భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

Publish Date:Mar 26, 2025

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  
రాజ‌కీయాల్లో క‌విత మ‌ళ్లీ యాక్టివ్‌.. హ‌రీశ్‌కు చెక్ పెట్టేందుకేనా?

రాజ‌కీయాల్లో క‌విత మ‌ళ్లీ యాక్టివ్‌.. హ‌రీశ్‌కు చెక్ పెట్టేందుకేనా?

Publish Date:Nov 24, 2024

బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు,  సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా  ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ కేటీఆర్ త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంట‌ర్ ఇస్తూ పార్టీలో అన్నీతానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ముందుకు న‌డిపించే వారు ఎవ‌ర‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు   రాబోయే రోజుల్లో హ‌రీశ్‌రావు పార్టీలో కీల‌కంగా మార‌బోతున్నాడ‌ని, ఆయ‌నే పార్టీని ముందుకు న‌డిపించే వ్య‌క్తి అంటూ  ప్ర‌చారం చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే క‌విత రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్ర‌జా క్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవ‌ల అదానీ కేసు విష‌యంలో క‌విత కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌ గురుకులలో ఫుడ్ పాయిజ‌న్ కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ప‌రామ‌ర్శించి కాంగ్రెస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేశారు. దీనికితోడు చాలారోజుల త‌రువాత త‌న నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఏ), బీసీ కుల సంఘాల సమావేశం నిర్వ‌హించారు. దీంతో క‌విత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్ల‌క‌ముందు క‌విత అసెంబ్లీలో పూలే విగ్ర‌హం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హ‌క్కుల సాధ‌న ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), భార‌త జాగృతి సంస్థ‌ల త‌ర‌పున జిల్లాల్లో రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హించారు. మ‌న‌మెంతో మ‌న‌కంత నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్య‌మాన్ని తలకెత్తుకున్నారు.   కుల‌గ‌ణ‌న చ‌ట్ట‌బ‌ద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. అయితే  అరెస్ట‌యి జైలుకెళ్లి,  బెయిల్ పై  విడుద‌లైన అనంత‌రం  సైలెంట్ అయిపోయారు.  పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అటువంటి క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.  క‌విత ఉన్న‌ట్లుండి ఇప్పుడు రాజ‌కీయాల్లో యాక్టీవ్ కావ‌డం కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అంద‌రూ ఊహించిన‌ట్లు కేటీఆర్ నిజంగా జైలుకెళితే పార్టీని న‌డిపించే బాధ్య‌త‌ను క‌విత తీసుకోబోతున్నార‌ని, అందుకే ఆమె ఉన్న‌ట్లుంటి రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. క‌విత పొలిటిక‌ల్ గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్ కు వ‌చ్చే ఇబ్బంది ఏమీలేదు. ఎందుకంటే.. క‌విత జైల్లో ఉన్న స‌మ‌యంలో త‌న చెల్లికి బెయిల్ కోసం కేటీఆర్‌ ఢిల్లీలోనే మ‌కాం వేసి తీవ్రంగా శ్ర‌మించారు. జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత క‌విత‌ సైతం   అన్న‌ను హ‌త్తుకొని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క్ర‌మంలో అన్నాచెల్లెలు మ‌ధ్య ఒక‌రిపైఒక‌రికి ఉన్న ప్రేమ బ‌హిర్గ‌తం చేశారు. దీంతో రాజ‌కీయాల్లో తాను ఎంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ప్ప‌టికీ.. త‌న అన్న త‌రువాత‌నే ఉంటాన‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పారు. ఈ క్ర‌మంలో ఒక‌వేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకెళ్లిన‌ప్ప‌టికీ పార్టీ బాధ్య‌త‌లను క‌విత త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుంటార‌ని, కేటీఆర్ జైలు నుంచి తిరిగిరాగానే ఆయ‌న సార‌థ్యంలో రాజ‌కీయాల్లో కొన‌సాగుతార‌ని బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇలా అన్నాచెల్లెలు బీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం కృషి చేస్తూనే.. మ‌రో వ్య‌క్తి చేతికి పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారని, త‌ద్వారా కేసీఆర్ వార‌సుడు కేటీఆర్ అనే విష‌యాన్ని క్యాడ‌ర్ లోకి క‌విత‌  బ‌లంగా తీసుకెళ్తున్నార‌ని బీఆర్ఎస్‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓట‌మి త‌రువాత కేసీఆర్ పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌టం లేదు. అడ‌పాద‌డ‌పా పార్టీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. కేటీఆరే పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. హ‌రీశ్ రావు లాంటి సీనియ‌ర్ నేత‌కు బీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీలోని ఓ వ‌ర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేటీఆర్ జైలుకెళితే పార్టీ ప‌గ్గాలు హ‌రీశ్ రావు చేతికి అప్ప‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని భావించిన కేసీఆర్‌.. త‌న కుమార్తె క‌విత‌ను రంగంలోకి దింపిన‌ట్లు బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చిన త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క‌విత త‌న తండ్రి సూచ‌న‌తోనే ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యార‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా హ‌రీశ్ రావుకు చేతికి మాత్రం పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగానే క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యార‌ని తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టిచూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?

