అనీల్ మళ్లీ మొదలెట్టేశారు!
posted on Jul 1, 2023 @ 11:21AM
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నానా అగచాట్లూ పడుతున్నారంటూ తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తున్నది. నెల్లూరు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు పి. నారాయణను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ( జూన్ 30) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆ స్థానం నుంచి తనను తానే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించుకున్న అనీల్ కుమార్ యాదవ్ సినిమా ఎత్తిపోయినట్లేనని నెల్లూరు వైసీపీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.
ఇప్పటికే పలు వివాదాలతో నిండా మునిగి ఉన్న అనీల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో ప్రజాదరణను కోల్పోయారనీ, సొంత పార్టీలోనే ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తి వెల్లువెత్తుతోందనీ వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పెర్ఫార్మెన్స్ సరిగా లేదంటూ ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేలలో అనీల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అన్న వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న అనీల్ కుమార్ యాదవ్ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ తరువాత ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అయితే వైసీపీ క్యాడర్ మాత్రం ఆయన వెంట నడిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారు. హైదరాబాద్ లో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకుని వార్తల్లోకెక్కిన మరుసటి రోజే నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారాయణపై సంచలన ఆరోపణలు చేసి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. నారాయణ గత కార్పొరేషన్ ఎన్నికలలో సొంత పార్టీ అయిన తెలుగుదేశం అభ్యర్థులను ఓడించమంటూ తనకు సొమ్ములు పంపారని నిరాధార ఆరోపణలు గుప్పించారు. అయితే తాను అందుకు అంగీకరించలేదనీ, నారాయణ పంపిన డబ్బులను వాసస్ చేశాననీ అనీల్ పేర్కొన్నారు. సందర్భం రాకపోవడంతో ఈ విషయాన్ని తాను ఎందుకు ఇంత వరకూ బయటపెట్టలేదన్నారు.
తాను ఇషామాషీగా ఈ ఆరోపణలు చేయలేదనీ, వాటికి కట్టుబడి ఉన్నాననీ, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన వారిని మోసం చేయడం అన్నది మాలూలు విషయమేనని అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే... ఒక వేళ తనకు వైసీపీ టికెట్ వస్తే ఇస్తే ఓటమి తప్పదన్న భయంతోనే అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడీ ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. నారాయణపై అనీల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు.