కాళ్ల పారాణి ఆరక ముందే!
జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు సాగించిన మారణకాండ మామూలు విషాదం కాదు. మాటలకందని మహా విషాదం. ముష్కర మూకలు సాగించిన రాక్షస కృత్యం. అవును. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తిన మహా విషాదం. ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన రాక్షస కృత్యం. బార్య కళ్ళెదుట భర్తను, పిల్లల కళ్ళెదుట తండ్రిని, తల్లి కళ్ళెదుట ఎదిగొచ్చిన కొడుకును తూటాలకు బలిచేసిన మహా ఘాతుకం. పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు చేసిన ఈ ఉగ్రదాడిలో మరణించిన ప్రతి ఒక్కరిదీ ఒక విషాద వ్యథ. గుండెలు పిండే విషాదం.
అందులోనూ దేశం మొత్తం కన్నీరు పెట్టేలా చేసిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ వ్యధ మరింత విషాదం. కేవలం వారంరోజుల క్రితమే వినయ్ నావల్, హిమాన్షి మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. హనీ మూన్ కు కశ్మీర్ వెళ్లారు. అదే వారు చేసిన తప్పో లేక హిందువులుగా పుట్టడమే వారు చేసిన మహాపరాధమో కానీ హనీమూన్ విషాదంగా మారింది. ఉగ్రవాదులు హిమాన్షి కళ్ళ ముందే వినయ్ నావల్ ని కాల్చి చంపారు.
పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ,ఒక్క వారం రోజుల వ్యవధిలోనే ఆ కొత్త జంట నూరేళ్ళ జీవితం ముగిసి పోయింది. పెళ్లి కలలు కరిగి పోయాయి. నవవధువు పాదాల పారాణి ఆరక ముందే, కళ్యాణ తిలకం ఆమె కన్నీళ్ళలో కరిగి గుండెల్లోకి జారిపోయింది.
అవును. ఏప్రిల్ 16 న ముస్సోరీలో మూడు ముళ్ళ సాక్షిగా ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఏప్రిల్ 19న కర్నల్ లో బంధు మిత్రులకు వివాహ విందు ఇచ్చారు. అందరి ఆశీస్సులు అందుకున్నారు. ఏప్రిల్ 21న హనీమూన్ కు కశ్మీర్ చేరుకున్నారు. ఏ ప్రిల్ 22.. ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు ఏప్రిల్ 23న అతడి మృతదేహం కర్నల్ చేరుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న నేవీ ఆఫీసర్ వినయ్ నావల్ నూరేళ్ళ స్వప్నం.. విషాద చిత్రంగా మిగిలి పోయింది.
నిజానికి గతంలోనూ దేశంలో అనేక చోట్ల ఉగ్ర దాడులు జరిగాయి. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎన్నో ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. కానీ, పహల్గాం ఉగ్రదాడి హిందువులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి. ఉగ్రవాదులు తూటా పేల్చేందుకు ముందుగా విక్టిమ్’ ఎవరో, ఏ మతమో అడిగి నిర్ధారణ చేసుకుని ఆ తర్వతనే తూటాలు పేల్చారు.
వినయ్ నర్వాల్ విషయంలోనూ అదే జరిగింది. ఆ ఇద్దరు బేల్ పూరి తింటున్న సమయంలో, ఉగ్రవాది ఒకడు నర్వాల్ ని సమీపించి నువ్వు ముస్లిమా అని అడిగాడు.. కాదనగానే కాల్చి చంపాడు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. హిమాన్షి స్పాట్లో చెప్పిన, వీడియోలో రికార్డు అయిన సత్యం. ఇలా జరుగుతుందని, ఎప్పుడు అనుకోలేదని ఆమె భోరు మన్నారు. ఇంకా విషాదం ఏమంటే, మరో వారం రోజుల్లో మే 1న నర్వాల్ ని 27పుట్టిన రోజు. ఇంతలోనే ఈ విషాదం. మరో రెండు రోజుల్లో కొత్త జంట, కొచ్చి నేవీ క్యాంపు లో కొత్త జీవితం (కాపురం) ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ఇంతలోనే ఉగ్రవాదులు ‘మృత్యు’ ముహూర్తం పెట్టారు. ప్రాణాలు తీశారు.
కర్నాల్ సిటీలో నర్వాల్ ఇంటి ముందున్న పెళ్లి పందిరి, పందిరికి కట్టిన పచ్చటి మామిడి తోరణాలు, అలంకారాలు అలా ఉండగానే, అదే పందిరిలోకి నర్వాల్ శవ పేటిక వచ్చింది. ఆ విషాద దృశ్యం చూసి కంటతడి పెట్టని వారు లేరు. తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు, తల్లి తండ్రులు బంధువులు, మొత్తం కర్నాల్ నగరమే కన్నీరు మున్నీరైంది. సరే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్, మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు నర్వాల్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు.
కానీ.. పాదాల పారాణి అయినా అరక ముందే భర్తను కోల్పోయిన హిమాన్షి కి ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుంది. ఆ తల్లితండ్రుల కడుపు కోతకు ప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుంది? అయినా పభుత్వం మహా అయితే.. పోయిన ప్రాణానికి విలువ కట్టి, నష్ట పరిహారం ఇస్తే ఇవ్వవచ్చును ? పెళ్ళయి పది రోజులు అయినా కాకముందే చెరిగిన నుదిటి బొట్టుకు నష్ట పరిహారం ఇంతని ఎవరు ఖరీదు కడతారు? ఏదో ఇస్తారు, ఏదో జరుగుతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేసిన విధంగా ఉగ్రవాది ఎక్కడ నక్కినా, వెతికి, వేటాడి శిక్షించ వచ్చును. ఇంకా ఏమైనా చేయవచ్చును.కానీ కంటి తుడుపు చర్యలు, ప్రకటనలు, ప్రగల్భాలతో ప్రయోజనం ఉంటుందా? ఉగ్రవాదానికి ముగింపు ఉంటుందా?