వైసీపీ.. పోకిరీల కిరికిరి
posted on Jul 1, 2023 @ 11:43AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో మందు.. చిందు.. పసందు.. క్యాసినో కార్యక్రమాలు అడ్డు ఆపు లేకుండా పోయిందన్న ఓ చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గుడివాడ కాసినో గురించి ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీలపై ఆరోపణలు ఎవరూ మరచిపోలేదు. తాజాగా ఓ గ్రామ సర్పంచ్‌తోపాటు ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని పాటలతో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ.. ఊగిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యర్రవరంలో గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకుడు బీశెట్టి అప్పలరాజు జన్మదినం సందర్బంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో రికార్డింగ్ డ్యాన్సు చేస్తున్న మహిళలతో కలిసి.. వైసీపీ నేతలూ చిందులేశారు. అలా చిందులేసిన వారిలో ఏలేశ్వరం జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ, యర్రవరం సర్పంచ్ బేశెట్టి అప్పల రాజు, స్థానిక ఆంజేనేయస్వామి వారి దేవస్థానం చైర్మన్ గుల్లంపూడి గంగాధర్ తదితరులు ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు.. రింగ రింగా అంటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. మామూలుగా జాతరలు, తీర్థాలలో ఎవరైనా రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేస్తే అనుమతి లేదంటూ నిలిపివేస్తున్న పోలీసులు.. అధికార పార్టీ నేతలకు మాత్రం ఎలా అనుమతి ఇస్తున్నారని జనం నిలదీస్తున్నారు.
అయినా.. ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన.. ఇదే జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు.. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల్లో పాపలతో కలిసి స్టెపులు వేస్తున్న ఓ వీడియో.. సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో సదరు ప్రజా ప్రతినిధి.. మీడియా ముందుకు వచ్చి .. సదరు రికార్డింగ్ డ్యాన్స్ వీడియోలో ఉన్నది తానేనని స్పష్టం చేస్తునే.. అయితే.. ఇది ఎమ్మెల్సీ పదవి చేపట్టక ముందు వేసిన చిందులాట అంటు తన తప్పును నిజాయితీగా.. మీడియా సాక్షిగా చెప్పేసుకొని.. ఒప్పేసుకొని.. చెపంలేసుకుని తన చిత్తశుద్ది ఐఎస్ఐ మార్క్ లాంటిందని తనకు తానే ప్రకటించేసుకున్నారు.
అయినా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు... మలి కేబినెట్‌లోని మంత్రులు సైతం నా బూతే నా భవిష్యత్తు అన్నట్లుగా మాట్లాడుతుండం.. అలాగే మీసాలు తిప్పడం, తోడలు కొట్టడం, మైక్ ముందు రెచ్చిపోయి మాట్లాడడం..చూసి చూసి అలవాటై పోయిన సగటు ఏపీవాసి ఈ రికార్డింగ్ డ్యాన్స్‌ల తీరును చూసి.. మనిషన్నాక కాసంత కళాపోషణ ఉండాలని.. కానీ ఈ ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల్లో మాత్రం అది కాస్తంత ఎక్కువ మోతాదులో ఉందని భావిస్తున్నాడు. ఈ తాజా వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్స్ చిందులపై నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.