జగన్ వైజాగ్ ఆశలు ఆవిరి.. షిఫ్టింగ్ ఇక లేనట్లే!
posted on Jun 29, 2023 @ 3:19PM
త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధాని కాబోతుంది.. నేను కూడా త్వరలోనే విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నా. ఇదీ ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇప్పటికి ఐదు నెలలు గడిచింది. ఆ మాటకొస్తే విశాఖ గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు అసెంబ్లీలో, మీడియా సమావేశాలలో, పలు కార్యక్రమాల సభలలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. విశాఖ నుండే పరిపాలన సాగుతుందని.. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. నాలుగు రోడ్లు, ఇంకో ఐదారు బిల్డింగులు కట్టుకుంటే అదే రాజధాని అవుతుందని చెప్పారు. ఒకసారి ఈ సంక్రాంతికి వైజాగ్ వెళ్తామని.. ఇంకోసారి ఈ దసరాకే ఫిక్స్ అని ఎప్పటికప్పడు ముహుర్తాలు మారాయి కానీ.. జగన్ మాత్రం తాడేపల్లి పాలెస్ దాటలేదు.
ఒక దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు వైజాగ్ లో ఇంటి కోసం అధికారులు సెర్చ్ మొదలు పెట్టారని, బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారనీ కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటికీ జగన్ మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. విశాఖ నుండే పరిపాలన అన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అయితే అసలు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా? రాజధాని ఎలా ఉన్నా ఆయనే చెప్పినట్లు విశాఖ నుండే పరిపాలన సాగిస్తారా? లేక ఇప్పటి వరకు విశాఖ గురించి చెప్పిన మాటలన్నీ ఉత్తి మాటలేనా? అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.
అందుకు తగ్గట్లే విశాఖ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాయి. జగన్ ఇక విశాఖ రావడం కలేనని భావించాలని గంటా వెల్లడించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన విషయాన్ని అందరూ చూశారన్న గంటా.. ఆ సంఘటన చూశాక ఇక సీఎం జగన్ విశాఖపట్నానికి రాలేరన్నారు. విశాఖకు ప్రస్తుత పరిస్దితుల్లో ప్రముఖులు గానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కానీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అందుకే సీఎం జగన్ కూడా విశాఖ రారని తాను అంచనా వేస్తున్నట్లు గంటా చెప్పుకొచ్చారు. విశాఖకు రావాలన్న తన ఆలోచనను సీఎం జగన్ మానుకుంటారని ధీమాగా చెప్పారు.
అంతే కాదు, సీఎం జగన్ విశాఖకు వస్తే ఏ విశ్వసనీయతతో ఆయన ల్యాండ్ పూలింగ్ చేస్తారని అందరూ అడుగుతున్నారని గంటా శ్రీనివాస్ ప్రశ్నించారు. అదే సమయంలో వైజాగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపైనా గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ లో అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రమంతా కలకలం రేపితే.. డీజీపీ మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, పోలీసులు భేషుగ్గా పని చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
గంటా సంగతెలా ఉన్నా ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇక జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం కష్టమే. ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నిండా పది నెలలే సమయం ఉంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రాజధాని అమరావతి వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందో క్లారిటీ లేదు. మరో వైపు విశాఖలో పరిస్థితులకు ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదంతమే అద్దం పడుతోంది. ఎన్నికల సమయానికి చక్కదిద్దుకోవాల్సిన అంశాలు ఇప్పటికే జగన్ కు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి విశాఖకు తరలి వెళ్తారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అన్నట్లు అసలు వైసీపీ కాన్సెప్ట్ విశాఖను రాజధానిని చేయాలనుకోవడం కంటే అమరావతిని నాశనం చేయడం.. రాష్ట్రానికి అనువైన రాజధాని లేకుండా చేయడమే. మరి అది ఎలాగూ జరుగుతుంది కనుక విశాఖ అంశంలో జగన్ లైట్ తీసుకోవడం విడ్డూరం ఏమీ కాదు!