఇచ్చే సౌలభ్యం ఏర్పడింది. అయితే తల్లులు తమ పాలను సేకరించి వాటిని జాగ్రత్తగా నిల్వ చేయాలి. శుభ్రమైన సీసాలు లేదా ప్యాకెట్లు ఉపయోగించాలి.  పాలను సేకరిచిన తేదీని వాటి మీద వేయాలి.  తల్లిపాలను గది ఉష్ణోగ్రత వద్ద నాలుగు గంటల వరకు, రిఫ్రిజిరేటర్ లో నాలుగు రోజుల వరకు,  ఫ్రీజర్ లో ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు.                                                          *రూపశ్రీ.  

పిల్లలు దుడుకుతనంగా తయారవ్వకూడదంటే...

పిల్లలు దుడుకుతనంగా తయారవ్వకూడదంటే... పిల్లలలో దుడుకుతనం సహజమేకాక, స్వాభావికం కూడా. తన భద్రతకు, తన సంతోషానికి, తన వ్యక్తిత్వానికి ముప్పు వాటిల్లుతోందని అనిపించినప్పుడు పిల్లలు దుడుకుతనాన్ని ఆశ్రయిస్తుంటారు. కారణాలు పిల్లలు దుడుకుతనాన్ని ప్రదర్శించడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు రకరకాల కారణాల్ని వివరిస్తుంటారు. ప్రతి మనిషిలోనూ స్వతహాగా పోరాడేతత్వం వుంటుందనీ అది బాల్యంలో దుడుకుతనం ద్వారా ప్రదర్శితమవుతుంటుందనీ అంటారు కొందరు. తల్లిదండ్రులు, సహోదరులు, సాటి పిల్లల నుంచి దుడుకుతనపు అలవాట్లు పిల్లలకు వంటపడతాయని అంటారు మరికొందరు. అలాగే పిల్లవాడు దుడుకుతనాన్ని ప్రదర్శించినప్పుడు పెద్దవాళ్లు మెచ్చుకోలు ద్వారా ప్రోత్సహాన్ని అందించుతోంటే కూడా అతనిలో ఆ స్వభావం జీర్ణించుకుపోతుంది. దుడుకు చేష్టలపట్ల సమాజపు దృక్పథం కూడా మనుషుల్లో దుడుకు స్వభావాల్ని ప్రవేశపెడుతుంది. ఈ రోజుల్లో వెలువడుతున్న పాపులర్ సినిమాలు, నవలల్లో వయొలెన్స్ చూపించడం జరుగుతోంది. ఇలాంటి వాటివల్ల ఇతరులతో  దెబ్బలాడడం దుడుకు చేష్టలకు దారి చూపుతుంది.  ఈ పై చెప్పిన కారణాలలో ఒక్కోటి ఒక్కో పిల్లాడిమీద తన ప్రభావాన్ని చూపి అతడిలో దుడుకు స్వభావానికి మూలకంగా పనిచేస్తుంది. పిల్లల్ని అతి గారాబంగా పెంచడం, అతి క్రమశిక్షణలో పెంచడం లాంటివి కూడా వాళ్లలో దుడుకు స్వభావానికి పునాదుల్ని వేస్తాయి. అతి గారాబం మంచిది కాదు పిల్లలు దుడుకుగా తయారుకావడానికి ఒక ముఖ్య కారణం అతి గారాబపు పెంపకం. మరీ గారాబంగా పెంచడంవల్ల పిల్లలకు రెండు రకాల నష్టం జరిగే అవకాశం వుంది. పిల్లవాడు పనికిమాలినవాడుగా, పిరికి వాడుగా తయారుకావచ్చు. పిల్లల్ని ఎంత గారాబంగా పెంచినా అవసరమైన సందర్భాలలో వాళ్లపట్ల ఖచ్చితంగానూ, కఠినంగానూ వ్యవహరిస్తుండాలి. కొన్ని రకాల దుడుకు పనుల్ని అనుమతించేది లేదని పిల్లవాడికి స్పష్టంగా తెలియజెప్పాలి. తోటి పిల్లల్ని చావగొట్టడం, బనాయిస్తూ ఏడిపించడం లాంటి పనులు చేయనివ్వకూడదు.  మరీ భయభక్తులూ ఉండకూడదు పిల్లలను మరీ భయభక్తులతో పెంచడం వల్ల కూడా దుడుకుతనం ఏర్పడడానికి ఆస్కారం వుంటుంది. మరీ భయభక్తులతో పెంచడం వల్ల పిల్లలు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో పడిపోయి తల్లిదండ్రులమీద కలిగే తిరుగుబాటు భావాల్ని, కోపాల్ని ఇంట్లో ప్రదర్శించలేక బయటి సాటి పిల్లలమీద ప్రదర్శిస్తూ అగ్రెసివ్గా తయారవుతారు. ఇలాంటి పిల్లలలో ఎక్కువగా బాధ్యతారాహిత్యం తొంగిచూస్తుంటుంది. సమర్ధించనివ్వకూడదు.  అగ్రెసివ్ వుండే పిల్లలు బయట పిల్లలతో దెబ్బలాడి వచ్చినప్పుడు తమను తాము సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తారు. అలా సమర్ధించుకోవడాన్ని తల్లిదండ్రులు అనుమతించకూడదు. ఖండించడానికి ప్రయత్నించాలి. మూలకారణాన్ని వెతకాలి పిల్లవాడు దుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తూ అగ్రెసివ్ ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అందుకు మూలకారణం  ఏమై వుంటుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అతడిని తాము విమర్శిస్తున్నారా ? అతడికి అవసరమైన ప్రోత్సాహం, మెచ్చుకోలులు లభించడంలేదా? శారీరకంగా ఏదన్నా అంగవైకల్యం వుంటే తోటిపిల్లలు అతణ్ణి గేలి చేస్తున్నారా ? లాంటివి తెలుసుకోవాలి. కొందరు పిల్లలు ఇంట్లో తాము కోరుకునే ప్రేమానురాగాలు లభించకపోతే అగ్రసేవ్ ధోరణిలో ప్రతిస్పందిస్తుంటారు. కాబట్టి పిల్లాలు దుడుకుగా ఉండకూదంటే.. పైన చెప్పుకున్న విషయాలను పాటించాలి.                                        ◆నిశ్శబ్ద.

