రంగా చుట్టూ ఏపీ రాజకీయం
వంగవీటి మోహన్ రంగా.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా పేరొందిన బెజవాడ ( విజయవాడ)కు ఎంత పేరుందో, బెజవాడ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన, దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగాకు అంత పేరుంది. అప్పుడే కాదు, ఆయన కన్నుమూసి మూడు దశాబ్దాలకు పైగా అయిన ఈనాటికీ, రంగా పేరు ఏపీలో పొలిటికల్ వైబ్రేషన్స్ సృష్టిస్తున్నాయి. నిజానికి, రంగాను కాపులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలందరూ తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. రాజకీయ పండితులు బడుగు బలహీన వర్గాలు పొలిటికల్ లెజెండ్’గా రంగాను అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయిలో ఉన్న బలమైన నాయకుడు కాపులకు లభించలేదు. అయితే మోహన్ రంగా భౌతికంగా లేకున్నా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రంగా పేరు మార్మోగుతుంది.
ఇప్పడు అదే జరుగుతోంది. అందరివాడుగా పేదల గుండెల్లో నిలిచిన రంగా, మావాడంటే మావాడు అని తమ సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రంగా బొమ్మపెట్టుకుని కాపులు, బడుగు బలహీనవర్గాల వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రంగా కన్నుమూసిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ, రంగా పేరు గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్’గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. నిజానికి రాష్ట్రంలో ఇప్పడు ఎన్నికలు లేవు, కానీ, ఎన్నిక వాతావరణం వుంది. అందుకే రంగా జయంతి (జూలై4) సందర్భంగా రాజకీయ చలిమంటలు భగ్గుమంటున్నాయి. అందుకే, పార్టీలు, పార్టీలకు అతీతంగానూ నాయకులు పోటీపడి మరీ రంగాకు జై కొడుతున్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా, విజయవాడలో రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
అదలా ఉంటే, గతంలో రంగా పేరు చెప్పుకుని ఓట్లు దండుకున్న వైసీపీ, ఆ తర్వాత రంగా వారసుడు, ఆయన కుమారడు వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్ లు చెబుతున్నారని రంగా, రాధా అభిమానులు ఆక్షేపిస్తున్నారు. రాధా సేవలను తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మొండి చేయి చూపించారని, అయిఆ ఆనాడు నోరు విప్పని వైసీపీ నానీలు ఈ రోజు ఏముఖం పెట్టుకుని, రంగా జయంతికి హడావుడి చేస్తున్నారని వంగవీటి అభిమానులు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.
అందుకే రాధా, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ది చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరినా.. జగన్ స్పందించ లేదని, వైఎస్సార్‌సీపీ నాయకులపై ఫైర్ అవుతున్నారు. మరోవంక గతంలో వంగవీటి రాధ హత్యకు ‘రిక్కి’ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించడమే కాకుండా.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిజానికి రాధా తెలుగు దేశం పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే, రంగా అభిమానులు మరో మారు, తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తామని రాంగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.