Publish Date:Nov 26, 2024

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? 2025లో ప్రపంచ వినాశనానికి నాంది ఏర్పడుతుందని ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పిందే నిజమౌతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర వినియోగానికి సై అంటూ చేస్తున్న హెచ్చరికలు, అమెరికా, నాటో దేశాలపై ఆయన వెల్లగక్కుతున్న విద్వేషం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మానవాళి ముంగిట్లోకి వచ్చేసిందనే అనిపిస్తున్నది. ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు నష్టాలు, అపజయాలే కాదు అవమానాలనూ తెచ్చి పెట్టింది. ఉక్రెయిన్  నోటో దేశం కాకపోయినా, రష్యా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తున్న నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ఆయుధాలు సరఫరా చేశాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఆర్థికంగా, ఆయుధాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించింది. దీంతో రోజులలో పూర్తైపోతుందని రష్యా భావించిన యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కంటే అన్ని విధాలుగా రష్యాకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ స్థితిలోనే పుతిన్ ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు.  అవసరమైతే అణ్వస్త్రాలను వినియోగించడానికి అనుమతించే ఫైల్ పై సంతకం కూడా చేసేశారు.  దీంతోనే ప్రపంచ వినాశనం గురించి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం నిజం కానుందన్న భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా,నాటో దేశాలపై రష్యా బ్లాస్టిక్ మిస్సైల్స్ గురిపెట్టి సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక వేళ రష్యా నేరుగా నాటో దేశంపై దాడి చేస్తే మూడో ప్రపంచయుద్ధం ప్రారంభమైనట్లే. అసలు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆరంభం అయినప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్లేషకులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఊహించారు. ఇప్పుడు రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఊహలు.. ఊహాగానాలు కాదనీ, వాస్తవ రూపం దాల్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అర్ధమౌతోంది.  అణు దాడులు చేస్తామని పుతిన్ ఎలాంటి బేషజాలూ లేకుండా ప్రపంచ దేశాలను హెచ్చరించారు.  త్తగా రూపోందించిన ఓరెప్నిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఈ యుద్ధంలో పరీక్షించాలని నిర్ణయం తీసుకున్న పుతిన్ ఈ మేరకు ఇప్పటికే తన సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు.  ఇప్పటివరకూ ఈ మిస్సైల్స్ ను అడ్డుకునే వ్వవస్థ లేదు కాబట్టి ప్రపంచ దేశాల లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా పరీక్షించాలనుకుంటున్న బాలిస్టిక్ మిస్సైల్స్ 5000  కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదించేయగలవు. నాటో దేశాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే రష్యా ఆ మిస్సైల్ ను ప్రయోగిస్తే.. నాటో దేశాలు అనివార్యంగా రష్యాపై దాడులకు ఉపక్రమిస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అయితే రష్యా కూడా అందుకు సిద్ధంగానే ఉంది. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై యుద్ధానికి వస్తే తనకు మద్దతుగా నిలిచే దేశాలను కూడగడుతోంది. ఇప్పటికే   ఉత్తర కొరియా,చైనా రష్యాకు మద్దతు ప్రకటించాయి.  ఆ ధైర్యంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు సహాయం చేసిన దేశాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.  ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు ఉక్రెయిన్, రష్యాలకు మధ్యవర్తిత్వం చేయగలిగే ప్రపంచ నేత ఎవరన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. ప్రధాని మోడీ ఆ పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. యుద్ధాన్ని ఆపడమే తక్షణ కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నోస్ట్రాడమస్ జోస్యం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజం కాకూడదు.  

మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!

Publish Date:Mar 26, 2025

మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.
[

Health

]

ఈ ఆహారాలను పెరుగుతో తింటే పాయిజన్ అవుతాయట..!

Publish Date:Mar 26, 2025

    పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు.  బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు,  మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి.  పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు.  వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు.    కానీ పెరుగు  కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో  తినడం వల్ల  చాలా నష్టం చేకూరుస్తుంది.  కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ఇంతకీ  పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఇది ఉబ్బరం,  గ్యాస్,  ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. డెజర్ట్‌లు స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?  కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా.  కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు,  స్వీట్ల  కలయిక  కడుపులో మంటను కలిగిస్తుంది. బంగాళాదుంపలు.. పెరుగుతో బంగాళాదుంపలు తినడం  చూసే ఉంటారు.  చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు,  బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది మాంసాహారం.. పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.  ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు.  ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం,  పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...