పవన్ పై పర్సనల్ అటాక్ .. లీగల్ యాక్షన్ కు జనసేన రెడీ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి ఆయన క్రేజ్ పెరిగింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పవన్ ఎండగడుతూ వారాహీ యాత్ర కొనసాగగా.. వైసీపీ ఉక్కిరి బిక్కిరై కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని స్థితిలోవైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం మొదలు పెట్టారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే స్కూల్ పిల్లల ముందే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన లేవనెత్తగా.. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే బాటలో పవన్ పై వ్యక్తిగత దాడి మొదలు పెట్టారు. అది మరీ శృతి మించి పవన్ ఇప్పుడు మరోసారి భార్యకు దూరంగా ఉంటున్నాడని.. ఈమెకు కూడా విడాకులు ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దాడికి దిగిన వారిపై ఇప్పుడు జనసేన చర్యలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారంపై, జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది.. చిందిస్తోంది. వారిపై లీగల్ యాక్షన్ తీసుకొనేందుకు సైతం సిద్ధమైంది. పవన్ వ్యక్తిగత జీవితంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వైసీపీ నేతలపై జనసేన చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. వైసీపీకి చెందిన నాయకుల సోషల్ మీడియా అకౌంట్లు, దుష్ప్రచారం చేస్తున్న కార్యకర్తలతోపాటు, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న యూ ట్యూబ్ ఛాన్సల్, పలు మీడియా సంస్థలపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్లు జనసేన ప్రకటించింది.
జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరుతో జనసేన పార్టీ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఏఏ ఛానెల్స్, ఏఏ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా చర్యలు తీసుకోబోతుందో ప్రకటించింది. ఈ లిస్టులో ప్రముఖ వెబ్ పోర్టల్స్ ఉన్నాయి. వైసీపీ నేతల విషయానికి వస్తే ఆ పార్టీ అధికార ప్రతినిథి నాగార్జున యాదవ్, వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న అనితా రెడ్డి తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. ఏపీ పారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ డైరెక్టర్, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి దేవేంద్ర రెడ్డి, గుర్రంపాటి తదితరులకు కూడా లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు జనసేన ప్రకటన ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినెవాతో విడాకులు తీసుకున్నారంటూ మొదలు పెట్టిన ఈ ప్రచారానికి, వైసీపీ మద్దతుదారులు, వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్ తీవ్రంగా ప్రచారం చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఈ అసత్య ప్రచార దాడి శృతి మించి కొనసాగుతుండటం, ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులతో ఒకరకంగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండటంతో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న జనసేన ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, నేర పూరిత కుట్ర.. తదితర సెక్షన్ల కింద చట్ట పరమైన చర్యలకు సంసిద్ధమవుతోంది.
అయితే, అధికార పార్టీపై లీగల్ యాక్షన్ కి సిద్దమవుతున్న జనసేన ఈ అంశంలో ఎంతవరకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నదో తెలియదు కానీ.. సోషల్ మీడియా కట్టడికి మన దగ్గర స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఈ క్రమంలో వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న వైసీపీపై న్యాయపోరాటం అంటే అంత సులభం కాదు. మరి జనసేన ధీమా ఏంటో చూడాల్సి ఉంది. కాగా, ఒకసారి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత సదరు సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లకు ఇబ్బందులు తప్పదు. మరి వైసీపీ అనుకూల వర్గం ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడతారన్నది కూడా చూడాల్సి ఉంది.