భోపాల్ లో కవితపై మోడీ విమర్శల ఆంతర్యమేమిటంటే?
posted on Jun 29, 2023 @ 11:02AM
ప్రధాని మోడీ ఉన్నట్లుండి.. కేసీఆర్ కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదీ తెలంగాణ గడ్డ మీద నుంచి కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వేదికగా ప్రధాని మోదీ కేసీఆర్ కుటుంబపాలనపై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారి తీశాయి. పార్టీలో ఉండాలా? వద్దా? అని లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్న వారిలో పునరాలోచన రేపాయి. మోదీ వ్యాఖ్యలు నమ్మాలా? వద్దా? మోడీ నిజంగా కవితపై చర్యలు తీసుకునేందుకే ఆ వ్యాఖ్యలు చేశారా? మోడీ వ్యాఖ్యలలో సీరియస్ నెస్ ఉందా? పార్టీ మారే విషయంలో మరికొంత కాలం వేచిచూద్దామా? అని రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులు మీమాంసలో పడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండ ని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొనసాగాలా? నిష్క్రమించాలా? సరైన సమయంలో కాంగ్రెస్‌లోకి వెళ్లాలా? అని సందిగ్ధంలో ఉన్న సీనియర్లను మరింత గందరగోళంలో పడేశాయనడంలో సందేహం లేదు.
అసలు ప్రధాని భోపాల్ వేదికగా తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అన్న చర్చ బీజేపీలో విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులు నమోదై, విచారణ కూడా జరిగింది. అయినా ఆమెను ఇప్పటివరకూ అరెస్టు చేయకుండా, కేవలం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని, తెలంగాణ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ముంగిట.. బీజేపీ, బీఆర్ఎస్ లాలూచీ అన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. కేవలం క విత విషయంలో బీజేపీ హైకమాండ్ తీరు కారణంగానే బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన హైప్ బుడగలా పేలిపోయింది. మద్యం కుంభకోణం కేసు నుంచి కవితను రక్షించేందుకే ఏపీ సీఎం జగన్ ద్వారా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మర్చడంలో బీజేపీ అగ్రనాయకత్వం పాత్ర, ప్రమేయం ఉందని రాష్ట్ర బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.
ఏపీలో అవినాష్ రెడ్డిని ఏ విధంగా అయితే అరెస్టు కాకుండా అడ్డుపడుతోందో, తెలంగాణలో కవితను కూడా బీజేపీ అగ్రనాయకత్వం అలాగే కాపాడుతోందని సామాన్య జనమే కాదు, తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు, శ్రేణులూ కూడా భావిస్తున్నాయి. ఆ కారణంగానే తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజలలో విశ్వసనీయత తగ్గిందనీ, గత నాలుగున్నరేళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకాన్ని బీజేపీ అగ్రనాయకత్వం చేజేతులా వమ్ము చేసిందని పార్టీలోని ఒక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ విషయంలో అగ్రనాయకత్వం ఎలా వ్యవహరించినా ఫరవాలేదనీ, ఎందుకంటే అక్కడ పార్టీ నామమాత్రమేననీ, కానీ తెలంగాణలో మాత్రం పార్టీకి గట్టి పట్టు ఉందనీ, ప్రజలు కూడా బీజేపీకి ఓ చాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావనలో ఉన్నారనీ వారంటున్నారు. అయితే మద్యం కుంభకోణంలో కవితకు బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రం కొమ్ముకాసేలా వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వారి ఆప్షన్ గా ఇంత కాలం ఉన్న బీజేపీ ఇప్పుడు వెనుకబడిపోయిందనీ, ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి చేరిందని చెబుతున్నారు. కవిత అరెస్టు కారన్న బలమైన భావన ప్రజలలో ఏర్పడిందనీ, ఇక బీఆర్‌ఎస్‌పై తాము చేసే పోరాటాలను, ప్రజలు ఎందుకు విశ్వసిస్తారని తెలంగాణ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాయి.
కేసీఆర్-కవితను జైలుకు పంపిస్తామని ఇప్పటికి కొన్ని వందల సార్లు హెచ్చరించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఆధారాలుంటే కచ్చితంగా అరెస్టు చేస్తారని మాటమార్చడంపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇంత కాలం ఎలాంటి ఆధారాలు లేకుండా కవితపై తెలంగాణ బీజేపీ ఆరోపణలు గుప్పించిందా అని ప్రజలు నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాల వద్ద ఇదే విషయాన్ని ఈటల, కోమటటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రస్తావించారని అంటున్నారు. కవిత విషయంలో కేంద్రం తీరు కారణంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలు రాజకీయ డ్రామాగానే ప్రజలు భావిస్తున్నారని వారు కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీని బతికించుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోడీ భోపాల్ వేదికగా కవితపై ఆరోపణలను ప్రస్తావించారని పరిశీలకులు అంటున్నారు. భోపాల్‌లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదు. అక్కడ ఆ పార్టీ ఉనికే లేదు. పోనీ మధ్యప్రదేశ్ లో బీఆర్‌ఎస్‌ను విమర్శించడం వల్ల అక్కడ ఓట్లు పడతాయా అంటే అదీ లేదు. ఏరకంగా చూసినా మోడీ వ్యాఖ్యలు బీజేపీకి ఇసుమంతైనా ఉపయోగపడవు. అదే సమయంలో బీఆర్ఎస్ కు వీసమెత్తు నష్టం జరగదు. కేవలం కేంద్రం- పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న.. తెలంగాణ బీజేపీ నేతలను సంతృప్తిపరిచేందుకే, మోడీ కవిత పేరు ప్రస్తావించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.