పిల్లలకు వాంతులు అవుతుంటే ఏమి చెయ్యాలి?

పిల్లలకు వాంతులు అవుతుంటే ఏమి చెయ్యాలి? చాలా మంది తల్లులు పిల్లలకు వాంతులు అవుతున్నాయని చెప్పడం వింటూ ఉంటాం. అయితే..  ఎక్కువసార్లు, వెంటవెంటనే వాంతులు అయితే బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టుగా గ్రహించాలి. బిడ్డకు వాంతులు అరికట్టే ప్రయత్నంలో సొంతవైద్యం చేయడం మరింత ప్రమాదకరం. బిడ్డ వాంతులు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిడ్డ జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఏర్పడి వాంతులు అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ విషయంలో ఆలస్యం చేయడం  ప్రమాదకరం. కొందరు పిల్లలు అసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు వాంతి చేసుకుంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తరువాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారీ కావచ్చు. లేదా రోజులోనో, వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు  ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకొన్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5,6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బిడ్డ వాంతి చేసుకున్న వెంటనే ఏం చేయాలి ?  బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందొళనపడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుండాలి. సంవత్సరం లోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచినీటిని తాగించాలి. 'వెంటనే' పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వడం సరికాదు. 2,3 నిమిషాలు వేచి చూడాలి. బిడ్డ కడుపు ఖాళీ అయివుంటే, వెంటనే ఏడ్వడం ప్రారంభం అవుతుంది. ఆ సమయం పాలు ఇవ్వడానికి అనువైనది. బిడ్డ సాధారణ స్థాయిలో పాలుతాగుతూ ఉన్నప్పుడు, బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగా ఉన్నప్పుడు వాంతి చేసుకున్నా ఫరవాలేదు. కానీ పాలుతాగడం మానేసి వాంతి చేసుకుని, శరీరం ఉష్ణోగ్రత తగ్గితే మాత్రం తక్షణం డాక్టర్ను సంప్రదించాల్సిందే. బిడ్డ జబ్బు పడ్డాడు అనడానికి ఇవన్నీ లక్షణాలుగా గుర్తించాలి. అయితే కొన్ని సార్లు బిడ్డ కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. అవి తాగిన పాలతో కలవడం వల్ల కూడా బిడ్డ వాంతి చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని సార్లు తాగిన పాలు, తీసుకున్న ఆహారం సాఫీగా వెళ్ళడంలో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో తీసుకున్న మొత్తం ఆహారం, పాలు వాంతి అవుతాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారిజరిగితే ఫరవాలేదు. అది కూడా వాంతి వల్ల బిడ్డ ఏ విధమైన నీరసానికి లోను కానంత వరకు తల్లులు కంగారు పడనవసరం లేదు. గమనిక: వైద్యులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే ఈ సమాచారం రాయడబడింది. పిల్లల విషయంలో వైద్యుల సలహాలు చాలా ముఖ్యం.                                    ◆నిశ్శబ్ద.

