విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

Publish Date:Mar 30, 2023

తెలంగాణ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు   హాలిడేస్‌ను డిక్లేర్ చేసిన విద్యాశాఖ. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.21 నుంచి 24వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. వచ్చేనెల 25న పేరెంట్స్ మీట్ నిర్వహించి.. విద్యార్థుల మార్కులు వెల్లడిస్తారు. కాగా  వచ్చేనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

80 ఏళ్ల‌కు గమ్యం చేరిన పెయింటింగ్!

Publish Date:Jun 19, 2022

ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Publish Date:Mar 15, 2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

చెడు స్నేహాలు..... పర్యవసానాలు!

Publish Date:Mar 29, 2023

జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు. తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా. తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు.  "తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని.  వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు?? పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి. తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.                                       ◆నిశ్శబ్ద.
[

Health

]

గొంతు నొప్పి వేధిస్తోందా? ఈ సమస్యతో ముప్పు రావచ్చు!

Publish Date:Mar 29, 2023

మారుతున్న వాతావరణం వల్ల  తరచుగా అనేక రకాల గొంతు సమస్యలు వస్తాయి. వీటిలో గొంతు ఇన్ఫెక్షన్ చాలా ఇబాబుది పెడుతుంది.  గొంతు ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల ద్వారా దాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. అదే ఈ ఇన్ఫెక్షన్ ను లైట్ తీసుకుంటే ఇది చాలా దారుణమైన ఫలితాన్ని పరిచయం చేస్తుంది.   గొంతు ఇన్ఫెక్షన్ సాధారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీల వల్ల సంభవించవచ్చు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పు లేదా ఫ్లూ కారణంగా కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే.. గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? గొంతు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. ఇది  ఏ వయస్సు వారిలో అయిన కనిపించవచ్చు.  కానీ ఈ సమస్య చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ.   గొంతు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తడం.  టాన్సిల్స్‌లో వాపు, నొప్పి. టాన్సిల్స్ మీద తెల్లగా ఉండటం. గొంతు ఎరుపు రంగులోకి మారడం.  వాయిస్ లో మార్పు, గొంతు బొంగురు పోవడం జరుగుతుంది.  గొంతు ఎండిపోయినట్టు, నాలుక మీద దద్దుర్లు రావడం,  జ్వరం-దగ్గు, తలనొప్పి మొదలైనవి ఉంటాయి.  గొంతు ఇన్ఫెక్షన్ కారణాలు.. జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని కారణంగా, స్ట్రెప్ థ్రోట్ సమస్య, గొంతు, టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలర్జీ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. కాలుష్యం, పెంపుడు జంతువులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల అలెర్జీలు వస్తాయి. గొంతు గాయం కారణంగా,  స్వర తంతువులు, గొంతులో కండరాలు వ్యాకోచం చెందుతాయి. , దీని కారణంగా గొంతు నొప్పి వస్తుంది. దీర్ఘకాలం గొంతు నొప్పి ఉంటే అది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ నివారణ ఇలా.. గొంతు నొప్పి లేదా ఇతర లక్షణాలు ఉంటే, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటిపై రుమాలు ఉంచుకోవాలి. సిగరెట్ మద్యం అలవాట్లు ఉంటే వాటిని వదిలెయ్యాలి. . పొగతాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. ఎక్కడైనా గాలి కాలుష్యం, ధూళి ఉంటే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మురికి ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి కానీ చల్లని నీరు మాత్రం త్రాగకూడదు. గొంతు ఇన్ఫెక్షన్ చికిత్స ఇలా..   గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే  డాక్టర్లు  యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా మందు  వాడటం ముఖ్యం. సమస్య తీవ్రత పెరిగినప్పుడు  గొంతు ఇన్ఫెక్షన్ చికిత్సకు శస్త్రచికిత్సా ప్రక్రియ కూడా ఉంది, దీనిలో టాన్సిల్స్ తొలగించబడతాయి.  గొంతు ఇన్ఫెక్షన్‌లో అనేక ఇంటి చిట్కాలు  ప్రయోజనకరంగా ఉంటాయి.  ఉప్పు, వెల్లుల్లి, ఆపిల్ వెనిగర్, తేనె, పాలు మంచివి. అలాగే పసుపు, అల్లం, ఆవిరి పట్టడం లికోరైస్ మొదలైనవి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.                                  ◆నిశ్శబ్ద.

కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం

Publish Date:Jul 17, 2020

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.