ఏపీలో బీజేపీ తెరవెనుక వ్యూహం?
posted on Jul 3, 2023 5:56AM
రానున్న ఎన్నికలలో ఏపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉంటుందా? ప్రధాన పార్టీ టీడీపీతో జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తుందా? లేక గత ఎన్నికల మాదిరి విడిగానే బరిలో దిగుతారా? టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలాకాలం క్రితమే చెప్పేసినా ఈ మధ్య కాలంలో ఆయన ప్రసంగాలలో మాటలు ఎందుకు మారాయి? ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీ-జనసేన పొత్తులో కూడా ఉంటుందా? లేక జనసేనతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీచేస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఎక్కడ నలుగురు చేరినా జరుగుతున్న చర్చ. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని దాదాపుగా రాజకీయాలలో ఖరారైన అంశమే కాగా ఎందుకో.. ఎక్కడో జనసేన, బీజేపీ కదలికలు చూస్తే అనుమానించక తప్పట్లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందులో కూడా ప్రధానంగా బీజేపీ రాజకీయాల గురించి చూస్తే ఈ అనుమానానికి మరింత బలం చేకూరుతుంది.
ఎన్నికలలో ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని రెండు భాగాలుగా విభజించుకోవాలి. ఏపీలో ఈ లెక్కన చూస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన పంచుకుంటాయి. రాష్ట్రంలో బీజీపీకి ఉన్న ఓటు శాతం అత్యంత స్వల్పం. ఆ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇసుమంతైనా మళ్లే అవకాశాలు లేవు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా వెళ్తే ఈ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కూటమి ఖాతాలో పడుతుంది. సరిగ్గా ఇక్కడే బీజేపీ ఏమైనా రాజకీయాలు చేస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీకి అధికారం దక్కలా వద్దా అన్న సంగతెలా ఉన్నా టీడీపీని దెబ్బ తీయాలనే ఆలోచన ఉంటే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనసేన-బీజేపీ వైఖరి చూస్తే ఈ ఓటు చీల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రలో పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోగా.. అక్కడక్కడా తానే సీఎం అనే మాటలు కూడా అన్నారు. దీనికి తోడు పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పవన్ ప్రసంగాలు వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అనేలా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ వైసీపీని తూర్పార పట్టిన పవన్ టీడీపీతో పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. మూడు నెలల క్రితం వరకు పొత్తులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి చెప్పిందే చెబుతూ వచ్చిన పవన్ వారాహీ విజయయాత్రలో టీడీపీ ప్రస్తావన తేలేదు. దీంతో ఇది వ్యూహమా.. భవిష్యత్ సంకేతమా అనే చర్చ మొదలైంది.
పవన్ ఈ మధ్య కొత్తగా తనకు సీఎం అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని అడగటం, తనతో పాటుగా తన పార్టీ వారిని కూడా అసెంబ్లీకి పంపాలని కోరడం, ఒక్క అవకాశం తమకు ఇచ్చి చూడాలని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయడం ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలలో కొత్త కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు సీఎం తాను అయ్యే అవకాశం లేదని చెప్పిన పవన్.. ఈ మధ్య తానే సీఎం అవుతానని చెప్పటం వెనుక బీజేపీ వ్యూహం ఉందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పని చెప్పారు. పవన్ స్వతహాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే నమ్మకం ఎవరికీ కలగడం లేదు. బీజేపీ వయా పవన్ మీదగా రాజకీయ ఎత్తుగడలకు సిద్దమైందా అనే అనుమానాల బలంగా వ్యక్తమౌతున్నాయి.
ఈ మధ్య కాలంలో పవన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఒకటి టీడీపీతో గ్యాప్ అయినా పెరగాలి.. రెండు పొత్తులో డిమాండ్లు సాధించేలా ఒత్తిడి పెంచే ప్రయత్నం అయినా కావాలి. మూడు బీజేపీ ఏదైనా కొత్త ప్రణాళిక రచించి అది పవన్ తో అమలు చేయిస్తునైనా ఉండాలి. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ శైలిని చూస్తే చాలా రాష్ట్రాలలో ఇలా పాత మిత్రులను సైడ్ చేసి తాను ఎదుగుతూ రావడం గమనించొచ్చు. ఏపీలో కూడా బీజేపీ ఇలాంటి పన్నాగం ఏమైనా పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి టీడీపీ సింగల్ గా పోటీచేసినా ప్రభుత్వాన్ని నెలకొల్పే సీట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి. టీడీపీ నేతల్లో కూడా ఈ ధీమా కనిపిస్తున్నది. అదే ఇప్పుడు బీజేపీకి మింగుడు పడక తెరవెనక దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు. రాజకీయం అంటే రాజకీయమే కదా.. లోగుట్టు ఆ పెరుమాళ్ళకెరుక!