పిల్లల ఆహారం విషయంలో అందరూ చేస్తున్న పొరపాట్లు!

పిల్లల ఆహారం విషయంలో అందరూ చేస్తున్న పొరపాట్లు! ప్రసవం అయిన తరువాత పిల్లల ప్రపంచంలో తల్లిదండ్రులకు రోజులు ఇట్టే గడిచిపోతాయి. అయితే తల్లులకు మాత్రం పిల్లల విషయంలో ప్రతి రోజూ యుద్దంలానే సాగుతుంది. పిల్లల జాగ్రత్త నుండి తాము జాగ్రత్తగా ఉండటం వరకు రెండు పడవల మీద ప్రయణంలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు తల్లిపాలు స్థానంలో ఇచ్చే పోషకాహారం, తల్లిపాలతో జతగా అందించే ఆహారం  గురించి చాలామందిలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.  ఏ వయస్సులో పిల్లలకు అనుబంధాహారాన్ని ప్రారంభించాలి అనే విషయం చెప్పడంకన్నా, ఏ వయస్సులో ప్రారంభించకూడదు చెప్పడం సులభమని చాలామంది చెబుతారు. అనుబంధాహారాన్నివ్వడం కొందరు ఆలస్యం చేస్తూ ఉంటే ఇంకొందరు డాక్టర్లు, ఆరోగ్యకర్తల సలహాపై 2, 3 నెలలకే ప్రారంభిస్తున్నారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. సామాజిక మాద్యమలలో ప్రస్తుతం విపరీతమైన యాడ్స్ వస్తూ పిల్లల అనుబందాహారం గురించి లెక్కలేనన్ని ప్రొడక్ట్ లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇవన్నీ డాక్టర్ల సిఫారసు అనే స్టాంప్ ను ఒకదాన్ని తగిలించుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయి.  పిల్లలకు పెట్టదగినదే అయినా ఇలాంటి ఆహారం డాక్టరు సలహాపై తప్ప పిల్లలకు 4 నెలలు నిండకనే పెట్టకూడదు. అనుబంధాహారం పిల్లలకు పెట్టె విషయంలో చెప్పుకోవాల్సిన కొన్ని శాస్త్రీయమైన కారణాల గురించి చెప్పుకుంటే…  అనుబంధాహారం త్వరగా ప్రారంభిస్తే పిల్లలు బాగా నిద్రపోతయారు. సరిపోయేన్ని పాలు త్రాగిన పిల్లలకన్నా ఇలాంటి ఆహారం తినేవారు బాగా నిద్రపోతారనుకోవడం అపోహ. నిజానికి వారు ఘనపదార్థాలను సరిగా జీర్ణించుకోలేకపోవడంవల్ల రాత్రి సమయాల్లో పదే పదే లేస్తూ ఎక్కువగా ఏడుస్తుంటారు.  ఇలాంటి ఆహారాన్ని పిల్లలకు ఇస్తుంటే  శిశువులు లావుగా అవుతారని అనుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. పిల్లల లావు, తీసుకొనే ఆహారం పైనే కాకుండా వంశపారంపర్య లక్షణాలపై కూడా ఆధారపడి వుంటుంది. తల్లిపాలు త్రాగే పిల్లలు వారికి పాలు సరిపోగానే త్రాగడం మాని రొమ్ము వదిలేస్తారు. నాలుగు నెలలకు ముందే అనుబంధాహారం తినిపిస్తే వారికి ఎప్పుడు సరిపోయింది మనకు తెలియజేయలేరు. అదే 5 వ నెలలో