హిడ్మా ఏపీకి ఎలా వచ్చాడు?.. ఎలా చిక్కాడు?
హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత.. రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే. ఇన్నాళ్లూ దొరకని వ్యక్తి.. ఇప్పుడెలా దొరికాడు? దాదాపు 26 సార్లు భద్రతా దళాలపై దాడులు చేసినోడు.. ఒక్కసారి కూడా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నోడు.. ఇప్పుడెలా దొరికాడు? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వ్యూహకర్తగా ఉన్న హిడ్మా.. ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే.. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత.. మావోయిస్టులకు గడ్డుకాలం మొదలైంది. అడవిలో సీన్ మారింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఎంతోమంది మావోయిస్టులు.. ఎన్కౌంటర్లలో చనిపోయారు.
కానీ.. వాటన్నింటిలో హిడ్మా ఎన్‌కౌంటరే అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎందుకంటే.. హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అంతకుమించి.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్‌కి.. కమాండర్. సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
దేశంలో మావోయిజాన్ని రూపుమాపేందుకు.. భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ క్రమంలో.. వందల మంది పోలీసులు, కేంద్ర బలగాల ప్రాణాలు తీసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడన్న వార్త.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించినప్పటికీ.. ఒక్క హిడ్మా మరణమే ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. మావోయిస్ట్ పార్టీలో అతనికి ఉన్న ట్రాక్ రికార్డే. పార్టీలో అతని హోదా, హిడ్మా చేపట్టిన గెరిల్లా దాడులు, ఇన్నాళ్లూ భద్రతా బలగాలకు దొరకకుండా తప్పించుకున్న చరిత్రే.. హిడ్మాపై ఇంత చర్చ జరిగేలా చేస్తోంది. అయితే.. హిడ్మాని రౌండప్ చేయడానికి దారితీసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయ్. అతను భద్రతా దళాలకు చిక్కకుండా ఇన్నేళ్లూ తప్పించుకోగలిగాడంటే అందుకు ప్రధాన కారణం.. అతని చుట్టూ ఉన్న మూడంచెల భద్రతా వ్యవస్థే! స్థానిక గిరిజనుల సహకారం, అడవులపై అతనికి ఉన్న తిరుగులేని పట్టు, చుట్టూ ఉండే సెక్యూరిటీ రింగ్ వల్లే.. హిడ్మా ఇన్నాళ్లూ సేఫ్‌గా ఉన్నాడు. అయితే.. కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన వ్యూహాత్మక ఆపరేషన్ల కారణంగా.. హిడ్మా ట్రాప్‌లో పడ్డాడనే వాదన వినిపిస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌తో పాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో.. భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయ్. దశాబ్దాలుగా మావోయిస్టులను పట్టుకోవడంలో ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు.. భద్రతా బలగాలు లేటెస్ట్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాయి. డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కదలికలను నిరంతరం ట్రాక్ చేయగలిగారు. దాంతో.. హిడ్మా ఆపరేషనల్ పాయింట్ అయిన దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలు కష్టమయ్యాయి. అన్ని వైపుల నుంచి నిర్బంధం పెరగడంతో.. హిడ్మా తన భార్య మడకం రాజే సహా కీలక రక్షణ దళ సభ్యులతో కలిసి.. షెల్టర్ జోన్ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే.. హిడ్మా బృందం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లోకి ప్రవేశించింది. ఈ ప్రాంతం ఎప్పటి నుంచో మావోయిస్టులకు ఓ షెల్టర్‌జోన్‌గా ఉండేది. అలా.. ఈసారి కూడా ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు, కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండేందుకు.. మారేడుమిల్లికి వచ్చినట్లు సమాచారం.
అయితే.. హిడ్మా కదలికలపై ఏపీ ఇంటలిజెన్స్ బ్రాంచ్‌కి, తెలంగాణ ఇంటలిజెన్స్‌కి కచ్చితమైన సమాచారం అందింది. అలా హిడ్మా బృందం మారేడుమిల్లి అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయ్. మావోయిస్టుల అంతర్గత సమాచారాన్ని ఛేదించడమే.. ఈ ఆపరేషన్‌కు కీలకంగా మారింది. హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే నిఘా సమాచారం అందిన వెంటనే.. ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, జిల్లా పోలీసు బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ ప్రారంభించాయ్. కూంబింగ్ మొదలుపెట్టి.. పక్కాగా ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆరున్నర నుంచి 7 గంటల మధ్య.. హిడ్మా బృందం అటవీప్రాంతంలో హిడ్మా బృందం భద్రతా బలగాలకు ఎదురుపడింది. దాదాపు అరగంట నుంచి గంట పాటు పోలీసులు, హిడ్మా దళం మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మా తన రక్షణ దళంతో పోరాడినా.. చివరికి పోలీసు బలగాల వ్యూహానికి చిక్కక తప్పలేదు. ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు అతని భార్య సహా మొత్తం ఆరుగురు కీలక మావోయిస్టులు మరణించారు. వారంతా.. హిడ్మా రక్షణదళంలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే అనేక ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీకి.. హిడ్మా ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బగా మారింది. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మావోయిస్టుల నివాసాల వివరాలు, సంప్రదింపుల కోడ్లు, ఆయుధాల డంప్‌ల గురించి తెలుసుకున్నారు. దాంతో.. నాలుగు రాష్ట్రాల్లో ఆయుధాల డంప్‌లని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. హిడ్మా మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగానే కాదు.. పీఎల్జీఏ బెటాలియన్ నెంబర్ వన్‌కి కమాండర్ కూడా. ఇది.. మావోయిస్ట్ పార్టీలో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన దళం. హిడ్మా జరిపిన అనేక దాడుల్లో.. ఎంతోమంది పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది మరణించారు.
మావోయిస్ట్ అగ్రనేతల్లో ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు కాగా.. హిడ్మా బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీకి ఎంపికైన.. ఏకైక గిరిజన నాయకుడు. ఇది.. అతని ప్రభావాన్ని, స్థానికంగా ఉన్న పట్టుని సూచిస్తుంది. హిడ్మా మరణం.. మావోయిస్ట్ పార్టీ సామర్థ్యం, అంతర్గత వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు. యువతని రిక్రూట్ చేయడంలోనూ, దండకారణ్యంలో దాడులను సమన్వయం చేయడంలో హిడ్మాకు తిరుగులేదు. అలాంటి వ్యక్తి ఎన్కౌంటర్.. మావోయిస్ట్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా, భద్రతా బలగాలకు చరిత్రాత్మకమైన విజయంగా విశ్లేషిస్తున్నారు.