కాంగ్రెస్ వర్గ పోరు భూతం బీజేపీని ఆవహించిందా!?
posted on Jul 3, 2023 6:46AM
కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వర్గ పోరు పార్టీ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బంగాళాఖాతంలో ఎప్పుడూ నీరున్నట్లు ఆ పార్టీలో నేతల మధ్య నిత్యం వర్గం పోరు తారస్థాయిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వర్గ పోరు పార్టీ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బంగాళాఖాతంలో ఎప్పుడూ నీరున్నట్లు ఆ పార్టీలో నేతల మధ్య నిత్యం వర్గం పోరు తారస్థాయిలో ఉంటుంది. పదవుల విషయంలో, నాయకత్వం విషయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీలోని నేతలు కుమ్ములాడుకుంటూనే ఉంటారు.
వర్గ పోరు ఆ పార్టీకి అనేక సార్లు అధికారాన్ని దూరం చేసినా నేతల్లో మాత్రం మార్పు కనిపించదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 'వర్గపోరు భూతం' ఎప్పుడూ ఆవహించే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వర్గపోరు భూతం బీజేపీని సైతం ఆవహించినట్లు కనిపిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గ పోరు తార స్థాయికి చేరింది. సాధారణంగా బీజేపీలో నేతల మధ్య విబేధాలు తక్కువ స్థాయిలోనే కనిపిస్తుంటాయి. ప్రస్తుతం, తెలంగాణ బీజేపీలో నువ్వా నేనా అనే స్థాయిలో నేతల మధ్య వర్గ పోరు నడుస్తుండటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు నాలుగు నెలలలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బూచి చూపించి అనుకున్న దాని కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన కేసీఆర్. ఈసారి కొత్త ఎత్తుగడలతో ప్రతిపక్షాలను బురిడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. రెండు పార్టీల నేతలు అధికారంలోకి వచ్చేది మేమంటే మేమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు పార్టీల్లోనూ నేతల వర్గ విబేధాలు ఆయా పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా కనిపించలేదు. అక్కడ పార్టీ ఘన విజయం సాధించడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రెండు నెలల కాలంలోనే ఊహించని రీతిలో కాంగ్రెస్ పుజుకుంది. అదే సమయంలో బీజేపీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. దీంతో బీజేపీలో చేరేందుకు సిద్ధమైన నేతలుసైతం యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక్కసారిగా ప్రజల్లో పెరిగిన గ్రాఫ్‌తో కేంద్ర అధిష్టానం సైతం అలర్ట్ అయింది. రాష్ట్రంలోని ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి ఐక్యంగా ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలిచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ కూడా పార్టీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి ఐక్యంగా ముందుకు సాగే విధంగా దిశానిర్దేశం చేసింది. ఎవరైనా హద్దు దాటితే కఠిన చర్యలు ఉంటాయంటూ రాహుల్ గాంధీ స్వయంగా కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు మేమంతా కలిసిపోయాంటూ కొత్తరాగం అందుకున్నారు.
కాంగ్రెస్ నేతలంతా ఐక్యతారాగం ఆలపిస్తున్న వేళ.. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య వర్గ విబేధాలు పీక్స్ కు చేరాయి. బీజేపీలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కనిపించిన దాఖలాలు లేవు. ఒకవేళ విబేధాలు ఉన్నా.. పార్టీలో అంతర్గతంగానే కొనసాగాయి. ఈసారి, బీజేపీలోని నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు కాలుదువ్వుకొనే పరిస్థితి కనిపిస్తోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారని, ఈటలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. దీనికితోడు ఆ పార్టీలోని నేతలు కొందరు బండి సంజయ్ పదవి ఊడినట్లేనంటూ ప్రచారం చేయడం పార్టీలో వర్గ విబేధాల ఆజ్యం పోసినట్లయింది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతల పట్ల కేంద్ర పార్టీ అధిష్టానం ఎలా వ్యవహరించాలో చెబుతూ.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన వీడియో ట్వీట్ తెలంగాణ బీజేపీలో పెను దుమారాన్నే రేపింది. దీంతో ఈటల వర్గం, సంజయ్ వర్గం అన్నట్లుగా బహిరంగంగానే ఆ పార్టీ నేతలు వాదులాడుకొనే స్థాయికి చేరింది.
ఆదివారం హన్మంకొండలో జరిగిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల పాల్గొన్నారు. అయితే, ఈటల, సంజయ్ ఎడమొహం పెడమొహంలానే ఉన్నారు. దీంతో ఎప్పుడూ కాంగ్రెస్‌ను పట్టిపీడించే వర్గపోరు భూతం.. ఈసారి బీజేపీని ఆవహించిందని రాజకీయా విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. అలాఅని కాంగ్రెస్‌ను సైతం వర్గపోరు భూతం పూర్తిగా వీడలేదు. దీంతో ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల్లోని నేతలతో వర్గపోరు భూతం ఎన్ని విన్యాసాలు చేయిస్తుందో వేచి చూడాల్సిందే.