ప్రారంభిస్తే ఆకలైనప్పుడు, నోరు తెరవడం, ఆహారం నోటిదగ్గరికి తేగానే ముందుకు వంగి సరిపోయేంత తీసుకున్నాక తలతిప్పివేస్తారు. అంటే 5వ నెలకన్నా ముందు ఆహారం తినిపించడమంటే బలవంతంగా ఆహారాన్ని నోట్లో కుక్కడమన్నమాటే. అనుబంధాహారం త్వరగా తినడం ప్రారంభించిన శిశువులు లావుగా ఉండటానికి మరొక కారణం దాంట్లో ఎక్కువ మొత్తంలో ఉండే లవణాలు. ఆహారం తీసుకోగానే దాహం వేయడంవల్ల శిశువు ఏడ్పు ప్రారంభిస్తుంది. దీనిని ఆకలనుకొని మరింత ఆహారాన్నివ్వడం జరుగుతుంది. అది శరీరంలో క్రొవ్వురూపంలో నిలువజేయబడడంతో పిల్లలు లావెక్కుతారు. చిన్నవయస్సులో లావుగా ఉన్నవారు పెద్దవారైన తరువాత కూడా లావుగా ఉండే అవకాశం ఎక్కువ. వారు రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం వ్యాధులకు తరచుగా గురవుతూ ఉంటారు. తల్లిపాలు మాత్రమే త్రాగడం వల్ల పిల్లలు మొదటి 3-4 నెలలు శిశువు బరువు పెరగనట్లైతే వారు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదో డాక్టరును సంప్రదించి తేల్చుకోవాలి. శిశువు బరువు మొదటి 4 నెలలలో సరాసరి రోజుకు 20 గ్రాములు పెరుగుతుంది. ఇది కొందరి విషయంలో కొంచెం ఎక్కువ, తక్కువలు ఉండవచ్చు. బరువు పెరగనట్లైతే అనేక ఇతర కారణాలతో పాటు తల్లిపాలు సరిపోకపోవడం కూడా ఒకటి. పాలు సరిపోనప్పుడు పాల ఉత్పత్తిని పెంచే మార్గాలన్నీ ఆలోచించిన తరువాతే డాక్టరు సలహాపై అనుబంధాహారం గురించి ఆలోచించాలి. బరువు పెరగడం లేదన్న విషయం కూడా బరువు క్రమం తప్పకుండా నమోదు చేసిన తరువాతే నిర్ణయించగలము. పిల్లలు ఏడ్చిన ప్రతిసారి ఆకలితో ఏడుస్తున్నారని అనుకోవడం  పొరపాటు. శిశువుకు ఆ వయస్సులో తెలిసిన ఒకే ఒక భాష ఏడ్పు. మూత్రం పోసేముందు, విరేచనం చేసేముందు, బట్టలు బిగుతుగా ఉన్నా, చలివేసినా, ఉక్కపోసినా ఇలా ఇంకా అనేకానేక కారణాలవల్ల కూడా శిశువు ఏడుస్తుంది. కాని శిశువు ఏ కారణంవల్ల ఏడ్చినప్పటికీ నోట్లో ఏదైనా ఆహారముంచినట్లైతే మ్రింగడానికి నోరు మూయాల్సి వస్తుంది. కాబట్టి ఏడ్పు ఆగిపోతుంది. దీనిని ఆకలి అని నిర్ణయించడం తప్పు. కాబట్టి అనుబంధ ఆహారం విషయంలో తల్లులు, ఇతరులు తమకు తాము సిద్ధాంతాలు అన్వయించుకుని అవే నిజమని ఇతరులకూ చెప్పి పిల్లల విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండాలి. అనుబంధ ఆహారం గురించి వైద్యుల సలహతోనే దాన్ని మొదలుపెట్టాలి.                                     ◆నిశ్శబ్ద.

