జగన్ ముందస్తు ముచ్చట..ఓ అంతులేని కథ
posted on Jul 3, 2023 @ 10:34AM
వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏం జరుగుతుందో ఏపీలో హేతువుతో సంబంధం లేకుండా సాగుతున్న ఊహాగాన సభలను గమనిస్తు ఇట్టే అర్ధమైపోతుంది. ఈ ఏడాది చివరిలో దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.
ఇక రెండు మూడు నెలలలో షెడ్యూల్ విడుదల కూడా జరిగిపోతుంది. అయినా ఏపీలో ముందస్తు ముచ్చటకు సంబంధించిన ఊహాగానాలూ, అంచనాలూ ఇసుమంతైనా ఆగడం లేదు. ఏపీ సీఎం స్వయంగా ముందస్తు ప్రశ్నే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని విస్పష్టంగా ప్రకటించినా.. పరిశీలకుల నుంచి, రాజకీయ విశ్లేషకుల దాకా, సామాన్య జనం నుంచి ప్రతి పక్ష పార్టీల వరకూ ఏపీలో ముందస్తు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు.
తాజాగా మరో మారు ఏపీలో ముందస్తు ఎన్నికలపై మరో సారి విస్తృత స్థాయి చర్చలకు తెరలేచింది. ఇందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ హస్తిన పర్యటనకు ముహూర్తం ఖరారు కావడమే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు బీజేపీ కీలక నేతలు, మంత్రులతో కూడా భేటీ అవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోడీ, షాల అప్పాయింట్ మెంట్ ఖరారైందని కూడా చెబుతున్నాయి. జగన్ ఈ పర్యటన విషయంలో బయటకు చెబుతున్న కారణాలు ఏపీకి రావలసిన అంశాలపై చర్చే అని చెబుతున్నా.. వాస్తవ కారణం మాత్రం ముందస్తు కోసం మోడీకి బతిమలాడుకోవడం కోసమేనని అంటున్నారు. అంతే కాకుండా మోడీ కూడా ముందస్తు యోచన చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ తన అప్పుల పరిమితి దాదాపు వాడేసుకుంది. ఎడాపెడా అప్పులు, కేంద్రం నుంచి ఉదారంగా నిధులూ వచ్చినా కూడా ఆగస్టు నుంచి ఉద్యోగుల జీతాలే కాదు, బటన్ నొక్కుడు సంక్షేమానికీ ఇబ్బందులు తప్పవు. దీంతో జగన్ కేంద్రం వద్ద మీరు ఆదుకోవాలి అంటూ వేడుకోవడం, అలాగే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకుంటాను.. ముందస్తుకు అవకాశం ఇవ్వండి అని విజ్ణప్తి చేయడం వినా మరో గత్యంతరం లేదని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ నెల5, 6 తేదీలలో హస్తినలో పర్యటించనుండటం ప్రభుత్వ పెద్దలతోనే కాకుండా, బీజేపీ అగ్రనాయకులతో కూడా సమావేశం కానుండటంతో.. మోడీ ప్రమేయంతో ముందస్తుకు అవకాశం దక్కేలా చేసుకుంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
2014 ఎన్నికలలో తన పార్టీని విజయ పథంలో నడిపించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత చుట్టూ సమస్యలు చుట్టుముట్టడంతో వ్యూహాత్మకంగా 2019 వరకూ ఆగకుండా ఆర్నెళ్లు ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఆయన అంతే వ్యూహాత్మకంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెడుతున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన నాలుగేళ్లలోనే అంతులేనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. అలా తగ్గే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. సంక్షేమం అంటూ బటన్లు నొక్కి లబ్ధి దారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నా.. ఎక్కడా సంతృప్తి అన్నది ప్రజలలో మచ్చుకైనా కనిపించడం లేదు.
ఈ పరిస్థితుల్లో బటన్ నొక్కుడు కూడా కష్టమయ్యేలా భవిష్యత్ అద్దంలో కనిపిస్తుండటంతో జగన్ లో ఆందోళన పెరుగుతోంది. దీంతో షెడ్యూల్ వరకూ వేచి చూడాలని ఆయన భావిస్తున్నా.. ముందస్తుకు వెళ్లకుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనా ఆయనను వెన్నాడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటన వెనుక ముందస్తు మంతనాలు జరపడం అన్నదే ప్రధాన కారణమై ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.