ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన.. కేసీఆర్ కుర్చీకి ఎసరేనా?
posted on Jun 29, 2023 @ 2:23PM
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. జులై 2వ తేదీ ఖమ్మంలో ఆయన కాంగ్రెస్ గుటికి చేరనున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు భారీగా ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అందులోభాగంగా ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వహణ పనులను పొంగులేటి అండ్ కో స్వయంగా పర్యవేక్షిస్తోంది.
అయితే ఈ బహిరంగ సభకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సభకు దాదాపు 5 లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు నాయకగణం ఏర్పాట్లు చేస్తుంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులపై తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన విషయం విదితమే ఆ క్రమంలో వీరిద్దరు కాంగ్రెస్ గూటికా, కమలం గూటికా అన్న మీమాంశలో చాలా కాలం గడిపేశారు. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ కూడా వీరి కోసం తమ తమ పార్టీల తలుపులు బార్లా తెరిచాయి. మా పార్టీలో చేరతారంటే.. మా పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జోష్ మీద ఉన్న బీజేపీ డీలా పడగా... హస్తం పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఒకటికి రెండు స్లారు.. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో వరుస భేటీలు నిర్వహించారు. దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమై.. ముహూర్తం ఖరారు అయింది. ఆ క్రమంలో జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచుకోనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న జిల్లా . అలాంటి జిల్లాలో గత ఏడాది డిసెంబర్‌లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత అంటే ఈ ఏడాది జనవరిలో తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన... ఇదే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ సైతం విజయవంతమైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సైతం జులై 2వ తేదీన ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ సైతం గ్రాండ్ సక్సెస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఈ సభకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు తెలంగాణలోని పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ కుర్చీకి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందనే ఓ చర్చ తెలంగాణ సమాజంలో హల్‌చల్ చేస్తోంది.