వాళ్ల ఫిర్యాదులు పట్టించుకోండి

వాళ్ల ఫిర్యాదులు పట్టించుకోండి 1)  పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి చిన్నా అంశాన్ని ఎంతో సునిశితంగా గమనించాల్సి వుంటుంది. అ ఏముంది? మామూలే కదా అని పెద్దవాళ్ళుతీసిపారేసే విషయాలు పిల్లలకి పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. వాటిని పదే పదే చెబుతుంటారు దానికి పెద్దవాళ్ళు ఉరికే సతాయించకంటూ విసుక్కుంటారు. ఇలా ఓ రెండు మూడు సార్లు జరిగాక ఇక పిల్లలు తల్లిదండ్రులుతో ఏ విషయాలు చెప్పరు. ఇక్కడితో పెద్దవాళ్ళు సమస్య తీరిపోయింది. కాని మరి పిల్లలకో ! సమస్య ఇంకా పెద్దదయ్యింది. తనకి తానుగా దానిని ఎదుర్కోవాలి,  ఎలా ! ఈ ప్రశ్న పిల్లల వ్యక్తిత్వంపై రకరకాలుగా ప్రభావాన్ని చూచిస్తుందిట. కొంత మందిలో ధైర్యాన్ని, మొండితనాన్ని కలిగిస్తే, మరికొందరిలో అధైర్యాన్ని, భయన్ని కలిగిస్తుందిట. 2)  పిల్లలున్న ప్రతీ ఇంట్లో అమ్మలు సాధారణంగా ఎన్నో ఫిర్యాదులు వింటుంటారు. పక్కపిల్లాడు కొట్టాడనో, తన బెంచీలో కూర్చునే అబ్బాయి పుస్తకం చింపాడనో, స్నేహితులు తనని ఆడించటం లేదనో, లేదా క్లాసులో పిల్లలు తనని ఏడిపిస్తున్నారనో, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి పిల్లల ఫిర్యాదులు. ఇవన్ని విన్నప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారో ఒకసారి గుర్తుచేసుకోండి. అ ఏముంది పిల్లలు, పిల్లలు చూసుకుంటారు. చిన్నతనంలో ఇవన్ని మామూలే అని కొట్టిపారేసి "ఊరికే అందరి మీద చాడీలు చెప్పకు" అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మాటల్ని తేలికగా తీసుకుంటే, మరికొందరు ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఎదురుతిరగమని పిల్లలకి చెబుతారు, మరికొందరు వాళ్ళే స్వయంగా రంగంలోకి దిగి ఏడ్పించే పిల్లలని బెదిరిస్తారు. ఈ రియాక్చన్స్ అన్ని మన స్థాయిలో, మనం తెసుకునే నిర్ణయాలు, కాని పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే!  అసలు వాళ్ళా సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నారు!  మన దగ్గర నుంచి వాళ్ళేం  ఆశిస్తున్నారు? వాళ్లకేం కావాలి? అని ఎవరైనా అడుగుతారా? 3) పిల్లల ప్రపంచంలో వాళ్లకుండే సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మొదట మనం చెప్పుకున్నట్టు. మనకి పిల్లలు చెప్పే సమస్యలు చాలా చిన్నవిగా, అసలు సమస్యలే కానట్టుగా కనిపిస్తాయి. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలో, పక్కపిల్లాడు తనని ఏడిపిస్తుంటే,  అ ఉడుకుమోతు తనాన్ని ఎలా దాచుకోవాలో, తనని బెదిరించే పిల్లల నుంచి భయపడకుండా ఉండటం ఎలాగో వాళ్లకి తెలీదు. దాంతో ఆ ఒత్తిడంతా వారి వ్యక్తిత్వంపై పడుతుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే, వయసుతో పాటు వచ్చే మార్పులనుకుని మనం తేలికగా తెసుకుంటాం. కాని వాళ్ళు  అ సమస్యలకి వాళ్లకి తోచినట్టుగా పరిష్కారాలు వెదుక్కునే తీరులో భాగమది అని గుర్తించం. అందుకే చైల్డ్ సైకాలజిస్టు 'డాక్టర్ పీటర్ హుక్'  ఓమాట చెబుతున్నారు, ప్రతీ రియాక్షన్ కి ముందు ఓ యాక్షన్ లాగా పిల్లల ప్రవర్తనలో వచ్చే ప్రతీ మార్పుకి ఓ కారణం వుంటుంది. అది గమనించాల్సిన భాద్యత తల్లిదండ్రులదే అంటారు ఈయన. 4)  మరి అసల పిల్లలు అలాంటి ఫిర్యాదులు చేసినపుడు తల్లిదండ్రులుగా మనం ఏంచేయాలి? ఈ ప్రశ్నకి సమాధానంగా చైల్డ్ సైకాలజిస్టులు ఏమంటున్నారంటే ముందు పిల్లలు చెప్పే ఏ విషయాన్ని అయినా కొట్టి పారెయ్యకూడదు వినాలి. మనం పిల్లలు చెప్పేవి వింటామన్న నమ్మకం కలగాలి వాళ్లకి, అది వాళ్లకి ధైర్యాన్ని ఇస్తుందిట. ఇక అతర్వాత ఇప్పుడు ఏం చేద్దాం ? ఈ ప్రశ్న వాళ్ళనడగగానే వాళ్ళు రకరకాల సమాధానాలు చెబుతారు,  అప్పుడు ప్రశంతంగా వినాలి. అ తర్వాత ఈ సారికి ఇలా చేద్దాం అంటూ మనం ఏమనుకుంటున్నామో చెప్పాలి,  వినటానికి ఇదంతా సిల్లీగా అనిపించినా ' పెరంటింగ్'  అంటే ఇదే అంటున్నారు సైకాలజిస్టులు. - రమ

పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి..!

 పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి..!   ప్రతి మనిషికి ఆహారమే శక్తి వనరు. అయితే వయసుకు తగిన ఆహారం తీసుకోవాలని వైద్యులు, పెద్దలు చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా చిన్న పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  పిల్లలు ఆహారం తినడంలో చాలా గోల చేస్తారు.  ఈ కారణంగా వారికి పోషకాహారం అందించడం కష్టమవుతుంది.  పోషకాహారం అందకపోతే ఎదుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయి.   ఈ కారణంగానే చాలా మంది తల్లులు తమ పిల్లలకు బలవంతంగా అయినా సరే ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.  అయితే ఇలా బలవంతంగా ఆహారం తినిపించడం చాలా ప్రమాదమని చిన్న పిల్లల వైద్యులు,  ఆహార నిపుణులు చెబుతున్నారు.   పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపిస్తే ఏం జరుగుతుందంటే.. పిల్లలకు 4-5 సంవత్సరాలు వచ్చినా సరే సరిగా ఆహారం తీసుకోకుంటే వారిని తిట్టడం, కొట్టడం, ప్రలోభపెట్టడం వంటివి చేసి ఆహారం పెడుతుంటారు.  ఇలా చేస్తే పిల్లలు విసిగిపోతారు.  కొన్నిసార్లు ఆకలి ఉన్నా సరే పిల్లలు తినడానికి ఇష్టపడరు. వారికి ఆహారం మీద ఆసక్తి తగ్గిపోవడానికి దారితీస్తుంది. పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపిస్తే అది వారి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. బలవంతంగా ఆహారం పెట్టేటప్పుడు పిల్లలు ఆహారాన్ని నమలకుండా ముద్దలు ముద్దలుగా అలాగే మింగుతారు. దీనివల్ల  ఆహారం సరిగా అరగదు. జీర్ణక్రియ ప్రభావితం  అవుతుంది.  కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. తల్లిదండ్రులు బలవంతంగా పిల్లలకు ఆహారం పెట్టే అలవాటును అనుసరిస్తే పిల్లలు తల్లిదండ్రులన్నా, ఆహారం అన్నా భయపడతారు.  తల్లిదండ్రులను చూసినా,  ఆహారాన్ని చూసినా పారిపోతారు.  ఇది పిల్లలలో పోషకాహార లోపానికి,  వారిలో మొండి వైఖరికి దారితీస్తుంది. పిల్లలకు కడుపు నిండినప్పుడు,  ఆహారం మీద ఆసక్తి లేనప్పుడు వారు ఆహారం తినడానికి వ్యతిరేకిస్తారు. ఇలాంటి సందర్బాలలో తల్లిదండ్రులు అతి ప్రేమ కొద్ది ఆహారాన్ని ఇంకా బలవంతంగా పెట్టడం వల్ల పిల్లలు అతిగా తిని బరువు పెరుగుతారు. ఏ తల్లి తమ పిల్లలు ఎక్కువ తింటున్నారు అనే ఆలోచనలోకి వెళ్ళదు. కాబట్టి ఎవరూ దీన్ని అర్థం చేసుకోరు.  కానీ అతిగా తినిపించడం వల్ల పిల్లలు బరువు పెరిగి చిన్నతనంలోనే ఊబకాయం రావడానికి కారణం అవుతుంది. పిల్లలకు ఆహారం ఎలా ఇవ్వాలంటే.. పిల్లల కోసం చేసిన ఆహార పదార్థాలు  అన్నీ ఒకేసారి తినిపించకూడదు.  మొదటిసారి పిల్లలను కన్న తల్లులు పిల్లలకు ఆహారం సరిపోతుందో  లేదోననే సందేహంతో ఏదో ఒకటి పిల్లలకు తినిపిస్తుంటారు.  కానీ కొద్ది కొద్దిగా పిల్లలు ఆసక్తి చూపినప్పుడు ఆహారం ఇస్తే వారు విసుగు లేకుండా తింటారు. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు పద్దతిగా కూర్చుని ఆహారం తినాలి.  తినేటప్పుడు పోన్ లో మాట్లాడటం,  టీవి చూడటం ఆపి పిల్లలతో కబుర్లు చెబుతూ తినాలి.  పిల్లలు కూడా తల్లిదండ్రులతో కబుర్లు చెబుతూ ఆహారం తినేయడానికి అలవాటు పడతారు. పిల్లలు ఒకే రకమైన ఆహారం అంటే విసుగు చెందుతారు.  ఆరోగ్యకరమైన పద్దతిలో విబిన్నంగా ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలి.  పిల్లలను ఆకర్షించాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఆసక్తిగా తింటారు.                                             *రూపశ్రీ.

సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు...

  సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు...   పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు.  సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు.  ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్‌కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల  కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది.   పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్‌ని, మూన్‌ని, సన్‌ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్‌ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు. ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ    పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి. ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు.  అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు.  ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ! -రమ

పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే..

పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే.. పిల్లలను కనడానికి యువతీయువకులు ఎంత సంతోషిస్తారో వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకవైపు సంతోషం ఉన్నా అంతకు మించి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి పాలు తాగించడం పెద్ద కష్టం కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్ది అన్నం తినడానికి  చాలా మారాం చేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని భయపడతారు. ఇందుకే పోషకాలను భర్తీ చేయడానికి హెల్త్ డ్రింకులు తాగించడానికి, అన్నం తినిపించడానికి వారిని ఏమారుస్తారు. ఒకప్పుడు కథలు చెబుతూ, భయపెడుతూ అన్నం పెట్టేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో కార్టూన్స్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అసలు పిల్లలకు మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించవచ్చా?  అలా చేస్తే ఏమవుతుంది? నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఎన్నుకున్న సులువైన మార్గం మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించడం. పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 90శాతం మంది మొబైల్ లేనిదే ఆహారం తీసుకోవడం లేదు. ఇలా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలు అయినా, పెద్దలు అయినా మొబైల్ చూస్తూ లేదా టీవి చూస్తూ తింటే ఆహారం రుచి ఫీల్ కాలేరు. పిల్లలకు ఆహారం రుచి తెలియడం చాలా ముఖ్యం. మొబైల్ చూస్తూ తినడం వల్ల అది మిస్ అవుతారు. పైగా పరిధికి మించి తినేస్తారు. దీనివల్ల పిల్లలో ఊబకాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వల్ల వారిలో జీవక్రియ మందగిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతార. ఎప్పుడూ మొబైల్ చూడటానికే ఇష్టపడతారు. మొబైల్ చూస్తూ అన్నం తినే పిల్లలు కృత్రిమంగా తయారవుతారు. వారికే తెలియకుండా వారిలో ఒక మానసిక శాడిజం అభివృద్ది చెందుతుంది. అదే ఇతరులను తిట్టడం, కొట్టడం, మొండి చేయడం వంటి పనులలో వ్యక్తం అవుతుంది. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. వారి ప్రవర్తన క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుంది. చిన్నతనంలోనే పిల్లలు అంత ఘోరంగా మొబైల్ చూస్తే వారి కళ్లు దెబ్బతింటాయి. చిన్నప్పుడే కళ్లజోడు వాడాల్సి రావడానికి అదొక కారణం.                                                          *నిశ్శబ్ద.  

పిల్లలలో మలబద్దకం సమస్య తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి!

పిల్లలలో మలబద్దకం సమస్య తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి! పిల్లలలో మలబద్ధకం అనేది  సాధారణ సమస్య. పెద్దలు తమ సమస్యను బయటకు చెప్పినంతగా పిల్లలు వ్యక్తం చేయలేరు. ఈ కారణంగా పిల్లలలో మలబద్దకం సమస్య వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాన్ని తల్లులే గమనించి పిల్లల సమస్య తగ్గే మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. ప్రేగు కదలికలు తక్కువ ఉండటం,  పాస్ చేయడం కష్టంగా  అనిపించినప్పుడు మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఎక్కువగా  ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.   అయితే కొన్ని సురక్షితమైన, సమర్థవంతమైన ఇంటి చిట్కాలు పిల్లలలో మలబద్దకం సమస్యకు  ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని జాగ్రత్తగా ఫాలో అయితే పిల్లలలో మలబద్దకం సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు. ఫైబర్.. పిల్లలు మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నప్పుడు  ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి. ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. పైబర్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి సమస్య తగ్గుతుంది. యాపిల్స్, రేగు పండ్లు,బ్రోకలి, క్యారెట్, బచ్చలికూర. తోటకూర  వంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను, ఓట్స్, బ్రౌన్ రైస్,  పొట్టు తీయని గోధుమలు మొదలైనవి బాగా ఇవ్వాలి.  ఫ్రూనే జ్యూస్.. ఎండిన ఫ్లం పండ్లను ఫ్రూనే అంటారు. ఈ ఫ్రూనే లతో జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే   ఫ్రూనే జ్యూస్ సహజంగానే భేదిమందు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొద్దిమొత్తంలో ఫ్రూనే జ్యూన్ ను నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా చాలా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. ఇది మోషన్ కావడానికి సహకరిస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఇస్తే అతిసారం సమస్యకు దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. వెచ్చని నీరు.. వెచ్చనినీరు కడుపులో ప్రేగులను, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోజూ 10 నుండి 15 నిమిషాల పాటూ వెచ్చని నీటిలో పిల్లలను కూర్చోబెట్టడం వల్ల  కడుపులో కండరాల కదలిక బాగుంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గోరువెచ్చని నీటిని పిల్లలకు తాగించాలి. శారీరక శ్రమ.. పిల్లలలో శారీరక శ్రమ లేకపోవడం కూడా మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. అందుకే పిల్లలలో శారీరక వ్యాయామం ప్రోత్సహించాలి. ఆటలు ఆడుకోవడానికి పంపాలి. ఎప్పుడూ కూర్చొని చదువుకోవడం, గేమ్స్, టీవి వంటివే కాకుండా పిల్లలలో యోగా, ఆసనాలు వేయిస్తుండాలి. ఇవి మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికే కాదు.. పూర్తీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతాయి.                                                   *నిశ్శబ్ద.